యావత్ దేశాన్నే ఆకట్టుకుంటున్న అక్కడి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం!

ఒకే ఒక్కడు సినిమా చూశాంగా…? ఒక్కరోజు ముఖ్యమంత్రిగా అందులో హీరో అర్జున్ తీసుకునే నిర్ణయాలు కొందరి ఆందోళనకు కారణమైతే.. ఇంకెందరిలోనో ఆనందాన్ని రేకెత్తిస్తాయి. అయితే అది సినిమా. కానీ, నిజ జీవితంలో కూడా అలా ఆలోచించే యువతకు అలాంటి అవకాశాలు వస్తే ఎలా ఉంటుంది..?

అలాంటి కార్యక్రమమే ఒక్క రోజు మీరు మీ నగరాన్ని నడిపించగల్గితే అనే కాన్సెప్ట్.

కేరళ కోళికోడ్ ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమం పేరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం. ఈ ప్రాజెక్ట్ తో విద్యార్థుల్లో పాలనానుభవం పెంచడం ముఖ్య ఉద్ధేశం. అలాగే, అధికారగణానికి నిత్యం ఉండే ఛాలింజింగ్ వర్క్స్ తో బిజీగా ఉన్నప్పుడు.. నాల్గు నెలల ఇంటర్న్షిప్ ప్రోగ్రాంతో విద్యార్థులనూ కోజికోడ్ జిల్లా పాలనా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ ప్రజలకూ, అధికారులకు అంటే ప్రభుత్వానికి మధ్య ఓ వారధిని ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్ధేశం. ఈ కార్యక్రమం 20 లక్షల మందిపై ప్రభావం చూపగల్గింది. నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది.

విద్య అంటే కేవలం తరగతి గదులకు పరిమితమైంది కాదని.. ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలోనూ నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయో తెలియపర్చే ఓ నూతన సృజనాత్మక ఆలోచనే ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం.

హర్షా హరిదాస్ అనే విద్యార్థినికి ఒక రోజు తన నగరాన్ని తానే పాలిస్తే ఎలా ఉంటుందన్నది చిన్నప్పట్నుంచీ ఓ కల. ఆమె కల నిజమయ్యే సమయం ఆమెకు 23 ఏళ్లకు దక్కింది. అలా హర్షా హరిదాస్ లాంటి వారెందరో యువత డీసీఐపీలో భాగస్వాములవ్వడంతో ఇప్పుడు కోజికోడ్ భారతదేశ పాఠశాలలన్నింటికీ ఓ కొత్త పాఠమైంది.

ఇప్పటివరకూ డీసీఐపీకి దశాబ్దకాలం నిండింది. 30 బ్యాచుల విద్యార్థులు నాల్గు నెలల పాటు 300కు పైగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు.

కోళికోడ్ జిల్లా కలెక్టర్ స్నేహల్ సింగ్ 2023లో అక్టోబర్ లో బాధ్యతలు చేపట్టాక ఈ ప్రోగ్రామ్ మరింత విజయవంతంగా సాగుతోంది. ప్రభుత్వ శాఖలతో విద్యార్థి దశలోనే కలిసి పనిచేయడం వల్ల అధికారగణం, విద్యార్థుల మధ్య పంచుకునే ఆలోచనలతో ప్రజాసంబంధ కార్యక్రమాలను విద్యార్థుల భాగస్వామ్యంతో సులభంగా పరిష్కరించడంతో పాటు.. విద్యార్థి దశలోనే పాలనపై ఒక అనుభవానికి అవకాశం కల్పిస్తున్నారిక్కడ.

ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజల అవసరాల మధ్య వారధిలా విద్యార్థుల ఉత్సాహంతో పుట్టుకొచ్చే ఐడియాస్ మార్పుకు కారణమవుతాయన్న నమ్మకం కూడా అధికారిక వ్యవస్థ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా రన్ చేయడానికి దోహదం చేస్తోంది.

క్లాస్‌రూమ్ నుంచి కౌన్సిల్‌కు!

భారత్ వంటి అధిక జనాభా కల్గిన దేశంలో ఆకలి కేకలు ఉండకుండా చేయగల్గడం ఓ పెద్ద సవాల్. అలాంటి సవాళ్లను అధిగమించాలంటే ఇప్పుుడున్న సాధనా సంపత్తి ఏ మాత్రం సరిపోవడంలేదు. అలాంటి పరిస్థితిలోనే 2015లో ఆపరేషన్ సులైమానిని ప్రారంభించారు కోళికోడ్ జిల్లా యంత్రాంగం.

ఆపరేషన్ సులైమానిలో భాగంగా కార్మికులు, వలసదారులు, నిరాశ్రయుల వంటివారికి తినడానికి ఇంత తిండి అందించడాన్ని మొదటి ప్రాధాన్యతగా చేపట్టారు. అలా జిల్లా వ్యాప్తంగా 14 జోన్లను ఏర్పాటు చేసి.. 25 కేంద్రాల్లో ఒక వంద రెస్టారెంట్స్, హోటల్స్ సాయంతో ఆహార కూపన్ల వ్యవస్థను తయారుచేసి ఆకలి కేకలు లేకుండా ఒక కొత్త ప్రణాళిక రచించారు. అలా ప్రతీరోజూ సుమారు కనీసం 150 నుంచి 200 మందికి భోజనాలందిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి అధికారిక లెక్కల ప్రకారం ఆకలి కేకలతో అలమటించేవారు సుమారు 1 లక్షా 25 వేల మందికి భోజనం అందించగల్గడమంటే కచ్చితంగా ఇదొక అద్భుతమైన ఇన్షియేటివ్.

ఇదేం అనుకున్నంత సులభమైన పని కాదు. ఎంతో కష్టంతో సమన్వయం చేసుకుంటేనే కానీ… ఫలప్రదమవ్వదు. నిత్యం తమ కార్యకలాపాల్లో బిజీబిజీగా ఉండే వివిధ శాఖల అధికారులకు సృజనాత్మకంగా ఆలోచించే శక్తి కొరవడొచ్చు. అలాంటి సందర్భంలో ఇంటర్న్షిప్ ద్వారా పాలనలో భాగస్వాములైన విద్యార్థినీ, విద్యార్థులు కొత్త ఆలోచనలతో ముందుకొస్తూ.. సరికొత్త పరిష్కారాలను అందిస్తూ కోళికోడ్ లో చరిత్ర సృష్టిస్తున్నారు.

సాధారణంగా ప్రభుత్వమంటే, అధికారులంటే ప్రజల్లో ఎప్పుడూ ఒక వ్యతిరేకత కనిపిస్తూనే ఉంటుంది. మన ఇంటి పక్క డ్రైనేజీ ఒక్కోసారి తీయకపోయినా, రోడ్లపైన గుంతలు పడ్డా, ఏ చిన్న సమస్య వచ్చినా.. అధికారులు, ప్రభుత్వాలను తిట్టుకోవడం సర్వసాధారణం. వాటినే ప్రతిపక్షాలు మరింత భూతద్దంలో చూపించి ప్రచారాలు చేసుకోవడమూ అంతే సాధారణం. అయితే, వాటి పరిష్కారంలో స్థానిక అధికారగణానికుండే నిధులు, విధులు, సవాళ్లు ప్రజలకు తెలియకపోవచ్చు. అదిగో అలాంటివాటిని కూడా ఈ డీసీఐపీ ద్వారా అవగాహన కల్పిస్తోంది కోళికోడ్ విద్యార్థుల బృందం.

ముందుగా చెప్పుకున్న హర్ష మ్యాథమేటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ సమాజానికి సేవ చేయాలనే తపనతో డీసీఐపీలో భాగస్వామైంది. ఆమె ఇప్పుడు గిరిజనుల బాగోగులు, సంక్షేమం చూస్తోంది. ఆయా గిరిజన తాండాలకు తిరుగుతూ వారికి కావల్సిన ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ వంటి పత్రాలపై అవగాహన కల్పిస్తూ, వాటిని ఎలా పొందాలి, ఎందుకు వాటి అవసరమో తెలియజెప్పుతూ డీసీఐపీలో చురుకైన పాత్రను పోషిస్తోంది.

తను చదివింది మేథమెటిక్స్.. సబ్జెక్ట్ ఏ మాత్రం సంబంధం లేదు.. అయినా తను ఇష్టపడ్డ చదువును మించి తనకు డీసీఐపీ సంతృప్తినిచ్చిందంటోంది హర్షా.

ఈ ఇంటర్న్షిప్ కు కూడా ముందు ఒక సామాజిక అంశంపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని తెలుసుకునేలా ఒక ఎస్సే రైటింగ్, ఆ తర్వాత వారిని పూర్తిగా ఇంటర్వ్యూ చేశాకే ఎంపిక చేస్తారు. అయితే, అతి తెలివితేటలున్నవాళ్లే కావాలని లేదు, వారి బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, మానవత్వం, సహానుభూతి వంటి అంశాల పట్ల వారి అభిప్రాయాలెలా ఉన్నాయో చూసి ఈ ఇంటర్న్షిప్ కు ఎంపిక చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ ఇంటర్న్షిప్ లో 30 ఏళ్ల లోపువారికి అవకాశం కల్పిస్తున్నారు. వారికి కనీస అర్హత ఉత్సుకతతో పాటు, మాతృభాష మళయాళం, ఇంగ్లీష్ లో మంచి పట్టుండాలి. అలాగే, ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ కల్గి ఉండాలి.

మొత్తంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం రెండు లక్ష్యాలను కల్గి ఉంది. ఒకటి ప్రభుత్వానికి యువతరం నుంచి అందివచ్చే కొత్త ఆలోచనలను స్వీకరించే అవకాశం.. అలాగే, యువత పాలనను అర్థం చేసుకునే అవకాశం. దీంతో కోళికోడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంటర్న్షిప్ కార్యక్రమం ఇప్పుడు ఒక వినూత్న ప్రాజెక్టై యావత్ దేశం దృష్టినీ ఆకట్టుకుంటోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles