పత్తి, అగర్బత్తీ.. ఇవే స్పెషల్ ఎఫెక్ట్స్: నాల్గు దశాబ్దాల క్రితమే టీవీ సెట్లకు కట్టేసిన రామానంద సాగర్!

రామాయణ ట్రైలర్ రిలీజ్ తో సహజంగానే… ఇప్పుడు మళ్లీ ఆ సినిమా టేకింగ్ పైనా.. ముఖ్యంగా అందులో పనిచేస్తున్న స్టార్స్ పైనా ఎంత చర్చ జరుగుతుందో.. ఈ కాలంలో వీఎఫ్ఎక్స్ పైనా అంతకంటే ఎక్కువ చర్చ సహజం. ఎందుకంటే ఆదిపురుష్ వంటి సినిమా డిజాస్టర్ గా మిగిలిపోవడంతో.. రాబోయే నితేష్ తివారీ రామాయణ్ పైన మరింత ఫోకస్ సర్వసాధారణం. రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా.. మరోవైపు, హాన్స్ జిమ్మర్ తో కలిసి ఏ. ఆర్. రెహమాన్ సంగీతమందిస్తుండటంతో ఆ క్రేజ్ మరింత ఎక్కువ. ఇప్పటికే ట్రైలర్ పై పెదవి విరుస్తున్నవారూ కనిపిస్తుండగా… అసలు వీఎఫ్ఎక్స్ వంటి సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లో మనల్ని ప్రతీ ఆదివారం అలరించిన రామాయణ్ ధారావాహికంలో ఎఫెక్ట్స్ ఎలా తీసి ఉంటారు..? అందుకు రామానందసాగర్ ఏం చేశారు..? రండి తెలుసుకుందాం!

జస్ట్ అగరుబత్తి, పత్తి… ఇవే రామానందసాగర్ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అంటే నమ్మగలరా..?

ఏడు కోట్ల ఖర్చుతో నాల్గు దశాబ్దాల క్రితం ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరం లేకుండానే రామాయణాన్ని తెరకెక్కించి అందరి మన్ననలూ అందుకున్నారు రామానందసాగర్.

వాల్మీకీ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న కొత్త రామాయణ్ ను హన్మాన్ జయంతి సందర్భంగా ట్రైలర్ విడుదల చేసి ఆసక్తికర చర్చకు తెరలేపింది ఆ సినిమా బృందం. సుమారు 2 వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా.. భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్.

సహజంగానే ఒకే కంటెంట్ తో ఏ సినిమానైనా, సీరియలైనా తెరకెక్కినప్పుడు పోల్చుకోవడం సర్వసాధారణం. అలాంటి పోలికే ఇప్పటి రామాయణ్ నేపథ్యంలో నలభై ఏళ్ల క్రితం రామానందసాగర్ రామాయణ్ సీరియల్ ను తెరపైకి తెచ్చి పోలుస్తున్నారు. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం, లో బడ్జెట్ లో రామానందసాగర్ రామయణ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని కల్గి ఉంది.

నాడు 7 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే నేడు 150 కోట్లకు సరిసమానంగా చూసినా.. భావోద్వేగపరంగా ఆధునికంగా రూపొందిస్తున్న భారీ చిత్రాల కంటే రామానందసాగర్ నాటి సీరియల్ ఎంతో ముందుంటుందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది.

చెరగని సాంస్కృత ప్రభావాన్ని కనబర్చిన సీరియల్!

1987-88లో రామాయణ్ టెలివిజన్ లో ప్రసారం అయినప్పుడు భారతీయ టెలివిజన్ చరిత్రలో అదో మైలురాయి. ప్రతీ ఎపిసోడ్ కు కేవలం 9 లక్షల రూపాయల ఖర్చుతో రామాయణ్ సీరియల్ ను తెరకెక్కించారు రామానందసాగర్. కానీ, నాడు అదే ఖరీదైన టీవీ షోల్లో ఒకటిగా నిల్చింది.

రామాయణ్ వస్తుందంటే చాలు.. ప్రతీ ఆదివారం వీధులన్నీ ఖాళీగా, దుకాణాలు మూసేసి అప్రకటిత కర్ఫ్యూలా కనిపించేవి. ఎవ్వరిని చూసినా రామాయణ్ టీవీ సీరియల్ కు అతుక్కుపోయేవారన్నట్టుగా కోట్ల మందిని అలరించింది. ఒక్కమాటలో చెప్పాలంటే భక్తితో టీవీ సెట్లకు అతుక్కుపోయిన చరిత్రను నాటి రామానందసాగర్ రామాయణ్ సృష్టించింది.

నాటి రామానందసాగర్ తీసిన రామాయణ్ భారతదేశానికే పరిమితం కాలేదు.. విశ్వవ్యాప్తమైంది. వివిధ దేశాల్లో కూడా ఆ సీరియల్ ప్రసారమైంది. విలియమ్ డాల్రింపుల్ అనే చరిత్రకారుడేమంటారంటే… పట్టణాలంతా టీవీ చుట్టూ చేరి రామాయణం చూడటం సర్వసాధారణంగా మారడం రామాయణ్ తో సాధ్యమైంది. ప్రభుత్వ పనులు కూడా ఆ సమయంలో నిల్చిపోయిన సందర్భాలున్నాయంటారాయన.

కంప్యూటర్లు లేకుండా సృష్టించిన మాయాజాలం!

సృజనాత్మకతే రామానందసాగర్ ప్రత్యేకత. నేటి డిజిటల్ వీఎఫ్ఎక్స్, ఏఐ టూల్స్ లేని కాలంలో పూర్తి ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ధారావాహికం నాటి రామాయణ్.

కానీ, షూటింగ్ షెడ్యూల్స్ మాత్రం చాలా కఠినంగా ఉండేవట. ముంబై, ఉంబర్ గావ్ మధ్య క్యాస్ట్, క్ర్యూ తరచూ ప్రయాణిస్తూ రాత్రి రాసిన సన్నివేశాల్ని ఉదయాన్నే షూట్ చేసేవారు. ఇక స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం వారుపయోగించిన పద్ధతులూ ఆసక్తికరమైనవే.

బ్యాక్ ప్రొజెక్షన్ టెక్నిక్, మినియేచర్ మాడల్స్, గ్లాస్ పెయింటింగ్స్, మేఘాల ఎఫెక్ట్స్ కోసం పత్తి, పొగ కోసం అగర్బత్తీ, దేవలోక సన్నివేశాల కోసం స్లైడ్ ప్రొజెక్షన్స్ ఇలా చిన్న చిన్న వస్తువులతో కూడా పెద్ద ప్రపంచాన్ని సృష్టించి.. పరిమిత వనరులతో కూడా అద్భుతాలు సాధించొచ్చని రామానందసాగర్ రామాయణ్ నిరూపించింది.

దీపావళికి విడుదల కాబోతున్న 2 వేల కోట్ల రూపాయల రామాయణ్ ట్రైలర్ ను మించి అలరించవచ్చునేమోగానీ… కేవలం, 7 కోట్ల రూపాయలతో రూపొందిన రామానందసాగర్ రామాయణం భావోద్వేగం, భక్తి, సృజనాత్మకతతో ఇప్పటికీ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుని అజరామరమైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles