తవారే… ఫాదర్ ఆఫ్ అగ్రిటూరిజం!
ఆరుగాలం కష్టం. చీడపీడలతో తద్దే దిగుబడులు. వచ్చిన దిగుబడులు వచ్చినప్పుడు మార్కెట్ లో దక్కని కనీస గిట్టుబాటు ధర. అసలు పెట్టుబడులే వెళ్లక అప్పులు. అన్నపూర్ణ వంటి దేశంలో ఆత్మహత్యలు. అన్నదాత పండిస్తేనే నాల్గు మెతుకులు తింటున్న సమాజం.. ఆ మెతుకుల వెనుక కష్టం వింటే కలిగేది దిగ్భ్రాంతే. సమాజ పోకడలను బట్టి మనుషులు మారాలి. రైతులు కూడా. ఆ మోటోతో సక్సెస్ అయినవాడే పాండురంగ తవారే. వినూత్న శైలితో వ్యవసాయరంగాన్ని పర్యాటక రంగంతో మిళితం చేసి సక్సెసైనవాడు. అగ్రిటూరిజం ప్రాజెక్ట్ తో నమ్ముకున్న ఆరువందల మంది రైతులనూ లాభాలబాట పట్టించి… వారి వ్యవసాయ ఉత్పత్తులకు 58 కోట్ల రూపాయల ఆదాయాన్నందించిన ఘనుడు. ఫాదర్ ఆఫ్ అగ్రిటూరిజం మ్యాన్ గురించి వినేందుకు.. మనమూ ఓసారి ఆ వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లొద్దాం పదండి.

దేశమంటే మట్టికాదోయ్ మనుషులోయ్ అన్నాడు గురజాడ. దేశమంటే పట్టణాలు… పైపైన కనిపించే సొబగులే కాదు… పల్లెప్రగతీ ముఖ్యమేనన్నాడు మహాత్ముడు. భారత్ అంటే ఢిల్లీ, ముంబై, హైదరాబాదో మాత్రమే కాదు… ఏడులక్షల గ్రామాల సముదాయమీదేశం. 145 కోట్ల జనాభా కల్గిన ఈ దేశంలో… రైతుల సంఖ్యే కనీసం పదిహేను నుంచి ఇరవై కోట్ల వరకుంటుందంటే… వ్యవసాయరంగంపై ఈ దేశం ఏ స్థాయిలో ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చు.
వ్యవసాయం చెప్పుకున్నంత సులభమేం కాదు. తన పని తానేదో చేసుకుని పోతానంటే రైతుకు అస్సలే కుదరని పని. రుతుపవనాల రాక.. అతివృష్టి, అనావృష్టి… నాణ్యమైన విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద, చీడపీడలు, తెగుళ్లు, పంటల యాజమాన్య పద్ధతులకవసరమయ్యే మౌలిక సదుపాయాలు… సబ్సిడీలు, డ్రిప్ సౌకర్యాలు, సాంకేతిక యుగపు హార్వెస్టింగ్ పద్ధతులు… ప్రభుత్వ విధానాలు, మార్కెట్ పరిస్థితులు… ఎన్నో ప్రభావితం చేస్తూ అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఓవైపు దేశంలో రైతుల బలవన్మరణాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్న నేపథ్యంలోనే…. వినూత్న పద్ధతుల్లో సాగును బాగు చేసి చూపించే పాండురంగ తవారే వంటి విశిష్ఠ వ్యక్తులే ఈ సమాజానికి అవసరం.
55 ఏళ్ల పాండురంగ తవారేది మహారాష్ట్రలోని బారామతి జిల్లా షాంగవి. ఓ రైతు కుటుంబంలో పుట్టినవాడు. చదివింది కంప్యూటర్ సైన్స్. తండ్రికి మాత్రం అగ్రికల్చర్ లో డిగ్రీ చదివించాలనే కోరిక. సరైన మార్కుల్లేక, ఆ కోర్సుకు ఎంపిక కాని పాండురంగ.. కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్లిపోయాడు. అక్కడా అనుకున్న సంతృప్తి దొరకలేదు. తర్వాత 20 ఏళ్లు పర్యాటక రంగంలో పనిచేశాడు. అక్కడా సంతృప్తి పొందని పాండురంగ… తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని తీర్మానించుకున్నాడు. తండ్రికిష్టమైన వ్యవసాయం చేయాలన్న కోరిక మొదలైంది. 13 ఎకరాల పొలముంది. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇంటిపట్టున ఊళ్లో అందరితో హాయిగా ఉండొచ్చన్నది పాండురంగ యోచన. పాండురంగ భార్య వైశాలి పట్టణవాసి కావడంతో… మొదట్లో ఆమె అంత సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ భర్త మాట కాదనలేక… భర్త పాండురంగతో పాటే అత్తగారి ఊరైన షాంగవికి వచ్చేసింది. ఫాదర్ ఆఫ్ అగ్రిటూరిజం మ్యాన్ గా పాండురంగ పేరు గడించడానికి… 19 ఏళ్లుగా తన భార్య తన వెంటుండి నడవడమే కారణమైంది. 32 ఏళ్ల వయస్సులో రియలైజైన పాండురంగ… ఐరోపాలో చాలా కాలంగా నడుస్తున్న అగ్రిటూరిజం మాడల్ ను ఇక్కడ కూడా అమలు చేయాలన్న ఐడియాతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు.

అలా 2002 నుంచి ఆయన ప్రస్థానం కొత్త మలుపు తీసుకుంది. అగ్రిటూరిజం అనే కాన్సెప్ట్ ను తవారే ఏమంత ఆషామాషీగా ప్రారంభించలేదు. 2003లో మార్కెట్ శాంపిల్ సర్వే నిర్వహించాడు. సుమారు 2 వేల 440 మంది రైతులతో కలిశాడు. ఎట్టకేలకు వారందరితో కలిసి… అగ్రిటూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ను ప్రారంభించాడు. తాను ఈ అగ్రిటూరిజమనే కాన్సెప్ట్ ను ప్రారంభించినప్పుడు… రైతులు తనపై విశ్వాసముంచేందుకు పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. పైగా ఎలాగోలా నమ్మకాన్ని సాధించి.. అగ్రిమెంట్స్ పై సైన్ చేసిన రైతులందరికీ ఆ విధానమేంటో అసలు అర్థమే కాలేదు.
అసలేంటీ ఈ అగ్రీటూరిజం…?
దూరపు కొండలు నునుపు అన్నట్టుగా ఎప్పుడూ పట్టణాల్లో మెకానికల్ లైఫ్ గడించేవారికి… పల్లె ప్రకృతంటే ఒకింత మమకారం. వ్యవసాయ భూముల్లో చేసే పనులవంటివీ తామూ చేస్తే బాగుండనిపించేవాళ్లూ ఉంటారు. ఈ అనుభూతి కోసం కేవలం దేశంలోని పట్టణవాసులే కాకుండా… విదేశాల నుంచి వచ్చేవారూ పరితపిస్తుంటారు. అలాంటివారు ఇదిగో పాండురంగ తవారే ప్రారంభించిన అగ్రిటూరిజం కాన్సెప్ట్ లో భాగంగా రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించవచ్చు. అక్కడ రైతులెలాగైతే సాగు చేస్తారో… వచ్చిన పర్యాటకులూ ఆ పని చేసి, ఆ పకృతి సిద్ధమైన అనుభూతిని పొందవచ్చు. అంతేకాదు… ఆ వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు పండించిన దిగుబడులనూ కొనుక్కోని వెళ్లవచ్చు. ఇలా పర్యాటకంగా వారికి ఓ ఆనందాన్నివ్వడంతో పాటే… ఇటు రైతుల ఉత్పత్తులను వారి క్షేత్రాలనే సందర్శించిన పర్యాటకులు కొనుగోలు చేయడం వల్ల మార్కెట్ కష్టాలకూ చెక్ పడుతుంది. ఇలాంటి ఆలోచనలే పాండురంగ తవారేను అగ్రిటూరిజం వైపు అడుగులు వేయించాయి.
అయితే మొత్తం నల్గురన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య ఉమ్మడి కుటుంబంలో పుట్టిన పాండురంగ తవారే అమ్మా, నాన్నకు తప్ప.. వ్యవసాయంలో ఎవ్వరికీ పెద్దగా అనుభవం లేదు. తను పర్యాటక రంగంలో పనిచేస్తున్న క్రమంలో కూడబెట్టుకున్న 6 లక్షల రూపాయల డబ్బును కూడా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన అగ్రీటూరిజంలో పెట్టుబడి పెట్టాడు. తాను రైతులను ఒప్పించి ప్రారంభించిన అగ్రిటూరిజం కాన్సెప్ట్ ను ప్రమోట్ చేయడానికి తన దగ్గరున్నదంతా ప్రకటనల కోసం కుమ్మరించాడు. కొంతకాలం నిరాశే ఎదురైంది. 2005లో మిణుకు మిణుకుమని కొట్టుకుంటున్న వారి ఆశలకు.. దీపంలాంటి ఓ చిన్న వెలుగు దొరికింది. మొదటి కస్టమర్ నుంచి ఫోన్ కాలే… తన ప్రయోగాత్మక అడుగుల నుంచి మరింత ముందుకు నడిపించిన మరో అడుగైంది. ఆ తర్వాత 2006లో పాండురంగ తవారే చేపట్టిన అగ్రిటూరిజం కాన్సెప్ట్ దశ తిరిగింది. పూణే నుంచి వచ్చిన 4 వేల మంది మహిళా సభ్యుల బృందం సందర్శించాక… అప్పటినుంచీ తన కాన్సెప్ట్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం 18 నెలల కాలంలోనే… తన అగ్రిటూరిజం దశ మారిపోయింది. పర్యాటకులు ఆసక్తి చూపడం మొదలెట్టారు… ఆ తర్వాత 13 వేల మంది వరుసగా వారి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.
ద్రవ్యోల్బణం పట్టిపీడించే రోజుల్లో.. వ్యవసాయోత్పత్తులతో వచ్చే ఆదాయంతో మాత్రమే రైతుల కుటుంబాలు నడవలేని దైన్యస్థితిలో… పాండురంగతో అనుబంధం అక్కడి అన్నదాతల బతుకుచిత్రాన్నే మార్చేసింది. ఈ విషయాన్ని భోర్ తాలూకాలోని నస్రాపూర్ కు చెందిన కృష్ణాపడార్తే వంటి ఎందరో రైతులు స్వయంగా చెప్పారు. తమ ఆదాయం ఐదు రెట్లు పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే టూరిస్ట్స్ నుంచి అందే సూచనలనూ పరిగణనలోకి తీసుకుని ఎంతో మరింత నేర్చుకున్నారు షాంగవి రైతులు.
పాండురంగ తవారే నిర్వహణలోని అగ్రిటూరిజంకు ఓ పర్యాటకుడిగా వెళ్లాలంటే… 1500 రూపాయలు ఒక్కో టూరిస్టుకి ఖర్చవుతుంది. దాంతో రెండుసార్లు నాణ్యమైన సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటల భోజనం… అల్పాహారం, సాయంత్రం టీ, స్నాక్స్ తో పాటు.. రాత్రి పూట కూడా పొలంలో గడిపేందుకు వసతి ఇలా అన్నీ అందిస్తారు. అలా.. తవారే వ్యవసాయ పర్యాటకం వైపు మళ్లితే… పచ్చని ప్రకృతి, ఎడ్లబండ్లు, ట్రాక్టర్ రైడ్, పతంగులేగరేయడం, నాణ్యతతో కూడిన ప్రామాణికమైన ఆహారం, సంప్రదాయ దుస్తులు, స్థానిక సంస్కృతి, జానపద పాటలు, నృత్యాల వంటివి ఆస్వాదించడంతో పాటు… అక్కడ రైతులు పండించే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆరోగ్యాన్నీ పొందొచ్చు. వారికింత లాభమూ చేయొచ్చు. అందుకే పాండురంగ తవారే అగ్రిటూరిజం కాన్సెప్ట్ దేశవ్యాప్త మన్ననలందుకుంది. ఆయన కృషికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అలా 2008-09, 2013-14 లో రెండు జాతీయ పురస్కారాలను అందుకున్నారు. TED X టాక్ షోలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే పాండురంగ విధానాల్ని విన్నవారు మంత్రముగ్ధులయ్యారు.
అగ్రిటూరిజంపై పాండురంగ కాన్సెప్ట్ ను సందర్శించడానికి… మహారాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులను ప్రతీ ఏడూ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పాండురంగ అగ్రిటూరిజం ఫీల్డ్ ను సందర్శించాలి. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలలకిప్పటికే ఆదేశాలుండగా.. ఆ లెక్కన వేల మంది విద్యార్థులు ఆ ఫీల్డ్స్ ను సందర్శిస్తున్నారు.
సేవార్త్ మథే పరమార్థ్.. ఇదే పాండురంగ తవారే జీవన విధానం. మీకు మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల వారికి కూడా ఉపయోగపడే ప్రయోజనకారులుగా బతకండి. ఇదే పాండురంగడి మోటో. పాండురంగ తవారే తన అగ్రిటూరిజం భావనను, మాడల్ ను దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకూ ప్రణాళికలు మొదలుపెట్టి దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.



