హృషీకేష్.. ✍🏼
భారత కర్ణుని కథ, క్రీడాభారత సౌత్ ఆఫ్రికా గాథ.. పోల్చి చూస్తే కొంచెం సిమిలర్ గా అనిపిస్తాయి. అన్ని అర్హతలుండీ.. అదృష్టానికి దూరంగా ఉండటమే ఈ ఉపమానానికి కారణమేమో బహుశా!

ప్రొఫెషనల్ గేమ్ తో అత్యుత్తమ జట్టుగా నిలిచినా.. ఛాంపియన్ గా నిలవడంలో మాత్రం తడబాటు తప్పని దురదృష్ట జాతకం కూడా ఆ సౌత్ ఆఫ్రికాదే. ఆజన్మాంతం రాధేయుడిగా.. ఛాత్రపరీక్షలో ధనుర్ధారిగా నిలువలేని అస్థిత్వ పోరాటంతో కర్ణుడి పాత్రెలాగైతే కనిపిస్తుందో.. వర్ణవివక్ష అనే రేసిజంతో 22 ఏళ్ల పాటు నిషేధానికి గురైన దక్షిణాఫ్రికాదీ సమకాలీన రాజకీయ క్రీడలో సుమారు అదే పాత్ర! అరుదైన కవచ కుండలాలున్నా.. ఇంద్రుడి వంటి కపట నాటక సూత్రధారుల కుట్రలకు బలైన.. ఆ కుంతీకుమారుడి జీవితంలాంటిదే.. దక్షిణాఫ్రికా క్రికెట్ చిత్రం!.
భారతంలో కర్ణుడి పాత్రకెన్ని కష్టాలున్నాయో … క్రికెట్ లో సౌత్ ఆఫ్రికాది అదే పరిస్థితి! ఆ జన్మాంతం కర్ణుడు రాధేయుడిగా వర్ణ వివక్ష ఎదుర్కొన్నాడు… అదే వివక్షతో దక్షిణాఫ్రికా 22 ఏళ్ల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాల్సిరావడం క్రీడా స్ఫూర్తి వర్ధిల్లాల్సిన సభ్యసమాజంలో కనిపించే సిగ్గుమాలిన చర్య!

91 వరకూ చీకటి అధ్యాయం!
1948 – 1991 వరకు సౌత్ ఆఫ్రికాది క్రికెట్ లో ఓ చీకటి అధ్యాయం, రేసిజం కారణంగా 1970లో ఐసీసీ సౌత్ ఆఫ్రికాను నిషేధించింది. 22 ఏళ్లనంతరం వర్ణవివక్ష రద్దయ్యాకగానీ.. సౌత్ ఆఫ్రికా తొలిసారిగా ఇండియాతో క్రికెట్ ఆడేందుకు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో మైదానంలోకి అడుగుపెట్టింది.1992లో తొలిసారిగా వరల్డ్ కప్ లో అడుగు పెట్టిన దక్షాణాఫ్రికా.. కెప్టెన్ కెప్లర్ వెసెల్స్ సారథ్యంలో అన్ని రకాల మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ, ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో వర్షం కారణంగా దక్షిణాఫ్రికా తలరాత మారింది. 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన సమీకరణలో కురిసిన భారీ వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ రూల్స్ సౌత్ ఆఫ్రికా పాలిట శాపంగా మారాయి. ఈ సమీకరణంతో ఒక్క బంతిలో 22 పరుగులు విజయ లక్ష్యంగా మారి అందినట్టే అందిన విజయం దూరమైపోయింది. ఇలా మొదలైన సౌత్ ఆఫ్రికా జట్టు దురదృష్టం, ఓటమి పర్వం మధ్యలో ఒకటో, ఆరో ఊరట మినహా.. మొన్నటివరకూ వెంటాడింది.
1999 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ అత్యంత విషాదకర ఘట్టం సౌత్ ఆఫ్రికాది. ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్, మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 213 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా చివరి ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాలి. ల్యాన్స్ క్లూసెనర్ , అలెన్ డోనాల్డ్ క్రీజులో ఉన్నారు. తొలి రెండు బంతులు బౌండరీలుగా మలిచిన క్లుసేనర్ మ్యాచ్ ను టై చేశారు. విజయం కోసం సౌత్ ఆఫ్రికాకు నాలుగు బంతుల్లో ఒక్క పరుగు కావాలి. మరోవైపు ఆస్ట్రేలియాకు ఒక వికెట్ కావాలి. మూడో బాల్ డాట్ బాల్ కాగా నాలుగో బంతి లూస్నర్ బాదిన స్టీవా పద్మవ్యూహం లాంటి ఫీల్డింగ్లో చిక్కుకుపోయింది. రన్ కాల్ గమనించని డోనాల్డ్ పరిగెత్తేలోపే రన్ అవుట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికాను చీకట్లోకి నెట్టేశాడు. మ్యాచ్ టై అయినప్పటికీ డక్వర్త్ లూయిస్ ప్రకారం కాంపిటీషన్ రూల్స్ మరొకసారి సౌత్ ఆఫ్రికా పాలిట శాపంగా మారాయి. లీగ్ దశలో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాను ఓడించిన కారణంగా ఫైనల్ లోకి అడుగుపెట్టింది. అన్ని అర్హతలు ఉండి కూడా దురదృష్టం వెంటాడే జట్టుగా చోకర్స్ గా సౌత్ ఆఫ్రికా నామకరణం చేసుకుంది. అపార క్రికెట్ అనుభవజ్ఞులు “The Greatest ODI Match ever Played” అని ఆ మ్యాచును కొనియాడారు.
అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ అత్యుత్తమ జట్టుతో 1996, 2011 వన్డే వరల్డ్ కప్ క్వాటర్ ఫైనల్స్ లోనూ.. 1992, 1999, 2007, 2015, 2017 సెమీఫైనల్ కు చేరినా కప్ పోరులో చతికిల పడింది దక్షిణాఫ్రికా. 2009, 2014 లో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరినా విజయాన్ని ముద్దాడలేకపోయింది. గత సంవత్సరం 2024 ఫైనల్ లో ఇండియా చేతిలో ఓడి కప్ అవకాశం కోల్పోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ 2002, 2006లో సెమీఫైనల్లో ఓటమిపాలైన దక్షిణాఫ్రికా మధ్యలో 1998లో మాత్రం ఒకసారి ఛాంపియన్ గా నిలిచింది. రెండు క్వార్టర్ ఫైనల్స్, 12 సెమీఫైనల్స్, ఒక ఫైనల్ లో ఓటములు సౌత్ ఆఫ్రికా జట్టు దురదృష్టాన్ని వెక్కిరించే గణాంకాలు.
కెప్లర్ వెసెల్స్ తో పాటు, హ్యన్సీ క్రానే, హర్షలే గిబ్స్, జాంటీ రోడ్స్, జాక్వస్ కల్లిస్, డారెల్ కలినాన్, అలెన్ డోనాల్డ్, షాన్ పోలాక్, లాన్స్ క్లూసెనర్, AB డివిలియర్స్, డూప్లెసిస్, స్టెయిన్ వరకు దిగ్గజాలున్నా కీలక మ్యాచులలో వెంటాడే దురదృష్టం, ఓటమి.. వారిని చోకర్స్ గా నిలిపింది. అర్హతలుండి నిర్ణయాత్మక మ్యాచుల్లి దురదృష్టంతో ఓటమి పాలవ్వడంతో చోకర్స్ గా ముద్ర వేసుకుంది సౌత్ ఆఫ్రికా టీం. హ్యాన్సి క్రానే సారథ్యంలోని సౌత్ ఆఫ్రికా జట్టు తొలి ఐసీసీ ట్రోఫీ గెల్చుకుంది. 1998లో తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏకైక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అది. సరిగ్గా 27 సంవత్సరాల తర్వాత మళ్లీ చరిత్రను తిరగరాసి.. శాపంగా మారిన తమ దురదృష్టంపై సానుభూతి చెందిన విశ్వవ్యాప్త అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలుచుకుని సౌత్ ఆఫ్రికా ఇప్పుడు క్రికెట్ లో కొత్త చర్చయ్యింది.
అసలు ఏమిటి WTC.. WORLD TEST CHAMPION SHIP.. ?
ICC.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. వన్డే, T20 లతో పాటు.. టెస్ట్ మ్యాచ్ కు కూడా ఛాంపియన్షిప్ ట్రోఫీలను ఇవ్వాలని ప్రయోగాత్మకంగా నిర్ణయించింది. 2009 నుంచే ఈ ఆలోచన ఉన్నప్పటికీ రకరకాల కారణాల చేత వాయిదాపడింది. 2019లో తొలిసారి అధికారికంగా వన్డే, టీ20 మాదిరిగానే.. టెస్ట్ ఛాంపియన్షిప్ ను ఐసీసీ నిర్ణయించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది టెస్ట్ మ్యాచుకు వరల్డ్ కప్ లాంటిది.
ఎలా ఆడుతారు.. ?
ఐసీసీ ర్యాంకింగ్స్ లో టెస్ట్ హోదా సంపాదించిన తొమ్మిది జట్లను నిర్ణయిస్తారు. రెండేళ్ల వ్యవధిలో ఆ తొమ్మిది జట్లు ఆరు సిరీసులను ఆడాల్సి ఉంటుంది. మూడు స్వదేశీ గడ్డపై.. మరో మూడు విదేశీ గడ్డపై టెస్ట్ మ్యాచులుంటాయి. పాయింట్ల ఆధారంగా ఫైనల్ అర్హతను నిర్ణయిస్తారు. టెస్ట్ మ్యాచ్ గెలిచిన జట్టుకు 12 పాయింట్స్.. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే 4 పాయింట్స్.. మ్యాచ్ టై గా నిలిస్తే 6 పాయింట్స్ వస్తాయి. ఇలా నిర్ణయించబడిన తర్వాత.. రెండు సంవత్సరాల్లో టాప్ 2 జట్లు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచులో తలపడతాయి.
ఇప్పటి వరకు ఎవరెవరు గెలిచారు.. ?
2019, ఆగస్ట్ 1 నుంచి 2021, 23 జూన్ వరకూ జరిగిన WTC టోర్నీలో ఇండియా, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ ఛాంపియన్షిప్ కు ఫైనల్ జరిగింది. తొలి టైటిల్ ను న్యూజిలాండ్ గెలుచుకుంది.
2021-2023 మరోసారి ఇండియా, ఆస్ట్రేలియా అర్హత సాధించగా ఆస్ట్రేలియా గెల్చుకుంది. తాజాగా 2023-2025 లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో వరుస గెలుపులు సాధించిన సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఫైనల్ అర్హత సాధించాయి. 4 రోజులు రసవత్తరంగా సాగిన మ్యాచులో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించింది. 8 వరుస టెస్టులలో గెలిచి దక్షిణాఫ్రికా విశ్వవిజేతగా నిలిచింది. 27 సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించి రికార్డులకెక్కింది. 2024లో మార్క్రమ్ కన్నీళ్లు పెట్టాడు, ఈ ఫైనల్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు, రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టి సౌత్ ఆఫ్రికా తలరాత మార్చి Man of the Seriesగా ఎంపికయ్యాడు. సౌత్ ఆఫ్రికా వెటరన్ ప్లేయర్లు అందరూ ఈ మ్యాచ్ కోసం లార్డ్స్ మైదానంలోకి వచ్చారంటేనే వారి బాధ లోతును అంచనా వేయొచ్చు. వారి భావోద్వేగాలెలాంటివో అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఇప్పుడు వారు చోకర్స్ కాదు.. ఛాంపియన్స్!



