రత్నరాశుల కేరాఫ్ విజయనగరమైతే… ముత్యాల చిరునామా మన భాగ్యనగరం!

#The pearl city

,………………………………………………………………

యాసీన్.. ✍️

అంగళ్ల ముత్యాలు అమ్ముతున్నారిచట!

………………………………………………………………………..

అమ్మాయికి ఆభరణాలంటే మక్కువ కదా… తీసుకోవాలంటోంది ఓ ముత్యాలమాల.
ఆయనగారికి ముక్కుమీద కోపం కదా… తగ్గాలంటే పొదగాలి ఉంగరంలో ముత్యం.
చిన్నారి కూతురి దస్తూరీ కుదురుగా ఉంది… అక్షరాలన్నీ అందాల ముత్యాల కోవల్లా.
మామగారు కవి అటగా… రాసుకుంటున్నారు కవిత్వం… ముత్యాల సరాల్లో.
అత్తగారికి ఆపరేషన్‌ అవసరమటగా… కారణం కంట్లో క్యాటరాక్ట్‌ ముత్యముందటగా.

ఇలా చిన్నా పెద్దా అందరికీ, అన్ని సందర్భాల్లోనూ గుర్తొచ్చేవి ముత్యాలు… ముత్యాలు… మేలి ముత్యాలూ… ఆణిముత్యాలూ… రైస్‌ ముత్యాలూ… చిట్టిముత్యాలు!!

అప్పడెప్పుడో విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాశులుగా పోసి అంగళ్లలో అమ్మారట. మనం చదివాం. కానీ చూడలేదు.
అయితే ఇక్కడలా మరీ వీధుల్లో రాసులగా పోసిలేవుగానీ…
రండి… అలా చూసొద్దాం మన ముత్యాల మర్కెట్లను
అది పంజాగుటై్టనా, పాట్‌ మార్కెటైనా లేదా
ఆబిడ్సమీర్‌పేట్‌… గుల్జార్‌ హౌజ్,
చందన్‌పేట్, చార్‌ కమాన్, చార్మినారైనా!!
ఇక్కడ ప్రతిచోటా అంగళ్లలో ముత్యాలమ్ముతుంటారు.
అప్పటి విజయనగరం దాకా ఎందుకు…
ఇక్కడి ఇప్పటి మన భాగ్యనగరం చాలదూ…
మన వైభవం చాటుకోడానికి.
అందుకే అసలు హైదరాబాద్‌కు
మారుపేరూ, మరో పేరూ… ‘‘ద సిటీ ఆఫ్‌ పెరల్స్‌’’ అని!


అందమైన జ్యుయెల్స్‌లో పొదిగే పేర్చిన పెరల్స్‌నూ, ముచ్చటైన ముత్యాల అంగడులనూ, అందమైన ఆణిముత్యాల మార్కెట్లనూ అలనాటి కుతుబ్‌షాహీలూ ఆ తర్వాత అసఫ్‌జాహీలూ పెంచి పోషించారు. ఎన్నెన్నో చోట్ల నుంచి సమీకరించి, అరుదైన అణిముత్యాలన్నీ దొరికే నగరంగా తీర్చిదిద్దారు. అందుకే దేశీయంగానే కాదు… అంతర్జాతీయంగా కూడా ‘ద సిటీ ఆఫ్‌ పెరల్స్‌’ అనే అథెంటిసిటీ మన హైదరాబాద్‌కే.

ముత్యాల్లో అనేక రకాలు… మేలి ముత్యాలూ, మంచి ముత్యాలూ, ఆణిముత్యాలూ, చిరుముత్యాలూ, రైస్‌ ముత్యాలూ, నల్లముత్యాలూ… ఇలా ఒకటేమిటి… ఎన్నోన్నో రకాల నాణ్యామైన తీరునొక్క ముత్యాలకు నెలవు మన హైదరాబాద్‌.

చరిత్రపూర్వకాలంలో అప్పట్లో పర్షియన్‌ గల్ఫ్‌లో ఉన్న చారిత్రక నగరం బస్రాలోనే ఇలా అమ్మేవారని అరేబియన్‌ నైట్స్‌…అలీఫ్‌ లైలాల్లాంటి కథల్లో చదువుతాంగానీ… మన పాతనగరంలో అడుగడుగునా ఇలాంటి మార్కెట్లన్నీఇప్పటికీ మనల్ని పలకరిస్తుంటయ్‌.


ఎక్కడో కడలి అడుగుల్లో ముత్యపుచిప్పల్లో పుట్టిపెరిగే ముత్యాలు…
సీషోరూ, సముద్రపుహోరూ లేని మన హైదరాబాద్‌లో విస్తరిల్లడం విచిత్రమనిపిస్తుంది. అయితే దీనికో చారిత్రక కారణముందట. భౌగోళిక అవసరాల దృష్ట్యా పాశ్చాత్యదేశాల్లో అపటి ప్రధానాహారం మాంసాహరమే. అది రుచికరం కావాలంటే వారికి భారత–దక్షిణాసియా దేశాల సుగంధద్రవ్యాలు తప్పనిసరి. అవి తెప్పించుకునేందుకు వారందరికీ అవసరమైన వాణిజ్యపు దారుల్లో ఒకటి అటువైపున్న సిల్క్‌రూటయితే… మరొకటి భారతీయ బాట. సుదీర్ఘ సాగరతీరాలుండే ఆ పాశ్చాత్య వ్యాపారవేత్తలందరూ ముత్యాలేరుకుని వచ్చేది ఇస్లాం విలసిల్లిన ఆ అరబ్బుల భూభాగం మీదుగానే. అలా సముద్రతీరాలున్న గల్ఫ్‌ మీదుగా వచ్చే ఈ గల్ఫ్‌ యాత్రికులూ, ఆ పశ్చిమ వ్యాపారవేత్తలందరూ తమతో పాటు అక్కడి ముత్యాలు తీసుకొచ్చి… ఇక్కడ విక్రయించేవారటా!… ఇక్కడి సుగంధద్రవ్యాలను కొని తమతో తీసుకెళ్లేవారట. మరి సుగంధద్రవ్యాలు మాత్రం ఇక్కడ పండుతాయా అంటే… ఇది రాజనగరు కదా… అందుకే కొనేవాళ్లూ, మంచి ధరా దొరుకుతాయని అఎక్కడెక్కడి స్పైసెస్‌ విక్రేతలూ రాజధానికి వచ్చి ఈ నేలను సుగంధభరితం చేసి, మంచి ముత్యాలతో అలంకరించేవారట. అందుకే చరిత్రపూర్వకాలంలో అక్కడ బస్రాలోలాగా ఇక్కడ హైదరాబాద్‌లో ముత్యాల అంగడి విస్తృతమైందంటారు చరిత్రకారులు.

అక్కడ బస్రాలాంటి పురాతన నగరంలో ముత్యాల వ్యాపారం అందరించిందో లేదోగానీ… ఇక్కడి సాంస్కృతిక నగరంలో మాత్రం అది విలసిల్లిందీ… విలసిల్లుతూ… విస్తరిస్తూ ఉంది.


ఇక్కడ పూర్వ చరిత్రా, వాణిజ్య చరితలే కాకుండా… కాస్తంత పూర్వ సాహిత్యపు కావ్యాల దాఖలాలనూ మనకు ఒత్తాసుగా చెప్పుకుందాం. చేమకూరి వెంకటకవి తన విజయవిలాసంలో ఇంద్రప్రస్థపురం వైభవం గురించి ‘‘ప్రబలు మౌక్తిక సౌధ సంపదల గరిమ…’’ అంటూ ఓ పద్యంలో మేలు పలుకులు పలుకుతాడు. అక్కడ ముత్యాలు చాలా ఎక్కువట… ఎంత ఎక్కువంటే… అతిశయోక్తిగా చెప్పాలనుకుంటే సౌధాల నిర్మాణానికి సిమెంట్‌గా కూడా ముత్యాల పౌడరే వాడారంటాడు. కొన్ని భవనాలకు సున్నం కొట్టించడానికి ముత్యాలు దంచి పొడి పొడి చేశారంటాడు. అవి అతిశయోక్తులైతే ఆ అతిశయోక్తులకు తీసిపోని నిజాల నిజామ్‌ల నిలయం ముత్యాల హైదరాబాద్‌!. అందుకే ఇది అచ్చమైన ‘పెరల్‌ సిటీ’!!

ఇంతకీ ఆ చేమకూరవారి ఇంద్రప్రస్థపురానికీ… ఇక్కడి మన హైదరాబాద్‌కూ పోలిక ఉన్నట్లు చెప్పే ఆ పద్యమేమిటీ అని అడుగుతున్నారా… అయితే వినండి…

‘‘పోకమ్రాకుల మహిమ కప్పురపుటనటి,
ఆకుతోటల సౌభాగ్యమందె కలదు;
ప్రబలు మౌక్తిక సౌధ సంపదల గరిమ
వీటి రహి మెచ్చవలయు బో వేయినోళ్ల’’!!

అప్పుడెప్పుడో ఆ ఇంద్రప్రస్థపురి గురించి చేమకూర వారు చెప్పిన ప్రతి వర్ణనా ఇప్పుడిక్కిడి హైదరాబాద్‌కు ఇప్పటికీ వర్తిస్తుంది. అక్కడ ఇంద్రప్రస్థపురిలో ‘పోకమాకుల’ గురించి చెప్పాడు. ఇక్కడ హైదరాబాద్‌లో అడుగడుగునా తమలపాకుల… పోకల పాన్‌షాప్‌లు. అక్కడి ‘కర్పూరపు అరటిపండ్లే’ ఇక్కడి తోపుడు బండ్ల మీద మీఠా మౌజ్‌లూ… ఛీటా మౌజ్‌లు. ఆ ఛీటామౌజరటిపండ్ల మీద నల్లముత్యాల్లా మెరుపుమచ్చలు!! ∙

#hyderabad_is_an_emotion

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles