రేబిస్.. బెంబేలెత్తిస్తున్న ఓ సామాజిక సమస్య!

విశ్వాసానికి కేరాఫ్.. అందుకే, కుక్క చాలా ఇళ్లల్లో వారికి తోడుగా.. మరికొందరికి ఏకంగా వాళ్ల పసిపాపల్లా చంకల్లోనూ కనిపిస్తుంటుంది. ఇక గ్రామసింహాలైతే ఏది దొరికితే అది తినే బతుకడమే కాకుండా.. బజారుకొస్తే భయపడాల్సిన బతుకును జనం కళ్లకు కడుతున్నాయి. ఇది వీధి కుక్కలకే పరిమితమైన విషయమేం కాదు.. కొందరు పెంచుకున్న కుక్కకాట్లతో కూడా రేబిస్ సోకినవాళ్ల కథలు వింటున్నాం. ఇక కుక్కల గురించి కన్నీరు కార్చేవారున్నారు.. మరి మనుషుల ప్రాణాల సంగతేంటని ప్రశ్నించేవారున్నారు. ఏదేమైనా రాను రాను కుక్క ఇప్పుడో సామాజిక సమస్యగా పరిణమిస్తోంది. ప్రభుత్వాలు అక్కడక్కడా స్టెరిలైజేషన్ ప్రక్రియను చేపట్టినా.. చిత్తశుద్ధిగా ఆ ప్రక్రియ అన్నిచోట్లా కనిపించదు. దీంతో పెంపుడు జంతువే ప్రమాదకారిగా మారిపోతున్న వైనం ఎలా సాగుతుందో వరల్డ్ రేబిస్ డే సందర్భంగా ఓసారి కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం రండి. అలాగే, రేబిస్ సోకాక బతికి బట్ట కట్టినవారి కేస్ స్టడీస్ ఇక్కడ చదువొచ్చు.

రేబిస్ సోకి, ఆ వ్యాధి ముదిరినవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 30 మంది మాత్రమే బతికి బట్టకట్టారనే విషయం మీకు తెలుసా…? మరి మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో దాని తీవ్రత ఎలా ఉందో కొన్ని కేస్ స్టడీస్ మనకు చెబుతాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 17 ఏళ్ల సాయికిరణ్ ది.. రేబిస్ నుంచి కోలుకున్న ఓ సక్సెస్ స్టోరీ. సాయికిరణ్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. 2018లో స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న సమయంలో సాయికిరణ్ ను కుక్క కర్చింది. రెండురోజుల తర్వాత ఏఆర్వీ టీకా టీకాలు వేయించారు. ఆ ఠీకాలు అందుబాటులో లేకపోవడంతో ఏమవుతుందిలే అనుకుని.. కోర్స్ మాత్రం పూర్తి చేయలేకపోయారు. వారు సంప్రదించిన ప్రభుత్వాసుపత్రిలో యాంటీ రేబిస్ వ్యాక్సిన్స్ అయిపోయింది. కొన్ని వారాల తర్వాత సాయి రేబిస్ తో విచిత్రంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. నడకలో ఇబ్బంది పడ్డాడు. వెలుతురు చూస్తేనే భరించలేనంత ఫోటోఫోబియాతో అసహనంగా కనిపించేవాడు. గాలి వీస్తే కూడా భరించలేని ఏరోఫోబియాతో గజగజా వణికిపోయేవాడు. అలా మెల్లిగా ఆ వ్యాధి ముదిరి సాయి కోమాలోకి జారుకున్నాడు. చివరికతణ్ని వెంటిలేషన్ పైనే ఉంచాల్సి వచ్చింది. ఇలాగే కొందరు నాటు వైద్యులను సంప్రదించి కూడా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న ఘటనలూ కనిపిస్తుంటాయి.

సాయి తల్లిదండ్రులు గుండెలు చిల్లులు పడేలా ఏడ్చారు. అనేక ఆసుపత్రులకు తీసుకెళ్లారు. చాలా రకాల మందులు వాడారు. ఫిజియోథెరపీ చేయించారు. ఆ మందుల్లో ఏం పనిచేసిందో, ఏమో తెలియదుగానీ.. మూడు వారాల తర్వాత సాయి మళ్లీ మామూలుగా ప్రవర్తించడం, కుదుటపడటం సాధించాడు. ఒక్క యాంటీ రేబిస్ ఇంజక్షన్ ను నిర్లక్ష్యం చేసినందుకు తన తల్లిదండ్రులు సాయి కోసం 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సాయి తండ్రి రాజిరెడ్డి ఓ ఆటో డ్రైవర్.. అలాగే, ఇంటివద్ద కూరగాయలమ్ముకుని బతుకుతుంటాడు. మరలాంటి కుటుంబానికి మందుమాకులకే 12 లక్షలంటే పెద్ద మొత్తమేగా..? కానీ, వారి పూజలు ఫలించి, పడ్డ కష్టానికి ఫలితం దక్కి ఇప్పుడు సాయి మళ్లీ మామూలు మనిషైపోయి తిరిగి స్కూల్ కు వెళ్తున్నాడు.

సాయి కేసును పరిశీలించిన బెంగళూర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ విభాగం ప్రొఫెసర్, న్యూరో వైరాలజీ హెడ్ డాక్టర్ రీతామణి… రేబిస్ సోకి మనిషి బతుకుతాడో, లేడో అనుకున్న పరిస్థితి నుంచి బతికి బట్టకట్టిన సాయిది ఇప్పటివరకూ తాను ఎప్పుడూ చూడనటువంటి ప్రత్యేకమైన కేసుగా చెప్పారామె. ఈ విభాగం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన సహకార కేంద్రం.

రేబిస్ సోకితే అంతే సంగతులు. అందుకు ఈమధ్య తుంగూర్ ఘటన ఓ ఉదంతం.. 3 నెలల క్రితం ఆడుకుంటూ పక్కనున్న డ్రైనేజీలో పడ్డ 3 ఏళ్ల రక్షిత్ అనే బాబుకు గాయాలైతే జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాగ్నసిస్ వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో కూడా ఈ బాలుడి ఉదంతం మనకు చెబుతుంది. అక్కడ పక్కనున్న మోరీలో పడటంతో గాయాలైనట్టుగా భావించి చికిత్స చేశారే తప్ప.. ఆ బాలుణ్ని కుక్క తరిమి కర్చాక అతడు ఆ డ్రైనేజీలో పడ్డాడనే విషయం ఆ హాస్పిటల్ డయాగ్నసిస్ సెంటర్ గుర్తించలేకపోయింది. వైద్యమందించిన డాక్టర్ కూ విషయం తెలియదు. పోనీ, తల్లిదండ్రులో, చుట్టుపక్కల వాళ్లో గమనించారో, లేదో తెలియదు. మొత్తానికి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ తో ఆ మూడేళ్ల పాలబుగ్గల పసిపిల్లాడు.. కుక్క కర్చిన మూడు నెలల తర్వాత ఇంట్లో కుక్కలా ప్రవర్తించి, నాలుకను బయటకు తీసి.. ఆ తర్వాత కాస్సేపటికి మరణించాడు.

రేబిస్ ప్రాణాంతకమైన వ్యాధి. రేబిస్ సోకిన వ్యక్తి మనుగడ సాధించడం చాలా అరుదైన విషయం. ఇప్పటివరకూ కూడా ప్రపంచవ్యాప్తంగా రేబిస్ సోకిన తర్వాత బతికి బట్టకట్టిన వారి సంఖ్య కేవలం 30 మంది మాత్రమేనంటే మీరు నమ్మగలరా..? కానీ ఇదే నిజం. కొన్ని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భారతదేశానికి చెందినవారే 17 మంది. అందులో సిరిసిల్లకు చెందిన సాయి ఒకడు. అయితే, రేబిస్ నుంచి కోలుకున్నవారు కూడా పూర్తి స్థాయిలో మళ్లీ మామూలు అయ్యేవాళ్లు ఇంకా వేళ్లపైనే లెక్క పెట్టొచ్చు. చాలామంది కోలుకున్నా కూడా వారిలో చాలారకాల వైకల్యాలను కల్గి ఉండటమే కనిపిస్తోంది.. అలాంటివారిని పూర్తిగా క్యూర్ అయినట్టుగా తాము భావించలేమంటారు డాక్టర్ రీతామణి.

కానీ, సిరిసిల్లకు చెందిన సాయి మాత్రం దాన్ని అధిగమించాడు. తన ప్రాక్టీస్ లో రేబిస్ సోకి తిరిగి పాఠశాలకు వెళ్లినవారినెవ్వరినీ చూడలేదంటోంది ఈ డాక్టర్ సాబ్. సాయిలాంటి కేస్ స్టడీ దేశం మొత్తంలోనే కాదు.. ప్రపంచంలోనే అరుదేమో అంటారామె. రీతామణి మాటే హైదరాబాద్ లో సాయికి చికిత్సనందించిన రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ చైల్డ్ అండ్ అడోలోసెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ లోకేష్ అభిప్రాయంగా కనిపించింది. రేబిస్ వైరస్ మెదడుకు చాలా వేగంగా ప్రయాణించడానికి సాయపడుతుందంటారాయన.

సాయి ఆసుపత్రిలో దాదాపు మూణ్నెల్ల పాటు కోమాలో ఉన్నాడు. ఇక బతకడనే అనుకున్నారు. చివరకు తల్లిదండ్రులు ఆసుపత్రుల బిల్లులు చెల్లించలేక ఇంటికి తీసుకెళ్లారు. కానీ, తొమ్మిది నెలలు గడిచేసరికి సాయి కోలుకున్నాడు. అప్పటివరకూ ట్యూబ్ ఫీడింగ్ అందించే తల్లిదండ్రుల ముందు తానే తినడం, ఇతర పనులు కూడా మెల్లిమెల్లిగా చేసుకోడం వారిని సంతోషపెట్టడంతో పాటు, ఆశ్చర్యపర్చింది. అంతేకాదు, అనూహ్యంగా ఐక్యూ కూడా బాగా పెరగడం, పాఠశాలలో మళ్లీ తిరిగి చురుకైన విద్యార్థిగా సాయి ముందుకెళ్లడం ఇప్పుడు అతడికి ట్రీట్మెంట్ అందించిన వైద్యుల బృందాన్నే నివ్వెరపరుస్తోంది. ఎందుకంటే, రేబిస్ అంత ప్రమాదకరం కాబట్టే.

సాయిని కాపాడటంలో ఇమ్యూనో గ్లోబులిన్ ఉపయోగపడి ఉండొచ్చంటారు డాక్టర్ లింగప్ప.

లూయిస్ పాశ్చర్ అనే మైక్రోబయాలజిస్ట్, కెమిస్ట్ అయిన శాస్త్రవేత్త రేబిస్ కు మందు కనుగొన్నాడు. ఈ క్రమంలో ఆయన కన్నూమూసిన సెప్టెంబర్ 28వ తేదీన ఆయన జ్ఞాపకార్థం వరల్డ్ రేబిస్ డేను కూడా జరుపుకుంటున్నాం.

కుక్క కర్చినప్పుడు.. అది ఎక్కడ కర్చింది.. దాని గాయం ఎంత లోతు వరకు ఉంది.. వైరస్ ఎంత మేరకు ప్రవేశించిందనేదాన్ని బట్టి వ్యాధి తీవ్రత కూడా ఆధారపడి ఉంటుంది. పందులు, గబ్బిలాలు, పందికొక్కులు, కోతులు, పిల్లులు, ఎలుకలు, గుర్రాలు, గాడిదలు ఏది కొరికినా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే.

ప్రపంచంలో రేబిస్ వ్యాధి బారినపడి బతికి బట్టకట్టినవారి లెక్కలను ఓసారి చూస్తే 57 శాతం భారతదేశంలోనే కనిపిస్తారు. 2011 నుంచి రేబిస్ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ముఖ్యంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా రేబిస్ బారిన పడి 61 వేల మంది చనిపోతున్నట్టు అమెరికన్ సొసైటీ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్ అండ్ హైజీన్ సంస్థ చెబుతోంది. అందులో 20 వేలకు పైగా భారతదేశంలోనే మృత్యువాత పడుతున్నారట.

పుదుచ్చేరికి చెందిన రేబిస్ రోగి కూడా సాయిలాగే ప్రాణాలతో బయటపడి ఇప్పుడు వివాహం చేసుకుని ఓ బిడ్డకు తల్లైందని బెంగళూర్ డాక్టర్ మణి చెబుతోంది.

అయితే, ప్రపంచంలోనే అత్యధిక రేబిస్ కేసులు నమోదవుతోంది కూడా భారతదేశంలోనే. కానీ, వీధి కుక్కల స్టెరిలైజేషన్, సామాజిక ముప్పుగా పరిణమిస్తున్న ప్రక్రియను సీరియస్ గా తీసుకుని ఒక పరిష్కార మార్గం చూపడం వంటివాటిపై.. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కనిపించకపోవడంతో నిత్యం ఎక్కడో ఓచోట కుక్క కాట్ల కేసులు వింటూనే ఉన్నాం. రేబిస్ నుంచి బతికి బయటపడ్డ ఏ సాయికిరణ్ సక్సెస్ స్టోరీ అయితే చెప్పుకున్నామో… అదే సిరిసిల్లలో వారం క్రితం ఏకంగా 60 మందిని ఒక గంటలో కుక్కలు కర్చిన ఘటన భయాందోళనకు గురిచేసింది. అయినా ప్రభుత్వాలు మాత్రం ఈ కుక్కల సామాజిక సమస్యపైన ఇంకా ఉదాసీనతను వీడటం లేదు.

కుక్క కాట్లు పెరుగుతున్నందున రోగనిరోధక వ్యాక్సిన్ తప్పనిసరి చేయాల్సిన అవసరముంది. ప్రీ ఎక్స్ పోజర్ వ్యాక్సిన్ ను తీసుకువచ్చి అన్ని చోట్లా తప్పనిసరి చేస్తూనే, ఐచ్ఛికంగానైనా అమలు చేయాల్సిన అవసరముంది. ఇది ప్రభుత్వాల పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వ్యాక్సిన్ రెండు డోసులు వేస్తే జీవితాంతం పని చేస్తుందంటున్నారు డాక్టర్ మణి.

అలాగే రేబిస్ ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో ఈ వ్యాధిపైన మరింత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు అవకాశం కల్పించాలి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే రేబిస్ ను పూర్తిగా నిర్మూలించగల్గారు. కాబట్టి ఈ వ్యాధి ఆయా దేశాలకు ప్రాధాన్యతాంశం ఏమాత్రం కాదు. కేవలం ఆసియా, ఆఫ్రికాలో మాత్రమే ఇది ప్రబలుతున్న క్రమంలో.. ఇప్పుడు రేబిస్ పై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన సమయమిది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles