ఓరోజు చల్లని సాయంత్రం నౌషాద్ అలీ తన ఇంట్లో హార్మోనియంపై కూర్చుని తనకిష్టమైన రాగరస సాగరంలో మునిగి తేలుతున్నాడు. ఉన్నపళంగా ఇంట్లోకి ఓ అపరిచితుడొచ్చాడు. ఏదో రాగాలాపనలో తాదాత్మ్యంలో ఉన్న నౌషాద్ ముందు ప్రత్యక్షమయ్యాడు. హార్మోనియం పెట్టెపై డబ్బు కట్టలు విసిరాడు. నేను తీయబోయే సినిమాకు నువ్వే నా స్వరకర్తవంటూ కాస్త దురుసుగా తానే ప్రకటించాడు.
ఆ సీన్ అప్పటికే ప్రఖ్యాత సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందిన నౌషాద్ కు తిక్కరేపింది. ఆ తిక్క నషాళానికెక్కి.. ఆ నోట్ల కట్టలను తీసి బంగ్లా పైనుంచి డాబాలోకొచ్చి కిందకు విసిరిపారేశాడు. శరదృతువు ఆకుల్లాగా పైనుంచి కట్టలకు కట్టల డబ్బు కిందకు రాలుతుంటే.. నౌషాద్ ఇంట్లో పని చేసే సిబ్బంది ఏం జరిగిందోనున్న ఒకింత టెన్షన్ తో పాటు.. వాటిని ఏరేందుకు యత్నిస్తున్నారు. ఆ సీన్ అక్కడికి కట్ చేస్తే.. ఆ డబ్బు హార్మోనియం పెట్టెపై విసిరి నువ్వే నా సంగీత దర్శకుడివంటూ ప్రకటించిన వ్యక్తి… అప్పటికి సుమారు 1950ల కాలంలో ఇండియన్ సినిమాకు అంత సుపరిచితుడేం కాదు. కానీ, 1960 మొఘల్ ఏ ఆజం విడుదలయై… ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన ఆ దర్శకుడి గురించి.. ఆ తర్వాత తెలియదంటేనే నామోషీ అన్నంత పేరు సంపాదించాడు.
ఆ దర్శకుడు కే. ఆసిఫ్ అయితే… భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఒక పెయింటింగ్ లాంటి కళాఖండాన్ని అందించి… సినిమా రంగాన్ని ఒక కుదుపు కుదుపేసిన ఆ మొఘల్ ఏ ఆజమ్ నిర్మాణం వెనుక 15 ఏళ్ల ఆసిఫ్ శ్రమ ఆ సినిమాను మించింది.

ముందు అంత కోపాన్ని ప్రదర్శించినా… నౌషాద్, ఆ తర్వాత కాస్త ఆలోచించాడు. అంత ధైర్యంగా ఓ ముక్కూముఖం తెలియని వ్యక్తి వచ్చి.. తన సమ్మతం లేకుండా తనను సంగీత దర్శకుడిగా ప్రకటించడం ఆయనలో కోపాన్ని రగిలించినా.. తన మీద ఎంత నమ్మకముంటే అతను వచ్చి ఉంటాడు.. తన సంగీతమే కావాలని మనసులో ఎంత బలంగా అనుకుండి ఉంటే తనపై అంత సాధికారత ప్రదర్శించి ఉంటాడన్న యోచన మొదలైంది. దాంతో ఆసిఫ్ ను పిల్చి మళ్లీ మాట్లాడాడు నౌషాద్. అతగాడి కసేంటో అర్థమైంది. మొఘల్ ఈ ఆజమ్ అనే సినిమా చేయాలనే తలంపులో ఆసిఫ్ వ్యామోహం… సరిహద్దుల్లేకుండా దూసుకుపోయే గుర్రంలా అనిపించింది. ఆ సినిమా నిర్మాణంలో భాగంగా అప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆసిఫ్ పడ్డ కష్టం, చూపించిన ఓపికా నౌషాద్ ను నివ్వెరపర్చింది. దాంతో, సినిమాకు తానే సంగీతం చేస్తాననీ ఒప్పుకున్నాడు. ఇక రెస్ట్ ఆఫ్ హిస్టరీ.. మొఘల్ ఏ ఆజమ్ సినిమాను నిలబెట్టడంలో నౌషాదూ కీలక పాత్రధారయ్యాడు.
ఆసిఫ్ కన్న అందమైన కలను సినిమా తెరపై పర్చాడు. తన రంగుల కలలోని ప్రతీ సన్నివేశాన్నీ అంతే కళాత్మకంగా రీల్ కెక్కించాడు. ఈ విషయాల్ని దస్తాన్ ఏ మొఘల్ ఈ అజామ్ పుస్తక రచయిత రాజ్ కుమార్ కేస్వానీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు శిల్పం చెక్కుతున్న రాయికి మాత్రమే దెబ్బలు పరిమితమైపోవు. అప్పుడప్పుడూ ఆ ఉలి గురి తప్పినప్పుడు శిల్పికీ గాయాలయ్యే అవకాశాలుంటాయి. అలాంటిది, మొఘల్ ఏ ఆజమ్ సినిమా నిర్మాణంలో ఆసిఫ్ కూ అడుగడుగునా గాయాలే. మలుపు మలుపుకూ ఓ సమస్య. ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరయ్యాడు. నటీనటుల భర్తీ నుంచీ నిర్మాణ జాప్యం వరకూ… ప్రతీ సవాల్ నూ స్వీకరిస్తూ ప్రతిసవాల్ విసిరాడే తప్ప వెరవలేదు. భారతీయ సినిమా రంగంపై చెరగని ముద్ర వేయాలన్న తలంపుతో ప్రారంభించిన మొఘల్ ఏ ఆజమ్ పూర్తైంది. బాలీవుడ్ చిత్రరంగంలోనే ఒక ఇతిహాసమై అప్లాజ్ అందుకుంది.
ఎందరో దర్శకులు, మరెందరో నటులు, ఓ ప్రవాహంలాంటి సినిమా రంగంలో… అంతకుముందు పెద్ద సినిమాలు చేసిన అనుభవం కూడా లేని ఓ అపరిచితుడు మొఘల్ ఏ ఆజమ్ తో చరిత్ర సృష్టించడంతో పాటు.. తీసినవి మూడే మూడు సినిమాలైనా భారతీయ చలనచిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశాడు.
తన మూడు సినిమాల్లో చివరి సినిమా అయిన లవ్ అండ్ గాడ్ పూర్తికాకమునుపే 1971, మార్చ్ 9వ తేదీన ఆసిఫ్ అస్తమయమయ్యాడు. ఆసిఫ్ మరణించిన తర్వాతే 1986లో లవ్ అండ్ గాడ్ విడుదలైంది. మూడే చిత్రాలైతేనేం.. ఒక్క మొఘల్ ఏ ఆజమ్ చాలదూ ఆసిఫ్ ను వెండితెర లెజెండ్ చేసేందుకని నిరూపించాడు.
మల్టీస్టారర్ సినిమాలకు పెట్టింది పేరైన బాలీవుడ్ లో.. మొట్టమొదటి మల్టీస్టారర్ గా చాలామంది వక్త్ సినిమాను చెబుతుంటారుగానీ.. ఆసిఫ్ 1945లోనే ఫూల్ అనే సినిమాతోనే ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ సినిమాతో పృథ్వీరాజ్ కపూర్, సురైయా, దుర్గా ఖోటే వంటి భారీ తారాగణాన్ని ఒకచోటకు చేర్చిన ఘనత ఆసిఫ్ ది. మసీద్ నిర్మించాలనే తండ్రి కలను నెరవేర్చాల్సిన ముస్లిం కుటుంబంలో మూలపురుషుడిగా.. కొడుకు పాత్రలో అందులో పృథ్వీరాజ్ కపూర్ కనిపిస్తాడు.
దర్జీ నుంచి దర్శకుడిగా!

ఇవాల్టి సినిమా సినారియోలో ఒక్క అవకాశం దక్కడమే కష్టం. దక్కిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మళ్లీ కనబడటం అంతకుమించి కష్టం. ఒకవేళ కమర్షియల్ ఫార్మూలాతో అవకాశాలు వచ్చినా.. ఒక అద్భుత దర్శకుడిగా నిరూపించుకునేవారు అంతకన్నా అరుదు. అలాంటిది కేవలం మూడు సినిమాలతో… దిగ్గజ దర్శకుడిగా ఎదిగాడు కే. ఆసిఫ్. మొఘల్ ఏ ఆజంతో తన పేరును సుస్థిరం చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ ఎటావా ఆసిఫ్ జన్మస్థలం. జస్ట్ 17 ఏళ్ల వయస్సులో మొఘల్ సామ్రాజ్యాన్ని వెండితెరపై చూపించాలన్న కోరికతో ముంబై పయనమయ్యాడు. ఆసిఫ్ మామ తనను ఓ ప్రయోజకుణ్ని చేయాలని ఓ టైలరింగ్ షాప్ ప్రారంభింపజేశాడు. మహిళల కోసం ఏర్పాటు చేసిన లేడీస్ టైలర్ షాప్ కావడంతో.. మరీ లేడీస్ టైలర్ సినిమాలో రాజేంద్రప్రసాద్ లా కాకపోయినా.. తన కథలతో మహిళలను విపరీతంగా ఆకట్టుకునేవాడట ఆసిఫ్. దాంతో, ఆయన మామే ఆసిఫ్ ను సినిమా నిర్మాణం వైపు ప్రోత్సహించాడు. అలా ఆసిఫ్ జస్ట్ 20 ఏళ్లకే ఒక పూర్తి స్థాయి దర్శకుడై అవతరించాడు.
తన మొదటి సినిమా హిట్ టాక్ సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ.. ఆసిఫ్ దృష్టి మాత్రం అక్బర్ చక్రవర్తి.. ఆయన కుమారుడు సలీం, ప్రేయసి అనార్కలీ కథపైనే ఉండేది. ఆసిఫ్ సినిమాను నిర్మించాడనేకంటే… ఓ శిల్పిలా శ్రద్ధగా చెక్కాడనొచ్చు.. ఓ పెయింటర్ లా తీర్చిదిద్దాడు. మొఘల్ ఏ ఆజమ్ కోసం తాను సంపాదించిన ప్రతీ పైసాను ఖర్చు చేస్తూ పోయాడతను.
సినిమా సెట్టింగ్స్ లో భాగంగా.. పీష్ మహాల్ కోసం బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్న గ్లాస్ నుంచి మొదలుకుంటే.. ఇంగ్లాండ్ లో దిలీప్ కుమార్ కు ప్రత్యేకమైన విగ్ తయారీ… ఆగ్రా నుంచి తెప్పించే పాదరక్షలు.. ఇలా ఏ ఖర్చుకూ వెనుకాడకుండా… ఏ మాత్రం రాజీ లేకుండా నేటి ఏఐ యుగంలో గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలను సైతం తలదన్నేలా అప్పుడే ఓ కళాఖండాన్ని చెక్కాడు ఆసిఫ్.
మొఘల్ ఏ ఆజమ్ జస్ట్ ఓ సినిమా కాదు. ఆసిఫ్ జీవితం. తన జీవితం ఇక సర్వనాశనమైపోయినట్టే అన్న నిరాశ, నిస్పృహల దాకా తీసుకెళ్లిందీ మొఘల్ ఏ ఆజమే. పడిలేచిన కెరటంలా తన జీవితాన్ని మార్చేసిన మాస్టర్ పీసూ మొఘల్ ఏ ఆజమే.
సుమారు ఆరోజుల్లోనే కోటిన్నర బడ్జెట్ తో నిర్మించిన సినిమా మొఘల్ ఏ ఆజమ్. అందుకే, ఆ కాలంలో ఈ కళాఖండమే అత్యంత ఖరీదైన భారతీయ సినిమాగా కూడా రికార్డులకెక్కింది.
మొఘల్ ఏ ఆజమ్ ను చెక్కే క్రమంలో ఆసిఫ్ పరిపూర్ణతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవాడు. ఒక సీన్ తాననుకున్నట్టు వచ్చేవరకూ రిహాల్సల్స్ తప్పేవి కావు. ఆ క్రమంలో రీల్స్ వేస్ట్ అవుతున్నాయన్న ఉద్దేశంతో ఫైనాన్షియర్స్ తోనూ, రీటేక్స్ విషయంలో నటీనటులతోనూ.. అలాగే, సీన్ సరిగ్గా వచ్చేవరకు చిత్రీకరించాలని సాంకేతిక నిపుణులతోనూ తరచూ గొడవ పడేవాడు. తన కచ్చితత్వాన్ని సాధించే క్రమంలో వారి ఓపికకు పరీక్ష పెట్టేవాడు. పీరియాడికల్ స్టోరీకి కావల్సిన క్యాస్టూమ్స్ ను తెప్పించేవరకూ నెలల తరబడి షూటింగ్ ను వాయిదాలు వేసేవాడు. విస్తృతమైన సెట్టింగ్స్ కోసం పట్టుబట్టేవాడు. కొన్ని సన్నివేశాలను తాననుకున్నట్టు రాకపోతే తిరిగి చిత్రీకరించినట్టు అనితా పాధ్యే అనే రచయిత తన టెన్ క్లాసిక్స్ లోనూ పేర్కొన్నారు.
నిర్మాతలు ఇక మేం నీతో వేగలేమన్నారు. ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడితో లాస్ అయితే అయినాం కానీ.. ఇకముందు మాత్రం మేం నీతో ఈ సినిమాను చేయలేమంటూ ఒక దశలో చేతులెత్తేశారు. కానీ, ఆసిఫ్ కలల జూదగాడు. పందెం వేసి మరీ నిర్మాతలను తన వెంట పరిగెత్తిస్తాడు.
తన చివరి చొక్కా అమ్మేవరకూ సినిమా తీసిన ఓ ఫకీర్ గా ఆసిఫ్ ను అభివర్ణించాడు ప్రముఖనటుడు ప్రేమ్ చోప్రా. అయితేనేం, ఎవర్ గ్రీన్ సినిమా తీశాడనీ పొగడ్తలతోనూ మళ్లీ ఆయనే ముంచేశాడు.
పరిపూర్ణతకు పర్యాయపదం ఆసిఫ్!
యుద్ధం నుంచి సలీం తిరిగివచ్చే ఓ సన్నివేశమది. దాన్ని హైలెట్ చేసి తారాస్థాయిలో చిత్రీకరించేందుకు.. నిజమైన ముత్యాలే ఉపయోగించాలని పట్టుబడ్డాడు ఆసిఫ్. ఆ ముత్యాలు వచ్చేవరకూ ఆ సీన్ చిత్రీకరణ ఆపేశాడు. జైపూర్ లో ఓ యుద్ధ సన్నివేశం చిత్రీకరణ జరుగుతుంటే బ్యాక్ డ్రాప్ లో కొన్ని విద్యుత్ స్తంభాలు కనబడుతున్నాయి. అక్బర్ కాలాన అదెంత మాత్రం యాప్ట్ గా ఉండదనుకున్న ఆసిఫ్.. అక్కడి మున్సిపల్, విద్యుత్ అధికారులను షూటింగ్ అయ్యేవరకూ ఆ విద్యుత్ స్తంభాలను తొలగించాలని పట్టుబట్టి.. వాటిని తొలగించే మూణ్నెల్లవరకూ షూటింగే చేయలేదు.
ఎవరైనా తాననుకున్నది కాదని చెబితే.. దాన్ని పూర్తి చేసేవరకూ నిద్రపోని తత్వం ఆసిఫ్ ది. హాలీవుడ్ పాప్యులర్ ఫిల్మ్ మేకర్స్ రాబర్టో రోసెల్లిని, డేవిడ్ లీన్ ఓసారి మొఘల్ ఏ ఆజమ్ సినిమా నిర్మాణం నడుస్తున్న పీష్ మహల్ సెట్టింగ్ కు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అద్దాల్లో ప్రతిబంబాలేర్పడి.. ఆసిఫ్ చిత్రీకరించాలనుకుంటున్న సీన్స్ సరిగ్గా రావని తేల్చేశారు. కానీ, తన మూడో కన్నైన సినిమాటోగ్రాఫర్ మాథుర్ తో కలిసి దాన్నో సవాల్ గా స్వీకరించాడు. అద్దాల్లో ప్రతిబింబాలు రాకుండా టెక్నిక్ తో ఆ షాట్ ను చిత్రీకరించారు ఆసిఫ్, మాథుర్ కలిసి.
ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతజ్ఞుడు, గజల్ గాయకుడు బడే గులాం అలీఖాన్ మొదట సినిమాలకు పాడేందుకు ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు. ఆయనకు సినిమా సంగీతంపైనే సరైన అభిప్రాయముండేది కాదు. కానీ, ఆయన స్వరమే తన సినిమాకు ప్రాణమని నమ్మిన ఆసిఫ్ గులాంఅలీని సంప్రదిస్తే.. ఇంటికొచ్చిన దర్శకుణ్ని కాదనలేక.. భారీ పారితోషికమడిగితే వెళ్లిపోతాడనుకున్నాడు. తను పాడే ఒక్క పాటకు 25 వేల రూపాయలివ్వాలనడిగాడు ఆ రోజుల్లోనే. ఆసిఫ్ కచ్చితంగా నిరాకరిస్తాడనే గులాం అలీక.. ఒక్క పాటకు అంత పారితోషికమడిగాడు. కానీ, ఆసిఫ్ కెవ్వకేక వేశాడు. అడ్వాన్స్ కూడా చేతుల్లో పెట్టేశాడు. ఇక గులాంఅలీ అన్న మాటకు కట్టుబడి పాడాల్సిన గత్యంతరం లేని పరిస్థితేర్పడింది. అలా మొఘల్ ఏ ఆజమ్ లోని ప్రేమ్ జోగన్ బాన్ కే, శుభ్ దిన్ ఆయో అనే రెండు పాటలు బడే గులాం అలీఖాన్ కంఠంలో చేరి.. మరింత మురిపించి మైమరిపించాయి.
1940ల కాలంలో ప్రారంభమైన మొఘల్ ఏ ఆజమ్ కు ఎన్ని ఎదురుదెబ్బలెదురైనప్పటికీ ఆసిఫ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా వెనుకడుగు వేయలేదు. ఆ సినిమా ప్రారంభించినప్పుడు అక్బర్ పాత్రధారి చంద్రమోహన్ కూడా మృతి చెందడంతో ఆ సినిమా ఫైనాన్షియర్ అయిన అలీ హకీం సిరాజ్ ఏకంగా ఇండియా వదిలి పాకిస్థాన్ కు వలస వెళ్లిపోయాడు. నిరాశ, నిస్పృహలొకవైపు.. ఎలాగైనా పూర్తి చేయాలన్న గట్టి తలంపు ఇంకోవైపు.. మొత్తంగా చివరకు షాపూర్జీ పల్లంజీ మిస్త్రీని కలిసి తన ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. ఆయన్నొప్పించాడు. అలా పదిహేనేళ్ల నిర్మాణం తర్వాత 1960లో మొఘల్ ఏ ఆజమ్ బయటకొచ్చింది. బ్లాక్ బస్టరైంది.
లైలా మజ్ను పర్షియన్ ప్రేమకథతో తన తదుపరి చిత్రం లవ్ అండ్ గాడ్ కూడా మొఘల్ ఏ ఆజమ్ వంటి భారీ సబ్జెక్టే. అదీ ఎన్నో సవాళ్లనెదుర్కొంది. ప్రధాన పాత్రలో నటించిన గురుదత్ మధ్యలోనే చనిపోయాడు. ఆయన స్థానంలోకి సంజీవ్ కుమార్ వచ్చి చేరాడు. అలా చిత్ర నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే ఆసిఫ్ 1971లో, కేవలం 48 ఏళ్ల వయస్సులోనే కన్నుమూశాడు.
ఆసిఫ్ దృష్టిలో సినిమా అంటే బడ్జెట్, కాంప్రమైజేషన్, గడువు, నటీనటులు ఇవేం కావు… ఒక శాశ్వతమైన ముద్ర వేయడం. తరతరాలుగా గుర్తుండిపోయే కళాఖండాన్ని తెరకెక్కించడం. అందులో ఆసిఫ్ విజయం సాధించాడు కాబట్టే.. ఇప్పటికీ 65 ఏళ్లు కావస్తున్నా మనం మొఘల్ ఏ ఆజమ్ గురించీ.. దర్శకుడు ఆసిఫ్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం.



