పూర్తిగా తినలేము, పారేయలేము! పుష్ప 2- ఓ ఐదో యాపిల్ కథ!!

Vamsy Krishna..✍️

ఐదో ఆపిల్

అర్ధ శాస్త్రం లో The law of Deminishing Marginal Utility అని ఒక సూత్రం ఉంటుంది. దాన్నే క్రమ క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటాము. అడిషనల్ సాటిస్ఫాక్షన్ గురించి ఈ సూత్రం చెపుతుంది. బాగా ఆకలి మీద వున్నప్పుడు ఒక ఆపిల్ పండు తింటే గొప్ప సంతృప్తి కలుగుతుంది. ఆకలి తీరి, వొళ్ళంతా ఒక గొప్ప రిలీఫ్ పాకిపోయి ఆనందంగా ఉంటుంది. ఆ తరువాత రెండు మూడు నాలుగు ఆపిల్ పండ్లు తిన్నాక ఇక చాలు అనిపిస్తుంది. అలా అనిపించాక కూడా ఐదో ఆపిల్ పండు తింటే అది మొదటి ఆపిల్ పండు ఇచ్చినంత సంతృప్తిని ఇవ్వక పోగా ముప్పావు వంతు తిన్నాక ఆ మిగిలిన పావు వంతూ బయట పడేయాలి అనిపిస్తుంది. లోపం ఆపిల్ పండు లో లేదు. మన ఆకలి లో వుంది. పుష్ప -2 ది రూల్ చూస్తున్నప్పుడు నాకీ సూత్రం గుర్తుకు వచ్చింది

పుష్ప -1 ది రైజ్ మొదటి ఆపిల్ పండు
పుష్ప -2 ది రూల్ ఐదో ఆపిల్ పండు

2021 లో పుష్ప వచ్చినప్పుడు అల్లు అర్జున్ సినిమా మీద వుండే అంచనాలు తప్పిస్తే అంతకు భిన్నమైన అంచనాలు లేవు. సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అయి పాన్ ఇండియా లెవెల్లో అర్జున్ హిమాలయ శిఖరం మీద కూర్చోపెట్టడమే కాక 60 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉత్తమ నటుడు అవార్డు ను కూడా అర్జున్ కి కట్టబెట్టింది. అప్పుడు, సుకుమార్ తన టీమ్ ఏది అనుకుంటే అది స్వేచ్ఛగా చిత్రీకరించుకుంటూ వెళ్లారు. పుష్ప -2 కి వచ్చే సరికి ఆ స్వేచ్ఛ కి కనపడని ఒత్తిళ్లు సంకెళ్లు వేశాయి. టార్గెట్ ప్రతిక్షణం కళ్ళ ముందు కనపడి కల్లోల పెట్టింది. భారతదేశం లో ఏ భాషలోనూ ఏ నటుడూ పొందనంత 300 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చిపుష్ప ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని అంచనాలు పెంచేశారు. ఫైర్ కోసం కాదు వైల్డ్ ఫైర్ కోసం ప్రేక్షకులు ఎదురు చూసారు

“భగ్గన న దరికొన్న భీషణ హుతాశన కీల అనంగ లేచి” అని పారిజాతా పహరణం లో ఒక పద్యం ఉంటుంది. కృష్ణుడు సత్యభామ వొంటి మీద చేయి వేయగానే ఆమె ఒక్కుదుటున భగ్గుమంటూ అగ్ని జ్వాల లాగా లేచిందట. అంతటి శ్రీకృష్ణుడూ ఒక్క క్షణం పాటు దిక్కు తోచక ఏమి చేయాలో తెలియని అవస్థ లో అలా చూస్తూ ఉండిపోయాడట. వైల్డ్ ఫైర్ అంటే అది.

పుష్ప -1 లో ఫైర్ వుంది
పుష్ప -2 లో కూడా ఫైర్ వుంది కానీ అది వైల్డ్ ఫైర్ కాదు కేవలం ఫైర్

ఇదంతా అనూహ్యంగా అంచనాలు పెంచినందువలన వచ్చిన తిప్పలు .

పుష్ప -2 లో 70 % సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్, దొంగ పోలీస్ ఆట లాగా సాగి సినిమా అంతా స్మగ్లింగ్ చుట్టే తిరిగినట్టు అనిపించినా సినిమా తిరిగింది మాత్రం షెకావత్, పుష్ప ల ఇగో చుట్టూనే. షెకావత్ కి పుష్ప ని పట్టుకోవడం తన ఇగో ని సంతృప్తి పరచుకోవడం కోసం తప్పిస్తే వృత్తి పరమైన నిబద్దత ఉండి కాదు. వృత్తిపరమైన నిబద్ధతే ఉంటే ఇతర రాష్ట్రాల పోలీసుల సహాయం తీసుకోవడం లాంటి పనులు సినిమాటిక్ జస్టిస్ కోసం అయినా చేసేవాడు. ముఖ్య మంత్రి తనతో ఫోటో దిగడానికి తిరస్కరించాడు కనుక పుష్ప ఇగో దెబ్బతిని ది రూల్ అయింది. తారక్ పొన్నప్ప కూడా అంతే

ది రైజ్ లో పల్లెటూరి అమ్మాయిలా కనిపించిన రష్మిక ది రూల్ కి వచ్చేసరికి చాలా వలువలు విప్పేసింది. సాధారణంగా హీరోయిన్ కి పెళ్లి కాక ముందు తెగ గ్లామర్ గా చూపించి పెళ్లి అయినా తరువాత మాత్రం కాస్త పద్దతిగా చూపిస్తారు ఏ సినిమాలో అయినా . పుష్ప ది రూల్ లో అది రివర్స్ అయింది. ఫీలింగ్స్ పాట కొరియోగ్రఫీ బావుంది కానీ శ్రీ వల్లి తో వంటగదిలో మరీ అలా చూపించడం మాత్రం బావోలేదు . వైల్డ్ ఫైర్ కాదు వైల్డ్ వైఫ్ అని ప్రేక్షకుడు అనుకుంటూ తప్పేమీ లేదు

అల్లు అర్జున విశ్వరూపం చూపించాడు. ముఖ్యమంత్రి తో క్లాష్ అయిన సందర్భం లో, షెకావత్ కి సారీ చెప్పిన సన్నివేశం లో , సిద్దప్ప ని ముఖ్యమంత్రి ని చేసి ఇంటికి తీసుకుని వచ్చిన సన్నివేశం లో అల్లు అర్జున్ అనుభవం కనిపిస్తుంది. జగపతి బాబు కి పెద్ద స్క్రీన్ ప్రెజన్స్ లేదు.

సుకుమార్ లెక్కల మాస్టర్ కనుక అన్నీ లెక్కలు వేసుకుని స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. నాన్నకి ప్రేమతో లో ఎత్తుకు పై ఎత్తులు వేసినట్టు గానే ఇందులో కూడా ఎత్తులు, పై ఎత్తులు ప్రేక్షకుడిని ఊపిరి పీల్చుకోనివ్వవు. మూడు గంటల ఇరవై నిమిషాల సుదీర్ఘ మైన ఈ సినిమాను కనీసం లో కనీసం ఓ ముప్పై నిముషాలు అయినా ట్రిమ్ చేయవచ్చు .రౌడీల మెడలు కొరుకుతూ చేసే ఫైట్ చూస్తున్నప్పుడు కాంతారా గుర్తుకొస్తే ప్రేక్షకుడిని నిందించవలసిన అవసరం లేదు

టార్గెటెడ్ ప్రేక్షకులను చేరుకున్నాడు కానీ పుష్ప -3 ది రాంపేజ్ అంటే అది పన్నెండో యాపిల్ అవుతుందేమో చూసుకోవాలి మరి. ఇంతా చేసి సినిమా బావుందా అంటే అయిదో ఆపిల్ లాగా వుంది. అయిదో ఆపిల్ ని బయట పడేయలేము. మనస్ఫూర్తిగా తిననూ లేము

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles