ఇప్పుడిక విడిపోతే.. ఎప్పుడో కలల్లోనే కలుస్తామేమోనంటూ ఆయన మేఘ్ రాగంలో అబ్ కే హమ్ బిచ్డే అని ఆలాపనందుకుంటే… మొరాయించిన మేఘం కూడా వర్షమై కురుస్తుంది. రంజిష్ హి సాహ్ని అంటూ యమన్ కళ్యాణ్ లో ఆలపిస్తే… పగిలిన హృదయం పాడిన ఆ విషాదగీతం విన్న గాలి కూడా స్తంభిస్తుంది. అందుకే, హసన్ స్వరం ద్వారా భగవంతుడు మాట్లాడతాడంటూ కితాబిచ్చింది ప్రఖ్యాత గాయకురాలు లతామంగేష్కర్.
మెహిదీ హాసన్ భారతీయ మూలాలున్న పాకిస్థాన్ గాయకుడే. కానీ, సరిహద్దులను చెరిపేసిన గాయకుడు. సంగీతానికి ఎల్లల్లేవని చాటిన గాయకనాయకుడు. అందుకే పాక్ గజల్ గాయకుడిగా, నేపథ్య గాయకుడిగా దాయాది దేశంలో పెరిగినా.. ఆ గజల్ మేస్ట్రోకు పాక్ లో ఎంతమంది అభిమానులో.. మన దేశంలో అంతకు రెట్టింపే!

గజల్ మొఘల్ గా పిల్చుకునే జగ్జీత్ సింగ్ వంటివారు కూడా మెహిదీహాసన్ గజల్ అంటే చెవి కోసుకునేవారంటే.. ఆ మంద్రమైన గాత్రం సృష్టించిన మ్యాజిక్కది.
ఫలనా బాలమురళీ అంటే కర్నాటక సంగీతం.. మైకెల్ జాక్సన్ అంటే పాప్.. నుస్రత్ ఫతే అలీఖాన్ అంటే పేరు మోసిన కవ్వాలీ.. మహ్మద్ రఫీ అంటే సినీ నేపథ్య గానం.. రెమో ఫెర్నాండెజ్ అంటే పోర్చుగీస్ జానపదం.. ఇలా ఎవరికి వారు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే, గజల్స్ లో మెహిదీ హాసన్ దీ అదే ఐడెంటిటీ అయినా… ఆ మాధుర్యం మాత్రం హద్దులు, విభజన రేఖలు చెరిపేసేది. అదే మెహిదీ హాసన్ ను మిగతా గజల్ గాయకులకు భిన్నంగా నిల్పింది.
అందుకే, మరణించి పన్నెండేళ్లవుతున్నా… షహన్షా-ఏ-గజల్ గా శ్రోతల్లో ముద్ర వేసుకున్న పాటగాడు మెహిదీ హాసన్. వో జరా సీ బాత్, కోప్లిన్ ఫర్ ఫూట్ వంటి గజల్స్ తో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న గజల్ గజరాజతను.
ప్రేమ, విరహం, విషాదం ఏదైనా సరే ఆ మంద్రమైన గాత్రంలోని విరుపులతో.. స్టేజీ కింద ప్రేక్షకులతో ఆహా ఓహోలే! మెహిదీహాసన్-లతా మంగేష్కర్ తెరా మిల్నా బహుత్ అచ్చా హై అనే డ్యూయెట్ సాంగ్ కోసం… కలిసి పాడే అవకాశం ఒకే ఒక్కసారి దక్కింది. ఆ కలయిక ఇండియా-పాక్ స్నేహంలా పాటై వినిపించింది.
తలాత్ అజీజ్ గజల్ గాయకుడిగా ఎదిగే క్రమంలో ప్రేరణైన స్టాల్ వార్ట్ మెహిదీ హాసన్. అందుకే మెహిదీ హాసన్ ను ఓ గురువులా, తండ్రి సమానుడిగా ఆరాధించేవారాయన. మెహిదీ హాసన్ ఆలాప్ నుంచి మొదలుకుంటే ప్రతీ పదం పలికే పద్దతి.. చాలా పరిపూర్ణంగా ఉంటుందనేది తలాత్ అజీజ్ అభిప్రాయం. తాను గమకాలు పలికేటప్పుడు… ఒక్కొక్క గమకాన్ని అలా ఠకీమని ఇట్టే పట్టేయచ్చన్నంత స్పష్టంగా పాడతాడంటారు అజీజ్. మొత్తంగా మెహిదీ హాసన్ గానంలో ఓ దైవత్వముందని మురిసిపోతారాయన.
మెహిదీ హాసన్ 1927, జూలై 18న రాజస్థాన్ లోని లూనా అనే గ్రామంలో వృత్తిపరంగా సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టాడు. యుక్తవయస్సులోనే జైపూర్, బరోడా రాజుల కోసం పాటలు పాడేవాడు. తండ్రి, మామలే గురువులుగా.. హిందుస్థానీ సంగీతంలోని ద్రుపద్ శైలిలో సుశిక్షితుడైన సంగీతకారుడు. హార్మోనియంపై కదిలే ఆయన వేళ్లు.. పురివిప్పి ఆడే నెమళ్లని తలపిస్తాయి.
భారత విభజన సమస్యలతో చాలామందిలాగే పాకిస్థాన్ కు వలస వెళ్లిన మెహిదీ హాసన్ పాటల్లో ఎంత విషాదం తొంగిచూస్తుందో.. ఆయన జీవితం వెనుకా ఆ స్థాయి విచారకర ఘట్టాలు కనిపిస్తాయి. మొదట ఓ సైకిల్ స్టోర్ లో పంక్చర్లు వేసుకోవడం నుంచి ఓ ట్రాక్టర్ డ్రైవర్ గా బతుకుచిత్రం కోసం వివిధ పనులు చేశాడు.
,
పొట్టకూటి కోసం తానెన్ని పాట్లు పడ్డా.. తన సంగీతాన్ని మాత్రం వదులుకోలేదు. పాకిస్థాన్ గల్లీల్లో రాత్రుళ్లు పాటల సాధన చేసేవాడు. అక్కడ గజల్స్ కు దక్కుతున్న ఆదరణ గమనించాడు. ఉర్దూ కవితలను లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నాలు మొదలెట్టాడు. గజల్ సింగర్ గా మెల్లిమెల్లిగా ఎదిగి.. పాక్ రేడియోలో పాడాడు. 1964లో ఫరంగి అనే సినిమా కోసం ఫైజ్ అహ్మద్ రాసిన గులోం మే రంగ్ భరే అనే గజల్ గానం చేసిన తర్వాత… మెహిదీ హాసన్ దశ మారిపోయింది.
ఇక ఆ తర్వాత, మెహిదీ హాసన్ వెనుదిరిగి చూడాల్సిన పన్లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా పర్యటించాడు. ఆయన గజల్స్ కు అభిమానుల సంఖ్య రోజురోజుకూ సోషల్ మీడియాలో ఓ సెలబ్రిటీకి వచ్చే లైకుల్లా పెరిగిపోయింది. అదే సమయంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్ అనే రెండు దేశాల మధ్య గజల్స్ తో.. ఓ సాంస్కృతిక సారథయ్యాడు. సంగీతానికి సరిహద్దుల్లేవని.. హద్దులంతకన్నా లేవని నిరూపించాడు.
అది 1978.. అప్పుడు మొరార్జీ దేశాయ్ పాలనలో అటల్ బీహారీ వాజ్ పాయ్ విదేశాంగ మంత్రి. ఆయన ఆహ్వానం మేరకు మెహిదీ హాసన్ ఇండియాకు వచ్చి కచేరీ చేశారు. ఈ సమయం కోసం తాను 30 ఏళ్లపాటుగా ఎదురుచూస్తున్నాని ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు హాసన్.
ప్రముఖ గాయకుడు హరిహరన్ కు మెహిదీ హాసన్ అంటే ఎనలేని వాశ్చల్యం. హరిహరన్ కాన్సర్ట్స్ లో మెహ్దీ పాడిన గజల్స్ ఒకటో, రెండో కచ్చితంగా ఆలపించాల్సిందే. 1985 నుంచి మెహిదీ హాసన్ గజల్స్ ఓ మత్తు మందు పెట్టినట్టుగా అలవాటైపోయాయంటాడు హరిహరన్. ఎందుకంటే ఆయన పాట వింటుంటే.. అది మనకోసమే పాడినట్టుగా అనిపిస్తుందన్నది హరిహరనిచ్చే కితాబు.
అవయవాల వైఫల్యం కారణంగా 85 ఏళ్ల వయస్సులో 2012, జూన్ 13వ తేదీన తుదిశ్వాస విడిచిన మెహిదీ హాసన్.. భౌతికంగా లేనప్పటికీ… గజల్స్ రూపంలో ఆయన అభిమానుల గుండెల్లో చిరంజీవయ్యాడు. 50 వేల పైచిలుకు గజల్స్ పాడిన ఆ గజల్ చక్రవర్తికి… ఆయన పుట్టినరోజు సందర్భంగా అర్పిస్తున్నదే ఈ అక్షర నివాళి.



