పట్టణ వీధులకే కాదు.. పట్టించుకుని సమస్యలు పరిష్కరించే సమయం లేని అధికారులకూ దూరం ఆ గిరిజన గ్రామం. చదువు అందని ద్రాక్ష. అదిగో అక్కడే ఓ గిరిజన గృహిణిలో కల్గిన ఆలోచన… ఓ స్కూల్ ఏర్పాటుకు బీజం వేసింది. అలా ఓ మట్టిగుడిసెలో ప్రారంభమైన ఆ విద్యాలయం.. ప్రైవేట్ సంగతి అసలు పక్కనేబెడితే.. ప్రభుత్వ పాఠశాలలు కూడా దిక్కులేక చదువుకు దూరమవుతున్న పిల్లల పాలిట చదువుల కేంద్రమైంది. రేపటి మార్చ్ 8 మహిళా దినోత్సవం సందర్భంగా ఇలాంటి కదిలించే కథలు కదా కావల్సింది!

ఇది పశ్చిమ బెంగాల్ అయోధ్య కొండల్లోని పురూలియా అటవీ గిరిజన గ్రామం కథ. ఏ ప్రభుత్వ పథకాలందని చోట.. కనీసం అక్కడి ప్రభుత్వం అక్కడో పాఠశాలను ఏర్పాటు చేయలేని ప్రాంతంలో.. 30 ఏళ్ల మాలతీ ముర్ము ఆలోచనకు బీజం ఓ మడ్ స్కూల్.
ఆ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్సేమీ లేవు. సిబ్బందీ లేరు. ఆ పాఠశాలకు నిధులందించే ప్రభుత్వం పట్టించుకోదు. అసలా పాఠశాల అక్కడ ఉందనే విషయమే ఈ నాగరిక ప్రపంచానికి తెలియదు. తెలిసినా పట్టించుకునేవారూ కనిపించరు. కానీ, ఆ స్కూల్ మాత్రం క్రమశిక్షణకు మారుపేలా నడుస్తోంది. ప్రతీ ఉదయం 45 మంది పిల్లలు క్రమం తప్పకుండా అక్కడికొచ్చి ఆసక్తిగా చదువుకోవడం ఆకట్టుకుంటుంది. దక్షిణాసియాలో సంతాలీ గిరిజన జనం మాట్లాడే సంతాలీ భాషలోనే వారి విద్యాభ్యాసం సాగుతుంది. ఓల్ చికి వారి లిపి. ఆ లిపిలోనే తమ విద్యాభ్యాసం కొనసాగిస్తూ.. సమాజంలో కావల్సిన చైతన్యాన్ని వారక్కడ నేర్చుకుంటున్నారిప్పుడు.
వివాహం చేసుకుని అత్తగారింటికొచ్చిన మాలతీ ముర్ముకు అక్కడ బడికి దూరమైన బాల్యానికి ఏదైనా చేయాలన్న తపన నుంచి పుట్టిందే ఆ పురూలియా పూరిగుడిసె పాఠశాల. ముందుగా తన ఇంట్లోనే కొందరు పిల్లలకు తనకు తెలిసిన విద్య చెబుతూ ఓ పాఠశాలను ప్రారంభించిన మాలతీ ముర్ము.. ఆ తర్వాత ఓ పూరిగుడిసెను నిర్మించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని చోట వారికి విద్యనందిస్తూ పురూలియా గిరిజనానికి ప్రాథమిక విద్య కోసం ఓప్రభుత్వ పాఠశాల లేదనే లోటును తీర్చింది.
పశ్చిమ బెంగాల్‌లోని అనేక గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు లేక చాలా ఊళ్లల్లో బాల్యం బడికి దూరమవుతూనే ఉంది. ఎంతసేపూ రాజకీయాలే తప్ప.. ఎక్కడో కొండాకోనల్లో ప్రకృతి మధ్య నివశిస్తున్న వారి చదువుల గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు లేకపోవడం.. ఈ నవనాగరిక సమాజంలోనూ ఆ చైతన్యం పాలకుల్లోనో కొరవడటంతో ఇదిగో ఇలాంటి మాలతీ ముర్ములే ఆయా ఊళ్లల్లో చదువుల తల్లి సరస్వతై విద్యా వికాసపు వెలుగులు అందిస్తున్నారు. జిలింగ్ సెరెంగ్ ప్రాంతంలో మాలతీ ముర్ము పెట్టిన మట్టి గుడిసె పాఠశాల మార్పుకో సంకేతం. ఏ పాలకులూ గుర్తించని.. ఏ అధికారులూ పట్టించుకోని చోట.. ఒక మహిళ ఆలోచన నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఒక వికాస ప్రక్రియ.
మాలతీ ముర్ము చేస్తున్న ప్రయత్నం అక్కడి తోటి గిరిజనానికి కూడా నచ్చింది. తమ పిల్లలు ఇంత అక్షరాలు నేర్చుకుంటూ.. వాటిని వల్లె వేసుకుంటూ.. వల్లె వేసినవాటిని రాసుకుంటూ అక్షరం వైపు అడుగులేస్తున్న ఆ దృశ్యం ఆ గిరిజన పురూలియాను కదిలించింది. అలా మాలతి తన ఇంట్లో పిల్లలకు పాఠాలు చెబుతున్న విషయాన్ని గమనించిన ఆ గిరిజన పెద్దలు.. తమ పిల్లల కోసం ఓ మట్టి గుడిసెనేర్పాటు చేసి, రెండు చిన్న తరగతి గదులను నిర్మించి ఇవ్వడంలో సాయమందించారు. ఇప్పుడా గిరిజన బాలబాలికలంతా పురూలియాలో 4వ తరగతి వరకు ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు.
వాస్తవానికి ఈ పూరిగుడిసె బడికొచ్చే పిల్లలెవ్వరూ అంతకుముందు బడంటే ఎరుగరు. వీరికే బడి తెలియదంటే.. అంతకుముందున్నవారి పరిస్థితేంటో మళ్లీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు పురూలియా తాండాలోని పిల్లలంతా తమ సంతాలీ భాషలో రాయడం, చదవడం చూసి పురూలియా మురిసిపోతోంది. మాలతి భర్త బంకా ముర్ము పాఠశాల నిర్వహణ చూస్తుంటాడు.
మాలతీ, బంకా ముర్ములకు ఇద్దరు పిల్లలు. వారి ఆలనాపాలనా చూసుకుంటూనే.. ఓ పాఠశాలను కూడా నిర్వహిస్తున్నారు ఈ భార్యాభర్తలు. తాము ఎవ్వరినీ ఏమీ అడగమని.. అడిగినా చేసేవాళ్లెవ్వరనే ముర్ము దంపతులు.. కేవలం పిల్లలు వస్తే చాలు.. మేం బడి నడపడానికి ఎప్పటికీ వెనుకాడమంటూ విద్యవికాసం వైపు పురూలియాను నడిపిస్తున్నారు.
పురూలియాలో మాలతీ ముర్ము కథ బాహ్యప్రపంచానికి తెలిశాక.. ఇప్పుడు బెంగాల్ లోని మమత ప్రభుత్వం సిగ్గుతో తలదించుకునే విమర్శలనెదుర్కొంటోంది. సంకల్పముంటే.. డబ్బు, ప్రభుత్వాలు, ఇతర సమాజం మద్దతు లేకపోయినా ఎలా సాధించవచ్చో మాలతీ ముర్ము చేసి చూపించింది. తానో గిరిజన గ్రామ మహిళగా.. ఓ హౌస్ వైఫ్ గా ఉండీ… పరిమిత వనరుల్లోనూ ఒక మార్పును ఎలా తీసుకురావచ్చో నిరూపించింది.
ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలు, ప్రైవేట్ పాఠశాలల హడావిడీ ఏవీ లేకున్నా… అవసరం నుంచి పుట్టిన ఓ తరగతి గదికి ఇప్పుడు పురూలియాలోని మట్టిగుడిసె పాఠశాల ఓ ఉదాహరణ.



