తన రథయాత్రతో భారత రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశాడు! బీజేపీ అస్తిత్వ చిహ్నమయ్యాడు!!

ఒక నవల బాగా చదివించగల్గాలన్నా… ఓ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుని, మాస్ నూ ఆకట్టుకుని హిట్ కొట్టాలన్నా.. అలాగే, ఓ పార్టీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వటవృక్షంలా ఎదగాలన్నా మంచి స్క్రిప్ట్ అవసరం. పైగా దేశంలో జాతీయపార్టీ అంటే ఒకే ఒక్క కాంగ్రెస్ అన్నట్టుగా సాగిపోతున్న రోజుల్లో… ఎవరో ఒకరి మద్దతు లేకుంటే ప్రభుత్వాలు నిలవలేని సంకీర్ణ రాజకీయ యుగంలో… కాంగ్రెస్ కు ఒక ప్రత్యామ్నాయ బలమైన పార్టీగా తీర్చిదిద్దడమంటే మాటలేం కాదు. ఇప్పుడు ఆ పార్టీకే ప్రత్యామ్నాయం లేదనేంత స్థాయి వచ్చిదంటే కూడా అది ఆయన చొరవే. అది చేశాడు కాబట్టే… 96 దాటిన ఆ సంపూర్ణాయుష్కుడి గురించి ఆయన జన్మదినాన మనమోసారి మాట్లాడుకుంటున్నాం.

లాల్ కృష్ణ అద్వానీ.. పుట్టింది.. ప్రస్తుత పాకిస్థాన్ దేశంలోని కరాచీలో 1935, నవంబర్ 8వ తేదీన జన్మించిన అద్వానీ కుటుంబం నాటి విభజనకాలంలో భారత్ కు వలస వచ్చింది. అద్వానీ తన కళాశాల చదువుల వరకూ ముంబైలోనే ఉన్నాడు. 1941లో జస్ట్ 14 ప్రాయంలో ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయిన అద్వానీ.. రాజస్థాన్ లో ప్రచారక్ గా తన జీవితాన్ని ప్రారంభించాడు. 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటైన భారతీయ జన్ సంఘ్ లో సభ్యుడైన అద్వానీ ఆ తర్వాత ఆ పార్టీలో పలు పదవులను చేపట్టడంతో పాటు.. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ కు చైర్మన్ గా ఎన్నికై.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ కార్యనిర్వాహకుడయ్యే వరకూ.. అంటే 1970 వరకూ కొనసాగారు. ఇక అక్కడినుంచి అద్వానీ జీవితం పూర్తిగా తానాశించిన పొల్టికల్ టర్న్ తీసుకుంది. 1970లో తొలిసారి రాజ్యసభ సభ్యుడైన లాల్ కృష్ణ… 1989 వరకూ నాల్గు పర్యాయాలు వరుసగా ఆ పదవిలో కొనసాగాడు. 1973లో శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ ప్రెసిడెంటైన అద్వానీ.. 1977లో జనతాపార్టీతో విలీనమయ్యే వరకూ కొనసాగడంతో పాటు.. 1977 ఎమర్జెన్సీ సమయంలో జనతాపార్టీ సాధించిన విజయంతో అద్వానీ సమాచార మంత్రిత్వ శాఖా మంత్రిగా కేంద్రంలో బాధ్యతలు చేపట్టడంతో పాటు.. రాజ్యసభలో పార్లమెంటరీ పక్ష నాయకుడిగా వ్యవహరించారు.

ఇక అప్పటివరకూ అద్వానీ పార్టీతోపాటు, తానెదగడానికే చేసిన వ్యక్తిగత కృషే ఎక్కువ కనిపించవచ్చు. కానీ, 1980 నుంచి అద్వానీ ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. అప్పటివరకూ భారత్ అంటే కాంగ్రెస్ అనే మాట బలంగా వినిపిస్తున్న రోజుల్లో.. ఎమర్జెన్సీ సమయంలో జనతాపార్టీ అధికారంలోకొచ్చినా.. మళ్లీ ఇందిర ముందు ఎక్కువకాలం స్థిరంగా నిలబడలేకపోయిన రోజుల్లో… అటల్ బీహారీ వాజ్ పాయ్ తో కలిసి స్థాపించిన భారతీయ జనతాపార్టీకి మూడు పర్యాయాలు జాతీయాధ్యక్షుడిగా పనిచేసి పార్టీని నిలబెట్టాడు. పార్టీ వ్యవస్థాపకుడిగానే కాకుండా… అసలు భారతదేశ రాజకీయాల్లోనే బీజేపీ దృఢంగా నిల్చోవడానికి అద్వానీ చేసింది ఇవాళ్టి బీజేపీ నేతల మాటలకు కూడా అందనంత ఆయనంతెత్తైన విషయమంటే అతిశయోక్తి కాదు.

1989లో మొట్టమొదటిసారి లోక్ సభకు ఎన్నికైన అద్వానీ… ఏడుసార్లు వరుసగా లోక్ సభలో ప్రాతినిథ్యం వహించాడు. ఇవాళ బీజేపీ ఇంతింతై అంతెత్తు నిలబడటానికి… మోడీ నాయకత్వంలో మూడోసారీ ఇంత పెద్ద దేశమైన భారత్ లో అధికారంలోకి రావడానికి… భారత్ అంటే కాంగ్రెస్సే అనుకునేంత స్థాయ బలమైన మదగజాన్ని లొంగదీసుకుని భారతీయ జనాతాపార్టీని అగ్రగామిగా నిలపడానికి అద్వానీ రాసిన స్క్రిప్ట్ మాములుది కాదు.

ఒక్క బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన… సెక్యులర్ రాజకీయాల్లో అద్వానీకి మాయని మచ్చైనా… అదే ఆయన్ను హిందుత్వ శ్రేణుల బ్రాండ్ అంబాసిడర్ గా నిలింపింది. 90ల్లో ఆయన చేపట్టి పదివేల కిలోమీటర్ల మేర సాగిన రామ రథయాత్ర అసలు బీజేపీ ఇవాళ ఈ స్థాయిలో నిలబడటానికి ఓ ప్రధానమైన పిల్లర్ అని చెప్పుకోకపోతే మూలాలు మర్చినట్టే. ఆయనపై అందుకు కేసు కూడా నమోదై.. అరెస్ట్ కూడా అయ్యారు. కానీ, కోర్ట్ అద్వానీని ఆ అంశంలో నిర్దోషిగా తేల్చేసింది. ఇవాళ అదే రామ జన్మభూమిలో ఒక కలగా మిగిలిపోయిన అయోధ్య ఆలయ నిర్మాణం కూడా సాకారమైందంటే… మూలం అద్వానీనే.

ఇవాళ భారతీయ జనతాపార్టీ ఇంత దృఢంగా నిల్చోవడంలో అద్వానీ నామస్మరణను ఆ పార్టీ ఎప్పటికీ మరవకపోవడం కనీస కృతజ్ఞత. అయితే, ఆయన్ను భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించారు సరే.. కానీ, ఆయన మోడీ నాయకత్వంలోని బీజేపీలో మాత్రం చాలా అవమానాలే ఎదుర్కొన్నారు. ఆయనకివ్వాల్సిన సముచిత గౌరవం కూడా చాలాసార్లు దక్కకపోవడం విషాదం. అసలు నరేంద్ర మోడీకి ఇవాళ బీజేపీ ప్రధానిగా మూడుసార్లు అవకాశం వచ్చిందంటే… బీజేపీ కేంద్ర క్యాబినెట్ లో ఇప్పుడున్నవారితో పాటు.. గత రెండు పర్యాయాల్లో ఉన్నవారంతా మంత్రులయ్యారంటే… అవన్నీ అద్వానీ అనే బీజేపీ పోస్టర్ బాయ్ పెట్టిన భిక్షే. కానీ, అదే పోస్టర్ బాయ్ ని ఇవాల్టి బీజేపీగానీ, దాన్ని వెనుకుండి నడిపించే శక్తులుగానీ.. పట్టించుకోవాల్సినంత పట్టించుకోలేదు. గౌరవించలేదు. ఏ రామ జన్మభూమి కోసం ఆయన రథయాత్ర చేపట్టి.. దాన్ని ఇవాళ సాకారం చేశాడో ఆ అయోధ్య ఆలయ నిర్మాణమనంతంరం ఆయన్ను ఆహ్వానించకపోవడం కన్నా అవమానం ఇంకేమీ ఉండదు. ఆహ్వానం అందిందని కొంత.. వయస్సు మీరింది కాబట్టి.. కరోనా సమయం కాబట్టి ఇబ్బందవుతుందని వద్దనుకున్నారని కొన్ని వార్తలు ప్రజల్లోకి ప్రచారంలోకి తీసుకెళ్లొచ్చునేమోగానీ.. అద్వానీ బీజేపీకి చేసిందాన్ని.. అద్వానీకి ఇవాళ్టి బీజేపీ చేసిందాన్ని జనమైతే మర్చిపోరు.

కేంద్రంలో బీజేపీ గద్దెనెక్కాక కావచ్చు.. అంతకుముందు పార్టీ స్థాపనలో కావచ్చు వాజ్ పాయ్ పాత్ర ప్రధానంగానే కనిపించినా… బీజేపీని జాతీయస్థాయిలో తన రథయాత్ర ద్వారా నిలబెట్టి ఇవాళ జాతీయ ప్రత్యామ్నాయపార్టీగా మార్చి… ఇప్పుడు మళ్లీ బీజేపీకి ప్రత్యామ్నాయమెవరనేంత ఎత్తుకు తీసుకెళ్లే స్థితికి రావడంలో మూలకారకుడు.. నవశకాన్ని రచించినవాడు మాత్రం ముమ్మాటికీ లాల్ కృష్ణ అద్వానే.

ఇప్పటి బీజేపీలో అద్వానీ ఎదుర్కొన్న అవమానాలు!

మోడీ, షా నాయకత్వంలోని బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కాక… 2014లో గైడెన్స్ కౌన్సిల్ అని ఎలాంటి రాజకీయ అధికారాల్లేని ఒక కమిటీ ఏర్పాటు చేసి.. అందులో అద్వానీలాంటివారికి అవకాశం కల్పించినట్టు ఓ సీన్ క్రియేట్ చేశారు. అప్పుడే నిర్ణయాధికారాల్లేని ఆ కౌన్సిల్ ఉంటే ఎంత ఊడితే ఎంత అనే విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తంగా పార్టీని నిలబెట్టిన వ్యక్తినే అవమానకరంగా తిలోదకాలిచ్చిన నేటి బీజేపిని ఓ ప్రత్యామ్నాయంగానే జనం చూస్తున్నారే తప్ప… ఈ వ్యవహారాలను అర్థం చేసుకున్నవారు మాత్రం ముమ్మాటికీ హృదయపూర్వకంగా అభిమానించేందుకు సంశయిస్తూనే ఉంటారు.

1984లో కేవలం 2 పార్లమెంట్ స్థానాల నుంచి కేవలం 15 ఏళ్ల కాలంలో… అంటే దశాబ్దంన్నరలో బీజేపీ ఇవాళ మహావృక్షమై నిల్చుందంటే అందుకు అద్వానీయే కారణమనే విషయం ఎంతో కొంత రాజకీయ చరిత్ర చదువుకున్న చిన్నపిల్లాడికి సైతం తెలుసు. కానీ, మోడీ,షా ద్వయం తమ ముద్రను వేసుకునేందుకు.. అద్వానీని దూరం పెట్టారనే వాదనా ఇప్పటికీ బలంగా వినిపిస్తూనే ఉంటుంది. అందుకే 2013లో పార్టీ పదవులన్నింటికీ అద్వానీ రాజీనామా చేసేశారు. అప్పటికే మోడీని 2014 ఎన్నికలకు ముందు ప్రచారానికి నాయకత్వం వహించేందుకు సిద్ధం చేస్తున్నారని తెలిసి మనస్థాపం చెందినట్టూ వార్తల్లోకెక్కారు అద్వానీ. ఆ సమయంలో అద్వానీ రాజీనామా పార్టీని ఒకింత షాక్ కు గురిచేసింది. చాలా మంది కీలకనేతలు ఆయన ఇంటికి వెళ్లారు. నచ్చజెప్పారు. బుజ్జగించారు. దాంతో మరీ మారాం చేయడం బాగుండదనుకున్నాడో ఏమోగానీ.. అద్వానీ మెత్తబడ్డారు. ఆ తర్వాత మోడీ ప్రమాణ స్వీకారానికి కూడా అయిష్టంగానే హాజరయ్యారు. ఇక 2019లో మోడీ, షా ప్రభ మరింత పెరగడంతో అద్వానీ కూడా అదే స్థాయిలో సైలెంటైపోయారు.

2004 ఓటమి తర్వాత అద్వానీపై విమర్శలు!

2004 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత.. తిరిగి పార్టీకి నాయకత్వం వహించాడు అద్వానీ. నాడే తన సొంత వెబ్ సైట్, బ్లాగ్స్ తో యువతకు సోషల్ మీడియా రూపంలో దగ్గరయ్యే వ్యూహాలను అమలు చేశాడు. కానీ, 2009 ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం అంతగా ఫలించలేదు. దాంతో యూపీఏ అధికారం చేజిక్కించుకుని మన్మోహన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు.

2007 డిసెంబర్ పదో తేదీన అద్వానీ పేరు ప్రధాని అభ్యర్థిగా కూడా చర్చకొచ్చింది. లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందన్న పరిస్థితుల్లో వాజ్ పాయ్ వారసుడిగా ఆయన్ను ప్రకటించారు కూడా. పార్లమెంటరీ బోర్డ్ కూడా ఆమోదం తెలిపింది. అయితే, 2005లో ఆరు రోజుల పర్యటన కోసం పాకిస్థాన్ వెళ్లి జిన్నాను లౌకికవాదిగా పేర్కొనడంతో ఆయనపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన తన అధ్యక్ష పదవి కూడా కోల్పోవాల్సి వచ్చింది. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకాయనే తాను ప్రధాని అభ్యర్థినని చెప్పుకోవడంతో ఆయన సహచరులైన మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వంటివారే విమర్శలు గుప్పించారు. కానీ, ఆ తర్వాత మళ్లీ మురళీ మనోహర్ జోషే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం కొసమెరుపు.

మై కంట్రీ మై లైఫ్ అంటూ 2008లో తన ఆత్మకథను కూడా వెలువరించాడు అద్వానీ.

క్రమశిక్షణ కల్గిన కార్యకర్తగా అద్వానీ!

హిందుత్వ ముద్ర ఎంతలా వేసుకున్నారో.. నిజాయితీ విషయంలో అంత పేరుంది అద్వానీకి. పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ 90వ ప్రాయం వరకూ సుదీర్ఘకాలం ఫిట్ నెస్ కాపాడుకున్న నేత అద్వానీ.

దశాబ్దాల సుదీర్ఘమైన ఆయన రాజకీయ ప్రస్థానంలో ఆయన కోరుకున్న ప్రధాని పదవి ఆయనకు దక్కి ఉండకపోవచ్చు.. చాలా ఊహాగానాలు వెలువడినట్టుగా ఆయన రాష్ట్రపతి పదవినీ చేపట్టి ఉండకపోవచ్చు.. కానీ, భారతదేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన నేతగా మాత్రం.. అద్వానీ పేరు ఎప్పుడూ ది లీడర్ గా అలాగే నిలబడటం మాత్రం ఖాయం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles