హృషీకేష్.. ✍🏼
గంగా, భగీరథీ సమానురాలైన అంటూ వెనుకట ఉత్తరాల్లో సంభోదిస్తూ రాయడం మనకు గుర్తే కదా…? అంటే భారతీయ జీవనవిధానంలో… గంగా, భగీరథీ, కావేరీ, కృష్ణా, యమున, తుంగభద్ర ఇలా ఎన్నో నదుల పవిత్రతకు ఎంత ప్రాధాన్యత ఉందో పట్టిచూపేందుకు… ఇప్పటికీ లేఖలు రాసేవాళ్లు ఉపయోగించే ఆ పద ప్రయోగమే ఓ చిన్న ఉదాహరణ.

మరలాంటి గంగా, భగీరథీ నదుల ప్రక్షాళనకై… కాన్పూర్ లో ఐఐటీ ప్రొఫెసర్… పర్యావరణ ఇంజనీరింగ్ ప్రేమికుడు… ఆ తర్వాత ఆశ్రమదీక్ష తీసుకుని ఆ నదుల ప్రక్షాళనే పోరాటమై… తన ఆమరణ నిరశన దీక్షలోనే తుదికంటూ శ్వాస విడిచిన ఓ మహానుభావుణ్ని ఓసారి గుర్తు చేసుకుందాం. కేంద్ర వైఖరికి నిరసనగా… స్వయానా ప్రధాని మోడీ మ్యానిఫెస్టోను పట్టించుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ.. ఏకంగా 114 రోజుల నిరశన దీక్ష బూని 2018, అక్టోబర్ 12న అసువులు బాసిన మహామనిషి. జీ. డీ. అగర్వాల్. ఆయనే ఆశ్రమదీక్షిత స్వామిగా అవతరించిన జ్ఞానస్వరూప సనంద.
ఇంతకు ఎవరీ జ్ఞానస్వరూప సనంద…?
తాను 114 రోజుల ఆమరణ నిరాహార దీక్షను చేపట్టినా… ఆయన తుది శ్వాస వరకూ అజ్ఞానాంధకారంలో కన్నుతెరవని కేంద్రాన్ని తన మరణం తర్వాతైనా కళ్లు తెరవాలని ఆశించాడు. ఇప్పటికీ మొద్దునిద్ర వీడని ఆ కేంద్ర అలసత్వాన్ని ఎప్పటికప్పుడూ పట్టిచూపించే ఓ ప్రతిబింబం జ్ఞాన స్వరూపం సునంద!.
కాన్పూర్ ఐఐటీలో పర్యావరణ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న జీ.డీ. అగర్వాల్… ఆ తర్వాత ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు. 2011లో ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో మాత్రిసదన్ ఆశ్రమంలో సన్యాసాన్ని స్వీకరించి జ్ఞానస్వరూప సనంద స్వామిగా మారారు. మాత్రిసదన్ గంగా పరిరక్షణ కోసం 1998 నుంచి పూర్తిగా గాంధేయ మార్గంలో పాటుపడిన ఆశ్రమం. గంగా నదీ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ… వాటిని నిషేధించాలన్నదే మాత్రిసదన్ ప్రధాన డిమాండ్.
ఇంతకీ ప్రొఫెసర్ జీ.డీ. అగర్వాల్ అలియాస్ జ్ఞానస్వరూప సనంద ఏంచేశారు..?
పవిత్ర గంగాజలాలను శుద్ధి చేయాలని… ఆనకట్టల నుంచి గంగను కాపాడేలా ఓ చట్టాన్నే రూపొందించాలని కొట్లాడిన వ్యక్తి ప్రొఫెసర్ జీ.డీ. అగర్వాల్. జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ ప్రాంతంలో 6500 కోట్ల రూపాయలతో నిర్మించిన మల్టీ మాడల్ వాటర్ వేస్ టెర్మినల్ కారణంగా… 485 కుటుంబాలు నిరాశ్రయులయ్యారని… అలాగే హల్దియా-వారణాసి లోతట్టు జలమార్గ ప్రాజెక్ట్ మార్గ నిర్మాణం వల్ల… లోతట్టు తాబేళ్ల ఏకైక పరిరక్షణ ప్రాంతంగా పేరొందిన… వారణాసి తాబేళ్ల అభయారణ్యానికీ, అలాగే జలసంరక్షణలో మాత్రమే జీవించగల్గే ఎన్నో జాతులకు తీరని నష్టమని… పర్యావరణ పరంగా పెద్ద దెబ్బ అని పోరాటం చేసిన వ్యక్తి జీ.డీ. అగర్వాల్.
గంగా మైదాన తీర ప్రాంతంలో నివశిస్తున్న ప్రజలు 2014 ఓట్ల కాలాన ప్రధాని మోడీని నమ్మారు. గంగా ప్రక్షాళన చేస్తానన్న ఆయన మాటలు బుట్టదాఖలైపోయి. ఆ గంగలో క్రూయిజ్, కార్గో షిప్పులు నడుస్తూ… అక్కడి జీవావరణ పరిస్థితులు… మత్యసంపదే తమ సంపదగా ఉపాధి సాగిస్తున్నవారి జీవనోపాధి కోల్పోవడం వంటివాటిని వేలెత్తిచూపిన స్వామి.. జ్ఞానస్వరూప సనంద.
2018 ఫిబ్రవరి నుంచి ప్రొఫెసర్ జీ. డీ. అగర్వాల్ గంగ పర్యావరణాన్ని దెబ్బతీసే ప్రాజెక్టులను ఆపేయాలని మోడీ నేతృత్వంలోని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ పలు లేఖలు సంధించారు. ఓ దేశ ప్రధానిని తమ్ముడు అని సంభోదిస్తూనే… తోటి గంగమ్మ కొడుకుగా పేర్కొంటూ… గంగా పరిరక్షణ మీ బాధ్యత అంటూ ప్రధాని బాధ్యతను గుర్తు చేస్తూ మూడు లేఖలు రాశారు. ఆయన మరణం తర్వాత నిట్టూర్పులు విడిచిన మోడీ నుంచి… ఆ లేఖలకు మాత్రం ఎలాంటి స్పందనా రాలేదు. 2014 ఓట్ల నాడు గంగా పరిరక్షణ బాధ్యత మాదేనని చెప్పి… ఇప్పుడు మీరేం చేస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు జీ.డీ. అగర్వాల్. గంగను జాతీయ జలమార్గంగా ఉపయోగించుకోవాలన్న ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. అది స్థానిక వైవిధ్య జాతుల మనగడకు ప్రమాదమై… కేవలం కార్పోరేట్ల ప్రయోజనాలకనుగుణమైనదని తూర్పారబట్టాడు.
సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అనే ఎన్జీవో కార్యకర్త ఉజ్జవాల్ కృష్ణాని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు కేంద్రం స్పందించింది. 2018 జూన్ 13, జూన్ 23 తేదీల్లో ప్రొఫెసర్ అగర్వాల్ నుంచి ప్రధానికి లేఖలు అందినట్టు పీఎంవోనే స్వయంగా పేర్కొంది. స్వామి జ్ఞానస్వరూప సనంద 114 రోజుల దీక్షతో కేంద్రానికి చెడ్డ పేరు వస్తోందని… కేంద్రం ఉమాభారతి, నితిన్ గడ్కరీ, చివరగా 2018 అక్టోబర్ 9వ తేదీన రమేష్ పోఖ్రియాల్ వంటివారితో చర్చలు జరిపించింది. అయినా తాననుకున్న లక్ష్యం కోసం కేంద్ర వైఖరిలో మార్పు రానంతవరకూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు ప్రొఫెసర్ జీ.డీ. అగర్వాల్ అలియాస్ జ్ఞానస్వరూప సనంద. అలా పోక్రియాల్ చర్చల తెల్లవారే ఆయన్ను మాత్రిసదన్ నుంచి రిషీకేష్ లోని ఎయిమ్స్ కి మార్చేశారు.
దశాబ్దాల పాటు భారతదేశంలోని నదుల పరిరక్షణకై అంతగా కొట్లాడిన వ్యక్తి ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదు. 2009లో భగీరథీ నదిపై ఆనకట్టల వ్యవహారంపై ఫైట్ చేశారు బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలం నుంచి పర్యావరణ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ చేసిన ప్రొఫెసర్ డాక్టర్ జీ.డీ. అగర్వాల్… అలియాస్ జ్ఞానస్వరూప సనంద. యూపీఐ హయాంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా.. కార్యదర్శిగా కూడా పనిచేసి… సన్యాసాశ్రమంలో జ్ఞానస్వరూప సనందగా మారారు. ప్రొఫెసర్ జీ.డీ. అగర్వాల్ పోరాటపటిమ అంతెత్తు భారత ప్రభుత్వాన్నే కదిలించిన తీరు… పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చనేందుకు ఓ ఉదాహరణ. నేటి యువతకు ఓ మార్గదర్శకం. అద్భుతమైన లక్ష్యంతో పోరాటంలోనే తన మరణాన్ని వెతుక్కున్న ఆ యోధుణ్ని తల్చుకునేందుకే ఈ అక్షరనివాళి!



