Vamsy Krishna… ✍🏻
ఇవాళ ఉదయం కంప్యూటర్ స్క్రీన్ మీద ఈనాడు స్క్రోల్ చేస్తుంటే సినిమా పేజీలో అనంత శ్రీరామ్ కనిపించారు.రెండు నెలల మథనం
రై రై రా రా అంటూ రాబోయే పెద్ది సినిమాలో రెహ్మాన్ సంగీత దర్శకత్వం లో తాను రాసిన పాట గురించి ఆ సినిమా పేజీలో చెప్పారాయన.
ఏం చెప్పారో ఆయన మాటల్లోనే “మాస్ పాట, తాత్వికత తో ఓ గీతం రాయడం కష్టమేమీ కాదు కానీ ఈ రెండింటి మేళవింపు తో అది కూడా ఏ ఆర్ రెహమాన్ ప్రయాగాత్మక బాణీకి రాయడం చాలా కష్టమైన పని. బాణీ ని అర్ధం చేసుకోవడానికే చాలా సమయం తీసుకున్నా. ఇతర భాషల ప్రభావం ఏ మాత్రం పడకుండా అచ్చ తెలుగులో రాసిన పాట ఇది. ఇది ప్రేమ పాట కాదు, ప్రత్యేక గీతం అంతకంటే కాదు.
అయినా కూడా సామాజిక మాధ్యమాలలో ఈ పాట లోని లైన్స్ ను ఉటంకిస్తూ మాట్లాడుకుంటున్నారు. సాహిత్యానికి ఇంత గొప్ప ప్రశంశ రావడం ఆనందాన్ని ఇచ్చింది. నేనూ బుచ్చిబాబు (సినిమా దర్శకుడు) చాలా రాత్రులు రింగ్ రోడ్ మీద ప్రయాణం చేస్తూ కాఫీ షాపులలో కూర్చుని చర్చించాం. రెండు నెలల మథనం తరువాత ఈ పాట పుట్టింది. నేటి తరం తో పాటు భవిష్యత్ తరానికి గొప్ప సందేశాన్ని ఇచ్చే మాస్ పాట ఇది. “

ఈ మాటలు చదివాక ఆ పాట ఏంటో తెలుసుకోవాలనే బుద్ది పుట్టింది. అంత గొప్ప సందేశం ఏం వుందో .మాస్ పాటకి ఏ తాత్వికత ను గార్నిష్ చేశాడో తెలుసుకోవాలనిపించింది. ఇదుగో ఇదీ ఆ పాట
రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అడ్డే లేని ధారై రా రా
రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
హద్దే లేని తిరై రా రా
దూకేటి జోరై రా
పోరరేటి పోరై రా
నీలో ఆరు నూరై రా
మందళ్లొంచి వేరై రా
భయ్యం పీకి పారేయ్ రా
సిగ్గుంటే సీరై రా
జై కొట్టేటి పేరై రా
నీ రాక చూసి లోకం చేసే
హోరై హోరై హోరై రా రా
రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అడ్డే లేని ధారై రా రా
రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
హద్దే లేని తిరై రా రా
బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసుకోకోయలా
నువ్వు నిన్నే నీ లోపల
హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా
నిన్నటి లాగే
రేపు ఉన్నదంటే
ఈ రోజేం పీకావనే
నీ అయ్య వడ్డి
నీ బిడ్డ కడితే
నువ్వు ఏమి పొడిచావనే
మొండెంలో తల దించేటట్టైతే..
మొలతాడు ఎందుకు కట్టావ్ తెంచేసేయ్
నువ్వు మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసేయ్
రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అడ్డే లేని ధారై రా రా
ఆట అనుకోకోయ్
ఆటంటే బతుకోయ్
నీ ఆట బతకాలిరోయ్
మాట అనుకోకోయ్
గెలుపంటే వెలుగోయ్
గెలుపై నువ్వు వెలగాలిరోయ్
మండే గుండె నీలో లేదంటే..
కాలు చేయి ఉన్నా లేనట్టే..
నీకే నెగ్గే నైజం అర్థం కానట్టే..
రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
అడ్డే లేని ధారై రా రా
రాయ్ రాయ్ రా రా
రాయ్ రాయ్ రా రా
హద్దే లేని తిరై రా రా
బెరుగ్గా ఆ బెరుగ్గా
ఇరుగ్గా ఆ ఇరుగ్గా
పాతేసుకోకోయలా
నువ్వు నిన్నే నీ లోపల
ఇందులో ఏం తాత్వికత వున్నదో నాకైతే అర్ధం కాలేదు. రైమింగ్ కోసం పడిన వ్యర్ధ ప్రయత్నం తప్ప. దూకేటి జోరు,పోరేటి పోరు, ఏం పీకావ్, ఏం పొడిచావ్ ఇవన్నీ అచ్చ తెలుగు పదాలు అని అనంత శ్రీరామ్ నమ్మి మనల్ని నమ్మ మంటున్నాడు.

సిగ్గుంటే సీరై రా అంటే నాకేమిటో అర్ధం కాలేదు. మొదట్లో చీరై (చీర) రమ్మంటున్నాడేమో అనుకున్నా. సిగ్గుంటే చీరై అనడం లో అన్వయ క్లిష్టత ఉన్నదేమో అనిపించింది. కాస్త ఆలోచిస్తే నీకు సిగ్గుంటే నీ శత్రువును రెండుగానో,మూడుగానో,చీరేసి రమ్మంటున్నాడేమో అని అనిపించింది.
మొండెంలో తల దించేటట్టైతే../మొలతాడు ఎందుకు కట్టావ్ తెంచేసేయ్. ఏంటి ఈ వాక్యం? పౌరుషాన్ని కేవలం మగతనంతోనో లేదా వేషధారణతోనో ముడిపెట్టడం. అంటే ఇదొక జెండర్ బయాస్డ్ వాక్యం అనిపించటం లేదా ?ఒక గొప్ప సాహిత్య విలువ కలిగిన పాట Universal గా ఉండాలి కదా
హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా
అన్న వాక్యాన్ని బహుశా అనంత శ్రీరామ్ గొప్ప తాత్వికత తో రాసాను అని అనుకుంటున్నట్టు వుంది. బరాబర్ ప్రేమిస్తా లో లాగా పూర్తి బూతులు రాయకుండా ఏం పీకావ్ అని మర్యాద గా రాసాను అని తన భుజం తానే తట్టుకున్నట్టున్నాడు.
ఈ పాట రాయడానికి రెండు నెలలు పట్టిందంటే, అనంత శ్రీరామ్ యువతలో ఉన్న “సగటుతనాన్ని” (Mediocrity) తిట్టడానికి ప్రయత్నించారు. ఆ తిట్లను ఏరుకోవడానికి రెండు నెలలు పట్టిందన్నమాట. కానీ ఆ తిట్లు కూడా సరిగ్గా ఏరుకోలేకపోయాడు కదా
వేటూరి “కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు” అన్నప్పుడు అందులో ఒక సంస్కారం ఉంది. మనిషిని దైవత్వానికి దగ్గర చేసే ఉన్నతమైన ఆశయం ఉంది. అక్కడ భాష పదునుగా ఉన్నా, అది శిల్పం చెక్కే ఉలిలా ఉంటుంది.
సిరివెన్నెల “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి” అన్నప్పుడు అందులో ఒక అమ్మ ఓదార్పు, తండ్రి ధైర్యం రెండూ ఉంటాయి. “నింగి ఎంత పెద్దదైనా విప్పిన పక్షి రెక్క ముందు చిన్నదే” అన్న భావనలో అహంకారం లేదు, ఆత్మవిశ్వాసం ఉంది. అది విన్నప్పుడు మనిషిలో ఒక తెలియని ప్రశాంతత, సానుకూలత కలుగుతాయి.
ఈ పాటలో: “ఏం పీకావ్” వంటి పదాలు వాడటం అంటే కవి తన బాధ్యతను విస్మరించి, వీధి రౌడీ భాషను ఆశ్రయించడమే. ఈ పాటలో ఉన్నవి కేవలం “ఉద్రేక పరిచే పదాలు” (Adrenaline pumping words) మాత్రమే. ఇవి జిమ్‌లో వర్కౌట్ చేయడానికి లేదా బైక్ వేగంగా నడపడానికి పనికొస్తాయేమో కానీ, జీవితంలో దెబ్బతిన్న మనిషిని నిలబెట్టడానికి పనికిరావు.
ఒక పాట పదే పదే వినాలంటే ఆ భాష మన అంతరాత్మలో ఇంకాలి. . “ఏం పీకావ్” వంటి పదాలు ఈ తరం పిల్లల మనసులలో ఇంకిపోతే అది మన సంస్కారానికే ప్రమాదం.
శ్రీరామ్ గారూ వింటున్నారా ?



