ప్రేమను నమ్మి, సరిహద్దులు దాటి.. హీారో ఏం తెలుసుకున్నాడు..? CIA.. చూడాల్సిన మూవీ!

నరేష్కుమార్ సూఫీ..✍🏻

తాను ఈ దేశాన్ని వదిలిపోవాలనుకున్నప్పుడు నన్నూ రమ్మనే అడిగింది. కానీ, నాకు ఈ దేశాన్ని వదలటం ఇష్టం లేదు. అవును నిజమే! ఇక్కడ ఏదీ సరిగ్గా లేదు. అలాగని వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అందుకే నేను రానని చెప్పేశాను. తననీ వెళ్లొద్దని అడిగాను. కనీ, అనుకోకుండా.. నాకు చెప్పకుండానే తను నన్ను వదిలేసి వెళ్లిపోయింది. వెళ్ళిన తరువాత నాకు ఫోన్ చేసి. ఇష్టం లేకుండా వచ్చాను వచ్చి నన్ను తీసుకుపో” అని అడిగింది. అదిగో ఆ క్షణంలోనే నేను నిర్ణయించుకున్నాను. వెళ్ళాలి ఎలాగైనా అమెరికాకి వెళ్లి తనని తీసుకొచ్చేయాలి.

వీసా దొరకలేదు, చాలా ఆలస్యమవుతుందని అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. మనసంతా పిచ్చెక్కినట్టు ఉంది. విపరీతంగా తాగుతు, ఆమెని ఎలా చేరుకోవాలో ఆలోచిస్తూ గడిపాను. అదే సమయంలో అమెరికాలో ఉంటున్న ఒక ఫ్రెండ్‌కి కాల్ చేస్తే చెప్పాడు. ముందు నికరగువాకి వెళ్ళి అక్కడినుంచి అక్రమమార్గంలో మెక్సికో మీదుగా అమెరికా చేరుకోవచ్చు. కానీ, అది అంత సులభంగా వీలయ్యేది కాదు. ప్రాణాలు కూడా పోవచ్చు. అయినా సరే, వెళ్లటానికే నిర్ణయించుకున్నాను.

కొన్నిసార్లు ప్రేమ అనేది చాలా ప్రమాదకరమైంది. దానిముందు ప్రాణాలే కాదు ఈ ప్రపంచంలో ఏదైనాసరే లెక్కలోకి రాదు. ఆమెని అందుకోవటానికి సిద్దమయ్యాను. నికరాగువాకి చేరుకున్నాను. ఎలాగోలా మెక్సికో దాటి అమెరికాలోకి చేరుకోవాలి. అదీ నడకమార్గాన. దారిలో అవసరమైనవి కొనటానికి స్టోర్‌కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి మన ఇండియన్ లాగానే ఉంది. కండోమ్స్ కొంటుంటే కోపమొచ్చి “ఇలాంటి పనులు చేసి సంపాదించటం అవసరమా అని” కసురుకున్నాను.

ఒక గైడ్‌ని పట్టుకొని అమెరికాకి చేరుకోవలని అనుకున్నాను. అక్కడికి వెళ్తే ఇంకా కొంతమంది ఉన్నారు. ఒకరు స్వేచ్చకోసం, ఇంకొకరు బతుకుదెరువుకోసం, మరొకరు ఆ దేశంలో ఉంటున్న కొడుకు కోసం రకరకాల కారణాలు, రకరకాల దుఃఖాలు. పొద్దున కండోమ్స్ కొన్న అమ్మాయి కూడా మాతోవస్తోందని అర్థమైంది. ఆమె పేరు పల్లవి. గైడ్ మాటల్లో మేము వెళ్తున్న మార్గం ఎంత భయంకరమైందో తెలిసింది. ఆ మార్గంలో ప్రాణాలకూ, ఆడవాళ్ళ మానాలకూ ఏ భరోసాలేదు. ఆ అమ్మాయి పొద్దున కొన్న కండోమ్స్ ఎందుకో అప్పుడు తట్టింది నాకు. క్షమించమని అడిగాను. మంచినీళ్ళు, తినటానికి అవసరమైనవి మాత్రం తీసుకొని బయల్దేరాం. కానీ, ఆ గైడ్ మమ్మల్ని మోసం చేశాడు అడవిలో వదిలేసి తప్పించుకు పోయాడు. అయినా మేమంతా ముందుకే వెళ్లటానికి నిర్ణయించుకున్నాం. మాలో ఉన్న చైనా మనిషి GPS సాయంతో దారి కనుక్కున్నాడు.

దార్లో ఎవరివో శవాలు కనిపించాయి. మాలాగే వచ్చిన వాళ్ళు ఇలా నిర్జీవంగా అడవుల్లో చనిపోయారు. జీవితం ఎంత దారుణమైంది? ఈ మంచి జీవితం అనే ఆశలో అమెరికా చేరుకోవాలన్న తపనలో, ఎన్ని కలలతో ఇంత రిస్క్ తీసుకున్నారు వాళ్ళు, కానీ, ఎవరికీ తెలియని చోట ఇలా దిక్కులేకుండా చనిపోయారు. ప్రపంచం ఇంత దుఃఖమయమని అర్థమైంది. బతకడంకోసమే చావుకు కూడా సిదపడే జీవితాలుంటాయనీ తెలిసి వచ్చింది. అవును ఎక్కడా ఎవరూ నిజానికి సుఖంగా లేరు. నిరంతరం ఓ పోరాటం ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంది.

రెండు మూడుసార్లు తుపాకులు పట్టుకున్న బంధిపోట్లతో పోరాడాల్సి వచ్చింది. పోలీసుల డేగ కళ్ళనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తప్పలేదు మాలోనూ కొందరు అలాగే బలయ్యారు. ఆ మెక్సికన్ ఫామిలీ ఆకలికి తట్టుకోలేక్జ పోలీసులకు లొంగి పోయింది. బార్డర్ దగ్గర పోలీసులకు దొరికిపోయాం. కానీ ఆ పోలీస్ నుంచి తప్పించుకున్నాం. పల్లవీ, ఆ చైనా కుర్రాడూ ఇంకోవైపుకు వెళ్ళిపోయారు. నేనూ ఎలాగోలా నా మిత్రున్ని కలుసుకున్నాను. అప్పుడు తెలిసింది. “నేను వీడికి ఫోన్ చేసినప్పుడే సారాతో మాట్లాడాడని, తనకి నాకూ సరిపోదని చెప్పిందట. అంతే కాదు తను మరొకరిని తన ఇష్టపూర్వకంగానే పెళ్ళి చేసుకోబోతోంది. ఈ పేద ఇండియన్ కంటే రిచ్ అమెరికన్‌నే తను ఎంచుకుంది.

విచిత్రంగా ఏ ప్రేమకోసమైతే ఇంత దూరం వచ్చానో అది లేదని అర్థమైనప్పుడు గుండెపగిలిపోయిందేమో అనిపించింది. రేపు తనకి పెళ్ళి జరగబోతోంది. వెళ్ళాను తనని కలిశాను.

“ఎలా వచ్చావ్? అనడిగింది. ఎందుకొచ్చావని అనలేదు సంతోషం.

“నీకు నేను రాలేనని నమ్మకం, నీ మీద నాప్రేమ చాలా తక్కువదని నీ అభిప్రాయం. అందుకే ఇంత త్వరగా నీదారిని చూస్కున్నావ్. అయినా నాకు ఏ బాధాలేదు. నీకోసం ప్రయాణం మొదలు పెట్టిన నేను నన్ను తెలుసుకున్నాను.” అని మాత్రం చెప్పి వెనక్కి తిరిగాను.

నాపేరు అజిపన్… కామ్రేడ్ అజిపన్..

నాదేశం ఇండియా…

నేను ప్రేమించిన అమ్మాయి పేరు సారా.

తన ప్రేమలో నన్ను నేను తెలుసుకున్నాను…

*** *** ***

2017లో అమల్ నీరద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. #CIA – comrade in america. దుల్కర్ సల్మాన్ హీరో. ప్రేమకోసం తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన హీరో చివరికి ఏం తెలుసుకున్నాడు అనేది లైన్. కానీ అంతర్జాతీయ రాజకీయాలు. అగ్రదేశాల మీద ఆశలు. అవే దేశాలు సాగిస్తున్న దారుణమైన విధానాలు, పేదరికం, దుఃఖం ఇలా ప్రతీ విషయాన్నీ టచ్ చేస్తూ వెళ్ళాడు. ఎక్కడా కథనం బోర్ అనిపించదు. స్క్రిప్ట్ రాసుకున్న తీరు, దాన్ని తెరమీదికి తెచ్చిన తీరూ మరింత అద్బుతంగా ఉంటాయి. ఇలాంటి ఒక సినిమా తెలుగులో కూడా వస్తే బాగుండని ఉంటుంది. అది అత్యాశ అని కూడా అనిపిస్తుంది. యూట్యూబ్ లోనే ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు ఒంటరిగాకూచుని ఈ సిన్మా చూడండి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles