ప్రస్తుతం ప్రజాస్వా మ్య ప్రభుత్వాలు.. లక్షల కోట్ల బడ్జెటంటూ బడాయిగా చట్టసభల్లో పెడుతున్నా పాలకులు తీర్చలేని తాగునీటి గోసను… నాడు ఒకే ఒక్క రాణి తీర్చగల్గింది. ఈమధ్య సమ్మర్ లో బెంగళూర్ నగరం ఎదుర్కొన్న కరవు తీవ్రత మాటలకందలేనిది. సమ్మర్ టూరిస్ట్ క్యాంప్ గా పేరు తెచ్చుకున్న బెంగళూర్ వైపు వెళ్లడమంటేనే.. పర్యాటకులు గజ్జుమనే పరిస్థితి. మరలాంటి బెంగళూర్ అలాంటి నీటి సంక్షోభాన్నే ఎదుర్కొన్నప్పుడు.. నాటి మైసూర్ మహారాణి ఏం చేశారు..? ఎలా నీటి సంక్షోభం నుంచి గట్టెక్కించారు..? తన వ్యక్తిగత ఆభరణాలనూ ఆమెందుకు అమ్మేయాల్సి వచ్చింది..? ఓసారి ఆ మైసూర్ మహారాణి కథలోకి వెళ్లి.. నేటి పాలకులు తెలుసుకోవాల్సిన ఓ స్ఫూర్తిగాధఇది.

మీరు బెంగళూర్ నగరానికి వెళ్లినా.. బెంగళూర్ వాసులైనా.. మీకు అక్కడ మైసూర్ రాణి పేరుపైనే ఆయా ప్రాంతాల పేర్లుంటాయి. రాణివిలాస్ రోడ్, రాణీ విలాస్ సర్కిల్, రాణీవిలాసపురం డ్యామ్.. ఇదిగో ఇలా కనిపిస్తుంటాయంటేనే… మైసూర్ మహారాణి అక్కడి ప్రజాపాలనపై వేసిన ముద్రలెలాంటివో ఒక్క ముక్కలో అర్థం చేసుకోవచ్చు. ఆమే.. కెంపనంజమ్మని వాణీదేవి.
వాణీ జీవితం తొలి దశలో!
మైసూర్ జిల్లాలోని కలాలేలో రాజవంశంలో జన్మించిన కెంపనంజమ్మని వాణీదేవీ.. 12 ఏళ్ల వయస్సులోనే 23వ మైసూర్ మహారాజైన చామరాజేంద్ర వడియార్ ను బాల్యవివాహం చేసుకుంది. వాణీదేవీకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.
1881లో మైసూర్ రాచరిక రాష్ట్రాన్ని నాడు బ్రిటీషర్స్ స్వాధీనపర్చుకున్న తర్వాత… వారి సామంతరాజుగా చామరాజేంద్ర కొనసాగాడు. అనేక బ్రిటీష్ ఆంక్షలున్నప్పటికీ.. ఈ పరిమితుల్లోనూ.. అపరిమితమైన ప్రజాసేవ చేస్తామని ఆ దంపతులిద్దరూ వాగ్ధానం చేసినట్టుగానే పాలన కొనసాగేది. 1894లో తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో తన 26 ఏళ్ల యుక్తవయస్సులోనే చామరాజేంద్ర మరణంతో… నాటి మైసూర్ రాజ్యం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడింది. పిల్లలను యువరాజులుగా చేద్దామంటే పెద్దవాడి వయస్సే 10 ఏళ్లు. ఐదుగురు సంతానం ఓవైపు… వారింకా ఎదగకుండానే తండ్రి చనిపోయి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాజ్యం మరోవైపు.. అదిగో, అలాంటి పరిస్థితుల్లోనే.. తన భర్త బాధ్యతలను పుట్టెడు దుఖంతోనే భుజానికెత్తుకుంది భార్య వాణీదేవీ.
అలా భర్త చనిపోయన మూడోరోజే మైసూర్ రాజ్య పాలనను భుజానికెత్తుకున్న రాణీ వాణీ.. భర్త ఏ ప్రజా సంక్షేమ పాలనైతే కొనసాగించాలని ఆశించాడో… ఆ ఆకాంక్షలను నెరవేర్చేందుకు శతధా ప్రయత్నించి విజయవంతమైంది. ముఖ్యంగా తాగు, సాగునీటిపై ఒక మహారాణిగా ఆమె పెట్టిన దృష్టి ఇవాల్టి పాలకులకూ ఓ పాఠం వంటింది. నాటి దివాన్ ఆఫ్ మైసూర్ గా పిల్చుకునే శేషాద్రి అయ్యర్ తో కలిసి ఆమె చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఇవాళ వేల మంది రైతుల పాలిట వరంగా మారాయి. చిత్రదుర్గ జిల్లాలోని వాణీవిలాస సాగర్ ప్రాజెక్ట్ 120 ఏళ్లైనా.. అది కట్టిన తీరు చెక్కు చెదరకుండా.. 25 వేల ఎకరాల్లో పంటలకు సాగునీటినందిస్తోంది. ఆ ప్రాంతం.. చెరకు, కొబ్బరితోటలతో ఎలా తులతూగుతుందో ఇప్పటికీ అక్కడికి వెళ్లితే చూడొచ్చు.
అలాగే, రాణీ వాణి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో శివనసముద్ర ప్రాజెక్ట్ కూడా ఓ మైల్ స్టోన్. ఇదో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ఉత్పత్తయ్యే విద్యుత్తునే.. 1902 నుంచి బంగారు గనుల ప్రాంతంగా పిల్చుకునే కేజీఎఫ్ కు అందించేవారు. ఆ తర్వాత బెంగళూర్ నగరానికి కూడా ఇక్కడి కరెంట్ సరఫరా అయ్యేది.
మరి రాణీ వాణి తన బంగారు నగలను ఎందుకు అమ్మాల్సి వచ్చింది…?
రాణీ వాణి గొప్ప వితరణలో.. కావేరీ ప్రాజెక్ట్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. కావేరీపై నిర్మించిన కృష్ణ రాజసాగర డ్యామ్ కోసం తన నగలను సైతం అమ్మేసిన నిస్వార్థ ప్రజా సేవకురాలు వాణీదేవి. అంతేకాదు.. ఇవాళ ప్రపంచంలోనే ఓ గొప్ప ఇనిస్టిట్యూట్ గా చెప్పుకుంటున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్.. ఐఐఎస్సీ కోసం తన సొంత జాగా 372 ఎకరాలను అందించిన గొప్ప పాలకురాలు. ఆడవాళ్లంటే వంటింటి కుందేళ్లుగా.. బాల్యంలోనే వివాహాలు చేస్తున్న రోజుల్లో… ఏకంగా 12 వేల మంది ఆడపిల్లలను 235 పాఠశాలలను ఎక్కడికక్కడ బలోపేతం చేసి చదివించిన రాణి.. వాణి.
తన పాలనలో ఆసుపత్రులు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలతో మహిళల సంరక్షణకు ప్రత్యేక చర్యలుండేవి. అలా 1902, ఆగస్ట్ 8 వరకూ తన పాలనతో రంజింపజేసిన కెంపనంజమ్మని వాణీదేవి తదననంతరం… ఆమె కుమారుడు 18 ఏళ్ల మహారాజా కృష్ణరాజా చేతుల్లోకి వెళ్లిపోయింది మైసూర్ రాజ్య పాలన. 1934, జూలై 7వ తేదీన వాణీదేవీ కాలం చేసింది. భర్త చనిపోతే.. భార్య ఇక ఎందుకూ పనికిరాని వస్తువుగా.. సతీసహగమనం వంటివాటినీ అప్పటికే చూసిన సమాజంలో… కనీస అవసరాలు తీర్చుకునేందుకుగానీ, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కానీ.. వైధవ్యం వచ్చినవారు అర్హులు కాని రోజుల్లో… భర్త ఆకస్మిక మరణంతో భుజాన వేసుకున్న మైసూర్ రాజ్యాన్ని అద్భుతంగా పాలించిన క్రౌన్ ఆఫ్ ఇండియా.. కెంపనంజమ్మని వాణీదేవి.
మొన్నటి ఒక్క బెంగళూర్ నీటి సంక్షోభమే కాదు.. ప్రజాస్వామ్యం పేరుతో ఏ రాజ్యం చూసినా ఏదో ఒక కల్లోలం.. ఇంకేదో సంక్షోభం కనిపిస్తున్న రోజుల్లో… మహిళల పట్ల పూర్తి స్థాయి వివక్ష కనిపిస్తున్న నాటి రోజుల్లోనే క్రౌన్ ఆఫ్ ఇండియాగా పిలిపించుకున్న మైసూర్ మహారాణి వాణి పాలన.. నేటి పాలకులకు ఆదర్శం కావల్సిన ఓ గొప్ప పాఠం.



