దూరదర్శన్ రెట్రో యుగానికి ప్రతీక.. ఆ యాంకరమ్మ!

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో కూడా రోబోటిక్ యాంకర్స్ ను సృష్టిస్తున్న నేటి రోజుల్లో… పాత తరం ప్రెజంటర్స్, యాంకర్స్ ను ఓసారి గుర్తు చేసుకోండి.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా..? అలా ఒక తరాన్ని ఊపేసిన టీవి జర్నలిస్ట్.. అంతకుమించి స్పష్టమైన భాషా నైపుణ్యంతో, గంభీరంగా వార్తలు చదివే తన శైలితో అందరినీ కట్టిపడేసిన ఆ గోల్డెన్ యాంకరే. సరళా మహేశ్వరి. బ్లాక్ అండ్ వైట్ టీవి భారతదేశంలో ఎంటరై రంగు తెరల టీవీ పెట్టెలు మార్కెట్ లోకి వచ్చేవరకు స్థిరంగా కొనసాగిన యాంకరమ్మ ఆమె. 71 ఏళ్ల వయస్సులో ఆమె కన్ను మూసిన సందర్భంగా దూరదర్శన్ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఆమెకు నివాళులర్పించింది.

సరళా మహేశ్వరి దూరదర్శన్ రెట్రో యుగానికి ఓ ప్రతీకగా నిల్చిన ప్రముఖ యాంకర్. తన స్వరంతోనేకాదు.. వ్యక్తిత్వంతోనూ చెరగని ముద్ర వేసుకుని ఆదరణ సంపాదించుకున్న యాంకర్.

స్పష్టమైన ఉచ్ఛారణ, గౌరవప్రదంగా కనిపించే ఆమె అప్పియరెన్స్ భారతీయ వార్తా ప్రపంచంలో సరళా మహేశ్వరికి ప్రత్యేక స్థానం కట్టబెట్టాయి. గంభీరమైన ఆమె స్వరం వినేవారు ఆ వార్తల వద్దే ఆగిపోవాలి. ఇవాళ ఏ పదాన్ని ఎలా పలకాలో తెలియనివాళ్లొక వైపు కనిపిస్తున్నారు. పదే పదే పలికిన పదాలనే పలుకుతూ.. అనవసరమైన పొడగింపులతో విసిగిస్తున్నారు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో స్పష్టత లేక.. పడికట్టు పదాలకలవాటు పడ్డ యాంకర్స్, రిపోర్టర్సే కనిపిస్తున్నారు. కానీ, ఏ పదాన్ని ఎలా పలకాలన్న నియంత్రణ, చర్వితచరణానికి ఆస్కారం లేని శైలి, అంతే సరళత వంటివి సరళా మహేశ్వరిని నాటి దూరదర్శన్ యాంకర్స్ లో ప్రత్యేకంగా నిలబెట్టాయి.

ఆమె సాదాసీదా శైలి, ప్రశాంతమైన ప్రవర్తన దేశవ్యాప్తంగా ఆమెకు ప్రేక్షకులను సంపాదించిపెట్టింది. ఆమె సరళమైన వార్తా శైలిపై అభిమానాన్ని, విశ్వాసాన్నీ పెంచింది.

దూరదర్శన్ లో తన మాజీ కో యాంకర్ సరళా మహేశ్వరి మరణవార్తపై దుఖాన్ని ప్రకటించారు మరో టీవీ జర్నలిస్ట్, యాంకర్ నారంగ్. ఆమె రూపమే కాదు.. హృదయం మరింత అందమైందంటూ పేర్కొన్నారాయన. భాషపై అద్భుతమైన పట్టుతో పాటు, అపారమైన జ్ఞానసంపద సరళా మహేశ్వరి సొంతమంటూ నారంగ్ గుర్తు చేసుకున్నారు. ఆమెతో కలిసి కో యాంకర్ గా తెరపై వార్తలు చదివిన ఆ భాగస్వామ్యం మర్చిపోలేనిదన్నారు. ప్రతీ ఒక్కరినీ గౌరవించడం.. తిరిగి ఆ గౌరవాన్ని పొందడం సరళా మహేశ్వరీ ప్రత్యేకత. దేవుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, మహేశ్వరి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని కోరుతూ నారంగ్ Xలో పోస్ట్ చేశారు.

1980-90వ దశకంలో దూరదర్శన్ వార్తా రంగాన్ని ఏకైక యాంకర్ గా ఆధిపత్యం చలాయించి ఇంటింటికీ పరిచయమైన పేరు సరళా మహేశ్వరి. 1976 నుంచి 2005 వరకు సుమారు మూడు దశాబ్దాల పాటు ఆమె హిందీ వార్తా బులెటిన్స్ చదువుతూ యాంకర్ గా పనిచేశారు. పదాలు పలికే విధానం, సమతుల స్వరం, స్పష్టమైన ఉచ్ఛారణతో ప్రశంసలు పొందారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చదువుతున్న సమయంలోనే ఆమె బ్రాడ్ కాస్టింగ్ రంగంలోకి ప్రవేశించారు. అనౌన్సర్ గా ఆడిషన్ లో ఎంపికైన తర్వాత క్రమంగా వార్తలు చదివే యాంకర్ గా స్థిరపడి.. నలుపు తెలుపు యుగం నుంచి రంగుల ప్రసారాల దశ వరకూ మారుతున్న టెలివిజన్ విప్లవానికి సాక్షిగా నిల్చారు.

తన ప్రశాంతమైన భావం, అంతకుమించి మెరుగైన ఉచ్ఛారణతో సరళా మహేశ్వరి బుల్లితెర యాంకర్ విశ్వసనీయతను పెంచిన ఒక తరం వార్తా వాచకురాలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles