శీతాకాలంలో నిద్రపట్టక చలిని తట్టుకునేందుకు పప్పు సంచుల గోతాలను కప్పుకున్నాడు. ఇవాళ లాస్ ఏంజిల్స్ లో 780 రూపాయలకు ఒక ఛాయ్ అమ్ముతున్నాడు. అతడు ఛాయ్ వాలాగానే కాదు.. ఐఐటీయన్ గా కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో దుమ్మురేపుతున్న నవతరం ఇన్స్పిరేషన్ హీరో.
పేరు ప్రభాకర్ ప్రసాద్. ఊరు బీహార్. ప్రస్తుతం ఇతగాడి స్టోరీ ఇంటర్నెట్ లో ఓ ప్రభంజనంలా వైరల్ అవుతోంది. బీహారీ ఛాయ్ వాలా.. లేదా, ఛాయ్ గై అని యాష్ ట్యాగ్ తో టైప్ చేస్తే చాలు ఈ ప్రభాకర్ ప్రసాద్ స్టోరీ వచ్చేస్తుంది. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే వెబ్సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బతుకు చిత్రం ఎలా ఉండేదో చెప్పాడు ఈ ఇంటర్నెట్ హీరో. బీహార్ లోని ఓ చిన్న ప్రాంతం నుంచి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఛాయ్ వ్యాపారిగా ఎలా ఎదిగాడో ప్రభాకర్ ప్రసాద్ మాటల్లోనే విందాం.

బీహార్ లో గంగానది ఒడ్డున బర్హ్ అనే చిన్న పట్టణం మాది. చిన్నప్పట్నుంచి తీవ్ర పేదరికాన్ని అనుభవించాం. కప్పుకునేందుకు చెద్దర్లు కూడా ఉండేవి కావు. చలికాలం వస్తే దుప్పటి కొనే డబ్బులూ కరువే. అందుకే ఆ చలి నుంచి తట్టుకోవడానికి పప్పు సంచుల గోతాలనుపయోగించేవాళ్లం. వెచ్చదనం కోసం పప్పు సంచుల మధ్య పడుకునేవాళ్లం.
మానాన్న ఎన్నో వ్యాపారాలు చేశారు. కానీ, ఏదీ అచ్చిరాలేదు. కానీ, ఏనాడూ మానాన్న మా చదువులపైన దాని ప్రభావం పడనీయలేదు. ఓరోజు మా అన్నను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. దాంతో రాత్రికి రాత్రే మేం బీహార్ వదిలేసి భోపాల్ కు వెళ్లిపోయాం.
బీహార్ బోర్డ్ పాఠశాలలో చదువుకున్న నేను.. నేరుగా ఇంగ్లీష్ మీడియం సీబీఎస్ఈ స్కూల్ కు మారడంతో నా చదువు చాలా కష్టంగా మారిపోయింది. అతి సాధారణ ఇంగ్లీష్ పదాలు కూడా అర్థం కాని నన్ను, నా యాసను చూసి సహచరులు ఎగతాళి చేసేవారు, నవ్వేవారు. కానీ, అదే నాలో కసిని పెంచింది. దాంతో కష్టపడి చదివి ఐఐటీ స్క్రీనింగ్ పరీక్ష క్లియర్ చేశాను.
ఐఐటీ సాధించడంతో.. జీవితం ఎప్పటికైనా మారకపోతుందానన్న ఒక ఆశ, మారుతుందో, లేదోనన్న నిస్పృహ నుంచి ఒక కొత్త మలుపు నాలో మరిన్ని ఆశలు, ఆశయాలకు కారణమైంది. ఐఐటీ పూర్తైన వెంటనే 2008లో మొదటి ఉద్యోగం వచ్చింది. కానీ, కార్పోరేట్ జీవితమెందుకో నాకంతగా నచ్చలేదు.
సాఫ్ట్వేర్ రంగంలో అంతా కోడింగ్ నేర్చుకునే దశలో… నాకెందుకో బాడీ బిల్డింగ్ పై మోజు పెరిగింది. దాంతో కోడింగ్ కన్నా ఎక్కువ జిమ్ లో నే సమయం ఎక్కువ గడిపాను. అలా బాడీ బిల్డింగే నా ప్యాషన్ గా మారిపోయింది. ఆ తర్వాత జీవన ప్రయాణం మరో కొత్త టర్న్ తీసుకుంది. ముంబైకెళ్లి మాడలింగ్ లో అవకాశాల కోసం వెదకడం మొదలెట్టాను. పైపై మెరుగులతో మెరిపించే ఫ్యాషన్ రంగంలో రాణించాలనుకునేవారి నిజజీవితాలు మాత్రం అంత గ్లామరస్ గా ఏముండవనేది అర్థమైంది. అంధేరీలో చిన్న గదిలో నివశించడం, ఆడిషన్స్ కోసం పెద్ద పెద్ద క్యూలైన్లలో నిల్చోవడం, దొరికిన పని చేసుకోవడం.. ఇదే నా రోజూవారీ జీవితం.
అమెరికా ప్రయాణంతో మరో కొత్త మలుపు తీసుకున్న జీవితం!
అలా కొన్నేళ్లు గడుస్తున్న క్రమంలో నాకో గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఆమె అప్పటికే అమెరికాకు వెళ్లిపోయింది. మేం చాలా ఏళ్ల నుంచి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా రిలేషన్ మెయింటెయిన్ చేశాం. అమెరికాకు నన్ను రమ్మని ఆమె కోరింది. నేను కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ, నా వీసా రెండుసార్లు రిజెక్టైంది. చివరకు 2014లో టెక్సాస్ కు వెళ్లి అక్కడ ఎంబీఏ పూర్తి చేశాను.
ఆ తర్వాత అమెరికాలోనే చాలాచోట్ల పలు ఉద్యోగాలు మారుతూ వచ్చాను. వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఎప్పటిలానే వెంటాడేవి. కొన్ని కార్పోరేట్ ఉద్యోగాలు చేశాను. కొన్నిసార్లు ఉద్యోగాలు కోల్పోయాను. ఆ క్రమంలో ఓ అమ్మాయితో నడిపిన ప్రేమకథలో ఓ బ్రేకప్ స్టోరీ కూడా నన్ను డిస్టర్బ్ చేసింది. ఆ దశలో నా ఆరోగ్యం కూడా దెబ్బ తింది.
జీవన గమ్యం ఎక్కడికో తెలియని అయోమయం!
ఓ రాత్రి నాలోకి నేనే చూసుకుని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. జీవితంలో ఎప్పుడూ మారని టేస్ట్ ఏంటి అని..? అదే ప్రశ్నని నా స్నేహితుడికి కూడా వేశాను. అతను సరదాగా ఛాయ్ అనే సమాధానమిచ్చాడు.
అవును కదా.. ఎంత కష్టంలో ఉన్నా… ఏ నగరంలో ఉన్నా.. ఎలాంటి బాధలో ఉన్నా.. నా అలసటైనా, సంతోషమైనా ఛాయ్ తోనే సేదతీరేవాణి కదా అనిపించింది. అలాగే, ఆ ఛాయ్ నా ఇంట్లో బాల్య జ్ఞాపకాలను కూడా గుర్తు చేసింది.
20215లో అమెరికాలో టెక్ రంగంలో ఒక భారీ సంక్షోభమేర్పడింది. ఆ సమయంలో నా ఉద్యోగం కూడా కోల్పోయాను. ఆ సమయంలోనే ఇక ఛాయ్ వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి.. లాస్ ఏంజిల్స్ లో భారతీయ పద్ధతిలో ఛాయ్ విక్రయం మొదలుపెట్టాను.
బియ్యం సంచుల కింద… చలికి గోతాలు కప్పుకుని నిదురించిన నా జీవితం అనేక మలుపులు తీసుకుని నన్ను ఓ ఐఐటీయన్ ను చేసింది. కానీ, నేను ఐఐటీ చేసి ఓ పెద్ద కంపెనీకి సీఈవోను కాలేకపోయానుగానీ… చాయ్ గై గా మాత్రం లాస్ ఏంజిల్స్ లో నా ప్రాంతంలో పాప్యులరయ్యాను. అయితే, ఫైనాన్షియల్ గానైనా.. జాబ్ స్యాటిస్ఫక్షన్ పరంగానైనా నా జీవితం ఇప్పుడు స్థిరపడిందన్న భావన నన్ను ఆనందపెడుతోంది.



