చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ, ఓ మంచి పుస్తకం కొనుక్కోమంటారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఓ మంచి పుస్తకం.. ఓ మంచి స్నేహితుడితో సరి సమానమన్నది ఆయన ఉవాచ. అయితే, అలాంటి పుస్తకాన్ని కూడా కొనుక్కోలేని వారికోసం ఉద్దేశించినవే గ్రంథాలయాలు. ఇప్పుడంటే పీడీఎఫ్ లు.. ముఖపుస్తకాలు.. వెబ్ సైట్స్.. డిజిటల్ లైబ్రరీస్ వచ్చాయిగానీ… ఒకప్పుడు గ్రంథాలయాలే సరస్వతీ నిలయాలు. అలా భారతదేశ వ్యాప్తంగా కొన్ని గ్రంథాలయాలైతే.. ఐకానిక్ లైబ్రరీస్ గా ముద్ర వేసుకున్నాయి. చాలామంది నాలెడ్జ్ కోసం మండల కేంద్రాల్లో ఉండే లైబ్రరీల్లో స్కూల్ డేస్ నుంచే సాయంత్రాలు వెళ్లి అన్ని పత్రికలు తిరగేసి, బయట కొనలేని ప్రతీ వీక్లీ, ఫోర్ట్ నైట్, మంత్లీ మ్యాగజీన్స్ తో సహా.. నవలలు, ఇతర గ్రంథాలు చదివేందుకు లైబ్రరీలే ఆవాసాలు. అందులో మెంబర్ షిప్ ఉంటే.. ఇక లైబ్రరీలో ఓ గ్రీన్ కార్డ్ హోల్డర్ తరహాలో లోపలికెళ్లి ఏదైనా వెతుక్కోవచ్చు… ఎన్నిరోజులైనా ఇంటికి తీసుకెళ్లి చదవడం పూర్తయ్యాక తిరిగివ్వొచ్చు. అయితే, ఇప్పుడక్కడో ఇక్కడో ఆ లైబ్రరీలు కనిపిస్తున్నా.. ఆసక్తి ఉన్నవారు మాత్రం అంతంతమాత్రంగానే కనిపిస్తారు. ఈ క్రమంలో దేశంలో నాడు ఐకానిక్ లైబ్రరీలుగా వెలుగొందినవాటి గురించి ఓ లుక్కేద్దాం.
భారతదేశ గ్రంథాలయాల చారిత్రక వారసత్వం.. విజ్ఞాన, సాంస్కృతిక కేంద్రాల వికాసం!

అందరూ ఉండి.. పిన్ డ్రాప్ సైలెన్స్ కనిపిస్తూ వినిపించని ప్రాంతమేదంటే మనమంతా చెప్పే పేరు లైబ్రరీ. ఎందుకంటే ఎంతమంది వచ్చినా ఎవరికి కావల్సినవి వారు వెతుక్కుని చదువుకోవడమే తప్ప.. ఒకరితో ఒకరు బాతాఖానీ కొట్టే దృశ్యాలే కానరాని క్రమశిక్షణ కల్గిన ప్రదేశం లైబ్రరీ. అలాంటి గ్రంథాలయాలు పెంచుకున్నవారికి పెంచుకున్నంత జ్ఞానసంపదనందించి సాంస్కృతిక చైతన్య కేంద్రాలుగా ప్రభావితం చేశాయి.
అలాంటి గ్రంథాలయాల్లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది బీహార్ లోని నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం. క్రీస్తుశకం 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం సమయంలోనే అత్యంత ప్రాచీనమైన లైబ్రరీగా నలందా గ్రంథాలయానికి పేరుంది. చైనా, కొరియా, టిబెటెన్లతో సహా, ఆసియా ఖండంలోని ఎందరో పండితులను నలంద విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ ఆకర్షించేదట. ఈ లైబ్రరీని ధర్మగంజ అని పిల్చేవారు. బౌద్ధ తత్వశాస్త్రం నుంచి మొదలుకుంటే ఖగోళ, వైద్య, జ్యోతిష్య, గణితశాస్త్రాలకు సంబంధించిన మ్యానువల్ స్క్రిప్చర్స్, తాళపత్ర గ్రంథాలు కూడా ఇక్కడ లభించేవి. అయితే టర్కియన్ల దండయాత్ర సమయంలో సుమారు 12వ శతాబ్దంలో ఈ లైబ్రరీ పూర్తిగా ధ్వంసమైపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ నలంద విశ్వవిద్యాలయంలోని ధర్మగంజ గ్రంథాలయ స్ఫూర్తితో ఎన్నో ఆ తర్వాత వెలసిన లైబ్రరీస్ కొనసాగుతున్నాయి.

అలాంటి మరో లైబ్రరీనే… తమిళనాడులోని తంజావూర్ సరస్వతీ మహల్ లైబ్రరీ. భారతదేశ పురాతన గ్రాంథాలకు కేరాఫ్ గా ఈ గ్రంథాలయాన్ని చెప్పుకుంటారు. చోళుల కళావైభవానికి ప్రతీకగా కనిపించే తంజావూర్ బృహదీశ్వరాలయమనే గుడికి పక్కనే.. బడిలా పుస్తకాలతో తులతూగే లైబ్రరీనే ఈ సరస్వతీ మహల్ లైబ్రరీ. 16వ శతాబ్దంలోనే మహారాష్ట్ర పాలకుల చేత స్థాపించబడిన ఈ లైబ్రరీ.. సంగీతం, సాహిత్యం, కళలు, సైన్స్ ఇలా అనేక విషయాలపై వెలువడ్డ అంతర్జాతీయ స్థాయి పుస్తకాలకు ఓ చిరునామా. ఇక్కడ ఎక్కువగా తాళపత్ర గ్రంథాలు, యానిమల్ స్కిన్ తో తయారు చేసిన వెల్లమ్ గా పిల్చేవాటిపై రచించిన గ్రంథాలు లభిస్తాయి. ప్రధానంగా సంగీత, సాహిత్యాలకు సంబంధించిన రచనలకు ఈ లైబ్రరీ ఓ కేరాఫ్. ఇదే తరహాలో మైసూర్ ప్యాలెస్ లైబ్రరీ కూడా గుర్తింపు పొందింది. కన్నడ భాషతో పాటు, సంస్కృత, ఆంగ్ల పురాతన గ్రంథాలకు పెట్టింది పేరుగా మైసూర్ ప్యాలెస్ లైబ్రరీకి పేరు.
వీటితో పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఢిల్లీ నేషనల్ ఆర్కైవ్స కూడా మరింత ప్రత్యేకమైంది. ముఖ్యంగా చారిత్రక రికార్డులను సంరక్షించడంలో ఈ ఆర్కైవ్స్ లైబ్రరీ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. పురాతన కాలపు తాళపత్రగ్రంథాలతో పాటు.. ప్రభుత్వ పత్రాలు, ఇతర ఆర్కైవల్ మెటిరీయల్ ను సమగ్రంగా సేకరించి ఈ లైబ్రరీలో భద్రపర్చారు. ఇదే కోవలో 1784లో స్థాపించిన కోల్ కత్తా ఆసియాటిక్ సొసైటీ లైబ్రరీ కూడా పురాతన గ్రంథాలయాల వారసత్వానికి కేరాఫ్. నాడు భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన లైబ్రరీల్లో ఒకటిగా కోల్ కత్తా ఆసియాటిక్ లైబ్రరీకి పేరు. జాగ్రఫీ, హిస్టరీ, కల్చర్ వంటి అంశాలపై వివిధ గ్రంథాల సమాహారం ఈ గ్రంథాలయం.
ఇలాంటి లైబ్రరీలు మన దగ్గర కూడా చెప్పుకోవాల్సినవున్నాయి. వాటిలో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అప్జల్ గంజ్ లైబ్రరీ వంటివి ఉండగా.. ఇప్పుడంటే ట్రెండ్ మారి అంతా ల్యాప్టాప్ లు, డెస్క్ టాప్స్ పెట్టుకుని ప్రిపేరవుతున్నారే తప్ప… గతంలో ఈ లైబ్రరీల్లోనే రోజుల తరబడి అభ్యర్థులు కుర్చీలకు అతుక్కుపోయేవారు. గ్రూప్ వన్, సివిల్స్ రాసేవారైతే ఏకంగా 16 నుంచి 18 గంటలు ఈ లైబ్రరీల్లో గడిపినవారెందరో.
ఈ గ్రంథాలయాలన్నీ.. కేవలం గ్రంథాలను సంరక్షించే కేంద్రాలు మాత్రమే కాదు. సామాజిక, ఆర్థిక, భౌగోళిక, ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక వికాస కేంద్రాలుగా ఉపయోగపడ్డాయి. మేథోపరమైన ఆలోచనల మార్పిడి కేంద్రాలుగా, అభ్యాస కేంద్రాలుగా విలసిల్లాయి. నేటికీ కొన్ని చోట్ల లైబ్రరీలు అంతే అద్భుతంగా నడవడంతో పాటు.. నేటి సాంకేతికతను అందిపుచ్చుకుని డిజిటల్ లైబ్రరీలుగా కూడా రూపాంతరం చెందుతున్నాయి. మరోవైపు గత కాలపు చారిత్రక అంశాలన్నింటినీ సమీకరించి వాటిని డిజిటల్ గా కూడా ప్రిజర్వ్ చేసే యత్నాలూ జరుగుతున్నాయి.
అయితే గ్రంథాలయాల విషయంలో గతకాలపు స్మృతులతో పోలిస్తే మాత్రం డిజిటల్ యుగంలో ఆ అనుభవాలు, అనుభూతి మాత్రం కొరవడుతుండటం ఓ విషాదం.



