నాడు పైలట్.. నేడు డ్యాన్సర్: ఓ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆసక్తికర జర్నీ!

కొందరి జీవన ప్రయాణాలు ఆసక్తికరంగా ఉంటాయి. అంతేనా.. పూర్తి భిన్నంగా ఉంటాయి. అలాంటి కంప్లీట్ కాంట్రాస్ట్ పిక్చరే… కెప్టెన్ రాజ్ కుమార్ లైఫ్ జర్నీ. భారత నావికాదళ హెలిక్యాప్టర్ కాక్ పిట్లలో మూడు దశాబ్దాలు ప్రయాణించి.. ఎన్నో సాహసగాధలకు కేరాఫ్ గా నిల్చిన రాజ్ కుమార్.. రిటైర్మెంట్ తర్వాత కథకళి నాట్యశిక్షణాలయంలో టేకాఫ్ అవ్వడమే ఈ స్టోరీ ప్రత్యేకత.

తుఫానులు, మంచు తుఫానులు, నైట్ డెక్ ల్యాండింగ్స్, జలాంతర్గాముల్లో యుద్ధకసరత్తులు, బతుకుతామో, లేదో కూడా తెలియని డేర్ డేవిల్ ఆపరేషన్స్ ఇలా ఎన్నో చూశాడు పైలట్ గా రాజ్ కుమార్.

1990ల కాలంలో అంటార్కిటికాలో ని మైత్రి రీసెర్చ్ సెంటర్ లో పనిచేస్తూ.. మంచు తుఫాన్ లో చిక్కుకున్నభారత్ కు చెందిన శాస్త్రవేత్తల బందాన్ని కాపాడి యంగ్ చేతక్ పైలట్ గా ప్రశంసలందుకోవడం నుంచి రాజ్ కుమార్ సాహసగాధలు మొదలయ్యాయి. ఆ తర్వాత అటువంటి అనేక ఆపరేషన్లలో పాల్గొన్న రాజ్ కుమార్.. 2017లో ఓఖి తుఫాన్ సమయంలో కొచ్చి సముద్రంలో చిక్కుకుని ప్రాణాలతో పోరాడుతున్న 12 మంది మత్స్యకారులను రక్షించాడు. అదీ రాత్రి పూట అలాంటి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన మొట్టమొదటి నావికా పైలట్ గా గుర్తింపు సాధించాడు. ఆయన సాహసోపోతమైన రెస్క్యూకు ప్రభుత్వం శౌర్య చక్రతో సన్మానించింది.

అంతేనా…? 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు ఆయన చేపట్టిన వీరోచిత రెస్క్యూ మిషన్.. కేరళ ఆయన్నెప్పుడూ మర్చిపోకుండా చేసింది. సీ కింగ్ 42బీ అనే విమానంలో ఒకేసారి 26 మందిని సురక్షితంగా వరదల్లోంచి బయటకు తీసుకురావడం.. విమానయాన చరిత్రలో ఒక ప్రపంచ రికార్డ్.

అయితే, కెప్టెన్ రాజ్ కుమార్ రిటైర్డై ఇప్పటికే 5 ఏళ్లైపోయింది. శేష జీవితాన్ని హాయిగా గడపాల్సిన సమయమిది. కానీ, 62 ఏళ్ల వయస్సులో ఇప్పుడాయన నేరుగా రిటైర్డ్ కాగానే కథాకళి శిక్షణ కోసం నాట్యాలయంలో టేకాఫ్ అయ్యారు.

నాట్య కళాకారుడిగా.. రాజ్ కుమార్ కొత్త మిషన్!

రిటైర్డ్ కాగానే నేరుగా నాట్యాలయంలో టేకాఫ్ అయిన రాజ్ కుమార్.. బాల్యం నుంచీ తాను కన్న కలను నెరవేర్చుకునేందుకు… ఇప్పుడు, 62 ఏళ్ల వయస్సులో కథకళి నాట్యాన్ని ఓ వేదికపై ప్రదర్శించేదుకు ఆరంగేట్రం చేస్తున్నాడు. అందుకు, ఈ సెప్టెంబర్ 21వ తేదీ ముహూర్తం ఖరారైంది.

కేరళ నిలంబూర్ లో పెరిగిన రాజ్ కుమార్.. తన తాతతోని ఓ ఆలయంలో కథాకళి నాట్య ప్రదర్శన చూడ్డానికి వెళ్లి.. అదిగో అక్కడ తన బాల్యంలోనే ఆకర్షితుడయ్యాడు. రాజ్ కుమార్ తాత కుంజుకుట్టన్ తంబాన్ కళాపోషకుడు. ఇప్పుడు రాజ్ కుమార్ కూడా తాత తరహాలోనే ఓ కళాపోషకుడిగా కథకళి నేర్చుకునే విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ కూడా అందిస్తున్నాడు. త్రిపునితురలోని పూర్ణత్రయీస ఆలయంలో నేషనల్ అకాడమి ఫర్ టెంపుల్ ఆర్ట్స్ మూడో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 21న నాట్య కళాకారుడిగా స్టేజ్ ఎక్కాలన్న రాజ్ కుమార్ కోరిక నెరవేరబోతోంది.

తన సోదరికి నేర్పించేందుకు మోహినీయట్టం గురువు గురించి ఆరా తీస్తున్నప్పుడు.. తను కథకళి గురువును కలుసుకున్నాడు. ముందు సోదరిని చేర్చిన రాజ్ కుమార్.. ఆ తర్వాత, తానూ చేరిపోయాడు. తన సోదరి గాయత్రీ గోవింద్ తో కలిసి కొచ్చిలోని సంస్కార స్కూల్ మాజీ ప్రిన్సిపాల్, ప్రఖ్యాత కథకళి గురువు ఏవూర్ రాజేంద్రనే పిళ్లై వద్ద శిక్షణ ప్రారంభించాడు. న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కథకళిలో ప్రిన్సిపాల్ గా పనిచేసిన రాజేంద్రన్ పళ్లై ఇప్పుడు త్రిపునితురలోని నేషనల్ అకాడమీ ఫర్ టెంపుల్ ఆర్ట్స్ ను నడుపుతున్నారు.

వార్మ్ అప్ చేయడమే కష్టంగా ఉండే వయస్సులో కథకళి నేర్చుకోవడం తన వయస్సుకు అంత సులువైన పని కాదంటాడు రాజ్ కుమార్. హెలిక్యాప్టర్ పైలట్ గా కాక్ పిట్ లో మణికట్టుతో నియంత్రించగల్గేంత సామర్థ్యం సాధించిన నేను.. నా గురువు చెప్పినట్టు మోకాళ్లపై కూర్చుని వేసే భంగిమల్లో బ్యాక్ పెయిన్ తో చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలూ ఉన్నాయంటున్నాడు ఈ కెప్టెన్.

ఇక కథకళిలో భంగిమలకెంత ప్రాధాన్యతో.. ముఖ కవళికలు, హావభావాలకూ అంతే ప్రాధాన్యత. నా గురువు సున్నితమైన శృంగార రసాన్ని ఒలికించి దాన్ని నా ముఖంలో చూడాలనకున్నప్పుడు నేను కనబర్చే హావభావాలు తల్చుకుంటే నాకే నవ్వొస్తుందంటాడు కెప్టెన్ సాబ్.

నా గురువును కాపీ చేయడానికి ప్రయత్నించినా.. ఆయన కనుబొమ్మల్లా నేను ఎగురవేయలేకపోయాడు. నేను కనుబొమ్మలెగురేసినప్పుడు అవి రన్ వేపై వెళ్తున్నప్పుడు హెలిక్యాప్టర్ గ్లిమ్ ల్యాంప్స్ లా వణుకుతున్నాయే తప్ప… అందులో కరుణరసం కనిపించలేదంటున్నాడు రాజ్ కుమార్. నా హావభావాల్లో నా గురువు కరుణరసం కోరుకుంటే.. నేనేమో సముద్రంలో తుఫాన్ లో తేలియాడుతున్న ఓ రాజులాగా నాట్యామాడానంటూ ఒకింత సరదాగా ఉత్సాహంగా చెబుతారు రాజ్ కుమార్.

ఏదైతేనేం తన వృత్తిలో ఎలాగైతే ప్రతీ సవాల్ ను ఛేదించాడో.. అదే పద్ధతిలో తన చిన్ననాటి కలైన నాట్యంలోనూ తర్ఫీదు పొంది తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. రెండుసార్లు క్యాన్సర్ అటాక్ అయినా బయటపడ్డ రాజ్ కుమార్.. ఇప్పుడు ఒకే ఒక్క కిడ్నీతోనే మళ్లీ నాట్యంలోనూ రాణిస్తున్నాడు. అయితే, తన బలహీనలు, అనారోగ్య సమస్యలు ఎవ్వరికీ చెప్పుకోవడం.. సమాజ సానుభూతి కోరుకోవడం ఇష్టంలేని ప్రాక్టికాలిటి ఉన్న రాజ్ కుమార్.. నిరంతరం ఏదో నేర్చుకోవాలనే తపనతో జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.

తన ఆత్మకథ పేజీల్లో తన వృత్తిగత జీవితానికి ఎంత ప్రాధాన్యతైతే ఉంటుందో.. తన బాల్యంనాటి కలైన కథకళి నాట్యశిక్షణకూ కొన్ని పేజీలుంటాయంటాడు. నిత్య జీవితం ఓ క్రమశిక్షణతో నడిస్తే ఆరోగ్యంతో పాటు, మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని.. ఎంప్టీ మైండ్ సెట్ తనకిష్టం కాదనే రాజ్ కుమార్ నేరుగా గగనతలం నుంచి కథకళివైపు పయనించాడు.

నేవీలో పని చేసేటప్పుడు కఠినంగా, దృఢంగా కనిపించేందుకు శిక్షణ పొందితే… మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు, రిలాక్స్ అయ్యేందుకు కథకళి ఉపయోగపడుతోందట రాజ్ కుమార్ కు. ఏ రంగంలోనైనా పోటీ ఉన్నప్పుడే మరింత రాణించేందుకు అవకాశముంటుంది. విమర్శలున్నప్పుడే తమను తాము పొరపాట్ల నుంచి సరిదిద్దుకునే ఆత్మవిమర్శ కనిపిస్తుంది. కాబట్టి, తనకిప్పుడు నాట్యంలో తన సోదరే ప్రధాన విమర్శకురాలు. ఎందుకంటే, తను చిన్నప్పట్నుంచే మోహినీ అట్టంగడి నాట్యం నేర్చుకుంటోంది. ఇప్పటికే ఆమె ఓ ఎక్స్పర్ట్. కానీ, నేనెప్పుడూ అలా అని ఒప్పుకోను… దాంతో ఒకరినొకరం మేం విమర్శించుకుంటూ, కీచులాడుకుంటూనే ఉంటామంటున్నాడు రాజ్ కుమార్.

తాను నృత్యం నేర్చుుకుంటోంది ఇంకా సాధించాలనే కోరికతో కాదు.. క్రమశిక్షణ, వ్యాయామం, పట్టుదల, ఉత్సాహం, మానసిక ఉల్లాసం కోసమేనంటున్నాడు నాటి కెప్టెన్ నేటి డ్యాన్సర్ రాజ్ కుమార్. తన వృత్తి జీవితంలో ఫ్లైట్ సూట్ లోనే కనిపించిన తాను.. ఈ 2025, సెప్టెంబర్ 21న కథకళి నృత్య వస్త్రధారణలో, మేకప్ తో కనిపించనున్నాడు. మొత్తంగా రాజ్ కుమార్ జీవితం కెప్టెన్ గా మొదటి ఇన్నింగ్స్ ఆడితే.. బాల్య కోరిక నెరవేర్చుకునే డ్యాన్సర్ గా రెండో ఇన్నింగ్స్ తో సంపూర్ణమవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles