రెండు భిన్నధృవాలు ఒక్క దిక్కున తారసపడితే ఏమవుతుంది…? పైగా ఒకేచోట బ్యాచ్ మేట్స్ కూడా అయ్యుండి… అసలేమాత్రం పొంతన లేని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నవారు ఏదైనా వేదికపై కలిస్తే.. వారిమధ్య ఎలాంటి సంభాషణ చోటుచేసుకుంటుంది..? చెప్పుకోవడానికే కాస్త ఆసక్తికరంగా అనిపిస్తున్న ఈ భేటీ గూగుల్ సీఈవోకు, ఓ సన్యాసికి మధ్య జరిగింది. అందుకే ఈ స్టోరీ కాస్త ఇంట్రెస్టింగ్.

లండన్ వేదికగా ఇండియా గ్లోబల్ ఫోరమ్ 2025 అనే ఒక సమ్మిట్ జరుగుతోంది. దానికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెళ్లాడు. మరొకరు ఇస్కాన్ కు చెందిన మాంక్ గౌరంగ దాస్ కూడా అదే స్టేజీపైన సుందర్ కు తారసపడ్డాడు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ ఎంత పాప్యులరో.. ఆధ్యాత్మిక వ్యవహారాల గురించి తెలిసినవారికి గౌరంగ దాస్ అంత ఆరాధ్యుడు. ఇప్పటికీ కార్పోరేట్స్ నుంచి మొదలుకుంటే చాలామంది ఉదయం లేవగానే ఆయన మోటివేషన్ ప్రవచనాలు లేందే తమ రోజును ప్రారంభించరంటే అతిశయోక్తి కాదు.
ఇండియా గ్లోబల్ ఫోరం 2025లో ప్రధానంగా ఒత్తిడి, ఆధ్యాత్మికత, నేటి యుగంలో డిజిటల్ సంక్షోభం వంటివాటి గురించి చర్చ జరిగింది. సుందర్ పిచాయ్, గౌరంగ దాస్ ఇద్దరూ సేమ్ బ్రాంచ్ కాకపోయినప్పటికీ… తరచూగానే కలుసుకున్నప్పటికీ ఆ ఇద్దరూ కూడా బాంబే ఐఐటీయన్స్ కావడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. గౌరంగ దాస్ ఇంకా యవ్వనంగా ఉండటాన్ని ఒకింత ప్రశంసిస్తూ కాస్త చమత్కరించాడు.
53 ఏళ్ల తనకంటే కూడా గౌరంగ దాసే చిన్నవాడిలా కనిపిస్తున్నాడంటూ సుందర్ పిచాయ్ స్టేజ్ పై చేసిన కామెంట్స్ కు గౌరంగ దాస్ ఇచ్చిన సమాధానం కూడా అందరినీ ఆకట్టుకుంది. సుందర్ పిచాయ్ ఒత్తిడిని సృష్టించే గూగుల్ తో డీల్ చేస్తే.. తాను ఒత్తిడిని విడుదల చేసే ఆ దేవుడితో వ్యవహరిస్తానంటూ గౌరంగ దాస్ ఇచ్చిన కౌంటర్.. పిచాయ్ తో పాటు, ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.
ఒకవైపు తాము సారథ్యం వహిస్తున్న కంపెనీల ప్రొడక్టివిటీ పెంచడంలోనే యవ్వనంగా, ఒత్తిడికి దూరంగా కనిపించే సుందర్ పిచాయ్ వంటి సీఈవోలున్న కాలంలో.. ఆ ఒత్తిడినే దరి చేరనీయని గౌరంగ దాస్ వంటి మాంక్స్ తో వారి కలయిక ఒకింత వైవిధ్యాన్ని కళ్లముందుంచేదే.
అదే సమయంలో కాస్త లిబర్టీ తీసుకుని మాట్లాడిన గౌరంగ దాస్.. డిజిటల్ మీడియా ఎలా వ్యసనంగా మారిపోయిందో కూడా కుండబద్ధలు కొట్టారు. దానివల్ల ప్రజారోగ్యంపై ఎంత తీవ్రమైన ప్రభావం పడుతుందో కూడా ఆయన విడమర్చి చెప్పారు. అధికంగా స్క్రీన్ కు అతుక్కుపోతూ.. సోషల్ మీడియాలో ఉంటున్నవారి మానసిక ఆరోగ్యం సంక్షోభంలో కూరుకుపోతోందన్నారు గౌరంగ. ఆయన తన ప్రసంగంలో ప్రపంచవ్యాప్తంగా 230 మిలియన్ల మంది ప్రజలు సోషల్ మీడియాకు బానిసలైనట్టు గణాంకాలు వెల్లడించారు. భారత్ లోనే 70 శాతం మందికి పైగా టీనేజర్స్ ప్రతీరోజూ 7 గంటల సమయం ఆన్ లైన్ లో గడుపుతున్నారని.. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడుగురిలో ఒకరు మానసికరోగాలకు గురవుతున్నట్టు గౌరంగ దాస్ ప్రసంగం వెల్లడించింది.
సుందర్ పిచాయ్ అంటే పరిచయం అక్కర్లేదు సరే.. గౌరంగ దాస్ ఎవరు..?
గౌరంగ దాస్ ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి. ఒక ఆధ్యాత్మికవేత్త. పర్యావరణవేత్త. విద్యావేత్త. ప్రస్తుతం ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. రాధానాథ్ స్వామి స్థాపించి గోవర్ధన్ ఎకో విలేజ్ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన నాయకత్వంలోని ఈ గోవర్ధన్ ఎకోవిలేజ్ 2017లో యూనైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనేజేషన్ అవార్డును కూడా అందుకుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం, ది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టూ కోంబాట్ డెజర్టిఫికేషన్, ది కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ వంటి యునైటెడ్ నేషన్స్ సంస్థలన్నింటి గుర్తింపునూ పొందిన ఆర్గనైజేషన్ మహారాష్ట్రలోని గోవర్ధన్ ఎకోవిలేజ్.
పర్యావరణ ప్రయత్నాలే కాకుండా… విద్య, నాయకత్వం వంటి అంశాల్లో ఆయన పాత్ర కీలకమైంది. పౌరసేవలకు ఆశావహులను తయారుచేసే గోవర్ధన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ లీడర్ షిప్ బోర్డులోనూ ఆయన సభ్యుడిగా పనిచేస్తున్నారు. అలాగే, వేదాలకు సంబంధించిన స్క్రిప్ట్స్ ను భద్రపరిచే విభాగంలోనూ, తత్వశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అందించే భక్తివేదాంత పరిశోధన కేంద్రానికీ ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ది ఆర్ట్ ఆఫ్ రీసైలెన్స్, ఆర్ట్ ఆఫ్ ఫోకస్ వంటి పుస్తకాల రచయితగా కూడా గౌరంగ దాస్ ఆధ్యాత్మికవాదులకు సుపరిచితులు.



