కొన్ని ప్రయాణాలకు ముందు పెద్ద పెద్ద ప్రకటనలు, ప్రణాళికలేమీ ఉండవు. ఓ వ్యక్తి నిశ్శబ్ద ఆలోచనల్లోంచి ఓ ప్రస్థానానికి నాంది పడొచ్చు. అలాంటి వ్యక్తే జ్యోతిష్కో బిశ్వాస్. బెంగాల్ నుంచి ఎవరెస్ట్ శిఖరం వరకూ 1346 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన ఆ బైస్కిల్ బాయ్ కథ చెప్పుకుందామిప్పుడు.
పశ్చిమబెంగాల్ లోని సముద్రమట్టం నుంచి.. నేపాల్ లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ సైక్లింగ్… ఓసారి ఊహించుకోండి.. ఎంత ఓర్పు, ఎంత పట్టుదల, ఎంత ఆత్మవిశ్వాసముంటే ఆ ప్రయాణం ప్రారంభించొచ్చో!

ఈ సమాజంలో దాదాపు ప్రతీ మనిషీ గుర్తింపు కోరుకుంటాడు. కానీ ఎవరికో నిరూపించుకోవాల్సిన అవసరంలేని, వాటిని మించి ఆలోచించేవారు కూడా కొందరుంటారు. అలాంటి కేటగిరీనే 29 ఏళ్ల జ్యోతిష్కో బిశ్వాస్. తన మానసిక సంసిద్ధత, శారీరక దృఢత్వమేంటో తనకు తానే ఓ సవాలుగా స్వీకరించి తన సైకిల్ యాత్రను ప్రారంభించాడు బిశ్వాస్.
మనిషి కంఫర్ట్ జోన్ లో సౌకర్యంగా ఉంటే ఎలా ఉంటుంది…? దాన్నుంచి బయటపడినప్పుడు ఎలాంటి సవాళ్లను ఛేదించాల్సి ఉంటుంది..? ఇదిగో ఈ రెండు ప్రశ్నలు తనకు తాను వేసుకుని… తన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడి చేసిన ఓ సాహసయాత్ర జ్యోతిష్కోది.
ఈకాలం యువత స్మార్ట్ ఫోన్సే ప్రపంచంగా జీవిస్తున్న దౌర్భాగ్యంలో… జ్యోతిష్కో వంటి వ్యక్తులు కూడా అక్కడక్కడా తారసపడుతారు. వారు ఎందరినో ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. అలా బిశ్వాస్ ఏకంగా ఆరేళ్ల నుంచీ పర్వతారోహణ, సైక్లింగ్ చేస్తున్నాడు. తాను వృత్తిగతంగా కూడా డార్జిలింగ్ లో హిమాలయ పర్వాతారోహణ సంస్థలో ఓ బోధకుడు. ట్రెక్కింగ్ కమ్యూనిటీ పేరిట ఓ సంస్థను కూడా నడుపుతున్న జ్యోతిష్కో… పర్యాటకులను పర్వతాలకు తీసుకెళ్తుంటాడు.
తాను ప్రయాణించే దారంతా పూలబాటేం కాదు. ఆవిషయం తనకు ప్రయాణం మొదలు పెట్టేకంటే ముందూ తెలుసు. అనుభవంలోకొచ్చాక అనుకున్నదే జరిగిందనే విషయమూ బాధపెట్టినా వెనక్కి తిరగలేని పరిస్థితులింకోవైపు. కానీ, ఆ సవాళ్లకెదురీదాలనే తలంపుతోనే కదా తాను సైకిలెక్కి తొక్కడం ప్రారంభించింది..? ఓవైపు లోయలు, లోయలను తలపించేలా కనిపించే పెద్దపెద్ద గుంతలు, అనూహ్యంగా మారిపోయే వాతావరణ పరిస్థితులు.. ఇలా శారీరకంగా, మానసికంగా జ్యోతిష్కో తన సైకిల్ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లేన్నో!
అసాధారణమైన పనిని ఓ సాధారణమైన వ్యక్తి ఎలా చేయగలడో నిరూపించాలన్న తపనే జ్యోతిష్కోను సైకిలెక్కించింది. స్వేచ్ఛకు ప్రతీకలా సైకిల్ పై సరిహద్దులు దాటుతూ చేసే విహంగ వీక్షణం శారీరక శ్రమతో పాటు.. మానసికంగా సవాళ్లతో పాటు.. అంతకుమించిన ఆహ్లాదాన్నీ ఇస్తాయంటాడు బిశ్వాస్.
అండగా నిల్చిన సమాజం!
ఒక సాహసోపేతమైన పని మొదలుపెట్టినప్పుడు సమాజం కూడా అండగా నిలుస్తుంది! ఎక్కడో పశ్చిమబెంగాల్ లో బయల్దేరేటప్పుడు… సైకిల్ తొక్కుతూ ప్రయాణిస్తున్నప్పుడు జ్యోతిష్కో ఓ ఒంటరివాడేనేమోగానీ… దారివెంట మాత్రం ఆయన కథ విన్నవారెందరో ఆశ్చర్యపోవడంతో పాటు.. తనను ప్రోత్సహించారు. అదే సమయంలో తనకు ఇటు భారత్ తో పాటు, అటు నేపాల్ లోని ట్రెక్కింగ్ బృందాలతో బలమైన కొత్త సంబంధాలేర్పడ్డాయి.
జ్యోతిష్కో స్వస్థలం అరుణాచల్ ప్రదేశ్. పని కోసం పశ్చిమబెంగాల్ లో నివశిస్తున్నాడు. తన సైకిల్ ట్రెక్కింగ్ జర్నీలో బయల్దేరేటప్పుడు తానొక్కడే అయినా.. తన ప్రయాణం సులువుగా సాగడం వెనుక దారివెంట ఉన్న వివిధ సమాజాల ప్రోత్సాహం కూడా ఉందంటాడు జ్యోతిష్కో.
తన 26 ఏళ్ల పర్వతారోహణ కెరీర్ లో ట్రెక్కింగ్ కు వచ్చే ఎందరినో చూసిన మలయ్ ముఖర్జీ ఏమంటాడంటే.. ఎందరికో జీవితంలో ఒక్కసారైనా మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకోవడం ఓ కల. కానీ, జ్యోతిష్కో మాత్రం ఆ కలను నిజం చేసుకోవడమే కాదు.. సైకిల్ తొక్కుడూ ఆ బేస్ క్యాంపుకు చేరుకోవడం తన జీవితంలో చూసిన ఓ గొప్ప విశేషమంటాడతను. తాను 21 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు గంగాసాగర్ నుంచి గోముఖ్ వరకు 2 వేల 500 కిలోమీటర్లు నడిచాను కాబట్టి… దానికి ఏమవసరమో నాకు తెలుసనంటాడు మలయ్.

సహనంతో కూడిన ప్రయాణం!
జ్యోతిష్కో తన ప్రయాణాన్ని 2024, ఫిబ్రవరి 9న దిఘా నుంచి ప్రారంభించాడు. పశ్చిమబెంగాల్ నుంచి కాకర్బిట్టా మీదుగా నేపాల్ లోకి వెళ్లే క్రమంలో… 1346 కిలోమీటర్ల ప్రయాణంలో చివరకు ఇటాహరి, ఓఖల్ధుంగా, సల్లేరి, నామ్చే బజార్, గోరక్షేప్ మీదుగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు చేరుకున్నాడు.
మార్గమధ్యంలో జ్యోతిష్కోకు పలువురి ప్రోత్సాహం!
కోల్‌కతాకు చెందిన హోం గ్రోన్ యజమాని, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలైన పౌలోమికి.. కోల్ కత్తాలోని ఓ కేఫ్ లో జ్యోతిష్కో తారసపడ్డాడు. అంతకుముందే దిఘా నుంచి బయల్దేరి రాణాఘాట్ కు చేరుకునేముందు జ్యోతిష్కోను గమనించిన ఆమె.. కోల్ కత్తా కేఫ్ లో అతడితో మాట్లాడింది. బిశ్వాస్ శక్తి, అతడి వెంట పెట్టుకున్న కిట్, సైకిల్ మీద ఆయన యాత్ర చేస్తున్న తీరువంటివి చూసి నివ్వెరపోయినట్టు చెప్పారామె. బెంగాల్ లోని ఓ చిన్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఓ పెద్ద టాస్క్ పెట్టుకుని అంతే నిర్భయంగా దాన్ని ఛేదించే క్రమం తనకు స్ఫూర్తినిచ్చిందనట్టు వెల్లడించింది పౌలోమీ. ఎవరెస్ట్ ఎత్తును మించిన అలాంటి కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవడమంటే అది నిజంగా ఓ అతిశయోక్తేనా అన్నట్టుగా ఇప్పటికీ నమ్మబుద్ది కావడం లేదంటోందామె.
బిశ్వాస్ ప్రయాణంలో తొలుత పశ్చిమబెంగాల్ లో చాలా ఇబ్బందులెదుర్కొన్నాడు. వేడిగాలులు తనను ఇబ్బంది పెట్టాయి. మరోవైపు, వాతావరణంలో తేమ, అడుగు ముందుకు వేయలేని కఠినమైన రహదారులు వంటివెన్నో సవాళ్లుగా మారాయి.
తన సోలోయాత్ర కోసం జ్యోతిష్కో రెండేళ్లపాటు మానసికంగా, శారీరకంగా కూడా తనను తాను సంసిద్ధం చేసుకున్నాడు. తన సైకిల్ యాత్ర కోసం ఎవరైనా స్పాన్సర్స్ దొరక్కపోతారానని కొందరి వద్దకు సాయం కోసం సంఘాలను, సంస్థలను సంప్రదించాడు. కానీ, ఎవ్వరూ కూడా ముందుకురాలేదు. తానే తన యాత్ర చేసి తీరాలన్న కసితో పైసా పైసా కూడబెట్టుకున్నాడు. తన తండ్రి కూడా అందించిన మరికొంత సాయంతో తన సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు జ్యోతిష్కో.
భూభాగం మారుతున్న కొద్దీ జ్యోతిష్కోకు అదే స్థాయిలో సవాళ్లు పెరిగాయి. అస్తవ్యస్థమైన రోడ్లు, నిటారుగా నిల్చున్నట్టున్న వాలులు, రాళ్ల దారులు, బురద, కొండచరియలు విరిగిపడే మార్గాలు.. ఇలా ఒక్కొక్కటీ ఎంత కాదన్నా ఆందోళనకు గురిచేసే సమస్యలే. ఇక భారత్ – నేపాల్ సరిహద్దు తర్వాత పరిస్థితులు మరింత కఠినంగా మారాయి. నేపాల్ లో కొన్నిచోట్ల రోడ్లు కఠినంగా ఉన్నచోట.. జ్యోతిష్కో తన సైకిల్‌ను వీపుపై మోసుకెళ్లాల్సిన పరిస్థితులెదుర్కొన్నాడు. ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం.. అసలు బతికి బట్ట కడతామా అన్న భయం.
కనీస సౌకర్యం మాట దేవుడెరుగు.. అన్నీ కష్టాలే!
ఒకే ఒక్క సైకిల్.. అది రిపేరైతే తానే బాగు చేసుకోవాలి. మెకానిక్స్ ఎవ్వరూ ఉండని ప్రాంతం. తన వెంట తెచ్చుకున్న రేషన్ తో తానే తినడానికేదైనా చేసుకోవాలి. వండడానికెవ్వరూ ఉండరు, మనిషే కనిపించని ఆ చోట హోటల్స్ ను ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశే. ఏదైనా అయితే వైద్యసాయమందే దిక్కు కూడా కరువైన ప్రాంతం. అవన్నీ ఏ పుస్తకాల్లో నేర్పించని విషయాలు జ్యోతిష్కోకు అనుభవంలోకొచ్చాయి.
కానీ, తాననుకున్న లక్ష్యం ఛేదించడంతో పాటు, ఆ ప్రాంతాల్లో ఉండే కఠినమైన వాతావరణాన్ని తెలుసుకోవాలన్న తపన, ఆయా ప్రాంతాల్లో జనజీవనం ఎలా ఉందో చూడాలన్న కోరిక ఇవన్నీ కలగలిసి జ్యోతిష్క్ ప్రయాణం ఒక పట్టుదలతో సాగింది. అదే సమయంలో హిమానీ నదాలు ఎలా కరిగిపోతున్నాయి. వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో కూడా తన ప్రయాణంలో గమనించగల్గానంటాడు బిశ్వాస్. ఓ ఊళ్లో ఆగి అక్కడి స్కూల్ లో పిల్లల చదువులు, పుస్తకాలు, అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయి.. తనవంతు తోచిన సాయమందించిన విషయాల్నీ తన సోషల్ మీడియా పేజీల్లో షేర్ చేసుకున్నాడు జ్యోతిష్కో.
ప్రయాణానికి పట్టిన రోజులు!
2024 ఫిబ్రవరి 9 న పశ్చిమబెంగాల్ లోని దిఘా నుంచి ప్రారంభమైన జ్యోతిష్క్… 2024, మార్చి 10వ తేదీన 29 రోజుల సుదీర్ఘ సైకిల్ ప్రయాణం తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకున్నాడు.
చివరిదశలో మరింత కఠినంగా సాగింది జ్యోతిష్కో ప్రయాణం. కానీ, మనసుకు నచ్చితే కష్టమైనా ఇష్టంగా చేస్తాం. జీవితం కూడా ఓ ప్రయాణమే. సవాళ్లు సర్వసాధారణం. వాటిని ఛేదిస్తూ ముందుకెళ్లడమే జీవితం. అలాగే, తానెంచుకున్న ప్రయాణం కూడానన్నది జ్యోతిష్కో ఫిలాసఫీ. అందుకు తన తండ్రిచ్చిన మద్దతే తనకు మరింత బలమిచ్చిందంటాడతను.
కంఫర్ట్ జోన్ నుంచి బయటపడితే లైఫ్ లో ఎలాంటి థ్రిల్ ఉంటుందో తెలుసుకోవడానికి కూడా తన ప్రయాణం ఓ ఉదాహరణ అంటాడు బిశ్వాస్. మండే ఎండలకు కేరాఫ్ లా కనిపించే పశ్చిమబెంగాల్ సంద్ర తీరం నుంచి మంచు చరియలు విరిగిపడే అత్యల్ప ఉష్ణోగ్రతల్లోకి సాగిన జ్యోతిష్కో ప్రయాణాన్ని ఓ సైకిల్ జర్నీగానో, ఓ సాహసోపేత ప్రయాణంగానో మాత్రమే చెప్పుకోలేం. ఎటువంటి కఠినమైన పరీక్షలెదురైనా ఎలా సవాళ్లనెదుర్కొని ముందుకు సాగాలో చెప్పే ఓ సందేశంగా కూడా చూడొచ్చు!
అంతేకాదు, జీవితాన్ని సారవంతంగా, అర్థవంతంగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవనీ.. వాటన్నింటినీ ఒక్కో మెట్టు ఎక్కుతూ సాధించాలనే ఒక మోటివేషన్ కూడా జ్యోతిష్కో బిశ్వాస్ ప్రయాణంలో కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి జ్యోతిష్కో జర్నీ.. జస్ట్ లైక్, ఇన్ టూ ద వైల్డ్ సినిమా చూసినట్టుగా అనిపించడం లేదూ!



