విన్నపాలు వినవలె వింతవింతలు: కలెక్టర్ ను షాక్ కు గురిచేసిన ఓ రైతు విన్నపం!

ఒక్కో బతుకుచిత్రానిదీ ఒక్కో సమస్య. కొన్ని సర్వసాధారణమే అయినా… ఆ సమస్య తీర్చాలంటూ వారు చేసే విజ్ఞప్తులు, డిమాండ్సూ ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఘటనే ఇప్పుడు రాజస్థాన్ ప్రజావాణీలో అక్కడి కలెక్టర్ కు ఎదురైంది.

రాజస్థాన్ బార్మర్ జిల్లా కలెక్టర్ టీనాదాబీకి ప్రజావాణిలో ఓ వింత ఘటన ఎదురైంది. ఓరైతు కోరిన గొంతెమ్మ కోర్కెకు ఎలా స్పందించాలో అర్థం కాక ఒకింత నివ్వెరపోవడంతో పాటు, ప్రజావాణీ విన్నపాల ఒత్తిడిలో ఒకింత దరహాసాన్నీ ఇచ్చిన ఘటన అది.

ఇంతకీ ఆ రైతు కథేంటి.. ఏమడిగాడు..?

బార్మర్ జిల్లాలోని జోరాపూర్ గ్రామస్థుడైన మంగీలాల్ ప్రజావాణీలో ఫిర్యాదు చేయడానికొచ్చాడు. కలెక్టర్ టీనా దాబీని కలిశాడు. తన ఫిర్యాదు చదివిన కలెక్టర్ కు ఆశ్చర్యపోవడమే తనవంతైంది. కారణం తన ఇంటి నుంచి తన పొలానికీ, తన పొలం నుంచి తన ఇంటికి వెళ్లేందుకు అతనో హెలిక్యాప్టర్ తనకు అరేంజ్ చేయాలని కోరాడు ఆ విన్నపంలో. అది చూసిన కలెక్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ రైతుకేసి చూసి ఓ చిర్నవ్వు నవ్వింది. ఆ తర్వాత అసలేమైందో వివరంగా చెప్పమని అని అడిగింది.

తన పొలం నుంచి ఇంటికి, ఇంటి నుంచి పొలానికి వెళ్లే దారిని ఉపాధ్యాయుడైనటువంటి ఖేరజరామ్ అనే వ్యక్తి కబ్జా చేశాడని… ఆ రహదారి మార్గంలో కూడా జీలకర్ర విత్తాడని మంగీలాల్ కలెక్టర్ చెప్పాడు. తాను ఎంతో కష్టపడి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్.. అలాగే, పోలీస్ అధికారుల సాయంతో తన పొలానికి రోడ్డు నిర్మించుకున్నాని తెలిపాడు. కానీ, ఖేరజరామ్ ఆ రోడ్డునంతా చదును చేసి దారిని మూసేశాడని ఆరోపించాడు. దాంతో తన ఇంటి నుంచి పొలానికీ, పొలం నుంచి ఇంటికి చేరుకునే మార్గం మూసుకుపోయిందని.. పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులను కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నది ఆ ఫిర్యాదు సారాంశం. దాంతో తానెలా తన పొలానికి వెళ్లాలో తెలియడం లేదని వాపోయాడు. అందుకోసం, తన ఇంటిముందు ఓ హెలిక్యాప్టర్ ఉంచితే రోజూ ఆ హెలిక్యాప్టర్ లో తన పొలానికెళ్లి, ఇంటికి తిరిగివస్తానని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

వ్యవసాయమే జీవనాధారమైన తనకు పొలానికి వెళ్లందే బతుకు వెళ్లదని, కుటుంబ పోషణ కష్టమని పేర్కొన్న మంగీలాల్… అటువంటి పరిస్థితున్నందునే తన కోసం ఓ హెలిక్యాప్టర్ ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తితో కూడిన డిమాండ్ ను కలెక్టర్ ముందుంచాడు. దీంతో కలెక్టర్ టీనాదాబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. ఒక ప్రత్యేకమైన కేసుగా మీడియాలోనూ హైలెట్ అయిన మంగీలాల్ ఇష్యూను ఏవిధంగా పరిష్కరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సందర్భంలోనే మనం కలెక్టర్ టీనాదాబీ గురించీ ఓసారి కాస్త చెప్పుకుంటే.. 2015 యూపీఎస్సీ టాపర్ అయిన టీనాదాబీ 2018లో ఆథర్ అమీర్ ఖాన్ అనే మరో ఐఏఎస్ అధికారిని వివాహమాడారు. కానీ, రెండేళ్లు కూడా గడవకుండానే వారిద్దరి మధ్య పొరపచ్చాలతో విడాకులయ్యాయి. ఆ తర్వాత ఆమె ఏడాది క్రితం మరోసారి వార్తల్లో వైరల్ అయ్యారు. బీజేపీ ఎంపీ సతీష్ పూనియాకు ఐదుసార్లు వంగి వంగి దండాలు పెట్టడంతో ఆ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles