ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగు! పీకే విజయానికి కారణాలేంటి?

బంకీపూర్ ఉపఎన్నిక ఏం చర్చకు పెట్టింది..?

బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ చారిత్రాత్మక విజయం.. ఇప్పుడు అందుకుగల ఐదు కారణాలను మౌలికంగా చర్చకు పెడుతోంది.

ఎన్నికల వ్యూహకర్తగా ఆరంభమై దేశంలోని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలందరికీ బ్యాక్ ఎండ్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే… రాజకీయాల్లోకి అడుగుపెట్టి జన సురాజ్ పార్టీ పెట్టాక గత ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని ఎదురుచూశారు. కానీ, ఆ పీకేనే ఇప్పుడు బీజేపీ కంచుకోటను బద్ధలు కొట్టి విజేతగా నిల్చాడు.

బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపైన ఘన విజయం సాధించి.. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలి విజయాన్నందుకున్నాడు. మూడు దశాబ్దాల కమల వికాసానికి… గండి కొట్టి ఆ ఆధిపత్యాన్ని పటాపంచలు చేశాడు.

మరి ఆ ఐదు కారణాలేంటి..?

పీకే నేరుగా తానే బరిలోకి దిగడం!

ఈ విజయంలో ఆయనే స్వయంగా బరిలోకి దిగడమే విజయానికి ప్రధాన కారణం. గత 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ 243 స్థానాలకు 238 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే, ఈసారి మరెవ్వరినో నిలబెట్టకుండా తానే బరిలోకి దిగడంతో ఎన్నికంతా ఫోకస్డ్ గా పీకే చుట్టే తిరిగింది. ఇది ప్రచారం చేయకుండానే వచ్చిన అడిషనల్ అడ్వర్టైజ్మెంట్. దీంతో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు ఇది తీవ్రమైన పోటీగా మారింది.

మార్పు కోరుకున్న ప్రజలు!

ఈ ఉప ఎన్నికలో ప్రజలు మార్పును కోరుకున్నారనే భావన పీకేకు అనుకూలంగా పనిచేసింది. 30 ఏళ్లపాటు బీజేపీ చేతిలో ఉన్న బంకీపూర్ లో జనం ప్రశాంత్ కిషోర్ ను మెరుగైన నాయకుడిగా, ప్రజల కోసం పనిచేసేవాడిగా ఆదరించినట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఉప ఎన్నిక ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ప్రజాభిప్రాయ పరీక్షగా కూడా చర్చకొచ్చింది. ఈ విషయాన్ని పీకే పదే పదే ప్రచారంలో ప్రస్తావిస్తూ.. రాజకీయ కోటలను నిర్మించేది పార్టీలు, నాయకులు కాదు.. ప్రజలేనంటూ దూసుకుపోయాడు. అలా బీజేపీ కంచుకోట అనే భావనను మరింత ప్రచారంలోకి తెచ్చి.. సవాళ్లు విసిరి అందరినీ ఆకట్టుకున్నాడు.

సంప్రదాయ ఓటు బ్యాంకులో మార్పు!

బీజేపీ, ఆర్జేడీ ఏర్పాటు చేసుకున్న సంప్రదాయ ఓటు బ్యాంకులో చోటుచేసుకున్న మార్పులు కూడా పీకేకు కలిసివచ్చాయి. కాయస్థ వర్గీయులు బీజేపీకి మద్దతిస్తే.. ఓసీలు, ఓబీసీల్లో కొందరు జన సురాజ్ పార్టీవైపు మొగ్గు చూపారు. అదే సమయంలో ఆర్జేడీకి కూడా సంప్రదాయంగా మద్దతుగా నిల్చే ముస్లిం-యాదవ్ ఓటర్లలో కొందరు ఈసారి పీకేకు మద్దతు ప్రకటించినట్టుగా కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి.

అభివృద్ధి – ప్రజాసమస్యలే ఎజెండా!

పీకే ప్రచారం మొత్తం ఉపాధి, విద్య, మున్సిపల్ మౌలిక వసతుల వంటి ప్రజలకు సంబంధించిన మౌలిక అంశాల చుట్టే తిరిగింది. కుల, మత రాజకీయాలకు దూరంగా అభివృద్ధి ఎజెండాతో దూకుడు ప్రదర్శించాడు పీకే. అదే సమయంలో బీజేపీ ప్రచారం మొత్తం గత ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ జాతీయాధ్యక్షుడైన నితిన్ నబీన్ తో అక్కడి ప్రజలకున్న భావోద్వేగ బంధంపైనే ఆధారపడటం కూడా బీజేపీకి మరో మైనస్. అదే సమయంలో కొత్త అభివృద్ధి ప్రణాళికను ఓటర్ల ముందుకు తీసుకురాలేకపోవడమూ బెడిసికొట్టింది.

జన సురాజ్ పార్టీ వ్యూహాలెలా పన్నింది..?

తానే స్వయంగా బరిలోకి దిగి ఈ ఉప ఎన్నికను పీకే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. ఈ క్రమంలో అత్యంత క్రమబద్ధమైన వ్యూహాలతో ముందుకెళ్లాడు. ఇంటింటి ప్రచారం, మొహల్లా స్థాయి ప్రచారాలు, ప్రజలతో ప్రత్యక్ష సమావేశాలతో ఓటర్లకు దగ్గరయ్యాడు. పీకే సూక్ష్మస్థాయి ప్రచారమే బీజేపీ సంప్రదాయ ఓటుబ్యాంకును దెబ్బతీసింది. బీజేపీ కూటమిలోని సామాజిక ఓట్లలోనూ చీలిక తెచ్చింది. అధికారపార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, స్థానికంగా రగిలే అసంతృప్తి వంటివాటినన్నింటినీ జన సురాజ్ తనకు అనుకూలంగా మల్చుకుంది.

వీటితో పాటు ఈమధ్యే జరిగిన ఢిల్లీలోని కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్ కూడా ఈ ఉప ఎన్నికపై ఎంతో కొంత ప్రభావం చూపి ఉంటుందన్నది ఇప్పుడు జరుగుతున్న ప్రధాన విశ్లేషణల్లో మరొకటి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles