కొన్ని ఎన్నికలు చాలా ప్రభావవంతంగా ఆకట్టుకుంటాయి. అందులో తాజాగా ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్ నూ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రభావం కేవలం ఎన్నికలు.. పార్టీలు, వారి హామీలు, గెలుపోటముల కారణాల వరకే పరిమితం కాదు. అంతకుమించి.. ఆ ఎన్నికల చుట్టూ జరిగిన పరిశీలనలు… ఎన్నికలపై పార్టీలవారీగా విడిపోయి చేస్తున్న కామెంట్స్.. ఫలితాలెలా ఉంటాయే విశ్లేషించే సర్వే సంస్థలు.. బెట్టింగ్ రాయుళ్లు.. ఇలా వాళ్లందరిపైనా ఆ ఎన్నికలనంతరం వాటి ప్రభావం అయితే సానుకూలంగానో, ప్రతికూలంగానో పడకతప్పదు. అలాంటి జాబితాలో ఇప్పుడు చెప్పుకోవాల్సిన ఓ హాట్ నేమ్ ధృవ్ రాఠీ.

ఏస్ ధృవ్ రాఠీ.. యాంటీ మోడీ, యాంటీ బీజేపీ, యాంటీ హిందుత్వ. ఆ బాటలోనే తన యూట్యూబ్ ఛానల్ తో తాను ఇండియాలో మరింత ఫేమ్ సంపాదించాడు. ఎన్నికలకు ముందూ పలు వీడియో స్టోరీస్ చేసిన ధృవ్ రాఠీ తాజాగా తన X ఖాతాలోనూ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆయనపై మీమ్స్, ట్రోలింగ్ కు కారణమవుతోంది.
https://twitter.com/dhruv_rathee/status/1888155234817470591
ఢిల్లీ ఎన్నికల్లో 26 ఏళ్ల తర్వాత బీజేపీ గద్దెనెక్కడం వెనుక కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న ఆ పార్టీ అణగదొక్కడమే ప్రధాన కారణమంటూ ఈ యూట్యూబర్ Xలో పోస్ట్ చేశాడు.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు, ఆప్ 22 స్థానాలను గెల్చుకోగా.. అంతకుముందే బీజేపీ 37 స్థానాల్లో, ఆప్ 11 స్థానాల్లో లీడ్ లో ఉన్న సమయంలోనే Xలో తన పోస్ట్ చేశాడు ధృవ్ రాఠీ.
తానేమంటాడంటే… గత కొన్నేళ్లుగా ఢిల్లీలో ఎటువంటి పని జరక్కపోవడంతోనే ఆప్ ఓటమిపాలైందంటాడు. కేంద్రంలో ఉన్న బీజేపి లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను ఉపయోగించడం నుంచి, వారి ఏజెన్సీలతో ఆప్ ప్రజాప్రతినిధులపై నకిలీ కేసులు పెట్టిస్తూ జైళ్లల్లో పెట్టడం, కొత్త చట్టాలను ఆమోదించడం వరకూ దుర్వినియోగానికి పాల్పడిందన్నది రాఠీ ఆరోపణ. ముఖ్యంగా ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్ మెంట్ (2023 GNCTD) ద్వారా ఢిల్లీని పరోక్షంగా బీజేపీనే పాలించిందన్నది ధృవ్ రాఠీ తన పోస్ట్ లో వెల్లడించిన విషయం.
ఆ క్రమంలో ఢిల్లీ ప్రజలు ఇప్పుడు ఆప్ ను ఓడగొట్టాకైనా ఆలోచించాలి.. తమ సమస్యలు పరిష్కారం కాకుండా అడ్డుకున్నదెవ్వరో తెలుసుకోవాలంటూ రాఠీ X పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అదే సమయంలో బీజేపీ సానుభూతిపరుల నుంచి మీమ్స్ తో పాటు, తీవ్రమైన ట్రోలింగ్ కూ రాఠీ గురి కావల్సి వస్తోంది.
సరే, ఇప్పటివరకూ తమ సమస్యలను ఓ ప్రభుత్వంతో కనీసం చెప్పుకోగల్గిన ఢిల్లీ ప్రజానీకం.. ఇకముందు ఢిల్లీలో పేరుకుపోయిన వాయుకాలుష్యం, యమునా కలుషితం, శిథిలావస్థకు చేరుకున్న మౌలికసదుపాయాలు, ఢిల్లీ వీధుల పరిశుభ్రత వంటి సమస్యలను బీజేపీ ప్రభుత్వంతో చెప్పుకోగలరా… అంటూ ప్రశ్నిస్తున్నాడు రాఠీ. లేక, ఈ సమస్యలన్నింటినీ బుల్డోజ్ చేసి ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే బీజేపీ ఢిల్లీ ప్రజలను మతపరమైన అంశాలను ముందుకు తీసుకొచ్చి బ్రెయిన్ వాష్ చేసి విజయం సాధిస్తుందా అంటూ బీజేపీపై తన సెటైర్ వేస్తున్నాడు.
అయితే, బీజేపీ సింపథైజర్స్ మాత్రం రాఠీని ఏకిపారేస్తున్నారు. నిన్నటివరకూ ఆప్ దే విజయమన్న రాఠీ.. ఇప్పుడు ఓటమిపాలయ్యేసరికి వాస్తవికతకు దూరం జరిగి ప్రేలాపనలు చేస్తున్నాడంటూ Xలో మండిపడుతున్నారు.
అంతేకాదు, ధృవ్ రాఠీనీ ఓ ఐరన్ లెగ్ గా అభివర్ణిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి, హర్యానాలో కాంగ్రెస్ కు, మహారాష్ట్రలో మహావికాస్ అఘాడ్ కు, ఢిల్లీలో ఆప్ కు మద్దతిస్తే వారంతా ఓటమిపాలయ్యారు… కాబట్టి ధృవ్ రాఠీ ఇక నుంచి వచ్చే ప్రతీ ఎన్నికల్లోనూ ఇండియా కూటమి పార్టీలకే మద్దతివ్వాలంటూ కౌంటర్ సెటైర్స్ తో ఈ సంవాదం Xలో హాట్ డిబేట్ లా మారిపోయింది. ఇక కొందరైతే రాఠీ నీ వీడియోలు వ్యూస్ మాత్రమే సాధిస్తాయి తప్ప.. ఓట్లను కాదంటూ ట్రోల్ చేస్తున్నారు.
మొత్తంగా ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆయా పార్టీలపైనే కాదు.. వాటిని ఫాలో అవుతూ వస్తున్న ఇతర సంస్థలు, వ్యక్తులు, ఛానల్స్ వంటివాటన్నింటిపైనా ఎంత అమితంగా ప్రభావం చూపుతున్నాయో ఇప్పుడు ధృవ్ రాఠీపై జరుగుతున్న ట్రోలింగ్ మరో ఉదాహరణ.



