సంగీతం ఆలపించే రోడ్డు: నారీమన్ పాయింట్ లో మ్యూజికల్ వైబ్స్!

మీరు కార్లోనో, మీ ఇంకేదైనా మీ వాహనంలోనో వెళ్తున్నారు. మీరు సంగీత ప్రియులనుకోండి.. ఆడియోనో, లేక, వీడియో ప్లేయరో ఆన్ చేస్తూ హాయిగా పాటలు వింటూ వెళ్లడం సాధారణమే. కానీ, మీరు ఆ రోడ్డుపైకెక్కితే.. మీరు ఆడియో, వీడియో ప్లేయర్స్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోడ్డే సంగీతం పాడుతుంది. అందుకు మనం ఓసారి ముంబై ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ మార్గంలోకి ఎంట్రీ కావాలి.

ముంబై తీర రహదారిపైన కారు సాఫీగా సాగుతోంది. ఓవైపు నీలిరంగు అలలతో మెరుస్తున్న సంద్రం.. దాని హోరు. ఒక యావరేజ్ స్పీడ్ లో డ్రైవింగ్ సాగుతోంది. కింద టైర్ల భాగం నుంచి సంగీతం వినిపిస్తుంది. అప్పుడు అరె మనం ఎలాంటి పాటలు పెట్టకుండానే సంగీతం వినిపిస్తుందేనని ఆశ్చర్యపోతాం. కాస్సేపు అలా కదులుతూనే ఆ శబ్దాలు రిథమిక్ గా వినిపిస్తూ మనల్ని ఊపేస్తాయి. జైహో అంటూ ఆస్కార్ అవార్డందుకున్న పాట మనల్ని అలరిస్తుంది. ఇదంతా ముంబైలోని ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ రోడ్డెక్కినవారికి అనుభవమయ్యే ఓ మధుర జ్ఞాపకం.

2026, ఫిబ్రవరి 11వ తేదీనే ఈ మ్యూజికల్ రోడ్డును ముంబైలో ప్రారంభించారు. కోస్టల్ రోడ్డులో నారీమన్ పాయింట్ నుంచి వర్లీ వైపు వెళ్తుంటే టన్నెల్ నుంచి బయటకు రాగానే సుమారు 500 మీటర్ల పొడవైన మార్గంలో ఈ భారతదేశపు తొలి మ్యూజికల్ రోడ్డు మనకు కనిపిస్తూ, వినిపిస్తుంది. వాహనం కనీసం గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల స్పీడుతో వెళ్లితే మెలోడీ పాట మీ వాహనంలో రికార్డర్ ఆన్ చేయకుండానే మీ సొంతమవుతుంది.

ఈ మ్యూజికల్ రోడ్డులో ఓవైపు సంద్రపు హోయలు.. ఇంకోవైపు సంగీత స్వరాలు వినేందుకు.. టన్నెల్ లోపలే 500 మీటర్ల దూరం నుంచే మనకు అడుగడుగునా ఓ బోర్డ్ కనిపిస్తుంది. ఆ సంగీతం వినాలంటే సరైన వేగం పాటించాలనే సూచనలతో ఆ బోర్డ్స్ కనిపిస్తాయి.

అసలెలా సాధ్యం…?

భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్డు ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా రంబుల్ స్ట్రిప్స్ ను ఏర్పాటు చేశారు. అంటే రహదారిపై హార్మోనియం మెట్లలాగా ఏర్పాటు చేసిన గాట్లే ఆ సంగీతం ఉత్పన్నం కావడానికి కారణం. వాహనాల టైర్స్ తగలగానే ఆ స్ట్రిప్స్ నుంచి సంగీతం ఉత్పన్నమవుతుంది. కంపనాల ద్వారా శబ్దం వినిపిస్తుంది. సంగీతానికి నిలయంగా చెప్పుకునే హంగేరియన్ సాంకేతిక పద్ధతిలో ఈ రోడ్డు నిర్మించారు.

ఇప్పటికే ఇలాంటి మ్యూజికల్ రోడ్స్ చాలా దేశాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకొచ్చాయి. హంగేరీ చాలాకాలంగా రహదారి భద్రతలో భాగంగా ఇలాంటి సృజనాత్మక ప్రణాళికలను రచిస్తోంది. మెలోడీ సంగీతాన్ని రోడ్లపై సృష్టిస్తూ కొత్త ప్రయోగాలు చేస్తోంది

అయితే, ముంబై ఛత్రపతి శంభాజీ మార్గ్ లో స్లగ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జైహో పాటనే వినిపించేలా డిజైన్ చేశారు. విండోస్ పూర్తిగా మూసి ఉన్నప్పటికీ.. సరైన యావరేజ్ స్పీడుగనుక ఉంటే పాట పెర్ఫెక్ట్ గా వినిపిస్తుంది.

అసలు రహదారి సంగీతం కాన్సెప్ట్ ఏంటి.. దాని వెనుక ఆలోచలెవరివి..?

ముంబైలోని ఛత్రపతి శంభాజీ మార్గ్ చూస్తే స్పీడ్ బ్రేకర్ల తరహాలో గాట్లు కనిపిస్తుండొచ్చుగానీ.. ప్రతీ గాటు వెనుక అకాస్టిక్ లెక్కలున్నాయి. టైర్స్ ఆ గాట్లపైకెక్కి గిర్రున తిరగ్గానే వేగంగా ఆ గాట్లు కంపిస్తాయి. ఇనుప కంచెపైన కర్రతో కొడితే వచ్చే శబ్దంలా ఆ సౌండ్ ఉంటుంది.

గాట్ల మధ్య దూరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ పనిచేస్తుంది. గాట్ల మధ్య దూరం తక్కువైతే.. ఎక్కువ ఫ్రీక్వెన్సీతో హెచ్చు స్వరంలో వినిపించే పాట.. గాట్ల మధ్య దూరమెక్కువైతే తక్కువ ఫ్రీక్వెన్సీలో గంభీరమైన మందర స్వరంలో వినిపించేలా ఈ రోడ్డును డిజైన్ చేశారు. వాహనం నిర్దేశించిన స్పీడులో గనుక వెళ్లితే ఇక్కడ వెలువడే కంపనలు మనకు పరిచయమున్న సంగీత స్వరాలుగా మారిపోతాయి. వాహనం బాడీ ఒక ప్రతిధ్వనించే ఛాంబర్ లా పనిచేసి ఆ సౌండ్ ను మరింత స్పష్టంగా మనకందిస్తుంది.

వాహనం వెళ్లే స్పీడును బట్టి కూడా పాట మారిపోతుంది. మెల్లిగా వెళ్లితే అరిగిపోయిన రికార్డులా లాగినట్టుగా వినిపించే పాట.. నిర్దేశించిన యావరేజ్ కంటే స్పీడ్ ఎక్కువైతే తారుమారై అర్థం కానంత ఫాస్ట్ గా వినిపిస్తుంది. అంటే అంతర్లీనంగా స్పీడ్ పెరిగినప్పుడు జరిగే ప్రమాదాలను హెచ్చరించే ఒక సూచికగా ఈ మ్యూజికల్ రోడ్డు తయారీ ఓ విప్లవాత్మక ప్రయోగం.

ప్రపంచంలో ఇంకా ఎక్కడెక్కడ ఈ మ్యూజికల్ రోడ్సున్నాయి..?

2026లో భారత్ లో తొలి రోడ్డు కావచ్చునేమోగానీ.. ఈ మ్యూజికల్ రోడ్డును డెన్మార్క్ లో 1995లోనే వేశారు. 2007లో జపాన్ ఇంజనీర్ షిజువో షినోడా కూడా ఇదే రంబుల్ స్ట్రిప్స్ తో సంగీతం సృష్టించే విధానాన్ని అభివృద్ధి చేయడంతో ఈ మ్యూజికల్ రోడ్స్ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జపాన్ లో గున్మా, హొక్కైడో వంటి ప్రాంతాల్లో డ్రైవర్స్ స్థిరమైన వేగంతో వెళ్లినప్పుడు స్థానికంగా ఫేమస్ అయిన జానపద గీతాలు అక్కడి రోడ్లపై వినిపిస్తాయి. హంగేరీలో రూట్ నంబర్ 67లో వెళ్తున్నప్పుడు మెర్న్యే సమీపంలో రిపబ్లిక్ బ్యాండ్ రూపొందించిన ఏ 67 అనే ప్రసిద్ధ గీతం వినిపిస్తుందట. ఇక దక్షిణకొరియాలోనూ పిల్లల పాటలు వినిపించేలా అక్కడి రోడ్లను డిజైన్ చేశారు. యూఏఈలో పుజైరాలో షేక్ ఖలీఫ్ స్ట్రీట్ లోనూ ఇలాంటి సంగీతమే వినిపిస్తుంది. 750 మీటర్ల పొడవునా బీథోవెన్ ఓడ్ టూ జాయ్ ని ఎంజాయ్ చేయొచ్చు.

నగర మౌలిక వసతుల్లో మ్యూజికల్ రోడ్డు ఓ కొత్త ప్రయోగం!

మ్యూజికల్ రోడ్లు కేవలం వినోదం కోసమే కాదు.. డ్రైవర్లను సరైన వేగంలో ప్రయాణం చేసేలా వారి ప్రవర్తనలో మార్పు తెచ్చే ప్రేరణ కోసం వీటిని రూపొందించారు. ముంబైలోని ఛత్రపతి శంభాజీ మహారాజ్ మార్గ్ లో ప్రారంభమైన మ్యూజికల్ రోడ్ అనే పైలెట్ ప్రాజెక్టుతో.. ఇప్పుడు శబ్ద ఆధారిత డిజైనింగ్ ను మరిన్ని రోడ్లపైకి తీసుకురావచ్చా.. ముఖ్యంగా యాక్సిడెంటల్ ప్రోన్స్ లో భద్రతాపరంగా ఏమైనా ఫలితాలుంటాయా అనే చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా ముంబై శంభాజీ మార్గ్ ఇప్పుడు ఇంజనీరింగ్ అద్భుతానికి, కళ కూడా తోడై ప్రయాణీకులకు ఒక సరికొత్త అనుభవాన్ని మిగులుస్తోంది. అందుకే, ఇప్పుడు శంభాజీ మార్గంలో ప్రయాణమంటే.. కేవలం గమ్యం చేరుకోవడమే కాదు.. ఓ చిన్న సంగీత ప్రయాణం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles