రిక్షా నుంచి రీల్స్ వరకు! ఓ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్రెస్టింగ్ జర్నీ!

ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కో తీరు. తండ్రి రిక్షా తోలుతూ కుటుంబాన్ని పోషిస్తే.. కొడుకు ఆ వింటేజ్ రిక్షా రీల్స్ తో 87 వేల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుని ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాడు.

ఆ 22 ఏళ్ల యువకుడి పేరు సుమిత్ ప్రజాపతి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన సుమిత్.. తన తండ్రి రిక్షాను సోషల్ మీడియా వేదికగా నడిపిస్తున్నాడు. తండ్రి రాత్రింబవళ్లూ కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తే… జస్ట్ చిన్న చిన్న వీడియోలతో ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ స్టార్ గా మారి పలు బ్రాండ్స్ ప్రమోటర్ గా, సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్ గా సుమిత్ డబ్బు సంపాదిస్తున్నాడు.

రిక్షా నుంచి రీల్స్ వరకూ ప్రయాణం!

ఎండాకాలం.. పైన భానుడి భగభగ.. ఉక్కపోతతో కూడిన మధ్యాహ్నం.. సుమిత్ ప్రజాపతి తన రిక్షా హ్యాండిల్ కు ఏర్పాటు చేసిన తన ఫోన్ మౌంట్ సర్దుకుంటున్నాడు. అది జస్ట్ సాధారణ ప్రయాణం కాదు.. తన కెరీర్ నే నేటి సోషల్ మీడియా జమానాలో సరికొత్తగా నిర్మించుకుంటూ చేపట్టిన ప్రయాణం. అదే అతడి జీవితమనే సినిమాకు సెట్, స్టేజ్, 80 వేలకు పైగా ఇన్ స్టా ఫాలోవర్స్ ను తీసుకొచ్చిన వేదిక.

చాలామందిలానే సుమిత్ కూడా ఇంజనీర్ కావాలని కలగన్నాడు. రిక్షా నడుపుతాననీ ఏనాడూ ఊహించలేదు. కానీ, జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, ఇంకెలాంటి మార్పులు తెస్తుందో ఎవరికి తెలుసు..? అలాగే, సుమిత్ కు మాత్రం ఏం తెలుసు..?

ఒక దుర్ఘటనతో సుమిత్ పై పడ్డ కుటుంబభారం!

ఎెందుకు సుమిత్ ప్రజాపతి సోషల్ మీడియాను ఎంచుకున్నాడు…? తన తండ్రి నడిపే వింటేజ్ రిక్షాను సోషల్ మీడియాలో తాను రాణించేందుకు ఎలా టూల్ గా మార్చుకున్నాడు..?

ఓరోజు రాత్రి తన పని ముగించుకుని వచ్చిన సుమిత్ తండ్రి గ్యాస్ స్టౌ వెలిగించేందుకు యత్నిస్తుండగా… ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఛాతీ, మెడవద్ద పూర్తిగా కాలిపోయి తీవ్రగాయాలయ్యాయి.

తల్లిదండ్రులతో పాటు.. మరో ఐదుగురు సోదరీసోదరీమణులతో ఏడుగురి కుటుంబం ఒక్కసారిగా ఆవేదనతో కూడిన భావోద్వేగానికి గురైంది. ఆర్థికంగా కుప్పకూలిపోయింది. అప్పుడు ఇంజనీర్ కావాలనుకున్న సుమిత్.. తన తండ్రి రిక్షా నడిపే బాధ్యతను తన భుజానికెత్తుకున్నాడు. ఎవరూ సాయమందించేవారు కనిపించనప్పుడు.. ఆ బాధ్యత తప్పనిసరైంది సుమిత్ కు.

బాల్యం నుంచీ సాఫీగా సాగని విద్య!

చిన్నప్పట్నుంచే పొట్టకూటి కోసం పొలాల్లో పని చేశాడు సుమిత్. కార్లు కడిగాడు, వాహనాలు రిపేర్ చేసే మెకానిక్ గా మారాడు. కూరగాయలమ్మాడు. రెడీమెడ్ బట్టల దుకాణాల్లో పనిచేశాడు. అవన్నీ చేస్తూ తన చదువు కొనసాగించాడు. ఎందుకంటే సుమిత్ 7వ తరగతి తర్వాత తల్లిదండ్రులు ఫీజులు భరించలేకపోయారు. అలాగే చిన్న చిన్న పనులు చేస్తూ బీఏ డిగ్రీ పూర్తి చేశాడు.

సోషల్ మీడియాపై ఆసక్తి!

డిగ్రీ కంప్లీట్ చేస్తున్న సమయంలోనే సుమిత్ కు సోషల్ మీడియాపై ఇంట్రెస్ట్ పెరిగింది. స్వయంగా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. ఆ నైపుణ్యంతో స్థానికంగా ఉండే ఓ ఇన్ఫ్లుయెన్సర్ కి సోషల్ మీడియా మేనేజర్ గా పని దొరికింది. కానీ, అదీ సుమిత్ కు ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. నెలకు 60 వేల రూపాయలిస్తానన్న సదరు పెద్దమనిషి.. కేవలం 12 వేల రూపాయలిచ్చి చేతులు దులుపుకునేవాడు. మిగిలిన డబ్బు తర్వాత ఇస్తానంటూ మబ్బిపెట్టేవాడు. అలా మోసం చేయడంతో పాటు.. సుమిత్ పైనే దొంగతనం మోపి అవమానించాడు. దాంతో సుమిత్ ఇక ఉద్యోగాలు చేయొద్దని డిసైడ్ అయ్యాడు. చిన్న పని చేసినా సరే.. తన కాళ్ల మీద తాను నిలబడాలకున్నాడు.

కొత్త ఆలోచనలకు తెరతీసిన తండ్రి మూడు చక్రాల బండి!

తండ్రికి జరిగిన ఫైర్ యాక్సిడెంట్ తర్వాత సుమిత్ రిక్షా నడపాల్సి వచ్చినప్పుడు.. అతడికి అంతకుముందు నేర్చుకున్న నైపుణ్యమేంటంటే ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా రీల్స్, వీడియో స్టోరీస్ చేయడం వంటివి మాత్రమే తెలుసు. అదిగో ఆ నైపుణ్యాన్ని.. తండ్రి మూడు కాళ్ల బండినీ మిళితం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టింది. అప్పటివరకూ కార్లు, బైక్స్ మీద వీడియోలున్నాయేగానీ.. రిక్షా మీద వీడియోలు చేయడం.. రిక్షాను ప్రధాన పాత్ర చేస్తూ స్టోరీస్ చెప్పడం ఎవ్వరూ చేయలేదని గుర్తించాడు.

ఓసారి తన కుటుంబంతా తమ రిక్షాలోనే ఓ పెళ్లికి వెళ్తున్నప్పుడు దాన్ని చిత్రీకరించి, సరిగ్గా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో రీల్ చేశాడు. రెండు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆన్ లైన్ లో ప్రశంసలతో పాటు.. వ్యంగ్యోక్తులూ వెల్లువెత్తాయి.

శుభ్రంగా డ్రెస్ వేసుకుని బయటకు వెళ్లే సుమిత్ ను ఇరుగుపొరుగువారు ఎక్కడికని అడిగేవారు. రిక్షా నడపడానికి అంటే ఫక్కున నవ్వేవారు. అలా అవమానాలను భరిస్తూనే… తాననుకున్న సోషల్ మీడియా రీల్స్ వైపు అఢుగులేశాడు సుమిత్. ఆ తర్వాత ఆ నవ్వులు మాయమయ్యాయి. తానో సోషల్ మీడియా స్టార్ గా ఎదిగాడు.

తండ్రికి నమ్మకం కల్గించని సుమిత్ పని!

సుమిత్ ఆలోచనలు స్పష్టంగా లేవని తండ్రి భావించాడు. ఆ పని గౌరవం లేని పని అని ఆయన హెచ్చరించేవాడు. ప్రయాణీకులతోనూ తిట్లు తప్పవని భావించాడు. కానీ, ఆ పనితోనే తాను గౌరవం తెస్తానని సుమిత్ గట్టిగా నిర్ణయించుకున్నాడు.

ప్రేరణగా మారుతున్న సుమిత్ ప్రయాణం!

ఇప్పుడు సుమిత్ ప్రయాణం చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఓ ఇన్సిపిరేషన్. రిక్షాపైనుంచే పలు మోటివేషనల్ వీడియోస్ తయారుచేస్తూ క్రేజ్ సంపాదించుకున్నాడు. తను రిక్షాతో చేస్తున్న రీల్స్, వీడియోస్ కి ఇన్ స్టా నుంచి మంచి ఆదాయం కూడా లభిస్తుండటంతో.. రిక్షా నడిపి లక్షలు సంపాదించడమెలాగో ఓ సీరిస్ కూడా చేస్తానంటున్నాడు సుమిత్ ప్రజాపతి. నెలకు సగటున కనీసం 25 వేల రూపాయలు తక్కువలో తక్కువ పనిచేసినా ఇప్పుడు సుమిత్ కు ఓ స్థిరమైన ఆదాయం ఏర్పాటైంది. గత నెలలో ఒక్క ప్రమోషన్ ద్వారానే సుమిత్ 1 లక్షా 50 వేల రూపాయలు సంపాదించాడు.

తన ఆదాయం పెరగడంతో కుటుంబ అప్పులు తీర్చాడు. ఓ మాంచి ఫోన్ కొనుగోలు చేశాడు. చెల్లెలికి పాకెట్ మనీ ఇస్తున్నాడు. ఎప్పుడూ పెద్ద హోటళ్లంటే తెలియని అమ్మానాన్నలను రెస్టారెంటుకు తీసుకెళ్తున్నాడు. ఇవన్నీ సుమిత్ ప్రజాపతి జీవితంలో ఇప్పుడు ఆనందభాష్పాలు తెప్పించే భావోద్వేగాంశాలు.

మరో పెద్ద కల దిశగా సుమిత్ అడుగులు!

సుమిత్ కు సాధించినవి సమాజం దృష్టిలో గొప్ప విజయాలేం కాకపోవచ్చు. కానీ, సుమిత్ జీవిత నేపథ్యానికి పెద్ద విజయాలే. అయితే, సుమిత్ మాత్రం అలా అనుకోవడం లేదు. ఇంకా పెద్ద విజయాలపై కన్నేశాడు. గతంలో అప్పులపాలే అమ్ముకున్న ఇంటిని తిరిగి కొనుక్కోవడం ఆ కలల్లో ఒకటైతే.. ఎలాగైనా బాలీవుడ్ నటుడిగా ఎదగాలన్నది అతడి అల్టిమేట్ గోల్.

ముందు నీ భవిష్యత్తు… తర్వాత కుటుంబం.. ఆ తర్వాత సమాజం.. ఇదీ సుమిత్ మోటో! కూరగాయలు అమ్మినా, టీ స్టాల్ పెట్టినా, రిక్షా నడిపినా సరే… నీ పనికి నువ్వే యజమాని కావాలని చెబుతున్నాడు. తక్కువ సంపాదనైనా సరే… అది నీకు సంతృప్తి, శాంతినిస్తుందని బోధిస్తున్నాడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles