ఎలా కూడదో చెప్పేది నాటి జపానైతే.. ఎలా ఎదగాలో నేర్చుకునేది నేటి జపాన్!

దేవతలా ? రాక్షసులా ?

సమయ పాలన, క్రమశిక్షణ , ఆత్మ విశ్వాసం , పాజిటివ్ { సకారాత్మక } దృక్పధం , దృఢ చిత్తం , స్థితిస్థాపకత { పడి పోయినా లేచే గుణం , ఓటమినుంచి గుణపాఠాలు గ్రహించి ప్రగతి మార్గాన నడిచే లక్షణం } … జపనీయులు లక్షణాలు .

ఎవుళ్ళురా మీరు ?

ఎవుడ్రా వీడు?? .. ఈ సినీ డైలాగ్ ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది.
ఇది సరిగ్గా జపనీయులకు సూట్ అవుతుంది.

భూభాగం లో డెబ్భై మూడు శాతం పర్వతాలు, కేవలం 12 % శాతం వ్యవసాయానికి అనుకూలం.. మరోవైపు, భూకంపాలు, అగ్ని పర్వతాలు, సునామీల దేశం.. అనేక ఆఫ్రికా దేశాలకన్నా వెనుక ఉండాల్సిన దేశం !

ఇదేందీ సామి.. ?

ఆ రోజుల్లో యూరోపియన్లు అజేయులు అనే భావన సర్వత్రా వ్యాపించి ఉండేది . తొలిసారి యూరోపియన్ దేశాన్ని జయించిన ఆసియా దేశం జపాన్. రెండవ ప్రపంచ యుద్ధం నాటికే ఒక సూపర్ పవర్. అణుబాంబుల దాడితో సర్వనాశనమైపోయినా.. నేలకు కొట్టిన బంతిలా ఉవ్వెత్తున ఎగిసి … బులెట్ ట్రైన్లు, కార్లు ఇంకా అనేకానేక అధునాతన పరిజ్ఞానంతో అమెరికాతో పోటీ పడుతున్న ఆసియ సూపర్ స్టార్ జపాన్ .

ఏంటీ జపాన్ కథ.. ?

ఇదో పెద్ద లైఫ్ స్కిల్స్ పాఠం. చదవకపోతే నష్టం మీదే. ప్రతి విద్యార్ధి చేత చదివించాలి. జీవితంలో ఏమి చేయకూడదో ఏమి చెయ్యాలో తెలుసుకొనేలా చెయ్యాలి.

సమురాయ్.. సుమో.. ఫ్యూడలిజం.. జామోన్.. యయోయి.. కొఫున్.. అసుక.. నారా.. హేయన్.. కాముకురా.. మురామచి.. సెంగోకు.. తోకుగావా… మొత్తం 13 పదాల్లో జపాన్ చరిత్ర .

ఒక్క ముక్కలో చెప్పాలంటే .. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ? జస్ట్ ఆర్డినరీ చరిత్ర. చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు .

జపాన్ ఉన్నతి 1868 మెయిజి పునరుద్హరణతో ప్రారంభం అయ్యింది.

సితో.. ఒక పద్ధతిగా తమ దేశాన్ని ఆధునీకరించుకున్నారు. ఫ్యూడల్ వ్యవస్థ రద్దు .. భూసంస్కరణలు, అధిక పరిశ్రమల స్థాపన, మౌలిక సదుపాయాల కల్పన, ఆధునిక విద్య!

అబ్బో! ఒకటా.. రెండా…?

పాశ్చాత్య దేశాలకు ఏమీ తీసి పోకూడదనే కసితో కొత్త ప్రభుత్వం వ్యవహరించింది. యూరోపియన్ రక్తంలో ఏదో మహిమ ఉంది అని చాలామంది ఆ రక్తాన్ని ఎక్కించుకున్నారు. ప్రభుత్వం తన ఖర్చుతో చాలామంది విద్యార్థులను జర్మనీ లాంటి దేశాలకు పంపి చదివించింది . ఫలితం .. 1905 నాటికే.. బస్తీ మే సవాల్ అంటూ జపాన్ రష్యాని ఓడించి ఔరా అనిపించింది .

అతి సర్వత్ర వర్జయేత్!

ఏదైనా అతి అయితే అనర్థమే. జపనీయుల కొంపా ముంచింది.. పశ్చిమ బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ ను ముంచింది.. అంచనా ప్రకారం.. 2024 ఎన్నికల్లో జరుగపోతున్నదిదే.

వందేళ్ల క్రితం కరోనా వచ్చింది (స్పానిష్ ఫ్లూ .. కరోనా లాంటిదే). దానికి తోడు మొదటి ప్రపంచ యుద్ధం. వెరసి … కలసి… ముందుగా అమెరికాలో అటు పైన ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం.. పెరిగిన ధరలు.. బతుకు కష్టమై పోయిన వైనం .

కష్టాల్లో ఉన్నప్పుడు ఆలోచనలు అతిగా మారే అవకాశముంది. మన దేశంలో ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంటేనే మనకు బతుకు అని జర్మన్ ఇటలీ జపాన్ లాంటి దేశాల ప్రజలు ఆలోచించారు. హిట్లర్, ముస్సోలిని, జోసెఫ్ స్టాలిన్… జపాన్ లో మిలిటరీ ప్రభుత్వం. ఇవి కాకుండా వలసవాద దేశాలు (ఇంగ్లాండ్ , ఫ్రాన్స్ లాంటివి) వాటి వలస రాజ్యాలు .. ఇదే క్లుప్తంగా రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం .

నరరూప రాక్షసులు!

చెబితే ఎవరూ నమ్మరు .. అయ్యో ఎప్పుడూ చిరునవ్వుతో తమ పని తాము చేసుకొని బతికే జపనీయులా ఈ పని చేసింది అనుకుంటారు.. ఒకటా.. రెండా.. ?

దారుణాతి దారుణాలు. చరిత్ర దాచేసిన సత్యం!

1937లో జపాన్.. చైనాకు చెందిన నాన్ కింగ్ భూభాగాన్నిఆక్రమించింది. సుమారుగా మూడు లక్షల మంది సాధారణ పౌరులను.. జపాన్ ఆర్మీ చంపేసింది. కొరియా, చైనా, ఆగ్నేయాసియాలాంటి చోట్ల దాడులు చేసి ప్రజలను వెట్టిచాకిరిలోకి నెట్టింది . వారి చేత రైల్వే లైన్స్ లాంటివి వేయించింది. తిండి కూడా పెట్టకుండా మాడి మసైపోయ్యేలా చేసింది. స్త్రీలను పడుపు వృత్తిలోకి దింపింది. యూనిట్ 731 పేరుతో వర్ణించలేని దారుణాలు చేసింది . యుద్ధ ఖైదీలకు మత్తు ఇవ్వకుండా శస్త్ర చికిత్స.. ప్రాణాంతకమైన సూక్ష్మ జీవులను వారిపై ప్రయోగించడం, వారి వృషణాలను కోసేయ్యడం, తిండి పెట్టకుండా చంపడం, బటన్ డెత్ మార్చ్, బర్మా రైల్వే మనీలా మాసకర్.. రాస్తూ పొతే .. వెయ్యి పేజీల గ్రంథమే అవుతుంది. శాడిజం .. నూటికి కోటి పాళ్ళ శాడిజం.. ఇదీ నాటి జపాన్ ఆర్మీ ప్రభుత్వ తీరు .

వీరు చేసిన పాపానికి పాపం.. హిరోషిమా ప్రజలు.. అన్నెం పున్నెం ఎరుగని బాలబాలికలు బలైపోయారు .

నిజమే .. హిరోషిమా నాగసాకి అణుబాంబు దాడులు జరగకపోయుంటే.. ఈ ముష్కరులు ప్రపంచాన్ని ఏమేమి చేసుండేవారో..?

మన పొరుగు దేశం ఇండోనేషియాను డచ్ వారు పాలించారు. జపాన్.. సింగపూర్, మలేసియా, ఇండోనేషియాను ఆక్రమించుకుంది. అమ్మయ్య .. వలస పాలన పోయింది అని ప్రజలు సంతోషపడ్డారు. కానీ, ఆ తర్వాత.. వామ్మో.. జపాన్ పాలన .. వారి అరాచకాలు చూసి చలించిపోయారు . డచ్ వలస పాలన కోటి రెట్లు మెరుగు అనుకున్నారు. జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడినా.. సుకర్ణో నాయకత్వంలో ఇండోనేషియా ప్రజలు ఇంకో స్వాతంత్య్ర యుద్ధం చెయ్యాల్సి వచ్చింది .

భారతజాతి ముద్దు బిడ్డ నేతాజీ.. శత్రువుకు శత్రువు మిత్రుడు అనుకొన్నాడు. ముందుగా స్టాలిన్ .. అటు పై హిట్లర్ ను కలిసాడు. లాభం లేదు . వేళ మైళ్ళు జలాంతర్గామిలో పయనించి జపాన్ చేరుకొన్నాడు. వారి సాయంతో దేశాన్ని బ్రిటిష్ చెరనుంచి విడిపించాలనేది అయన ఆలోచన .

అల్ మోస్ట్ అయిపొయింది. అండమాన్ ను ఆక్రమించుకున్నారు. బర్మా దాక వచ్చేసారు. అదిగో అప్పుడే జపాన్ పరిస్థితి బలహీన పడింది. లేకుంటే .. మన నాయకుడు నేతాజీకి కూడా సుకర్ణో పరిస్థితి ఎదురై ఉండేదేమో!

జపాన్ మిలిటరీ కర్కశుల పాపానికి.. మన నేతాజీ కూడా చివరి రోజులు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. ఢిల్లీలో రాజపీఠంపై ఉండాల్సిన మహావ్యక్తి ఎక్కడో.. మంచుకొండల్లో అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది.

నిన్న అన్న ఎన్టీఆర్ జన్మదినం. దానవీరశూరకర్ణ చూడని తెలుగు వాడుండడు.

కర్ణుడు సుగుణాల పుట్ట. అయన చేసిన ఒకే తప్పు… దుష్టులతో సావాసం .

నా ఉద్దేశంలో మన నేతాజీ.. అభినవ కర్ణుడు.

హిరోషిమా అణుబాంబుకు కూడా మిలిటరీ పాలకులు చలించలేదు. ఇంకో బాంబు వేస్తేకానీ వీరు తగ్గరు అనుకున్నఅమెరికా ప్రభుత్వం మూడు రోజులకు అంటే 9 ఆగష్టు 1945న నాగసాకిపై ఫాట్మాన్ అనే ప్లుటోనియం రకం అణుబాంబు వేసింది.

అప్పుడు ఆ మిలిటరీ ప్రభుత్వం దిగొచ్చింది. సరెండర్ అయ్యింది. అక్కడ జర్మనీలో హిట్లర్ ఆత్మహత్య చేసుకొన్నాడు. నియంతృత్వ ప్రభుత్వాలు అంతమయ్యాయి. అప్పుడు జపాన్ ప్రభుత్వం.. తిరిగి అభివృద్ధిపై దృష్టి పెట్టింది. యుద్ధాలు వద్దనుకుని ఆర్థిక ప్రగతిని సాధించింది. హిరోషిమా, నాగసాకి గాయాలను అధిగమించి అద్భుత ప్రగతి వైపు దూసుకెళ్తోంది.

మనిషన్నోడు.. ఎలా బతకాలో చూడాలంటే.. నేటి జపాన్ ను చూడాలి. మనిషన్నోడు ఎలా వుండకూడదో తెలుసుకోవాలంటే 1930 – 1945 మధ్య జపాన్ మిలిటరీ పాలకుల ఆకృత్యాలను చదవాలి.

సయొనారా! సయొనారా!!

వాసిరెడ్డి అమర్నాథ్, విద్యా, సామాజికవేత్త…✍️

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles