ఎవరీ మన్సూరీ..? అసోం వరదల్లో ఎందుకీయన చర్చ..?

ఫిలాంత్రోపిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హుస్సేన్ మన్సూరి ఇప్పుడు ఎందుకు వైరల్ టాపిక్ అవుతున్నాడు..? హృదయ విదారకమైన అసోం వరదలు చూసి చలించనివారుండరు. కానీ, ఆ ఆవేదనకు ఓ కార్యరూపమిచ్చి తనకు తోచినంత సాయమందిస్తున్నాడు హుస్సేన్ మన్సూరి. మానవత్వం ముందు కులాలు, మతాలు, ప్రాంతీయతలు ఎంత చిన్నవో మన్సూరీ సాయం చెబుతున్న పాఠమిది.

మన్సూరీ అసోంకు వెళ్లి సాయమందించడం వెనుక ఆయనకు వచ్చే లాభాలేంటి..? తానేమన్నా భవిష్యత్తులో అక్కడి నాయకుడిగా పోటీ చేస్తాడా.. లేక, అసోంలో వరదల సాయంతో ఆయనకేమైనా దేశంలో ఎక్కడైనా నిలబడమని సీటిస్తారా..? లేక, అసోం వరదల్లో తాను చేసే సాయంతో పాప్యులరైపోదామనుకుంటే.. ఆయన ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి. కానీ, మానవత్వం.. అదే మన్సూరీని అస్సాం వరదల వరకూ తీసుకెళ్లింది.

తనతో పాటు కొందరిని వెంటబెట్టుకు వెళ్లిన హుస్సేన్ మన్సూరి తీవ్ర ప్రభావిత ప్రాంతాలను సందర్శించాడు. బాధిత కుటుంబాలకు పడుకోవడానికి పడకలు అందించాడు. బురద దారుల్లో బాధితుల కోసం బెడ్స్ మోసుకుంటూ ఇంటింటికీ వెళ్లాడు. తాత్కాలిక ఆశ్రయ శిబిరాలకు చేరుకుని వరద బాధితులకు తానందించే సాయం తన ఇన్ స్టాలో పంచుకున్నాడు.

ఒకవైపు భారీ వాన.. ఇంకోవైపు జారుతున్న నేల… అలాంటి ఇబ్బందులన్నీ ఎందుకు పడాలి..? కానీ, ఎక్కడో హృదయాన్ని కలిచివేసిన అసోం దృశ్యాలు.. మన్సూరిని కదిలించాయి. కానీ, హాయిగా వెళ్లిరావడానికి ఇప్పుడు అసోం ఏం టూరిస్ట్ ప్లేస్ కాదు… డార్క్ టూరిస్ట్ స్పాట్. అయినా, పట్టు వదలని విక్రమార్కుడిలా ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ అసోం బాధితులను కలిసి వాళ్ల ఇళ్లల్లో, టెంట్లల్లో చాపలు, బెడ్స్ ఏర్పాటు చేసి, వాటిపై బెడ్ షీట్స్ వేసి మరీ ఇచ్చి వచ్చాడు. అలా వెళ్లుతున్నప్పుడు కొన్నిచోట్ల జారి పడిపోయే ప్రమాదాలూ తప్పలేదు. కానీ, వాటన్నింటినీ అధిగమించి ఆ వరద బాధితుల బురద బతుకులకు ఇంత ఆసరా కావాలన్న సంకల్పమే మన్సూరీని ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోను చేసింది.

ఆపదలో, ముప్పులో ఉన్నప్పుడు అందించే ఒక చిన్న సాయం.. ఎంతోమందిని కృతజ్ఞులను చేయగలదు. అలాంటి దృశ్యాలే అసోంలో మన్సూరి వెళ్లిన ప్రతీచోటా కనిపించాయి. ఆయన అందించిన సాయం పొందినవారి ముఖాల్లో ఆనందంతో కూడిన చిర్నవ్వులు దర్శనమిచ్చాయి. కృతజ్ఞతగా ఆయన్ను ఆలింగనం చేసుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కొందరైతే పాదాలు తాకి మొక్కే విజువల్స్ అక్కడి పరిస్థితులను, దృశ్యాలను కళ్లకు కట్టాయి.

ఇటీవల వచ్చిన వరదలతో అసోం అతలాకుతలమైంది. ఇంకా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా తెలియని దైన్యస్థితి. ఇలాంటి సమయంలో అక్కడి సర్కార్ ఒక్కో కుటుంబానికి తక్షణ సాయంగా 75 వేల రూపాయల చొప్పున తొలివిడత సాయాన్ని విడుదల చేసింది.

ఒకవైపు ఎగువ అసోంలో వరదల కారణంగా 85 మంది మరణించారు. శివసాగర్ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. చరైదియో, జోర్హాట్ జిల్లాలదీ ఇదే దైన్యస్థితి. ప్రస్తుతం అసోం ప్రభుత్వం 5 ప్రభావిత జిల్లాల్లో 54 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, బాధితులకు కావల్సిన మౌలిక సదుపాయాలనందిస్తోంది. 14 వేల మంది బాధితులకు ఆశ్రయం కల్పించింది. ఇలాంటి సమయంలో సర్కార్ సేవలను కూడా మరిపించేలా ఒక వ్యక్తి తన బృందంతో చేస్తున్న సాయం సోషల్ మీడియాలో వైరల్ కావడమంటే… స్పందించే హృదయానికి మన్సూరీ ఓ ప్రతీకలా నిల్చినట్టే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles