విజేతగా మారినా వివాదాలే! మనూభాకర్.. ఎప్పుడూ ఓ చర్చే!!

ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ కు షార్ట్ లిస్ట్ కాకపోవడంతో ఇప్పుడు మనూభాకర్ పేరు మరోసారి తెరపైకొచ్చింది. తన తండ్రి రామ్ కిషన్ ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు.. రకరకాల చర్చలకు ఆస్కారిమిస్తోంది. మనూ కూడా x వేదికగా తన గోల్ దేశం కోసం మెడల్స్ సాధించడం మాత్రమేనంటూ తన ఫీలింగ్స్ షేర్ చేశారు. అవార్డ్స్ అనేవి మనల్ని మరింత ప్రోత్సహించేవని, గుర్తింపునిచ్చేవే తప్ప.. అవే మన లక్ష్యం కాదు. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు దరఖాస్తు చేసుకోకపోవడం తన నుంచే జరక్కపోవడం వల్ల ఇదంతా జరిగుండొచ్చు. అవార్డ్స్ తో సంబంధం లేకుండా దేశం కోసం నేను సాధించిన మెడల్స్ తో నేను సంతృప్తిగా ఉన్నా, గర్వపడుతున్నా.. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ మనూ xలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి భారతదేశం కోసం రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన ఏకైక మహిళగా కూడా మనూభాకర్ ది రికార్డ్. ఇప్పుడు అవార్డ్ విషయంలోనే కాదు.. తన కెరీర్ విషయంలోనూ మనూ పంతం ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలో తన కోచ్ జస్పాల్ రాణా కూడా మనూను ధ్యాన్ చంద్ ఖేల్ రత్నాకు షార్ట్ లిస్ట్ చేయకపోవడంపై నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ పై విమర్శలు గుప్పిస్తున్నాడు.

అయితే ఇదే జస్పాల్ రాణా, మనూ కొంతకాలం ఉప్పునిప్పులా ఎలా విభేదాలతో గడిపారు… ఒక లక్ష్యం వారి మధ్య పంతాన్ని ఎలా పటాపంచలు చేసిందో కూడా ఒక్కసారి గతంలోకి వెళ్లి తెలుసుకుందాం.

పారిస్ ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారతీయ మహిళగా మనూభాకర్ ఓ సంచలనం. వార్తల్లో వైరల్. సాధారణంగా క్రీడాకారులతో పాటు.. ఆ సందర్భంలో వారి కోచెస్ ఎవరూ అనే చర్చ కూడా వస్తుంటుంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో మనూ విజయం వెనుకున్న కోచ్ ఎవరనే చర్చ నుంచి.. కోచ్ రాణాకు, తన శిష్యురాలైన మనూకు మధ్య నెలకొన్న వివాదంపైనా చాలాకాలం చర్చ జరిగింది. వారిద్దరినీ ఓ కుదుపు కుదిపేసిన ఆ వివాదమేంటి..?

రాణా వర్సెస్ భాకర్! అసలేం జరిగింది..?

మొట్టమొదటిసారి 2018 కామన్ వెల్త్ గేమ్స్ కంటే ముందు జస్పాల్ రాణాతో మనూభాకర్ కు గురు, శిష్యుల బంధమేర్పడింది. అదే భాకర్ షూటింగ్ కెరీర్ లో ఓ కీలక ములుపు కూడా. అలా 16 ఏళ్ల ప్రాయంలోనే గోల్డ్ మెడల్ సాధించిన మహిళా షూటర్ గా మనూభాకర్ వార్తల్లోకెక్కింది. కోచ్ గా రాణాతో మనూభాకర్ శిష్యబంధం మరింత బలపడింది.

2019లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించిన వరల్డ్ కప్ గేమ్స్ లో.. మనూభాకర్, సౌరభ్ చౌదరీతో కలిసి సాధించిన ఐదు బంగారు పతకాలు భాకర్ లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అదే సమయంలో మనూభాకర్ కు.. తన కోచ్ జస్పాల్ రాణాతో విభేదాలూ మొదలయ్యాయి.

ఒకేసారి పదిమీటర్ల పిస్టల్ షూటింగ్ తో పాటు.. మిక్స్ డ్ డబుల్స్ లోనూ పార్టిసిపేట్ చేస్తూ.. మరోవైపు 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ కూ సిద్ధమవ్వడమంటే… ఓ యంగ్ షూటర్ కు అయ్యే పని కాదనేది కోచ్ జస్పాల్ రాణా తన అభిప్రాయాన్ని మనూ ముందుంచాడు. కానీ, దాన్ని మనూభాకర్ అంగీకరించలేకపోయింది. జస్పాల్ రాణా శిష్యురాలిగా వైదొలిగింది. అదే సమయంలో మనూభాకర్ తీవ్ర మానసిక ఒత్తిడికీ గురైంది. తన కోచ్ అన్న మాటలతో… తనతో విభేదాలేర్పడ్డాక తనపైన తనకే నమ్మకం లేనంతగా ఒక దశలో కృంగిపోయింది.

కోచ్ జస్పాల్ కు ఘాటైన సందేశం!

2021 వరకూ కూడా ఆ విభేదాలు కోచ్ రాణాకూ, శిష్యురాలైన భాకర్ కూ మధ్య అంతర్గతంగానే కొనసాగాయి. ఆ సమయంలో ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ కోసం న్యూఢిల్లీలో మార్చ్ 21, 2021లో జరుగుతున్న వరల్డ్ కప్ సమయంలో అవి తారాస్థాయికి చేరి డ్రమటిక్ గా మారాయి. తన కోచ్ తన పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి తట్టుకోలేక కోపంతో మనూభాకర్ తన అసంతృప్తిని చాటుతూ ఫోన్ లో రాణాకు ఓ సందేశాన్ని కూడా పంపింది.

ఇంతకీ ఏంటా సందేశం..?

ఇప్పుడు మీకు సంతోషమేనా…? అభినందనలంటూ ఇంగ్లీష్ లో టైప్ చేసి పంపిన ఆ మెస్సేజ్ రాణాను ఒకింత అసహనానికి గురిచేసింది.

రాణా చర్యతో మరో టర్న్ తీసుకున్న ఎపిసోడ్!

అయితే, ఆ డ్రామా అక్కడితో ఆగిపోలేదు. ఆరోజు జరిగిన 10 మీటర్ల షూటింగ్ లో చింకీ యాదవ్ గోల్డ్ మెడల్, మనూభాకర్ కాంస్య పతకం సాధించారు. అదిగో అప్పుడు కోచ్ జస్పాల్ రాణా మనూభాకర్ తనకు పంపిన సందేశాన్ని తన టీషర్ట్ పై బాహాటంగా వెనుక వీపుపై డిస్ ప్లే చేయడం మరింత నాటకీయ పరిణామాలకు దారితీసింది.

ఆ పరిణామం మనూభాకర్ కంటే కూడా భారత్ తరపున సుమారు 600 జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధించిన షూటర్ గా.. కామన్ వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారుడిగా… తీవ్ర జ్వరంలోనూ స్వర్ణాన్ని ముద్దాడిన యోధుడిగా… షూటింగ్ పై తనకున్న అంకితభావంతో ఏర్పాటు చేసిన డెహ్రూడూన్ లోని జస్పాల్ రాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టెక్నాలజీ నిర్వాహకుడిగా.. మనూభాకర్ వంటి అప్ కమింగ్ షూటర్స్ కు కోచింగ్ ఇస్తున్న కోచ్ గా రాణాకే మైనస్ గా మారింది. దాంతో తన కోచ్ పదవే పోయింది. దాంతో రాణా మూడేళ్ల పాటు ప్యారిస్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న పట్టణంలో ఓ నిరుద్యోగిగా కాలాన్ని గడుపాల్సి వచ్చింది.

టోక్యో పరాజయం తర్వాత మనూలో పరివర్తన!

కానీ, మనూభాకర్ లో వచ్చిన పరివర్తన కారణంగా… ప్యారిస్ ఒలింపిక్స్ కు ముందు రాణానే మళ్లీ తన కోచ్ గా ఉండాలని భావించింది. ఎందుకంటే గతంలో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో మనూభాకర్ సరైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఆ పరాజయం ఆమెను వెంటాడింది. దాంతో జరిగిందేదో జరిగిపోయిందనుకుని.. మళ్లీ గురువు జస్పాల్ రాణాను ఆశ్రయించింది. అందుకు ఆయనా ఒప్పుకున్నాడు. అలా ప్యారిస్ ఒలింపిక్స్ పిస్టల్ షూటింగ్ కు మళ్లీ రాణానే గురువయ్యాడు.

పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ సమయంలో కూడా తననే గమనిస్తున్న కోచ్ వైపు ఓ లుక్కేసిన మనూ.. ఆ తర్వాత తన కోచ్ ను చూశాక సమకూరిన ధైర్యంతో తాను గురి తప్పకుండా లక్ష్యం వైపు దృష్టి సారించింది. స్వర్ణమో, రజతమో రాలేదన్న ఓ బెంగ ఉండవచ్చుగాక.. కానీ, తనకు కోచ్ తో ఏర్పడ్డ విభేదాల తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లిన మనూ… మళ్లీ తిరిగి పుంజుకుని కాంస్యాన్ని సాధించింది. వ్యక్తిగత విభాగంలో కాంస్యంతో పాటు.. డబుల్స్ లో కూడా కాంస్యాన్ని సాధించి.. విశ్వక్రీడల్లో షూటింగ్ విభాగంలో మొట్టమొదటగా రెండు కాంస్యాలందుకున్న భారతీయ మహిళా షూటర్ గా చరిత్ర సృష్టించింది.

తమ మధ్య నెలకొన్న వివాదాన్ని గతంలో రివీల్ చేసిన రాణా!

ప్యారిస్ లో మనూభాకర్ సాధించిన విజయాలపై తన సంతృప్తిని వ్యక్తం చేసిన జస్పాల్ రాణా.. అప్పుడు తన శిష్యురాలికి అభినందనలూ తెలిపాడు. తన శిష్యురాలిగా మనూభాకర్ గెలుపు జస్పాల్ రాణాలోనూ ఆనందానికి కారణమయ్యాక రాణా కూడా ఇండియాకు తిరిగి రావాలనుకున్నాడు. ఎందుకంటే అప్పటికే తన ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బాగా లేకపోవడం.. తనకు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచిగానీ.. లేదా, ఏ ఇతర ఎజెన్సీల నుంచిగానీ నెలవారీ జీతం కూడా అందని పరిస్థితుల్లో తన లైఫ్ స్టోరీని RevSportz అనే పత్రికతో పంచుకున్నారాయన.

మనూభాకర్ విజయం జస్పాల్ రాణాకు ఆనందాన్నిచ్చినా.. ఆ విజయం వెనుక తన ప్రోద్భలం, ప్రోత్సాహమున్నా… ఇప్పుడు తను మాత్రం కేవలం మనూభాకర్ వ్యక్తిగత కోచే తప్ప… క్రీడావిభాగంలో ఎలాంటి ఉపాధి లేని ఓ నిరుద్యోగి.

వివాదం నుంచి విజయం వైపుకు!

పాయింట్ బ్లాంక్ లో ఏర్పడ్డ విభేదాలు.. గురుశిష్యుల జీవితాలనే మార్చేశాయి. ఈగోస్ ను పక్కనబెట్టి మనూభాకర్ మళ్లీ తన వ్యక్తిగత కోచ్ గా జస్పాల్ రాణాను ఎంచుకోవడమే ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆమె మొదటి విజయం. అవే ఆమె క్రీడాజీవితంలో అత్యున్నతం కూడాను.

మొత్తంగా ఇద్దరు గురుశిష్యులు లక్ష్యం కోసం చేసిన ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులెదుర్కొన్నా అంతిమంగా దేశం పేరును నిలబెట్టిన సక్సెస్ స్టోరీ కోచ్ జస్పాల్ రాణా, మనూభాకర్ జోడీది..

కావల్సిందల్లా జస్పాల్ రాణా వంటివారిని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు తిరిగి సమున్నతంగా గౌరవించాల్సి ఉండగా అది జరగలేదు. మరింత మంది మనూభాకర్లు తయారుకావాల్సి ఉండగా.. ఆ ప్రక్రియకూ పెద్దగా అడుగులేమీ పడటం లేదు సరికదా.. ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకు కూడా మనూ పేరును షార్ట్ లిస్ట్ చేయకపోవడంతో మళ్లీ ప్యారిస్ మెడల్స్ విజేత పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles