Mani Bhushan.. ✍🏼
……………………………………………
ఈ రోజు (sep 13)న ఆత్రేయ వర్ధంతి.
ఆత్రేయ… అలతి పదాల రాత్రేయ!
…………………………………………………………………………………………………..
ఆత్రేయ… అలతి పదాలతో అందంగా రాయగల గేయకర్త. శ్రీవైష్ణవ సంప్రదాయంలో మధురభక్తితో ప్రణయ, సరస, విరహ, హృద్గీతాలను రమ్యంగా రాసి మెప్పించిన రాత్రేయ.
ఆయన మధుర భక్తి ఎంతటిదంటే… దేవుణ్ణిసైతం క్షణం ఆలస్యం చేస్తే “ఉన్నావా అసలున్నావా…?” అని నిలదీయగలడు. “ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు, ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు” అని దేవుడికే పరీక్ష పెట్టగలడు (bhakta tukaram).
మహాలక్ష్మితో ఆవుదూడలను అమ్మిస్తూ…”మనిషికున్న తెలివున్నది, మనిషిలోని చెడులేనిది; కొందామని కొమ్ముపడితె కుమ్ముతుంది, కోరుకున్న వారివెంట గోవులాగె వస్తుంది” అనిపించారు (sri venkateswara mahatmyam).
.
ప్రేమ గీతం రాసినా అదే ఒరవడి.

“చేయి చేయి కలిసింది హాయి హాయిగా ఉంది”అంటూ తెరమీద హీరోహీరోయిన్లు(koduku-kodalu) పాడుతుంటే, ప్రేక్షకుడు పరవశించాల్సిందే.
గాజుల కిష్టయ్యతో “రేపు ఎంతో తీయనిది, నేటికన్నా కమ్మనిది; మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నది” అంటూ ప్రేయసీప్రియుల భవితకు బాట వేశాడు.
కేవలం ఇద్దరినడుమ సంభాషణలా సాగే ప్రణయగీతంలో “నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటీ వేయించి నేనే ఓడి నీదే గెలుపంటీ” అనిపించాడు (manchi-chedu).
మాయదారి మల్లిగాడు పాడితే ఇలాగే ఉంటుందన్నట్టుగా…”పొద్దుపోని సూరీడు పొంచి పొంచి సూస్తుంటే, ముద్దు మొగం మీద నీటిముత్యాలు మెరుస్తుంటే, నీ సొగసులకు బానిసనే పిల్లో” అని దాసోహపరిచాడు.
.
ఆత్రేయను బూతు రచయితని ఈసడించుకుంటారుగానీ, ఆయన కలం చిందించిన శృంగారాన్ని గుర్తించరు. “రేయి గడిపిన హాయినంతా మనసు నెమరు వేసెరా…” అని కొత్త వధువుతో పలికించాడు (illalu).
.
లోకం పోకడలు ఆత్రేయకు తెలిసినంతగా ఎవరికీ తెలీవు. ఆయన కలానికి ప్రేమ లోతులు తెలుసు, మనిషి నైజం తెలుసు, మనసు వెతలు తెలుసు, గుండె గాయం తెలుసు; కలతలు, కన్నీళ్ళు, కలిమి లేములు, సుఖ దుఖాలు, కష్టసుఖాలు అన్నీ ఆత్రేయ కలంలో సిరాగా మారాయి.
“అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం” అని ఈసడించుకున్నాడు. “వయసు కాస్త దాటినాక మనసున్నా వ్యర్థము” అని ‘అంతులేని కథ’లో బోధించాడు.
ఎడబాటులోని సుఖాన్ని అనుభవించే ప్రేయసితో “మన గాథ యువతరానికి కావాలి మరోచరిత్ర” అని ఆశించేలా చేశాడు.
మగాళ్ళు ఎంత దొంగనాయాళ్ళో చెబుతూ…”రవ్వంత పసుపు కాసింత కుంకుమకు మగవాడిని నమ్మడం, మనిషి చేయడం; మనసు నిదర లేపడం, మమత నింపడం; ఆ పనిలో బతుకంతా అరగదీయడం, కన్నీళ్ళే నవ్వుగా మార్చుకోవడం… ఇదే పనా మీకూ? ఇందుకే పుట్టారా?” అంటూ ఆడాళ్ళూ మీకూ జోహార్లు అన్నాడు.
ఒన్ సైడ్ లవర్సుని “ప్రేమంటే తెలుసా నీకు? తెలియందే ప్రేమించకు” అని నిగ్గదీశాడు (ravanude ramudaite).
.
ఆత్రేయ పాటలన్నీ పొడి పొడి మాటలతో అల్లుకుంటాయి. లోతైన భావంతో కుదిపేస్తాయి. గంభీర పదాలుండవు, పదాలతో చెడుగుడు ఆడాలనే కుతి ఉండదు.
సంప్రదాయ కీర్తన పద్ధతిలో పల్లవి, దానికి అనుసరణగా అనుపల్లవి, ఎత్తుగడకు కొనసాగింపుగా చరణాలు… అన్నీ కుదురుగా తలదువ్వి జడ అల్లినట్టుగా ఉంటాయి.
అంగడి బొమ్మ బతుకును, మనోగతాన్ని…”జాబిల్లి వెన్నెల్లు చవిచూడలేదు, సిరిమల్లె పువ్వులు సిగ ముడువలేదు; కనులార ఒక రేయి కునుకైన లేదు, మనసార మాటాడ మనిషైన లేడు; బతుకంత మరుభూమి కాగా, ఆమె మిగిలింది ఒక గాధగా” అన్నాడు.
వన్నెచిన్నెలన్నీ ఉన్న చిన్నదానికి మనసివ్వాల్సిన పద్ధతి ఎలా చెప్పాడంటే… “అందనిదైనాగానీ నరులందరు కోరుదురందాన్ని; తూకం వేసి పాకం చూసి డెందం ఒకరికె ఇవ్వాలి” అన్నాడు (vagdanam).
.
రీమేక్ సినిమాలకు పాట రాసినా భావం తొణక్కుండా బెణక్కుండా జాగ్రత్త పడ్డాడు.
కోడెనాగుతో పాత ప్రేయసి…”తొలి రేయి విరి పాణ్పు ముళ్ళనే పరిచింది, కసటు కోరిక మగని రూపాన నిలిచింది; నీ పేరు మెదిలిన మధురాధరముపైన చిరుచేదు చిలికింది, జీవితమె మారింది” అని చెప్పింఛాడు.
అంతులేని కథలో “తానే మంటయి వెలుగిచ్చు దీపం, చెప్పదు తనలో చెలరేగు తాపం; నే వెళ్ళు దారి ఓ ముళ్ళదారి, రాలేరు ఎవరూ నాతో చేరి” అని హీరోయిన్ పరిస్థితిని ఒక్క చరణంలో చెప్పేశాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు.



