సరిగ్గా 500 ఏళ్ల క్రితం అటవీ గ్రామాలెలా ఉండేవి… ఇప్పుడెలా ఉన్నాయి…?
అడవినే ఇంటిలా చూసిన తరాల నుంచి ఇన్ స్టా లో ప్రపంచాన్ని చూసే జెన్ జీ వరకు… గిరిజన యువత జీవితంలో వచ్చిన మార్పేంటి..?
ఒకప్పుడు అడవే వారి ప్రపంచం… అడవిలో దొరికే పండ్లు, దుంపలే ఆహారం… చెట్ల వనమూలికలే మందులు… నదులు, వాగులు, చెరువులు, చెలిమెలే నీటి వనరులు… పెద్దలు చెప్పే మాటలే పాఠ్యపుస్తకాలు. కానీ, నేడు ట్రెండ్ మారింది. అవే గిరిజన గూడాల్లో ఓ యువకుడి చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. యూట్యూబులో పాటలు వింటున్నారు. ఇన్ స్టాలో రీల్స్ చూస్తున్నారు. వాట్సప్ లో స్నేహితులతో చాట్ చేస్తున్నారు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. నగరాల్లో చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని, వ్యాపారాలు పెట్టాలని కలలు కంటున్నారు.
కానీ, వారి ఇళ్లల్లో వారి బామ్మలు, తాతలు చెప్పే పద్ధతుల్లోనే ఇప్పటికీ వంటలు జరుగుతాయి. పండుగ వస్తే సంప్రదాయ పద్ధతుల్లోని పాటలే వినిపిస్తాయి. పెళ్లిళ్లు చేసినా సంప్రదాయ పద్ధతులకే పెద్దపీట. అడవిలో ఏ మొక్క పనికొస్తుందో ఈ జెన్ జీ గిరిజన తెగ తల్లిదండ్రులకు ఇప్పటికీ తెలుసు.

మరి గిరిజన జీవితాలు మారిపోతున్నాయా..? రూపం మార్చుకుంటున్నాయా..?
అప్పుడు అడవే ప్రపంచం… కానీ, ఇప్పుడు అరచేతిలోనే మొత్తం ప్రపంచం!
గిరిజనులకు అడవే మొదటి పాఠశాల. ఈ సమాజాల్లో జ్ఞానం తరతరాలుగా మాట ద్వారా, ఆచరణాత్మకంగా, ప్రకృతితో ప్రత్యక్ష అనుభవంతో బదిలీ అవుతోంది. ఏ మొక్క తినేందుకు పనికొస్తుంది. ఏ పండు ఏ కాలంలో కాస్తుంది. ఏ చెట్టు బెరడు ఉపయోగపడేది. వర్షం ఎప్పుడు పడే అవకాశముంది. అడవిలో ఏ దారి ఎక్కడికి తీసుకెళ్లుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలు ఏ పుస్తకాల్లోనూ ఉండవు. కానీ, ఇవన్నీ గూడాల్లో పెద్దల ద్వారా తెలిసేవి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాల్లోని గిరిజన సంస్కృతిపై చాలా అధ్యయనాలు జరిగాయి. జరుగుతున్నాయి. వారి జీవన విధానంపై.. భౌగోళిక పరిసరాలు, వృక్షజాలం, జంతుజాలం వంటివి తీవ్రమైన ప్రభావం చూపినట్టుగా కూడా కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.
ఇప్పుడు ఒక్క డివైజే గిరిజన గూడాల్లో పాఠశాలగా మారిపోయింది.
జెన్ జీ గిరిజన యువతకు ప్రపంచం గ్రామ సరిహద్దులతో ఆగిపోలేదు. స్మార్ట్ ఫోన్ ఒక న్యూ విండోగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన యువతపై 2025లో జరిగిన ఒక అధ్యయనంలో ఆండ్రాయిడ్ ఫోన్స్ వినియోగం పెరిగిందని తెలిసింది. వాట్సప్, ఇన్ స్టా, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ గిరిజన యువత కమ్యూనికేషన్, వినోదం, సామాజిక సంబంధాల్లో భాగస్వామ్యమవుతున్నాయని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ జర్నల్ స్పష్టం చేసింది.
అంటే ఏం మారినట్టు..?
తాతకు అడవే ప్రపంచమైతే… మనవడికి అడవితో పాటు, ఇప్పుడు ఇంటర్నెట్ కూడా మరో సరికొత్త ప్రపంచాన్ని ముందుంచింది.
మరి మార్పు అంటే సంప్రదాయాన్ని వదిలేయడమేనా..?
ఈ మాట ఎప్పటికీ తొందరపాటే. కొందరు యువతకు సంప్రదాయాలు పాత జ్ఞాపకాలేం కాదు. అదో కొత్త గుర్తింపులో అదనపు ఆకర్షణయ్యే విశేషం. ఎందుకంటే, తమ సంప్రదాయ దుస్తుల్లో ఫోటోలు తీసుకుంటున్నారు. గిరిజన పాటలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. తన డ్యాన్సుల వీడియోలు వైరలవుతున్నాయి. వారి సంప్రదాయ ఆహారాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. మొత్తంగా తమ కళను మార్కెట్ కు పరిచయం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా గిరిజన విద్యార్థుల సాంస్కృతిక, సాహిత్య, కళా ప్రతిభకు వేదికలు పెరుగుతున్నాయి. 2025లో జరిగిన ఉద్భవ్ జాతీయోత్సవంలో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 15 వందల మందికి పైగా గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు.
సంప్రదాయం నుంచి దూరం జరగకుండా.. నూతన పద్దతులను ఆకళింపు చేసుకుంటూ తమ సంప్రదాయాలను మరింత కొత్తగా చెప్పే ప్రయత్నం జరుగుతోంది.
ఓవైపు మోబైల్… ఇంకోవైపు మట్టిమనిషి జ్ఞానం!
మోబైల్ చేతిలో జెన్ జీ గిరిజన యువతకూ అందరిలాగే.. ప్రపంచంలోని ఏ విషయాన్నైనా గూగుల్ చేసి వెతికే అవకాశముంది.
కానీ, తన తాతకు తెలిసిన అడవిలోని ఒక 50 మొక్కల పేర్లైనా ఇవాళ అతడు చెప్పగలడా..? అమ్మమ్మకు తెలిసిన సంప్రదాయ వంటకాలను చేయగలడా..? తమ తెగ ఆలపించే పాటల పూర్తి అర్థాలు తెలుసా..? మాతృభాషలో మాట్లాడ్డానికి నాటి ఉత్సాహమే నేటి యువతలో కనిపిస్తుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రతీ గిరిజన సమాజంలో ఒకేలాంటి సమాధానాలు కనిపించకపోవచ్చు.
ఒడిశాలోని లోధా గిరిజన యువతపై జరిగిన ఓ అధ్యయనంలో సోషల్ మీడియా వినియోగం పెరగడం, సంప్రదాయ, సాంస్కృతిక వ్యవస్థల నుంచి కొంత దూరం కావడం వంటివి గుర్తించాయి కొన్ని అధ్యయన సంస్థలు.
తాతయ్యకు అడవి… మనవడికి కొత్త ప్రపంచం!
ఇదే ఇప్పుడు గిరిజన గూడాల్లో కనిపిస్తున్న కొత్త మార్పు.
అడవిని వదులొద్దన్నది తాత సూచనైతే… మన అడవి గురించి ప్రపంచానికి పరిచయం చేయాలన్నది మనవడు, మనవరాలి ప్రయత్నం. మన ఆట, పాట మర్చిపోవద్దని తాత అంటే.. వాటిని యూట్యూబులో పెడతాను, ఇన్ స్టా రీల్స్ గా మారుస్తామంటున్నారు మనవలు, మనవరాళ్లు. మన కళలను కాపాడుకోవాలని తాత, అమ్మమ్మ చెబితే.. వాటిని ఆన్లైన్ లో విక్రయించి డబ్బు సంపాదిస్తానంటున్నారు నేటి పిల్లలు.
ఇక్కడే మనకు సంప్రదాయానికి, టెక్నాలజీకి మధ్య ఓ వారధి కనిపిస్తోంది.
500 ఏళ్ల క్రితం ఎలా ఉండేది.. వర్తమానం ఎలా ఉందనేది చెప్పుకున్నాం సరే! కానీ, ఐదు శతాబ్దాల తర్వాతెలా ఉంటుంది మరి..?
అప్పుడు కూడా అడవి ఉంటుందా..? సంప్రదాయ పాటలు వినిపిస్తాయా..? మాతృభాషలు నిలుస్తాయా..? పండుగలూ అలాగే జరుగుతాయా..? లేక, ఇవన్నీ డిజిటల్ అర్కైవ్స్, మ్యూజియాలు, పుస్తకాలకే పరిమితమైతాయా..? వీటికి సమాధానాలన్నీ నేటి అటవీ జెన్ జీ బిడ్డలు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే, సంప్రదాయం గతమే కాదు.. దాన్ని భవిష్యత్ తరాలకు అందించే మనుషుల చేతుల్లో ఉన్న వర్తమానం.
500 ఏళ్ల క్రితం గిరిజన యువకుల చేతిలో విల్లులొండొచ్చు.. కానీ, ఈరోజు స్మార్ట్ ఫోన్స్ చేతికొచ్చాయి. అప్పుడు అడవితోనే ఆరంభమై.. అడవితోనే ముగిసే ప్రపంచం కాస్తా ఇప్పుడు అడవిలో మొదలై సోషల్ మీడియా వేదికగా నగరాలు, మార్కెట్స్, విశ్వవిద్యాలయాల వరకూ ప్రపంచాన్ని చుట్టి వస్తోంది.
కానీ, తానెవరు… ఇదే ఇవాళ అతడు వేసుకోవాల్సిన ప్రధాన ప్రశ్న..?
ఆ ప్రశ్నకు సమాధానమే తమ జీవితాల్ని విశేషంగా ప్రపంచానికి పరిచయం చేసిన సంప్రదాయం. ఆ సమాధానాన్ని కొత్త ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యత, భాష మాత్రం జెన్ జీ గిరిజన యువతదే.



