అత్యంత భారీ భద్రత, అంతకుమించిన ప్రోటోకాల్ కు కేరాఫ్ గా నిల్చి హైఎండ్ ఈవెంట్స్ కు మాత్రమే వేదికయ్యే రాష్ట్రపతి భవన్.. ఇప్పుడో పెళ్లి వేడుకకు ముస్తాబవుతోంది. అవును ఈ ఫిబ్రవరి 12న జరిగే సీఆర్పీఎఫ్ అధికారి పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్ లో జరుగనుంది. అందేంటి.. అంత ప్రత్యేకత అంటారా..? ప్రత్యేకమే కాదు, చారిత్రాత్మకమైన ఘటనగా కూడా చెప్పుకోవచ్చు.

పూనమ్ గుప్తా రాష్ట్రపతి భవన్ లో పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తోంది. ఆమెకు కాబోయే భర్త అవనీష్ కుమార్ జమ్మూకశ్మీర్ లో అసిస్టెంట్ కమాండర్ గా పనిచేస్తున్నాడు. అయితే, పూనమ్ గుప్తా సేవలు, ఆమె ప్రవర్తనకు ముగ్ధురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన రాష్ట్రపతి భవన్ ను పూనమ్ జీవితాంతం గుర్తుంచుకునేలా పెళ్లి వేదికగా మార్చి అద్భుతమైన బహుమతినిచ్చారు. పూర్తి భద్రతా తనిఖీలు నిర్వహించి వరుడు, వధువు కుుటుంబాల సభ్యులు, ఇతర స్నేహితులతో లిమిటెడ్ మ్యారేజ్ ఈవెంట్ గా పూనమ్ పెళ్లి వేడుకను ఏర్పాటు చేశారు.
అయితే, గతంలోనూ ఇలాంటి ఆకట్టుకునే ఓ ఘటన జరిగింది. 2020 జనవరి నెలలోనూ ఓ పెళ్లి వేడుకకు రాష్ట్రపతి భవన్ వేదికైంది. అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జోక్యంతో అప్పుడా పెళ్లి జరిగింది. అమెరికాకు చెందిన ఆష్లే హాల్ కొచ్చిలోని ఫైవ్ స్టార్ హోటల్ లో వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక ఆ సమయంలోనే అక్కడ రాష్ట్రపతి కోవింద్ పర్యటనకు వెళ్లడంతో.. ఆ హోటల్ ను రాష్ట్రపతి భద్రత కోసం ఆల్రెడీ రిజర్వ్ చేశారు కాబట్టి.. పెళ్లికి తమ హోటల్ లో వీల్లేదని యాజమాన్యం చెప్పేసింది.

దాంతో ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆష్లే తన X అప్పటి ట్విట్టర్ ఖాతాలో రాష్ట్రపతి అఫీషియల్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ తన సాయాన్ని కోరింది. వెంటనే ఆ విషయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికెళ్లింది. ఇంకేం ఆయన ఆదేశాలతో రాష్ట్రపతి భవన్ అధికారులు తక్షణమే స్పందించారు. అలా రాష్ట్రపతి భవన్ లో 2020 జనవరిలో ఆష్లే హాల్ పెళ్లికి రాష్ట్రపతి భవన్ వేదికైంది.
ఇప్పుడు సర్వీస్ లో ఉన్న ఓ అధికారి వివాహానికి వేదికైన రాష్ట్రపతి భవన్ మరోసారి ఓ కొత్త అధ్యాయంతో వార్తల్లోకెక్కింది. రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరీసా క్రౌన్ కాంప్లెక్స్ లో పూనమ్ గుప్తా వివాహ వేడుకలు జరుగనున్నాయి.
అసలు పూనమ్ గుప్తా ఎవరంటారా..?
పూనమ్ గుప్తా 2018 యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించి సీఆర్పీఎఫ్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా తన సేవలందిస్తోంది. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లోని జివాజీ విశ్వవిద్యాలయం నుంచి బీఎడ్ కూడా పూర్తి చేసిన పూనమ్.. గణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఆంగ్ల సాహిత్యంలో పీజీ పూర్తి చేసింది. 2024 గణతంత్ర వేడుకల కవాతులో సీఆర్పీఎఫ్ మహిళా బృందానికి నాయకత్వం వహించింది.
పూనమ్ గుప్తా ఇన్ స్టా అకౌంట్ ద్వారా మహిళలను చైతన్యపర్చడం, పలు అంశాల్లో అవగాహన కల్పించడం వంటివాటితో సోషల్ మీడియాలోనూ ప్రోయాక్టివ్ ఉమ్యాన్ గా పేరు తెచ్చుకుంది. బీహార్ లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ కమాండెంట్ గా నాయకత్వం వహించారు.
పూనమ్ క్రమశిక్షణ, డ్యూటీ మైండ్ సెట్, ఆమె సర్వీస్ ఇవన్నీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును విశేషంగా ఆకట్టుకోవడంతో ఏకంగా తన పెళ్లి వేడుకకు రాష్ట్రపతి భవన్ నే వేదికగా మార్చుకుని అపార గౌరవాన్ని, గుర్తింపునూ సంపాదించుకుంది.



