టీచింగ్ ఈజ్ ఏ సెలెబ్రేషన్!

డా. పుల్లూరి సంపత్ రావు…✍️

పాఠాలు చెప్పడం కేవలం ఒక పనికాదు. అది ఒక ఉద్యోగం మాత్రమే కాదు. అది ఒక జాతి నిర్మాణ ప్రక్రియ. నాగరికతను పరిపుష్టం చేసే యజ్ఞం. పసిమనసులను ప్రభావితం చేయగలిగే అవకాశం ఉన్న రంగం. చాలామంది విద్యార్థులు టీచర్లను అనుకరిస్తారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు అన్ని పాత్రలు పోషించాల్సి ఉంటుంది. ఒక్కోసారి నటించాలి, పాడాలి, ఆడాలి. మంచి ఉచ్చారణ ఉండాలి. టీచింగ్ లో పిల్లలను భాగస్వాములను చెయ్యాలి. బ్లాక్ బోర్డ్, టీచింగ్ ఎయిడ్స్,టెక్నాలజీ అవసరం మేరకు వాడాలి. సిలబస్, ప్రశ్నపత్రాలు రూపొందించే పరిజ్ఞానం ఉండాలి. ప్రశ్నలకు జవాబులను పిల్లలచే స్వంతంగా రాయించే సాధన చేయాలి. పిల్లల పేరెంట్స్ తో పిల్లల నడవడి గురించి చర్చించాలి.

పిల్లలను ప్రయోగశాలలకు బయటి ప్రపంచానికి తీసికెళ్ళి గమనించమని చెప్పాలి. వాళ్ళ అభిప్రాయాలను రాయించాలి, మాట్లాడించాలి. భిన్న ఆలోచనా ధోరణులను అవగతం చేయించాలి. ఘర్షణ భావాల మద్య ఉండాలి గాని వ్యక్తుల మద్య కాదని అర్థం చేయించాలి. భిన్నత్వం ఒక జీవన విధానంగా అలవాటు చేయించాలి. ఉపాధ్యాయులు పిల్లలలో ఆలోచనలు రేకెత్తించాలి. ఇందుకోసం వైవిద్యభరితమైన నిత్య నూతన బోధనా పద్ధతులను ఎప్పటికప్పుడు అవలంబించాలి. పిల్లలలో స్వతంత్ర్య భావనలను, స్వశక్తిని, పరోపకారాన్ని పెంపొందించాలి. బాధ్యతాయుతమైన మంచి వ్యక్తులను తయారుచేసే పనిలో ఉన్నామని టీచర్లు నిరంతరం గుర్తెరగాలి.

అయితే పైన వివరించిన లక్షణాలున్న టీచర్లు ప్రస్తుతం చాలా అరుదు. టీచింగ్ అనేది ఉత్సాహంగా ఎంచుకునే ఉద్యోగాల జాబితాలో లేదు. మిగతా ఉద్యోగాలు రానపుడు తప్పనిసరిగా చేయవలిసిన పనిగా చాలామంది ఎంపిక చేసుకుంటున్నారు. చాలా రంగాలలో చదువులో ముందున్న విద్యార్థులు ఎవరూ ఆయా రంగాలలో టీచింగ్ వైపు మొగ్గు చూపడం లేదు. ఇక విద్యాసంస్థలలో ఇతర ఉద్యోగుల స్థితి మరీ దారుణం. జీవితంలో అనేక రకాల దెబ్బతిన్న వాళ్ళు ఏదో ఒక ఉపశమన మార్గం కోసం స్కూళ్ళలో ఉద్యోగాలు చేస్తున్నారు.

విద్యపై ఖర్చును ప్రభుత్వాలు అనవసర వ్యవహారంగానే చూస్తున్నాయి. మెజారిటీ పేరెంట్స్ కూడా అన్ని బిల్లులు చెల్లించాక చివరికి ఫీజు కడదాం అనే భావనలోనే ఉంటున్నారు. ఒక ప్లంబర్ కు గంట పనికోసం ఇచ్చే డబ్బు కూడా ఒక విద్యార్థికి ట్యూషన్ చెప్పే టీచర్ కు నెలకు ఇవ్వడం లేదు. దోపిడిచేసే విద్యాసంస్థలలోనే పిల్లలను చేర్పించే వేలం వెర్రి మూక ధోరణి మారాలి. తరగతి గదిలో జ్యోతులుగా వెలిగే సమగ్ర వ్యక్తిత్వం గల టీచర్లను తయారుచేసే యంత్రాంగం గురించి ఆలోచించాలి. మీడియా, ఆలోచనాపరులు, ఉద్యోగబృందం ప్రైవేట్ ప్రభుత్వ పరిధులు దాటి దార్శనికత ప్రదర్శించాలి. ఇప్పటివరకు విద్యారంగం అక్షరాస్యత కోసం పనిచేసింది. ఇకపై మానవత్వం పరిడవిల్లే సమాజ నిర్మాణం కోసం విద్యారంగంలో రావలిసిన మార్పుల దిశగా అందరూ ఆలోచించాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles