పారిస్ వీధులనే ఆశ్చర్యపర్చిన పటియాలా మహారాజ్ ఎవరు..?

పారిస్ ను ఒక నడిచే ఖజానా విస్తుగొల్పిన ఘటన గురించి మీరెప్పుడైనా విన్నారా..? అయితే, 1928 సంవత్సరానికి మనమోసారి వెళ్లాలి. 7 వేల 500 వజ్రాలతో పారిస్ నగరంలో ఆభరణాల వ్యాపారుల వద్దకు వెళ్లిన ఓ భారతీయ మహారాజు గురించి తెలుసుకోవాలి.

చారిత్రాత్మకమైన పారిస్ సాహిత్యాన్ని, సంపదను, కళలను, కళాకారులను ఇలా ఎన్నో చూసి ఉండొచ్చుగానీ… వైభవమంటే ఏంటో చూసిన రోజది.

1928 సంవత్సరంలో వేసవి విడిది కోసం పటియాలా మాహారాజా భూపీందర్ సింగ్ ఫ్రాన్స్ బాట పట్టాడు. పారిస్ కు చేరుకున్నాడు. ప్లేస్ వెండోమ్ అనే ప్రాంతంలో ఆయన అప్పుడో పెద్ద చర్చగా మారారు. ప్లేస్ వెండోమ్ అంటేనే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆభరణాల కేంద్రంగా పేరు. అంతటి ఆ ప్లేస్ వెండోమ్ అనే వీధి… పటియాలా రాజు రాకతో ఒక ఉత్కంఠను ఎదుర్కొంది.

ఆ స్ట్రీట్ లో ఆయన వస్తున్నప్పుడు.. వెంట 40 మంది సేవకులు.. సిక్కు రక్షక దళాలు.. మొత్తంగా ఒక రాజప్రసాదాన్ని తలపించే ఊరేగింపది. అలాంటి ఒక ఊరేగింపు చూసి పారిస్ వీధులు నిర్ఘాంతపోయాయి. ఎందుకంటే, వారి చేతుల్లో ఉన్నవి సాధారణమైన వస్తువులు కాదు. వారి వెంట ఉన్న పెట్టెలు, రహస్యమైన బాక్సుల్లో ఉన్నవన్నీ విలువైన వస్తువులు. 7 వేల 500కు పైగా వజ్రాలు, 14 వందల పచ్చలు (ఎమరాల్డ్స్), రూబీలు, నీలమణులు, ముత్యాలు… ఒక్క మాటలో చెప్పాలంటే యూరప్ మొత్తంలోనే అత్యంత సంపన్న ఆభరణాల వ్యాపారులను సైతం ఆశ్చరపర్చే అపారమైన విలువైన సంపద అది.

పారిస్ లో ఎందుకంత ఉత్కంఠ..?

పటియాలా భూపీందర్ సింగ్ మహారాజ్ ఏ జ్యువెల్లరీ షాపును ఎంచుకుంటారనేదే అక్కడ నెలకొన్న ఉత్కంఠకు కారణం. కానీ, అలా అంతా ఎదురుచూస్తున్న ఆ కాలంలో ఆయన బుషెరోన్ అనే ఆభరణాల సంస్థలోకి అడుగుపెట్టాడు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉన్న నగలు ఆయనకేం అక్కర్లేదు. తన దగ్గరున్న అపారమైన సంపదను కొత్త డిజైన్స్ గా.. కళాఖండాల్లా మార్చాలనే ఆయన పారిస్ లో ఆ సంస్థను సంప్రదించాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే అప్పటికే ఆకట్టుకుంటున్న ఆ నగలను అంతకంటే ఇంకా బాగా ఎలా డిజైన్ చేయగలమనే ఒక పజిల్ ను బుషెరోన్ జ్యువెల్లరీ కళాకారుల ముందుంచాడు భూపీందర్ సింగ్. కానీ, భూపీందర్ సింగ్ కోరిక మేరకు అవి ఆ తర్వాత అద్భుత సృష్టిగా తయారయ్యాయి. 149 ప్రత్యేకమైన ఆభరణాలు.. హారాలు, కంకణాలు, నడుం పట్టీలు, తల అలంకారాలైన అయిగ్రెట్లు, రాజసంబంధమైన వేడుకల ఆభరణాలుగా అద్భుతంగా తీర్చిదిద్దారు పారిస్ కళాకారులు.

పటియాలా రాజు ఇచ్చింది కేవలం ఓ ఆర్డర్ మాత్రమే కాదు… ఆభరణాలను కొత్త కళాఖండాలుగా సృష్టించడంలో ఓ మహారాజు సృష్టించిన విప్లవం. అలా అని అదే ఆయన జీవితంలో ఏకైక గొప్ప ఘట్టమూ కాదు. అదే సమయంలో, 1847లోనే లూయిస్ ఫ్రాంకోయిస్ కార్టియర్ నేతృత్వంలో పారిస్ లో నెలకొల్పిన మరో ప్రపంచ ప్రసిద్ధ ఆభరణాల సంస్థైన కార్టియర్ లో కూడా ఆయన నెక్లెస్ ను తయారు చేయించారు. ఆ తర్వాత అదే ప్రసిద్ధి చెందిన పటియాలా నెక్లెస్ గా కూడా వినుతికెక్కింది. దాదాపు 3 వేల వజ్రాలతో అలంకరించబడిన హారం.. మధ్యలో ఉండే 234 క్యారెట్ల డీబీర్స్ వజ్రంతో.. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన నగలోలో ఒకటిగా ఆ నెక్లెస్ ను నిలిపింది.

ఇప్పటికీ పటియాలా మహారాజా భూపీందర్ సింగ్ పారిస్ కు వెళ్లిన సందర్భం అక్కడ ఓ గుర్తుగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆయన వెళ్లింది కేవలం నగల డిజైనింగ్ కోసమే అయినా… ఆ వైభవం మాత్రం పారిస్ ను ఆయన్ను గుర్తు పెట్టుకునేలా చేసింది.

ఆరడుగుల ఏడంగుళాల ఎత్తైన ఓ మహారాజు, 40 మంది సేవకులతో, వజ్రాల మూటలతో.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆభరణాల కళాకారులు సైతం ఆశ్చర్యపోయి నిశ్శబ్దంగా నిల్చిపోయిన దృశ్యమది. అందుకే, ఇలాంటి కథలు విలాసవంతమైన సమాజపు పురాణాలుగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు. కేవలం సంపద కారణంగానే కాదు.. ఓ కాలానికి ప్రతీకగా నిల్చేవవి. ఒక భారతీయ మహారాజు పారిస్ లో అడుగుపెట్టి విలాసమంటే ఎలా ఉంటుందన్న భావనకే కొత్త అర్థం చెప్పిన కాలమది. దాదాపు శతాబ్దం గడుస్తున్నా ఇప్పటికీ ఆ సీన్ తల్చుకుంటుంటే నమ్మశక్యం కానట్టో.. కొంత సినిమాటిక్ గానో అనిపించడమూ సాధారణమే.

ఎందుకంటే, అతడో సాధారణ వినియోగదారుడో, కొనుగోలుదారుడో కాదు.. పారిస్ ను సైతం తన రాజసం, వైభవంతో విస్తుగొల్పిన ఒక నడిచే ఖజానా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles