ఇప్పుడు లేటెస్ట్ యూత్ స్టార్.. ఆర్యన్ మాన్! 2025 ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పేరు ఇప్పుడు చర్చల్లోకొచ్చింది. అసలెవరీ ఆర్యన్ మాన్..?
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కూడా తన మద్దతు ప్రకటించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడు ఆర్యన్ మాన్… ఢిల్లీ యూనివర్సిటీ నూతన విద్యార్థి సంఘ అధ్యక్షుడయ్యాడు. 1 లక్షా 55 వేల మందికి పైగా విద్యార్థులు ఓటింగ్ లో పాల్గొన్న పెద్ద విద్యార్థి సంఘ ఎన్నికల తంతులో విజయంతో ఎవరీ ఆర్యన్ మాను అనేది విద్యార్థి సంఘాల్లో, సామాన్య జనంలోనే కాదు.. రాజకీయ నాయకుల్లో చర్చకు తెరలేపింది.

ఆర్యన్ మాన్ తండ్రి ఓ ప్రముఖ లిక్కర్ బ్రాండ్ యజమాని. ఆర్యన్ మాన్ వ్యాపార నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినవాడు. తండ్రి పేరు సికిందర్ మాన్. హర్యానాలోని బార్హీలో ఉన్న ఏడీఎస్ గ్రూప్ కంపెనీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ప్రసిద్ధమైన రాయల్ గ్రీన్ లిక్కర్ బ్రాండ్ లో కూడా సికిందర్ మాన్ భాగస్వామి. ఆర్యన్ అన్న విరాట్ మాన్ ఏడీఎస్ గ్రూప్ సీఈవో రోకో బ్రాండ్ డెరెక్టర్. హర్యానా రాజకీయాలను శాసించే వ్యాపార కుటుంబం సికిందర్ మాన్ ది.
అయితే, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో గెలుపు విషయంలో ఆర్యన్ కు సోదరుడు విరాట్ పూర్తిస్థాయి సహకారమందించాడు. ఈ ఎన్నికల్లో భాగంగా విలాసవంతమైన కార్లల్లో ఆర్యన్ మాన్ ప్రచారం చేస్తున్న అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
మరి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఎందుకు ప్రచారం చేశాడు..?
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా హోరాహోరీగా సాగాయి. ఈ క్రమంలో సంజయ్ దత్ వంటి స్టార్స్ కూడా రంగంలోకి దిగారు. తండ్రి సికిందర్ మాన్ తో ఉన్న స్నేహంతోనే ఆర్యన్ మాన్ కోసం సంజయ్ దత్ తో పాటు.. సోనూసూద్ వంటివారంతా ప్రచారం చేశారు. సంజయ్ దత్ ఆర్యన్ మాన్ ను మేనల్లుడు అని సంబోధిస్తూ.. తన మేనల్లుడికే ఓటు వేయాలంటూ విద్యార్థులకు విజ్ఞప్తి చేశాడు. సోనూసూద్ ఏకంగా తాను ప్రచారం చేసే ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రణ్ దీప్ హుడా కూడా ఆర్యన్ మాన్ వైపుండటంతో ఆర్యన్ మాన్ ప్రచారం ఓ సెలబ్రిటీలా సాగింది.
ఆర్యన్ నేపథ్యమేంటి..?
ఆర్యన్ మాన్ హర్యానాలోని బహదూర్ గఢ్ నివాసి. హన్స్ రాజ్ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో లైబ్రరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆర్యన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొంటున్నాడు. ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా గళం విప్పాడు. విశ్వవిద్యాలయ మౌలిక సదుపాయాలపై కూడా పోరాటాలు చేశాడు. వీటితో పాటు.. ఫుట్ బాల్ ఆటగాడిగా కూడా మాన్ క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే సబ్సిడీపై మెట్రో రైలు పాసెస్, యూనివర్సిటీలో ఉచిత వైఫై కనెక్టివిటీ, మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీలిచ్చాడు. అలాగే, చివరి సంవత్సరం పీహెచ్డీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ కూడా సాధిస్తానని భరోసా కల్పించాడు.
నిన్నటి గురువారం రోజున 2025, సెప్టెంబర్ 18న ఢిల్లీ విశ్వవిద్యాలయం ఎన్నికలు ముగియగా.. ఏకంగా ఒక లక్షా యాభై ఐదు వేలకు పైగా విద్యార్థులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ 2025, సెప్టెబర్ 19న ఉదయం 8 గంటలకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని స్పోర్ట్స్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. హోరాహోరీ పోరులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అభ్యర్థి ఆర్యన్ మాన్.. కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎన్ఎస్యూఐ నేత జోస్లిన్ నందితా చౌదరీపై విద్యార్థి సంఘ అధ్యక్ష పదవిని గెలిచి ఇప్పుడు విద్యార్థీ లోకంలో పతాకశీర్షికయ్యాడు. ఈ పోటీలో ఏబీవీపీ ప్యానెల్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను గెల్చుకోగా.. ఎన్ఎస్యూఐ కేవలం వైస్ ప్రెసిడెంట్ పదవితో సరిపెట్టుకుంది.



