హరికథ బ్రాండ్ అంబాసిడర్ ఆదిభట్ల
Hemachander Kolipaka…✍🏻
…………………………………………………………………………………………
ఆగస్టు 31 నారాయణదాసు జయంతీ
మీరెవరి వద్ద నేర్చుకున్నారని ఎవరినైనా అడిగితే, తమకు విద్య నేర్పిన గురువు పేరు చెబుతారు.. కానీ ఆ దేవుడి వద్ద అని ఎవరైనా చెబుతారా? అలా చెప్పిన వ్యక్తి ఆదిభట్ల నారాయణదాసు. 1913లో కలకత్తాలో శ్రీకృష్ణ జననం హరికథాగానం చేసిన తర్వాత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరి వద్ద నేర్చుకున్నారని ప్రశ్నిస్తే, దాసుగారి సమాధానమది. ఆదిభట్ల నారాయణదాసు అంటే హరికథ బ్రాండ్ అంబాసిడర్. ఆగస్టు 31నే ఆయన జయంతి.. కాస్త ఆలస్యమైనా చెప్పుకోవాల్సిన సందర్భమిది.

ఎవరి వద్దా శిష్యరికం చేయకుండా ఉన్నత స్థాయికి ఎదగడం సాధ్యమా అంటే కష్టమనే సమాధానమే వస్తుంది. కానీ, చెన్నపట్నం (చెన్నై)కు చెందిన కుప్పుస్వామినాయుడు అనే హరికథకుడు విజయనగరంలో హరికథ చెబుతుండగా నారాయణదాసు విని ప్రేరణ పొందారు. విశాఖకు చెందిన కవి ధూళిపాళ కృష్ణయ్య చెప్పిన ‘ధృవచరిత్ర’ యక్షగానం విన్నారు. తన సోదరుడి ఇంట్లో తొలి కీర్తన చేసారు. తర్వాత వేణుగోపాలస్వామి మందిరంలో తొలి హరికథ చెప్పారు. ఎవరి వద్దా శిష్యరికం చేయకుండా, అవసరమైన వాటిని నేర్చుకుంటూ పలువురి ప్రశంసలు పొందారు. తాను గంధర్వుడినని చెప్పుకునేవారు. వ్యక్తిగత కృషితో గురువు స్థాయికి చేరారు. శిష్యరికం చేసినవారు కొందరైతే, ఏకలవ్య శిష్యులు ఎందరో. ఆయన శిష్యుల్లో వాజపేయాజుల సుబ్బయ్యదాసు, నేతి లక్ష్మీనారాయణ భాగవతులు (విజయవాడ), వేదనభట్ల వెంకటరమణయ్య, పిల్లలమఱ్ఱి రామదాసు, నేమాని వరహాలుదాసు, కరూరు కృష్ణదాసు, వడ్లమాని నరసింహదాసు వంటి వారు ఎందరో. వారిలో నేతి లక్ష్మీనారాయణకు ప్రత్యేక స్థానం ఉంది. సంగీత కళాశాలకు రామాయణ గాథగానం చేస్తూ వెళ్లే ఆయన వెంట నేతి లక్ష్మీనారాయణ, వాజపేయాజుల సుబ్బయ్యదాసులో ఒకరు గొడుగు, మరొకరు పుస్తకం పట్టుకుని వెళ్లేవారు. వారికి రామాయణ సోదరులని నామకరణం చేసారని చెబుతారు. శిష్యులంటే ఆయనకు అపార అభిమానం. 1923లో కాకినాడ కాంగ్రెసు సమావేశంలో ఆదిభట్ల చెప్పిన ‘రుక్మిణీ కళ్యాణము’ హరికథ విన్న ‘భారత కోకిల’ సరోజినీదేవి నాయుడు వశీబతీ సఅషవ ఱం వఞనబఱంఱ్‌వ (మీ నృత్యం చాలా మనోహరము) అని శ్లాఘించినారట. మతాధిపతులకు, పీఠాధిపతులకు చేసే ‘బ్రహ్మరథ’ సన్మానం 1933లో తునిలో దాసుగారికి జరిగింది. దాసుగారి డెబ్బయ్యవ జన్మదిన సందర్భాన (1934) సింగరేణి క్వారీస్ వాసులు గజారోహణము చేశారు. ఇలా ఆదిభట్లవారి గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు.
హరికథా రంగంలో తనదైన ముద్ర వేసిన ఆదిభట్ల నారాయణదాసు జీవితం పూలపాన్పుకాదు. నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. నలుగురికి పురాణాలు చెప్పే తండ్రి. వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవారు. బాల్యంలోనే భాగవతం చదివారు.
విజయనగరానికి చెందిన ఆయన దేశంలో పలు ప్రాంతాల్లో హరికథలు చెప్పినా, విజయనగరం రాజావారి ఆస్థానంలో చెప్పే అవకాశం రాలేదు. దానికి కారణం ఆయన వ్యక్తిత్వం. తనకు అవకాశం కల్పించాలని రాజుగారి ఆస్థానంలో వారిని కోరకపోవడం. ఇంతింతై అన్నట్లు మైసూరు మహారాజావారు పిలిపించుకుని, ఆయనతో హరికథ చెప్పించారు. మైసూరు రాజావారికి తెలుగు రాదు. ఆదిభట్ల వారికి కన్నడం రాదు. దీంతో హరికథ చెబుతూ ఆంగ్లంలో వివరించేవారు ఆదిభట్ల. ఆదిభట్ల వారి హరికథను రాజావారు రికార్డు చేయించినా, అగ్ని ప్రమాదంలో దగ్ధమైపోవడం తెలుగువారి దురదృష్టం.
దురవాట్లకు లోనై.. అంతలోనే దూరమై!
హరికథలు చెబుతున్నా, దురలవాట్ల బారినపడిన ఆయన వాటికి స్వచ్ఛందంగా దూరమయ్యారు. ఆయన చెప్పే పురాణ గాథల ప్రభావమో లేక సమాజాన్ని పరిశీలించినందువల్లో ఆలోచనల్లో ఎంతో మార్పు వచ్చింది. సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. చిన్నతనంలోనే ఆదిభట్ల వారు కొన్ని దురలవాట్లకు అలవాటుపడ్డారు. అవే నల్లమందు, మద్యం, వేశ్యాసంపర్కం. అయితే కొన్ని ఘటనల అనంతరం ఆయన వాటిని మానేసినట్లు చెప్పుకున్నారు. దేశమంతా తిరుగుతూ హరికథలు చెప్పారు. ఒకసారి నరసన్నపేట వెళ్లినపుడు అక్కడ ఉన్న ఒక వేశ్య ఆయన పొందు కోరింది. రూ.2 వేల విలువైన నగలతో పాటు ఆస్తినంతా ఆయనకు ఇస్తానని నరసన్నపేటలో తనతో ఉండాలని కోరింది. తాను హరిదాసుడనని, గతంలో తన ప్రవర్తన ఎట్లా ఉన్నా, ప్రస్తుతం పరాయి ఆడవాళ్ల పొందు కోరనని ఆయన చెప్పారు. పరాయి స్త్రీలను తల్లులుగా భావించేవారు. స్త్రీ విద్యపట్ల స్పష్టమైన అభిప్రాయం గలవారు. భర్త, పిల్లలను పనివాళ్లకు అప్పగించి ఉద్యోగం పేరుతో ఆడవాళ్లు బయట తిరగడాన్ని వ్యతిరేకించారు. పరాయి మగవారితో కలసి ఏకాంతంగా తిరగడం, తాగుట, పరపురుషులకు సన్నిహితంగా మెలగడం వంటివి సరికాదన్నారు.
నమ్మితే వంచించారు!
ఆయన ఎంతో శ్రమించి చేసిన రచనలను తమ పేరుతో చెలామణి చేసుకున్న వారూ ఉన్నారు. ఈ జాబితాలో వీరేశలింగం పేరు కూడా ఉంది. ఈసఫ్ కథలను ‘నూఱుగంటి’ పేరుతో నారాయణ దాసు తెలుగులోకి అనువదించారు. దానిని ముద్రణకై వీరేశలింగం ప్రచురణాలయానికి పంపించారు. అయితే దానిని ముద్రించకుండా, వీరేశలింగం ఆ కథలను తెలుగులోకి అనువదించి ముందుగా ముద్రించుకున్నారని ఆరోపణ ఉంది. వీరేశలింగం రచన విద్యార్థులకు పాఠ్యగ్రంథమైంది. తర్వాతే నూఱుగంటి వెలుగుచూసింది. ఆదిభట్ల రచించిన కొన్ని పద్యాలను విజయనగరం మహారాజు సమక్షంలో నాటి విజయనగరం డిప్యూటీ కలెక్టర్ వినిపించారు. అయితే అవి తానే రచించినట్లు డిప్యూటీ కలెక్టర్ చెప్పుకోవడం ఆయనకు బాధ కలిగించింది. నాటి సభలో ఉన్న పండితులకు ఆ పద్యాలు ఆయన రచించలేదని, తానే రచించానని తెలిసీ చెప్పకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఆదిభట్ల వారితో ఆ డిప్యూటీ కలెక్టర్ దీనిగురించి మాట్లాడినపుడు, నియోగుల పరువు తీసావు కదయ్యా అన్నారని ఆత్మకథలో పేర్కొన్నారు. హరికథలతో పాటు అష్టావధానాలు కూడా ఆదిభట్లవారు చేసారు. ఒకసారి ‘మీరు చేసిన ప్రయోగం తప్పు అని ఒప్పుకోండి లేదా ప్రమాణమైనా చూపండి’ అని రాజావారు అంటే ఆ రాత్రి భారతమంతా వెతికి భిన్న కర్తృక క్త్వార్థక ప్రయోగానికి ‘రాహుకంఠముదెగి దేహము ధరణిబడియె’ అనే దాన్ని ప్రమాణంగా చూపించారట.
వ్యక్తిపూజకు వ్యతిరేకం!
తనను దేవుడిగా కొలవడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. చోడవరం మున్సబు, నారాయణదాసుగారు ఇద్దరూ వ్యాహాళికి వెళ్లి తిరిగి వస్తుండగా భారీ వర్షంలో తడిసి ముద్దయ్యారు. మోకాలు నీటిలో నడిచి వస్తుండగా, దాసుగారి పాదాలపై పడ్డారు మున్సబు. అప్పుడు దాసుగారు చెప్పిన మాటలు ఇప్పటి సమాజానికి వర్తిస్తాయి. ‘‘అయ్యా! మీరు గ్రాడ్యుయేట్లు. చదువుకున్నవారు. ప్లీడరుగా లోకుల మంచి చెడ్డలు తెలుసుకోగలిగినవారు. నా కన్నా వయసులో పెద్దవారు. ‘చేసేవి మాఘస్నానాలు. దూరునవి … గుడిసె’లన్నట్టు నా ప్రవర్తన ఉంటుంది. పరాయి స్త్రీలమీద చూపు ఉంటుంది. దుర్వ్వసనాసక్తుడిని. ఇలాటి నన్ను అవివేకులు కొలవవచ్చుగానీ, మీ వంటి వివేకవంతులు ఇలా చేయవచ్చా’’ అని ప్రశ్నించారు. మునసబుతో ఆయన అన్న మాటలు అర్థం చేసుకుంటే, ఇప్పుడు బాబాల వెంట ప్రజలు బారులు తీయరేమో? విదేశీ సంస్కృతి, ఆంగ్ల విద్య ప్రభావం మన సమాజానికి హాని చేస్తుందన్న భావన ఆయనకు ఉంది. ఫలానా వర్ణాల వారిమని చెప్పుకోవడం తప్ప, వర్ణాశ్రమ ధర్మాలు పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఆనందగజపతి ప్రతి శుక్రవారం ఇచ్చే పార్టీల్లో ఇచ్ఛకాలు పలకడం, ఎంగిలి బ్రాందీ తాగుతూ, గొడ్డు మాంసం తింటూ వచ్చీరాని ఇంగ్లీషు పేలుచూ, వెకిలి నవ్వులు నవ్వుతూ, ధనాశతో తెల్లవార్లు మేలుకుని పిశాచాల్లా జోగుతారన్న ఆదిభట్ల వారి మాటలు నేటికీ వర్తిస్తాయి. తమ దర్బారులో పని చేస్తావా అని విజయనగర ప్రభువులు అడిగితే, ‘‘మర్త్యులను గొల్వ నొల్లను’’ అని దాసుగారు చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.
హరికథకు విశేష ప్రాచుర్యం కల్పించిన ఆదిభట్లవారి స్ఫూర్తితో వేలాది మంది ఆ కళను అందిపుచ్చుకున్నారు. వారిలో సినీనటి కరాటే కళ్యాణి ఒకరు. 114 గంటల 45 నిమిషాల 55 సెకన్ల పాటు హరికథ (హరి లేదా విష్ణువు యొక్క కథ) ప్రదర్శించి ఆమె లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యారు. భక్తిని, విలువలను రంగరించి ప్రజల్లో ఆధ్యాత్మికత వైపు పయనించేలా చేసిన నారాయణదాసు గారి జయంతికి అక్షర నీరాజనాలు.


