సాహిర్ కవిత్వంతో సమాజ పోకడలపై గురుదత్ ఎక్కుపెట్టిన బాణం.. ప్యాసా!

Shanthi Ishaan… ✍🏼

#GuruDuttt #pyaasamovie #sahirludhianvi

“Jaane woh kaise log the jinke pyar ko pyar mila
Humne to jab kaliyan maangi kaanton ka haar mila”

ఒక గురుదత్, ఒక SD బర్మన్, ఒక సాహిర్ లుధియాన్వీ, ఒక హేమంత్ కుమార్ కలిస్తే ఊపిరి పోసుకున్న మాస్టర్ పీస్ ఈ పాట.


“ప్రేమిస్తే తిరిగి ప్రేమించేవాళ్ళు దొరకడం ఎంతటి అదృష్టమో కదా, అదేంటో నేను పూలు కోరుకుంటే ముళ్ళ హారమే వచ్చి మెడలో పడుతుంది” అని వాపోతాడో భగ్న ప్రేమికుడు. అతను భగ్న ప్రేమికుడే కాదు లోకంలో పేరుకుపోయిన కుళ్ళు, కుతంత్రాలు చూసి ఈ లోకాన్నే బహిష్కరించిన కవి, కల్మషం లేని మనిషి.

Pyaasa అంటే దాహంతో ఉన్నవాడు అని అర్థం. ఈ సినిమాలో హీరో విజయ్ (గురుదత్) స్వచ్ఛమైన ప్రేమ కోసం అలమటిస్తాడు. కానీ ప్రియురాలు, తోడబుట్టినవాళ్ళు, స్నేహితులు – అందరూ అతణ్ణి మోసం చేస్తారు.


“Bichad gaya har saathi dekar pal do pal ka saath
Kisko fursat hai jo thaame deewanon ka haath
Humko apna saaya tak aksar bezar mila

అందరూ క్షణకాలం తోడుగా ఉండి నన్ను వదిలేసిపోయేవాళ్ళే. ఈ వెర్రివాడి చేయి పట్టుకునే తీరికెవరికుంది? నా నీడే నన్ను వదిలిపోతుంది చాలాసార్లు” అని విజయ్ కుమిలిపోతుంటాడు.

నిజానికి విజయ్ మంచి కవి. ఆశువుగా కవిత్వం చెప్పగలడు కూడా. అతని కవిత్వం మనసు లోతుల్లోంచి పుడుతుంది. కానీ బతికుండగా ఏ దశలోనూ అతని కవిత్వం గుర్తింపుకు నోచుకోదు. చనిపోయాక అనుకోని పరిస్థితుల్లో పబ్లిష్ అయిన కవితల వల్ల బోలెడు కీర్తి వచ్చి పడుతుంది. బతికున్నప్పుడు అతని కవిత్వాన్ని చిత్తు కాగితాల్లా తీసి పడేసినవాళ్ళంతా ఇప్పుడా కీర్తి మాదంటే మాదని కీచులాడుకుంటారు. తీరా విజయ్ చనిపోలేదు బతికే ఉన్నాడని తెలిసి అతనో అబద్ధం అని నిరూపించడానికి నానా ప్రయాసా పడతారు. ఇదంతా చూసి అసహ్యమేసిన విజయ్ తానసలు విజయే కాదని అబద్ధం చెప్పి, ఈ లోకంతో తనకు పని లేదంటూ ఎటో వెళ్ళిపోతాడు. వెళ్ళే ముందు ఇలా అంటాడు-
Ye mahalon, ye takhton, ye tajon ki duniya
Ye insaan ke dushman samajon ki duniya
Ye daulat ke bhookhe riwajon ki duniya
Ye duniya agar mil bhee jaaye to kya hai

మహళ్లు, సింహాసనాలు, కిరీటాలకు విలువిస్తుందీ లోకం. మానవత్వానికి శత్రువీ లోకం, డబ్బుకు దాసోహం ఈ లోకం, ఇలాంటి ఈ లోకం నాకు అక్కర్లేదు అంటాడు.

1957లో వచ్చిన “Pyaasa” సినిమా గురుదత్ ఎప్పుడో రాసుకున్న Kashmakash అనే కథ నుంచి పుట్టింది. ఇది గురుదత్ అసలు సిసలు జీవితం, లోకం పట్ల ఆయనకున్న నిర్వేదానికి ప్రతిరూపం. “ప్యాసా” గురుదత్ కథ మాత్రమే కాదు సాహిర్ లుధియాన్వీ వ్యథ కూడా. ఇద్దరూ ప్రేమ కోసం తపించినవాళ్ళే కదా మరి! గురుదత్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సాహిర్ ప్రాణ ప్రతిష్ఠ చేశారనే చెప్పాలి. విజయ్ ఒక మేటి కవి. అతని కవిత్వం చాలా గొప్పగా ఉండాలి, సామాజిక స్పృహ కూడా ఉండాలి. అలాంటి కవిత్వం సాహిర్ తప్ప ఇంకెవరు రాయగలరు! సినిమాలో కవి చెప్పిన కవిత్వం, పాడిన పాటలు అన్నీ సాహిర్ వే! అసలు సినిమా మొదలు కావడమే ఓ ఉర్దూ కవితతో మొదలవుతుంది. నిజంగా ఇదో సాహసమే! విజయ్ పూలతో, తుమ్మెదలతో మాట్లాడుతుంటాడు. Ye rang aur noor mein doobi huyi raahen అంటూ దారులను రంగులు, వెలుతురులో మునిగిపోయినట్లుగా వర్ణిస్తాడు. ఆ మాటలే పాటలా రఫీ గొంతుకలో సాగిపోతాయి. కవితకు తగ్గ షాట్స్ కళ్ళు తిప్పుకోనివ్వవు. షాట్ కంపోజిషన్, లైటింగ్ మీద గురుదత్ కి మంచి కమాండ్ ఉంది. సినిమా అంతా ఆ నైపుణ్యం కనపడుతూనే ఉంటుంది. అందుకే ఈ సినిమా అందమైన దృశ్య కావ్యమైంది. ప్రకృతి మీద ప్రేమతో సాహిర్ పాట రాస్తే గురుదత్ అందమైన ఫ్రేమ్స్ తో దాన్ని ఇంకా అందంగా మలిచాడు.

ప్రేమ కవిత్వం అనగానే ఆ రోజుల్లో (ఏ రోజుల్లో అయినా) కవులు ప్రియురాలి సొగసును తెగ పొగిడేవాళ్ళు. కానీ సాహిర్ లుధియాన్వీ రచనలు ఇందుకు భిన్నం. ప్రేమ పాటల్లో నిజమైన ప్రేమే ఉండేది. ఇందుకు ఉదాహరణే
Jaane kya tune kahi
Jaane kya maine sunee
Baat kuch ban hi gayi
అనే పాట!
నువ్వేం చెప్పావో, నేనేం విన్నానో కానీ మనిద్దరి మధ్య ఇలా బంధమేదో కుదిరిపోయిందంటూ గీతాదత్ ఎంత గొప్పగా పాడిందో! ఆమె స్వరంలోని విరుపు, మెరుపు వహీదా రెహ్మాన్ కళ్ళల్లో ఎంత చక్కగా పలికాయని! ఇంత అందమైన పాట ముగిసీ ముగియగానే కల నుంచి ఇలలోకి తెచ్చి పడేస్తాడు గురుదత్. సన్నజాజి మొగ్గ లాంటి అందమైన అమ్మాయి అసలు జీవితమేంటో అర్థం కాగానే మనసంతా చేదైపోతుంది. అందమైన “గులాబో” ఒక వేశ్య. ఆ పాత్రలో వహీదా రెహ్మాన్ చక్కగా ఒదిగిపోయింది. “గులాబో” అనే పేరు వెనక చిన్న కథ ఉంది. “ప్యాసా”లో రెడ్ లైట్ ఏరియా ఒక ముఖ్య భాగం. అందుకే రియల్ లైఫ్ రెడ్ లైట్ ఏరియాని స్టడీ చేయడానికి గురుదత్, రైటర్ అబ్రార్ అల్వీతో కలిసి కలకత్తా రెడ్ లైట్ ఏరియాలో మారు వేషాల్లో తిరిగాడట. అక్కడ “గులాబో” అనే అమ్మాయితో వీళ్ళు మాట్లాడారట. అందరిలా కాక తనని గౌరవంగా పిలిచిన వీళ్ళని చూసి ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయట. ఆ అమ్మాయికి గుర్తుగా వహీదా పాత్రకి అదే పేరు పెట్టారు. “గులాబో” అన్న కొన్ని మాటలను వహీదా రెహ్మాన్ డైలాగ్స్ గా సినిమాలో చేర్చారు కూడా. అంతే కాదు… కలకత్తా రెడ్ లైట్ ఏరియాలో తను చూసొచ్చిన ప్రతి దృశ్యాన్నీ కళ్ళకు కడతాడు… గురుదత్. పాలకులను ప్రశ్నిస్తూ అంతకుముందే సాహిర్ రాసిన Jinhe naaz hai Hind par woh kahan hain? అనే కవితను ఇందుకు వాడుకున్నాడు. “నా దేశం మహా గొప్పదని గర్వపడేవాళ్ళంతా ఇప్పడేమైపోయారు? ఓసారి వచ్చి వీళ్ళ దుస్థితి చూడండి” అని సాహిర్ కవిత్వం ద్వారా సమాజం, ప్రభుత్వాల ద్వంద్వనీతిని గురుదత్ ఎండగడతాడు.

ఇలా బాక్సాఫీస్ పరిధుల్లోనే తను చెప్పదలుచుకున్నది “ప్యాసా” ద్వారా ఆర్టిస్టిక్ గా చెప్పాడు… గురుదత్. ఇండియన్ సినిమాలో అటు ఆర్ట్ ని, ఇటు కమర్షియాలిటీని బహుశా ఇంత గొప్పగా ఇంతవరకు ఎవరూ బ్లెండ్ చేయలేదేమో!

“ప్యాసా” ఒక ప్రేమ కావ్యం, సమాజపు కుళ్ళు మీద సంధించిన వ్యంగ్యాస్త్రం, మానవ జీవితాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించిన అద్భుత చిత్ర రాజం. “ప్యాసా” గురించి ఇలా ఎన్ని విశేషణాలు చెప్పుకున్నా తక్కువే. కేవలం 39 ఏళ్ళు మాత్రమే బతికిన గురుదత్… తన జీవిత కాలంలో తీసిన అన్ని సినిమాల్లోకీ “ప్యాసా”, “కాగజ్ కే ఫూల్” కల్ట్ క్లాసిక్స్ గా పేరు తెచ్చుకున్నాయి. 2005లో టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన ఆల్ టైం-100 మూవీస్ లో “ప్యాసా” చోటు దక్కించుకుంది. 2010లో CNN లిస్ట్ చేసిన టాప్ 25 ఏషియన్ యాక్టర్స్ లో గురుదత్ కూడా ఒకరు.

(ఇవాళ గురుదత్ శత జయంతి)

Related Articles

2 COMMENTS

  1. గురుదత్ ఆత్మను ఆవిష్కరించిన రచన! ఆయన సినిమాల్లోని కవితాత్మకత, సౌందర్యం ఈ రచనలోనూ ప్రతిఫలించాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles