స్వరస్రష్ట పెండ్యాల రా(నా)గేశ్వరుడిపై ఓ లుక్కేయండి.
………………………………………………………………………
వీర నరసింహ రాజు.. ✍️

మోహన, కళ్యాణి, భీంప్లాస్ రాగాలు అంటే
ఆయనకు అత్యంత ప్రీతిపాత్రం
కరుడు గట్టిన వానిని “రావోయి మా ఇంటికి ” అని పిలిస్తే వాడు వెళ్లక తప్పదు.. మైమరచి ఆ వనిత పెట్టే వాడి వేడి తిట్లు అట్లుగా భావించి తినకా తప్పదు.
ఆయన తెల్లటి దుస్తులు ధరించి స్వరాలు కూరిస్తే
“ముక్కోటి దేవతలు ఒక్కటై” వింటారు.
ఆ రసమయ సంగీతము వింటూ భువిలోని
సరస్సులలో జలకాలాడ్డానికి దివి నుండి దేవకన్యలు దిగివస్తారు – “జలకాలాటలలో గలగల పాటలలో” అని పాడుకుంటూ మైమరచి పోతారు.
రసికులను రంజింపజేయడానికి “రసికరాజ తగువారము
కామా యేలుదొరా ” అనిపిస్తారు.
శిలలను సైతం కరగించగలిగే దివ్యామృత
స్వర ఝరుల సృష్టించగల మేటి. ఆయన ” శివ శంకరీ శివానందలహరీ” అంటే ఆ స్వరఝరికి శాపాలు సైతం పటాపంచాలవుతాయి.
ఆ అద్భుత స్వరాలు “నీలిమేఘాలలో
గాలికెరటాలలో” అలా అప్రతిహతంగా
“కొండ గాలిలో తిరుగుతూ గుండెను ఊసులాడిస్తూ’
“ఉయ్యాల ఝంపాల లూగిస్తూ”
“యమునా తీరమున సంధ్యాసమయమున”,
“చందన చర్చిత నీలకళేబరుని”కి
“జోహారు శిఖిపింఛ మౌళీ”, “జయహే నవనీల మేఘశ్యామా!”అంటూ అంజలి ఘటిస్తాయి.
“ఆ మబ్బు తెరలలోన” , “చిగురాకు వంటి అరుదైన చిన్నది”కనబడి చూడాలని అంటే , “ఈ వెన్నెల ఈ పున్నమి వెన్నెల” అంటూ “హాయి హాయిగ జాబిల్లి” తో ఊసులు చెప్పిస్తాయి.
“హృదయమా ఓ బేల హృదయమా!” అని పలకరిస్తే చాలు ఇది “కల కానిది విలువైనది” అంటారు ..
ఆ “చిగురాకులలో చిలకమ్మ” .. “రాగమయీ రావే!” అని పిలిస్తే.. “విన్నానులే ప్రియా.. కనుగొన్నానులే ప్రియా!”
అంటూ ” ” అదే అదే నాకు అంతు తెలియకున్నది” ..ఏమిటీ “చిత్రం భళారే విచిత్రం” అని అనక తప్పదు.
ఆయన స్వరం వేసి చెప్తే సత్యాదేవి ఆనతి “మీరజాలగలడా” ఆ నల్లని కృష్ణయ్య ?
చదువుల తల్లి శారదకు “జయ జయ శారదా!
జయకళా విశారదా!” అని నిలువెత్తు జోతలు పట్టారు
“రసికరాజ మణిరాజిత సభలో యశము” గాంచిన
అద్భుత స్వరకర్త కోసం “నీకై వేచితినయ్యా, నీకై కాచితినయ్యా” అంటారు రసికులు.
సంగీత దర్శకుడు అంటే కేవలం పాటలకు సంగీతం మాత్రమే అనుకుంటాము. చిత్రములో నేపథ్యములో సన్నివేశానికి తగ్గట్టు సంగీతం ఉండాలి . ఇపుడంటే నేపథ్య సంగీతం ఎలా ఉన్నా పేద్దగా ఎవరికీ తెలియదు గానీ సన్నివేశానుగుణంగా సంగీతం అందించాలి. పాటలకు సంగీతం చేయడం కన్నా నేపథ్య సంగీతం పెద్ద కష్టం అంటారు పెండ్యాల వారు.
అది సూర్యోదయ దృశ్యం అయితే అక్కడ భూపాల రాగం ఉండాలి.. పక్షుల కిలకిలలు ఇలా అన్నీ ఉండాలి .. ఇంక యుద్ధ సమయములో మధుర సంగీతం వినిపిస్తే సన్నివేశం రక్తి కట్టదు.. భేరీ నినాదాలతో ప్రేక్షకులకు ఆ భీభత్స వాతావరణాన్ని అనుభవేకవేద్యం చేయాలి. ఇంక పోరాట సన్నివేశాలకు తగ్గట్టు ఆ సంగీతం ఉండాలి.. గుర్రం మీద సవారీ ఉంటే గుర్రపు గిట్టల శభ్ధాలు, ఇంక స్వప్న దృశ్యాలకు ఒక్కోరకం, స్వప్నానికి ఒక్కోరకపు నేపద్య సంగీతం, ప్రేమ సన్నివేశాల్లో హృదయతంత్రులు మ్రోగినట్టు ఉండాలి.
ఇంక కథలో అశుభ కార్యాలకు ఆ సన్నివేశానికి అనుగుణంగా బాధాతప్త సంగీతం ఉండి ప్రేక్షకుల హృదయాన్ని పిండి వేయాలి.ఇలా ప్రతి సన్నివేశానికి ప్రేక్షకుని హృదయానికి హత్తుకునేలా చేయగలగాలి. సన్నివేశములో శుభకరమైన సన్నివేశం వస్తే దానికి తగ్గట్టు మంగళకర సంగీతం హాయిగా విపించాలి. మన చిత్రాలలో కొన్నింట సీతారామ కళ్యాణం, వెంకటేశ్వర మహత్మ్యం, లవకుశ, సంపూర్ణ రామాయణములో వచ్చిన శంకరశాస్త్రి గారి మరియు చిట్టిబాబు గారి వీణ వాదన సంగీతం కొన్ని దృశ్యాలలో అద్భుతంగా వీనుల విందుగా వినబడుతుంది.
హాస్య సన్నివేశాలకు తగ్గట్టు , రాత్రి నేపద్యం అయితే ఆ సన్నివేశాన్ని రక్తిగట్టించేందుకు కీచు శబ్ధాలు ఇలా ప్రతీ ఒక్కటీ ఆ సన్నివేశానుగుణంగా ఉండాలి. ఇపుడంటే సినిమా అంతా రణగొన ధ్వనులే గానీ శ్రావ్య సంగీతానికి స్థానం మెక్కడిది.
నేపథ్య సంగీతము ఆరంభమవగానే ప్రేక్షకునికి సన్నివేశం అర్థం అయిపోతుంది . ఇంక సాంఘికాలకు ఓ రకం వాయిద్యాలు , చారిత్రిక మరియు ఐతిహాసిక చిత్రాలకు కొన్నిరకాల వాద్యాలు వాడాలి. లేకపోతే ఔచిత్యం చెడుతుంది.
ఇలా చిత్రాలలో ప్రతీ సన్నివేశానికీ , పద్యం, రాగం ఏ లక్షణమూ, ఔచిత్యము చెడకుండా రసోత్పత్తికి భంగం కలగకుండా ప్రయోగాలు చేయడములో పెండ్యాల గారిది అందె వేసిన చేయి.
ఆయన సంగీతం కూర్చిన చిత్రాలన్నీ ఉన్నత చిత్రాలే. తన అరవైయ్యవ పడిలో కూడా అద్భుత స్వరాలు కూర్చి వీనుల విందైన సంగీతం అందించి మా కంటి పాపగానే కాదు మా ” వీనుల విందై నిలచిపోరా” అని ప్రేక్షకుల చేత అనిపించుకున్నారు పెండ్యాల నాగే’స్వరుడు’ గారు.



