ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోనగఱగిపోయె ! యిచ్చోటనే భూములేలు రాజన్యుని యధికారముద్రిక లంతరించె! యిచ్చోటనే లేత యిల్లాలి నల్లపూసలసౌరు గంగలో గలిసిపోయె! యిచ్చోటనెట్టి పేరెన్నికంగనుగొన్న చిత్రలేఖకుని కుంచియ నశించె! ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు.. ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ నవనిబాలించు భస్మసింహాసనంబు.. అంటారు గుర్రం జాషువా శ్మశానవాటికలో. రుద్రభూమికి చెడ్డవాడు, మంచివాడనే తేడాలేదు. హతుడూ, హంతకుడు ఇద్దరూ సమానమే. కవైనా, రాజైనా, లేత ఇల్లాలి మాంగల్యమైనా, చిత్రకారుడైనా… ఎవ్వరైతేనేమి ఆయువు తీరాక ఇక్కడ విశ్రమించవలసిన వారేనంటాడు. సృష్టి లయకారుడు శివుడికిష్టమైన తాండవానికి అనువైన ఈ శ్మశానవాటిక కన్న మిన్న ఏమున్నదంటాడు లోతైన భావనలో కవి. అయితే అచ్చోటనే శ్మశాన వైరాగ్యం ఆవహించి.. రుద్రభూమికి వచ్చిన ఓ ముసల్మాన్ కాటికాపరిగా అవతరించి పద్మశ్రీ అందుకున్న విశేషమైన కథ ఇది.

జీవితం ఎన్ని అనూహ్యమైన మలుపులు తిరుగుతుందో చెప్పడానికి ముసల్మాన్ టోపీ పెట్టుకున్న ఈ కాటికాపరి బతుకు చిత్రం ఓ ఉదాహరణ. పుట్టుక, చావు మధ్య మనిషి సృష్టించుకున్న కుల, మతాల రొంపే.. మనిషిని మనిషిగా బతుకనివ్వకుండా రాక్షసత్వం వైపు నెట్టేస్తోందని నమ్మినవాడు… కాలుతున్న కట్టే చచ్చేనాడు కావలని తెలిసిన అనుభజ్ఞుడు. తన 27 ఏళ్ల కాటికాపరి అనుభవంలో కుల, మతాలకతీతంగా… ఎన్నో అనాథశవాలకు అన్నీ తానై అంత్యక్రియలు చేసిన అల్లా అంశతో కాటికాపరి పనినీ ఓ గర్వకారణంగా మార్చిన శివపుత్రుడు.. పద్మశ్రీ మహ్మద్ షరీఫ్ అకా.. అలియాస్ షరీఫ్ చాచా.
ఉత్తరప్రదేశ్ అయోధ్య నివాసి అయిన షరీఫ్ చాచా. ఫైజాబాద్ లో సైకిల్ పంక్చర్లు వేస్తూ జీవించే బతుకు. కానీ, అలాంటి వ్యక్తి పద్మశ్రీ అవార్డ్ కు ఎంపిక కావడమే భారతజాతిలో కనిపించే వైవిధ్యం, ఔన్నత్యం. సైకిల్ పంక్చర్లేంటి… పద్మశ్రీ ఏంటీ…? అసలు మతుండే మాట్లాడుతున్నారా అనిపిస్తుండొచ్చు. కానీ కొన్ని సంఘటనలు మనుషుల్ని కదిలిస్తాయి. ఆ కదలిక ఎలా ఉంటుందంటే… అచ్చూ షరీఫ్ చాచాలాగా! వారు చేస్తున్న సేవెలాంటిదో కూడా తెలియకుండానే దిగంతాలకు పాకే వారి ఖ్యాతంత!!
ఔను.. స్వయానా తన సొంత కొడుకే దుర్మరణం పాలై… రైల్వే ట్రాక్ మీద పడి… జంతువులన్నీ పీక్కుతిన్న పరిస్థితిలో గుర్తుపట్టలేకుండా చాచా కళ్లల్లో పడింది. అదిగో అక్కడ మొదలైంది చాచా కాటికాపరి ప్రస్థానం. తన కొడుకులా ఇంకెవ్వరూ దిక్కులేని చావు చావొద్దన్న తపనలోంచి ప్రారంభమైంది… ఈ హరిశ్చంద్రుడి వైకుంఠధామ నిరీక్షణ.

అలా 27 ఏళ్లల్లో 25 వేల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు షరీఫ్ చాచా. చనిపోయినవారి కులమేంటో, మతమేంటో జాన్తానై అన్నాడు. ముందు మనం మనుషులమంటాడు. ఆ తర్వాత మనమేర్పచుకున్నవే ఈ కుల, మతాలడ్డుగోడలంటాడు చాచా. అందుకే రోడ్లపై అనాథల్లా యాక్సిడెంట్లలో మృతి చెందినవారెందరికో అన్నీ తానై అంత్యక్రియలు చేశాడు. ఆ మృతదేహాలను తన సైకిళ్లపై, లేదా వాటికోసం ఏర్పాటు చేసుకున్న ఓ రిక్షాలాంటి వాహనంపై తీసుకెళ్లి మరీ అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. అలా తీసుకెళ్లే క్రమంలో ఈ సభ్య సమాజం ఎన్నోసార్లు చాచాను చూసి పిచ్చివాడు అనుకుంది. కానీ చాచా భావనలో ఈ గొర్రెధాటి సమాజమే పిచ్చిదని.. ఈ సభ్యసమాజానికి తెలియకపోయుండొచ్చు!
షరీఫ్ చాచాకు తెలియకుండానే ఆయన చేస్తున్న అంతిమసేవలు మాత్రం నిఘావర్గాల ద్వారా ప్రభుత్వం దృష్టిలో పడ్డాయి. అందుకే షరీఫ్ చాచా తీసుకొచ్చే మృతదేహాలే కాకుండా… 72 గంటల్లో మృతులెవరో తెలియని శవాలను కూడా రైల్వే స్టేషన్లు, ఊరిశివార్లలో నమోదైన డెత్ కేసుల్లో చాచాకు అప్పగించేవారట ప్రభుత్వాధికారులు. అలా తన దృష్టికి వచ్చిన ఏ శవాన్నీ అనాథలా విగతజీవిలా పోనివ్వకుండా… అంతిమ సంస్కారాలతో సాగనంపిన సంస్కారవంతుడు మహ్మద్ షరీఫ్.
షరీఫ్ చాచా వద్దకు ఓరోజు ఓ పోలీసాయన వచ్చి… తన వెంట రమ్మన్నాడట. ఎందుకు నేనేం నేరం చేశానంటే చెప్పా పెట్టకుండానే బలవంతంగా తీసుకెళ్లాడట. వెళ్లిందేమో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి. వెళ్లగానే ఏమవుతుందో, ఏమోనన్న ఒకింత తెలియని అపరాధ భావంతో బాధపడుతూనే లోనికడుగుపెట్టిన చాచాకు కలెక్టర్ నుంచి పుష్పగుచ్ఛమందిందట. మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించిందని చాచాకు చెప్పడంతో… ఎప్పుడూ శ్మశాన వైరాగ్యంలోనే జీవిత సగభామంతా గడిపిన ఆ బతుక్కి… చల్ల తిమ్మెరగాలిలా ఏదో ఉరట కల్గిందంటాడు చాచా.
కానీ చాచా గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉన్నాడు. కుటుంబం కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. స్థానిక బీజేపి ఎంపీ లల్లూసింగ్ రికమండ్ చేయడంతో… షరీఫ్ చాచాకు పద్మశ్రీ దక్కింది. అయితే ఇప్పుడు పద్మశ్రీ వచ్చిందన్న సంతోషం కన్నా… పూట గడవని స్థితిలో ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతూ బాధపడుతోంది. చాలామంది, చాలా సంస్థలూ ఫండ్స్ కూడా సేకరించి వీలైనంత సాయమందిస్తూనే ఉన్నాయి. పద్మశ్రీ బదులు తమకు ఇంత పెన్షనిచ్చినా బాగుండుననే బాధ.. మరోవైపు ఆయన కొడుకులోనూ వ్యక్తమైంది. అలాంటి చాచా 2020, నవంబర్ 8వ తేదీన రాష్ట్రపతి రామ్ నాాథ్ కోవిద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్నందుకుని… ఒక యునిక్ పర్సనాలిటీగా అందరి మన్ననలూ చూరగొన్నాడు. మరణించినవారికి తాను చేస్తున్న సేవతో… పుట్టిన బతుక్కి ఓ సార్థకత చేకూర్చిన కథయ్యాడు.



