సులేఖ! నోస్టాల్జియా!!
విదేశీ వస్తువుల బహిష్కరణ… స్వదేశీ వస్తువుల వాడకమనే నినాదం ఊపందుకుని ఉద్యమిస్తున్న వేళ అది. గాంధీ ఆశీస్సులు, రవీంద్రుడు చేసిన నామకరణంతో దేశంలో మొట్టమొదట చేతిరాతతో అక్షరానికి ప్రాణం పోసిన సిరా సులేఖ. నానిగోపాల్, శంకరాచార్య మైత్ర అనే ఇద్దరు కోల్ కత్తాకు చెందిన వ్యక్తులు ప్రారంభించిన ఆ సిరానే ఆ తర్వాతి కాలంలో మనం వాడిన క్యామ్లిన్ వంటి సిరాల తయారీకి ఓ ఇన్స్పిరేషన్.
బెంగాల్ విభజననంతరం ప్రారంభమైన స్వదేశీ ఉద్యమంలో భాగంగానే టాటా స్టీల్సైనా, ఓ ఆసియన్ పెయింట్స్ వంటి కంపెనీలైనా పుట్టుకురావడానికి ప్రధాన కారణం. అలాంటివాటిల్లో సులేఖ సిరా కంపెనీ ఒకటి. ఇవన్నీ కూడా నాటి విదేశీ వస్తువుల బహిష్కరణకు… స్వదేశీ ఉత్పత్తులుగా ఉద్యమంలో భాగమయ్యాయి. 1930లో స్వదేశీ ఉద్యమం పీక్ స్థాయిలో ఉన్న సమయంలో పిటీషన్స్, లేఖలు రాయడానికి విదేశీ ఇంకునే వాడుతున్న క్రమంలో… ఆ విషయాన్ని బెంగాల్ కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు సతీష్ చంద్రదాస్ గుప్తతో మహాత్మగాంధీ చర్చించారట. స్వదేశీ ఇంక్ ఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని సతీష్ చంద్ర ముందుంచాడు గాంధీ. ఎందుకంటే, సతీష్ చంద్ర దాస్ అప్పటికే మొట్టమొదటి భారతదేశ సిరాను.. కృష్ణధార పేరుతో తయారుచేశారు. గాంధీ అభిప్రాయం నచ్చిన సతీష్ చంద్ర.. ఆ ఫార్మూలాను నానిగోపాల్, శంకరాచార్య మైత్రలకు చెప్పడంతో సులేఖ సిరా ఉత్పత్తికి అంకురార్పణ జరిగింది.

అప్పటికే పలుమార్లు జైలుపాలైన జాతీయవాదులైన నానిగోపాల్, శంకరాచార్య మైత్ర గాంధీ ఆశీస్సులతో స్వదేశీ ఇంక్ ను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజ్షాహి యూనివర్సిటీలో ప్రొఫెసర్ పదవిని కూడా వదులుకుని గాంధీ ఆశీస్సులతో నానిగోపాల్ సిరా అమ్మకాలు మొదలుపెట్టాడు. ఆ సిరా అమ్మకాలు ఇంతింతై… ఒకదశలో సులేఖ సిరా అనేది ప్రొఫెసర్ మైత్రా సిరాగా పేరు పడిపోయింది.
సు అంటే మంచి… లేఖ అంటే ఉత్తరం అనే అర్థం వచ్చేలా రవీంద్రనాథ్ ఠాగూర్ పెట్టిన పేరుతో సులేఖ అనే ఈ స్వదేశీ ఇంక్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. గాంధీ నుంచి మొదలుకుంటే… మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ వంటివాళ్లతో పాటు… లెజెండరీ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే కూడా సులేఖ సిరాతోనే తమ సినిమా స్క్రిప్టులు రాయడంతో పాటే.. సినిమాల్లోనూ సులేఖ సిరాబుడ్లు కనిపించేవి. దాంతో, సులేఖ ఇంక్ మార్కెట్ కు ఇక తిరుగులేకుండా పోయింది. అలా 1970-80 మధ్యకాలంలో సులేఖ సిరా ఉత్పత్తులు నెలకు పదిలక్షల చొప్పున భారతీయ మార్కెట్ లో అమ్ముడుపోయి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకే ఇప్పటికీ బెంగాలీలకు సులేఖ సిరా ఓ నోస్టాల్జియా.
అలా స్వదేశీ వస్తు ఉత్పత్తి పేరిట ఇండియన్ మార్కెట్ లోకి వచ్చి ఒక ఊపులూపి.. మరెన్నో సిరా కంపెనీలకు స్ఫూర్తైన సులేఖ సిరా సంస్థ.. కొన్ని కారణాల వల్ల 1986లో మూతబడింది. తిరిగి 2006లో అదే పేరుతో సోలార్ పవర్ ఉత్పత్తులు, ఇతర హోంకేర్స్ వంటివి సులేఖ సంస్థ మార్కెట్ లోకి తెచ్చినప్పటికీ ఆ పునర్వైభవాన్ని మాత్రం ఆ సంస్థ దక్కించుకోలేకపోయింది. నాల్గేళ్ల క్రితం 2020 నవంబర్ మాసంలో మళ్లీ సులేఖ సిరా ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది. స్కార్లెట్, రెడ్, ఎగ్జిక్యూటివ్ బ్లాక్ తో పాటు రాయల్ బ్లూ వంటి కలర్స్ లో తిరిగి తన గత స్వదేశీ బ్రాండ్ ఇమేజ్ తో రంగంలోకి దిగింది. శాంతినికేతన్ లో తయారైన ఖాదీ సంచుల్లో పెట్టి.. దానికి జాతీయవాదపు సెంటిమెంట్ ను కూడా రంగరించుకుని.. ఇప్పుడు మార్కెట్ లో మళ్లీ డిమాండ్ తిరిగి పొందింది సులేఖ సిరా. యూకే, ఆస్ట్రేలియా, గ్రీస్, యూఎస్ఏ, బంగ్లాదేశ్, నేపాల్ తో పాటు… భారత్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్స్ మొదలయ్యాయి. ఒక ఫేస్ బుక్ లోనే ఇప్పుడేకంగా సుమారు 2 వేల మంది అభిమానులు సులేఖ ఇంక్ తో తమకున్న అనుబంధాన్ని షేర్ చేసుకోవడంతో… మరోసారి మార్కెట్ లో మార్మోగుతోంది ఈ సులేఖ సిరా పేరు.

నానిగోపాల్ మనవడైన కౌశిక్ ఎండీగా ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన సులేఖ సిరాకు చాలా పాఠశాలల నుంచి కూడా డిమాండ్ వెల్లువెత్తుతోంది. నానిగోపాల్, శంకరాచార్య మైత్ర అనే సోదరుల తల్లిదండ్రులు కూడా స్వాతంత్ర్య సమరయోధులు కావడంతో పాటు.. సులేఖ ఇంక్ ప్రారంభపు రోజుల్లో వీరిద్దరి కుటుంబాలు కూడా డోర్ టూ డోర్ ప్రచారం చేసి సులేఖ సిరాను ప్రమోట్ చేశాయి. ఒక చిన్న ఇరుకైన గదిలో ప్రారంభమైన సులేఖ సిరా కంపెనీ కథ.. 1946లో వెయ్యిమంది షేర్ హోల్డర్స్ తో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది. అలా ఇంతింతై విస్తరించి ఆఫ్రికాలోనూ రెండు కంపెనీలు పెట్టాలని సులేఖ యాజమాన్యాన్ని ఏకంగా ఐక్యరాజ్యసమితే కోరే స్థాయిలో ఈ సిరా ప్రస్థానం సాగిందంటే సులేఖ సిరా కథ కచ్చితంగా ఓ చరిత్రే!
సులేఖ సిరా అడ్వర్టైజ్ మెంట్ రంగంలోనూ వినూత్న పద్ధతులను పాటించింది. నాడు పశ్చిమబెంగాల్ లో తిరిగే బస్సులపై కూడా సులేఖ యాడ్స్ కనిపించేవి. వ్యాసుడు చెబుతుంటే విఘ్నేశ్వరుడు మహాభారతాన్ని రాస్తున్నట్టువంటి ఘట్టాలనూ తమ సిరా ప్రమోషన్ లో వాడుకునీ.. భారతీయ సంప్రదాయవాదులకు దగ్గరైంది ఈ ఇంక్. ఇప్పటికీ పర్యావరణపరమైన అంశాలనూ, స్వాతంత్ర్య సమరయోధులనూ, ఆధునిక సాహిత్యకారులను, మదర్ థెరీస్సా వంటి సేవకులను సింబాలిక్ గా తమ సిరా ప్రమోషన్ తో ముడిపెడుతూ.. తన ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ మళ్లీ మార్కెట్ లో సులేఖ నిలబడటం విశేషం.
ఇప్పుడున్న మాడ్రన్ ఈరాలో డిజిటలైజేషన్ పుణ్యమా అని పెన్ను పెట్టి రాసేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఈమెయిల్స్, ఈనోట్స్, ల్యాప్టాప్స్ తో పాటు.. మైబైల్ ఫోన్లలోనూ టైపింగ్ ఆప్షన్స్ వచ్చాక చేతితో రాసే అక్షర భవిష్యత్తిక అంధకారమే. అదే జరిగినా కూడా సులేఖది ఫౌంటెయిన్ పెన్నులో సిరా పోసి రాసిన ఓ చరిత్రగా ఎప్పటికీ మిగిలిపోయే కథ!



