ఇవాల్టి కాలంలో విద్యా, వైద్యం ఎంత ఖరీదైనవో అందరికీ తెలిసిందే. ఖరీదైన విద్యా, వైద్యంతోనే మంచి చదువందుతుందని, సరైన చికిత్స జరుగుతుందనీ జనంలో సర్వసాధారణంగా బలపడ్డ నమ్మకం కూడా. ఓవైపు కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ ముక్కు పిండి పిల్లలకు ట్యూషన్ ఫీజులు వసూళ్లు చేస్తుంటే… రోగి కోలుకునే వేగం కంటే ఎక్కువగా కార్పోరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ రోగులను దోచుకుంటున్నాయి. అందుకే, పిల్లలు బాగా చదివి పెద్ద ఉద్యోగాలు చేయాల్సిన ఆలోచనల కంటే.. అసలా చదువులు చదివించేందుకే ఎక్కువ ఆలోచించాల్సిన పరిస్థితి తల్లిదండ్రులది. ఇక వచ్చిన వ్యాధి కంటే ఆ వ్యాధి నయం కోసం ఆసుపత్రికెళ్లాక ఫీజుల సంగతేంటని ఆందోళన చెందే పరిస్థితి కుటుంబీకులది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే తన పాఠాలతో సామాజిక మాధ్యమ ఉపాధ్యాయుడిగా అవతరించిన ఓ గురువు.. ఇప్పుడు ఆసుపత్రిని కూడా నెలకొల్పి సామాజిక వైద్యుడిగా కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆయనే ఈ స్టోరీ హీరో ఖాన్ సాబ్.

ఖాన్ సార్.. ఇప్పటికే లక్షల మంది విద్యార్థులకు సుపరిచితుడు. ఏళ్లుగా ఈయన యూట్యూబ్ పాఠాలతో కరెంట్ అఫైర్స్, హిస్టరీ వంటి అంశాలపై సులభంగా అర్థమయ్యేలా బోధన చేస్తూ వైరల్ అయ్యారు. సరళత ఖాన్ సార్ శైలి. కఠినమైన పదజాలం, భాషకు భిన్నంగా, ఎంత పేరు సంపాదించినా అహంకారం తలకెక్కించుకోకుండా.. విద్యార్థులడిగే ప్రశ్నలన్నింటీ ఆన్లైన్ లో సమాధానాలిస్తూ బోధిస్తున్న సూపర్ టీచర్ ఖాన్ సార్.
ఇంతకాలం విద్యపై దృష్టి పెట్టి తన ఆన్లైన్ పాఠాలతో తరగతి గదిపైనే దృష్టి పెట్టిన ఖాన్ సార్ దృక్కోణం ఇప్పుడు వైద్యంపైకి మళ్లింది. ఎందుకంటే, సమాజంలో విద్యా, వైద్యం ఈ రెండు ఎంత ప్రధానమైనవో గుర్తించాడు. అందుకే, ఇంతకాలం ఆన్లైన్ పాఠాలకు మాత్రమే పరిమితమైన ఖాన్ సార్.. ఇప్పుడు హాస్పిటల్ ను కూడా నిర్మించి ఉచిత వైద్యానికి తెరతీశారు.
పాట్నాలో ఖాన్ సార్ ఆసుపత్రి!
ఎటువంటి ఘనమైన ప్రారంభోత్సవాల్లేవు. ప్రముఖులతో రిబ్బన్ కట్టింగ్స్ కనిపించలేదు. ఎలాంటి ఆడంబరం లేని నిరాడంబరతతో హాస్పిటల్ ను ప్రారంభించారు ఖాన్ సార్. ప్రజారోగ్యమనేది ఇవాళ బ్యాంక్ బ్యాలెన్స్ పై ఆధారపడ్డ రోజుల్లో.. అది సరికాదని నమ్మి ఖాన్ సార్ ఈ హాస్పిటల్ నిర్మించడం ఇంతకాలం విద్యకు ప్రాధాన్యతనిచ్చిన ఆయన వైద్యానికీ ఇస్తున్న ప్రాధాన్యతెంతో పట్టిచూపేది. వినడానికి కొందరికి పెద్ద గొప్పగా అనిపించొచ్చో లేదోగానీ… మానవ సమాజంలో ఇదో విప్లవాత్మక చర్య.
సోషల్ మీడియాలో వైరల్ గా హాస్పిటల్ లోని ఓ సంఘటన!
ఈ మధ్య ఖాన్ సార్ నిర్మించిన హాస్పిటల్ లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. మరో ఆసుపత్రి నుంచి ఖాన్ సార్ హాస్పిటల్ కు ఓ రోగిని రిఫర్ చేశారు. సదరు పేషంట్ ఎంఆర్ఐ కోసం వచ్చాడు. మధ్యాహ్నం వచ్చిన అతడికి రాత్రి ఒకటిన్నర వరకూ ఎంఆర్ఐ కోసం వేచి చూడాల్సి వచ్చింది. అప్పటికే సదరు పేషంట్ అలసిపోయాడు. అసహనంతో ఎప్పుడు పడిపోతాడా అన్నట్టున్నాడు. వెంటనే ఆ పేషంట్ ఖాన్ సార్ దగ్గరకు వెళ్లాడు. ఏంటిసార్ ఇంత సమయం వెయిట్ చేయాలా అని నిట్టూర్పులోనే ఒకింత ఆవేదనతో ప్రశ్నించాడు.
ఖాన్ సార్ ఆ ఫిర్యాదుదారుడితో ప్రతివాదనలకు దిగలేదు. ఆ సమయానికి ఎంబీబీఎస్ వైద్యులంతా అక్కడే ఉన్నారని, రోగులకు సేవలందిస్తున్నారని నచ్చజెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత తనే అనవసరంగా అసహనంతో అతి కోపానికి గురైనట్టు సదరు పేషంట్ గ్రహించి క్షమాపణ చెప్పాడు. ఆ తర్వాత ఆ పేషంట్ కు సంబంధించిన ఎంఆర్ఐ పరీక్షలు, ట్రీట్మెంట్ నూ వెంటనే మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఈ సంఘటన చాలా మందిని టచ్ చేసింది. ఒక అలసిపోయిన రోగి తాలూకు భావోద్వేగాన్ని అర్థం చేసుకుని… అతడి సమస్యను పరిష్కరించిన తీరు అప్లాజ్ అందుకుంది.

ఖాన్ సార్ హాస్పిటల్ నిర్మాణం వెనుకున్న మోటో ఏంటి..?
ఇవాళ బయట మార్కెట్ లో వేలకు వేలు పోస్తేనేగానీ, సీటి స్కాన్, ఎంఆర్ఐ వంటి పరీక్షలకు నోచుకోలేని కాలంలో… ఖాన్ సార్ నిర్మించిన హాస్పిటల్ లో ఎక్స్ రేకు 35 రూపాయలు, కిడ్నీ పరీక్షలకు 17 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. ఇవాళ రోగాలు వచ్చినా తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు, చికిత్సలు వద్దనుకుని విషయాన్ని దాస్తున్నవారున్న కాలంలో.. ఖాన్ సార్ నిర్మించిన హాస్పిటల్ లో పరీక్షల నుంచి వైద్య చికిత్సల వరకు పేద, మధ్య తరగతికి అందుబాటులో ఉండే నామినల్ ఫీజులే వసూలు చేయడమంటే మాటలేం కాదు.
త్వరలోనే డయాలసిస్ సెంటర్, ఆపరేషన్ థియేటర్స్, మరిన్ని వైద్య సదుపాయాలతో ఖాన్ సార్ హాస్పిటల్ పేద, మధ్య తరగతి వైద్యశాలగా ఓ కొత్త మార్గదర్శనం చేయబోతోంది. రోగులు అప్పు గురించి ఆలోచించకుండా ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఆసుపత్రికి రావాలన్నదే ఖాన్ సార్ హాస్పిటల్ వెనుకున్న మోటో.
జీఎస్ రీసెర్చ్ సెంటర్ పేరిట పోటీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేసే ఉపాధ్యాయుడిగానే ఇప్పటివరకూ పరిచయమున్న ఖాన్ సార్.. ఇప్పుడు వైద్యరంగంలోకి అడుగుపెట్టి తన చేతనైనంతలో విద్యా, వైద్యాన్ని తానే దిక్సూచై తక్కువలో అందించే యత్నం చేయడం అభినందనీయం. ఇప్పటికే విపరీతమైన ప్రజాదరణ సంపాదించుకున్న ఖాన్ సార్ లో తన వ్యక్తిగత జీవిత ఎదుగుదలను మించి సమాజం పట్ల ఆలోచన ఉండటం గమనించాల్సిన విషయం.
వివిధ రంగాల్లో విజయాలు సాధించి దానాలు, ధర్మాలు చేసేవారెందరో ఉన్నారు. కానీ, తన విజయంతో సమాజంలో పేరుకుపోయిన ప్రధాన సమస్యలను నివారించడానికి, పరిష్కరించడానికి ఖాన్ సార్ చేస్తున్న ప్రయత్నం నల్గురిలో ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టేది.
విద్య అంటే పరీక్షలు పాస్ కావడం, ర్యాంకులు సాధించడమే కాదు.. మరో నల్గురు అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేయడమే కాదు… మానవ సమాజ రుగ్మతలను గుర్తించడం.. ఆ రుగ్మతలపై పోరాటానికి సిద్ధపడటం… తద్వారా తనకు వీలైనంతగా సమాజానికుపయోగపడటం.. ఇవన్నీ ఖాన్ సార్ కెరీర్ మనకు చెప్పే పాఠాలు.
ఇవాళ విజయమంటే డబ్బు లేదా పలుకుబడి అనుకుంటున్న రోజుల్లో… ఖాన్ సార్ నిర్మించిన ఈ ఆసుపత్రి ఇప్పుడు ఈ సమాజానికి అంతకుమించిన ప్రశాంతమైన సందేశమేదో ఉందని చెబుతోంది. మనుషుల జీవితాలను మెరుగుపర్చినప్పుడు మాత్రమే మనం సాధించిన జ్ఞానం విలువైందనే సందేశాన్నీ ఇస్తోంది.


