ప్రకృతి మెచ్చిన గ్రీన్ ఆస్కార్.. నుక్లూ ఫోమ్!

పచ్చని ప్రకృతి… తమలాగే భూమిపై జీవించే ఇతర ప్రాణులు.. అలాంటి జీవవైవిధ్యాన్ని గురించి తన తాత దగ్గర తెలుసుకుంటూ పెరిగాడు నుక్లూ ఫోమ్. తాతతో కలిసి నాగాలాండ్ లాంగ్లెంగ్ జిల్లాలోని యెయాంజించెన్ అనే తన సొంత గ్రామాన్నిఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో తిరుగుతూ పక్షులకు పేర్లు పెడుతూ… ప్రకృతి కథలు వింటూ పెరిగిన ప్రాణమది. అందుకే ప్రకృతిని మనం కాపాడితే… అది మనల్ని కాపాడుతుందన్నది ఆయన నినాదమైంది. ఏకంగా గ్రీన్ ఆస్కార్ నే అందించింది.

తన చదువు పూర్తి చేసుకున్న నుక్లూ ఫోమ్ 2010 లో తిరిగి తన గ్రామానికి వచ్చాడు. యెయాంజించెన్ కమ్యూనిటీ బయోడైవర్శిటీ కన్జర్వ్డ్ ఏరియా అనే ఓ సొసైటీ అప్పటికే జీవవైవిధ్యంపై పనిచేస్తుండటంతో… అక్కడ చేరిపోయాడు. బోధకుడిగానూ పనిచేస్తూ.. ఏడేళ్లపాటు ఆ బృందంతో కలిసి పయనించాడు. థియరీ కంటే ప్రాక్టికల్ ముఖ్యమనే విషయాన్నీ అదే సమయంలో గమనించిన నుక్లూ ఫోమ్.. తామనుకుంటున్న జీవవైవిధ్యాన్ని పెంపొందించాలన్నా.. అప్పటికే ఉన్నదాన్ని సంరక్షించాలన్నా… క్షేత్రస్థాయి కార్యనిర్వహణే ప్రధానమని భావించాడు. దాంతో తానే లెమ్సాషెన్లోక్ అనే ఓ సంస్థను స్థాపించాడు.

సైబీరియా వంటి దేశాల నుంచి వలస వచ్చే ఫాల్కన్స్ అనే జాతి పక్షులతో పాటు… హార్న్బిల్స్ వంటి పక్షుల మనుగడ కోసం ముఖ్యంగా ఫోమ్ పోరాటం మొదలైంది. ప్రకృతిలో చెట్లు, గుట్టలు, ఇతర ప్రాణులైన పక్షులు, జంతువులు, కీటకాలు ఇలా అన్నీ మనగల్గినప్పుడే.. జీవవైవిధ్యాన్ని పెంపొందించగలమన్న భావన నుక్లూ ఫోమ్ ది. అదే సమయంలో అముర్ ఫాల్కన్ జాతి పక్షుల సంఖ్య తగ్గిపోవడం ఫోమ్ లో ఆందోళన రేకెత్తించింది. నాగాలాండ్ అటవీ ప్రాంతంలో.. ముఖ్యంగా ఫోమ్ సొంతూరైన యెయాంజించెన్ ప్రాంతంలో ఫాల్కన్ జాతి పక్షుల వేటగాళ్లెక్కువ. ఆ పక్షులను వేటాడి అమ్ముకోవడం వారి జీవనవృత్తి. కలప, ఇతర అటవీ ఉత్పత్తులనమ్ముకుంటూ, జంతువులను వేటాడుకుంటూ బతుకుతుంటారక్కడి జనం. అలాంటి పరిస్థితుల్లో వేటకవసరమై.. వారి ఉపాధిగా మారిన జీవన విధానాన్ని మార్చి.. వారిలో పరివర్తన తేవడమంటే మాటలేం కాదు. అలా ఆ ప్రాంతంలో అముర్ ఫాల్కన్ జాతి పక్షుల పెంపు, విధ్వంసానికి గురవుతున్న జలవనురులను కాపాడటం, చెట్లను పెంచి హరితహారంగా మార్చే బాధ్యతల వంటి ఎన్నో సవాళ్లను ఫోమ్ తన భుజస్కంధాలపై వేసుకున్నాడు.

అందుకే నుక్లూ ఫోమ్ కు 2021లో యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన విట్లీ ఫండ్ ఫర్ నేచర్ (WFN) అవార్డ్ వరించింది. గ్రీన్ ఆస్కార్ గా కూడా పిలువబడే ఈ అవార్డు కింద విజేత ఫోమ్ కు.. తాననుకున్న ప్రాజెక్టును మరింత ప్రోత్సహించేందుకుగాను 40 వేల పౌండ్లను అంటే ఇండియన్ కరెన్సీలో 41 లక్షల 19వేల రూపాయలకు పైగా క్యాష్ ప్రైజిచ్చింది. ఫోమ్ భార్య ఓ ఆంగ్ల ఉపాధ్యాయురాలు కాగా… ముగ్గురు పిల్లలతో కలిసి తన సొంత జిల్లా లాంగ్లెంగ్ లోనే నివశిస్తున్న ఫోమ్… బయోడైవర్సిటీ పీస్ కారిడార్ నిర్మాణానికి చేస్తున్న కృషి విశ్వమంతా గుర్తించే స్థాయికి చేరింది.

వెయ్యి హెక్టార్ల భూమిలో తోటలు, చెట్ల పెంపకంతో హరితవనాన్ని సృష్టించిన ఫోమ్ కృషితో.. ఫాల్కన్ జాతి పక్షుల జనాభా అనూహ్యంగా పెరిగింది. 2007లో తమ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడున్న అంచనా ప్రకారం ఫాల్కన్ జాతి పక్షులు కేవలం 50 వేలు మాత్రమే ఉంటే… ఇప్పుడు ఏకంగా పదిలక్షలు దాటిపోవడం.. జీవవైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఫోమ్ పట్టుదలకు దక్కిన ఆచరణాత్మక విజయం!

అందుకే నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియో రియో కూడా ఫోమ్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందించారు. నాగాలాండ్ తూర్పుభాగంలో అడవులను పరిరక్షిస్తూ.. వాటితో సహజీవనం చేస్తున్న నుక్లూ ఫోమ్ ఆదర్శప్రాయుడంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ నుక్లూ ఘనతను చాటేది.

వాస్తవానికి నుక్లూ ఫోమ్ తన ప్రాజెక్ట్ ను ప్రారంభించినప్పుడు ఫాల్కన్లు మాత్రమే లక్ష్యమైతే… ఆ తర్వాత రసాయనాలతో పనికిరాకుండా పోయిన భూమిని తిరిగి సారవంతం చేయడం, స్వదేశీజాతి మొక్కల పెంపకం, సంరక్షణ ఇలాంటివాటన్నింటిపైనా ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన సవాళ్లు ముందు నిల్చాయి. వేటే జీవనాధారంగా మారిన వారందరినీ ఒప్పించి, మెప్పించి వారిని సాగు, చేపల వేట వైపు మళ్లించిన కృషీవలుడు ఫోమ్. ఇప్పుడక్కడి అటవీ ప్రాంతంలో 400 నుంచి 500 వరకు హార్న్ బిల్స్ జాతి పక్షులతో పాటు.. వివిధ రకాల గుడ్లగూబలు, జింకలు, ముంగిసలు, ఇతర అటవీ జంతువులెన్నో దర్శనమిస్తాయి. ఫాల్కన్ జాతి పక్షిని వేటాడి మార్కెట్ లో ఒక్కో పక్షిని 80 రూపాయలకమ్ముకుంటున్న వేటగాళ్లకు.. ఫాల్కన్ల ప్రయోజనాలను తన సంస్థైన లెమ్సాషెన్లోక్ ద్వారా అవగాహన కల్పించి.. దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఫాల్కన్స్ వచ్చాకే అక్కడి రైతులు తమ పంటకాలాన్నెలా ప్రారంభిస్తారో తెలియజెప్పారు. అవి పంటలను నాశనం చేసే కీటకాలను తినడం వల్ల పంటలకెలాంటి మేలు జరుగుతుందో అవేర్ నెస్ తీసుకొచ్చారు. 2015లోనే లెమ్సాషెన్లోక్ సంస్థ ద్వారా ఫోమ్ చేపడుతున్న కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం గుర్తించింది. 2018లో బయోడైవర్సిటీ అవార్డ్ తో పాటు… 2021లో గవర్నర్ నుంచి గోల్డ్ మెడల్ కూడా పొందింది ఫోమ్ నేతృత్వంలోని లెమ్సాషెన్లోక్.

ఇప్పుడు వర్షపు నీటిని ఒడిసిపట్టి నీటివనరులను పెంపొందించడంతో పాటు… అక్కడివారికి ఆదాయవనురులుగా సాగు, చేపల పెంపకంలో ప్రోత్సహిస్తున్నాడు నుక్లూ తమ ప్రాంతాన్ని పర్యావరణ హితమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే కృషి చేస్తూ… మనుషులు, పక్షులు, జంతువులు, మొక్కలను ఏకం చేస్తవ్న ప్రకృతి ప్రేమికుడు నుక్లూ ఫోమ్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles