అధికార కేంద్రాల రహస్యాలను బట్టబయల్జేసిన వన్ మ్యాన్ ఆర్మీ! ఎవరీ సీమోర్ హెర్ష్..?

సీమోర్ హెర్ష్… ఎవరు..?

అధికారిక కేంద్రాల వెనుక ఉన్న రహస్యాలను బట్టబయల్జేసిన వన్-మ్యాన్ ఆర్మీ!

దేశాధ్యక్షులనే గడగడలాడించిన ఎందరో జర్నలిస్టులు కథలు వింటుంటాం. కానీ, సీమోర్ హెర్ష్ మాత్రం వారందరిలోకీ ప్రత్యేకం. ఎందుకంటే, హెర్ష్ కు జర్నలిజం ఓ ప్యాషన్.

ఏంటీ సీమోర్ స్పెషాలిటీ..?

1969 వియత్నాం యుద్ధ కాలంలో మై లై మారణకాండలో వందలాది మంది నిరాయుధ వియత్నాం పౌరులు హతమైన ఘటన వెనుక కారణాలను హెర్ష్ సమర్థవంతంగా వెలుగులోకి తెచ్చి, సమాజం ముందుంచాడు. అప్పటికి అతను ఏదైనా పెద్ద మీడియా సంస్థలో పని చేస్తున్న ఓ స్టార్ జర్నలిస్ట్ కూడా కాదు. జస్ట్ ఫ్రీలాన్స్ రిపోర్టర్. ఆయన కథనాన్ని మొదట్లో పెద్ద పెద్ద మ్యాగజైన్స్ తిరస్కరించాయి. చిన్న వార్త సంస్థ ద్వారా బయటకొచ్చిన మై లై మారణకాండపై ఆయన రిపోర్టింగే.. ఆయనకు ఏకంగా 1970లో పులిట్జర్ తెచ్చి పెట్టింది.

ఆ తర్వాత హెర్ష్ జర్నలిజం కెరీర్ ఓ గోల్డెన్ ఎరాను చూసింది. నిక్సన్ రిపబ్లిక్ పార్టీ కార్యకర్తలు… డెమోక్రాటిక్ పార్టీ కార్యాలయంలో ఉన్న వాటర్ గేట్ భవనంలోకి చొరబడి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పత్రాలు, ఇతర డాటాను తస్కరణకు యత్నించిన వాటర్ గేట్ కుంభకోణం నుంచి మొదలు.. సీఐఏ రహస్య కార్యకాలాపాలు, కంబోడియాపై రహస్య బాంబు దాడులు, నిక్సన్ కు సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా ఉన్న దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ కు మధ్య నడిచిన రహస్య బంధాలు, 2003లో అమెరికా బలగాలు ఇరాక్ దురాక్రమణ తర్వాత.. బాగ్ధాద్ జైల్లోని ఖైదీలపై జరిగిన హింస వంటి అత్యంత సున్నితాంశాలపై హెర్ష్ వెలువరించిన ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ప్రపంచ జర్నలిజం చరిత్రలోనే ఆయన పేరును చిరస్థాయిగా నిలబెట్టాయి.

హెర్ష్ స్టైలే వేరు!

ఏ ప్రభుత్వమైనా ఏం చెబుతుందో.. దానికి రివర్స్ లో ఆలోచించడమే హెర్ష్ జర్నలిజంలో అనుసరించిన ప్రధానమైన వైఖరి. అదే ఆయనకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.

జర్నలిజంలోకి రాకమునుపు లా చదివి, నచ్చక వదిలేశాడు. ఆ తర్వాతే వార్తా విలేకరి అవతారమెత్తాడు.

అతనొక వెధవే… కానీ, అతడు చెప్పింది నిజమేనంటూ కితాబిచ్చాడు బద్ధ విరోధైన నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్. అందుకే సీమోర్ హెర్ష్ పైన ఏకంగా కవర్ అప్ అనే ఒక డాక్యుమెంటరీనే రూపొందించారు. అదిప్పుడు నెట్ ఫ్లిక్స్ లో కూడా ఉంది చూడొచ్చు.

89 ఏళ్ల హెర్ష్ ఈ మధ్యే వాషింగ్టన్ డీసీలో తన ఇంటి నుంచి పత్రికేదైనా కొందామని బయల్దేరితే.. అరగంటపాటూ తిరిగినా ఒక్క న్యూస్ స్టాండ్ కూడా ఆయనకు కనిపించలేదు. చివరకు ఒక డ్రగ్ స్టోర్ లో కేవలం రెండే రెండు న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్స్ కనిపించాయి. అందులో ఒకటి కొనుక్కున్న హెర్ష్.. మరి రెండో కాపీ కొనేవాళ్లెవరైనా ఉంటారా అని ఆ డ్రగ్ స్టోర్ కీపర్ ను అడిగాడు. అంటే నేటి మీడియా ప్రపంచంపై ఆయన ఆలోచనలకు అద్దం పట్టిన డైలాగ్ అది.

…………………………

1937లో షికాగోలో పుట్టాడు హెర్ష్. న్యూయార్క్ టైమ్స్, న్యూయార్కర్ వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. వియత్నాం యుద్ధం మెదలు గాజా, ఉక్రెయిన్ వంటి పలు అంతర్జాతీయ వ్యవహారాలపై సంచలనమైన కథనాలు రాశాడు. అందులో 1968 మై లై మారణకాండ రిపోర్టింగ్ ఆయన కెరీర్ లోనే అత్యున్నతమైంది. అమెరికా ప్రజాభిప్రాయాన్నే వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా మల్చగల్గేంత కీలకపాత్ర పోషించాయి ఆయన రాసిన కథనాలు.

హెర్ష్ స్వభావరీత్యా ఎప్పుడూ కాస్తా వివాదాస్పదుడే. సహచరులతోనూ, ఎడిటర్లతోనూ, అధికారులతోనూ ఎప్పుడూ ఫైటే. అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కు హెర్ష్ అంటే అంతులేని అసహనం. వైట్ హౌజ్ లో నిక్సన్ ఓసారి సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా ఉన్న హెన్రీ కిస్సింజర్ తో హెర్ష్ ను దూషించిన ఓ రికార్డింగ్ కూడా అప్పట్లో సంచలనం రేపింది. అతనో వెధవ.. బహుశా కమ్యూనిస్ట్ ఏజెంట్ కూడా కావచ్చు.. కానీ, అతను చెప్పిందీ నిజమేనంటూ నిక్సన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. ఒక అగ్రరాజ్య అధ్యక్షుడు స్వయంగా ఒక జర్నలిస్టు గురించి తన అధికారిక కేంద్రంలో మరో కీలక అధికారితో ఆ వ్యాఖ్యలు చేయడమంటే… హెర్ష్ ఎంత ప్రభావితం చేసుండాలి..?

……………………………

హెర్ష్ పై డాక్యుమెంటరీ!

లారా పోయిట్రాస్, మార్క్ ఓబెన్ హౌస్ కలిసి హెర్ష్ పై కవర్ అప్ అనే డాక్యుమెంటరీని నిర్మించారు.

మొదట్లో హెర్ష్ ఆ డాక్యుమెంటరీలో కనిపించేందుకు ససేమిరా అన్నాడు. దర్శకురాలు లారా పోయిట్రాస్ ఆయన్ను ఒప్పించేందుకు కొన్నేళ్లు తన చుట్టూ తిరిగింది. షూటింగ్ సమయంలోనూ కొన్ని సమస్యలు తప్పలేదు. హెర్ష్ తన ఆఫీస్ లో కెమెరాలు పెట్టడాన్ని ఒప్పుకోలేదు. తన రహస్య కాంట్రాక్టులు ఎవ్వరికీ తెలియడానికీ ఆయన ఇష్టపడలేదు. ఒక దశలోనైతే తాను పూర్తిగా ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ నుంచి తప్పుకుంటున్నానీ ప్రకటించాడు. కానీ, మళ్లీ 24 గంటలు తిరక్కుండానే తానే వచ్చాడు.

ఏదైనా నచ్చకపోతే వదిలేయడం అలవాటున్న హెర్ష్… న్యూయార్క్ టైమ్స్ వంటి సంస్థనే వదిలేశాడు. కాబట్టి ఇక ఈ డాక్యుమెంటరీ నుంచి కూడా అంతే సంగతులనుకున్నారు. కానీ, ఎందుకో హెర్ష్ మనసు మార్చుకున్నాడు.

కవర్ అప్ హెర్ష్ అనే జర్నలిస్ట్ కథ మాత్రమే కాదు.. అంతకుమించి!

కవర్ అప్ అంటే హెర్ష్ బయోపిక్ లాంటిది ఏమాత్రం కాదు. జర్నలిజం వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో చర్చించిన డాక్యుమెంటరీ ఫిల్మ్. అధికారాన్ని ప్రశ్నించే కథనాలను మీడియా సంస్థలు ఎంతవరకు భరించగలవో చెప్పే ఓ విజువల్ డాక్యుమెంట్.

మీడియాకు సెన్సార్షిప్ ఎవ్వరో చేయాల్సిన పనేం లేదు.. ఎప్పుడేం చేయాలో తెలిసిన మీడియాకు సెల్ఫ్ సెన్సార్షిప్పూ తెలుసని 1970ల్లోనే హెర్ష్ చెప్పేవాడు.

న్యాయపోరాటాలకు భయపడటం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం, నేటి డిజిటల్ మీడియా వచ్చాక మారుతున్న ధోరణులు… వెరసి, పరిశోధానాత్మక జర్నలిజం రాను రాను ఓ చరిత్రగా మారిపోయింది.

మరి అంత ప్రఖ్యాత జర్నలిస్టైన హెర్ష్ ఇప్పుడెక్కడ ఉన్నాడు..?

పెద్ద పెద్ద మీడియా సంస్థల ఎడిటోరియల్స్ లో నియంత్రణెక్కువ. అలాంటి బాధేం లేకుండా తనకు నచ్చిన కథనాలను రాయడానికి తనకు అనుకూలంగా seymourhersh.substack.com అనే వెబ్ సైట్ ఏర్పాటు చేసుకుని ఇంకా రాస్తూనే ఉన్నారు. అయితే, అదే సమయంలో ఓ పెద్ద మీడియా వేదికపై నిలబడి ఓ సంచలన కథనాన్ని గతంలోలా ప్రపంచం ముందుకు తీసుకెళ్లే ఒక ఉత్కంఠ మాత్రం ఇప్పుడు హెర్ష్ జర్నలిజం జీవితంలో కనిపించదు.

అయితే, ఆరు దశాబ్దాల అనుభం తర్వాత కూడా హెర్ష్ కు జర్నలిజంపై నమ్మకం ఏమాత్రమూ తగ్గలేదు.

ఆయన మాటల్లో చెప్పాలంటే….

జర్నలిజం అద్భుతమైన సూత్రం. మనకు ఇప్పటివరకు ఉన్న జర్నలిజం లేకపోయి ఉంటే ప్రపంచం ఎలా ఉండేదో ఓసారి ఊహించండి. జర్నలిజం ముఖ్యం. అది అవసరం.

2025 సెప్టెంబర్‌లో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కవర్ అప్ ప్రీమియర్‌కు హెర్ష్ హాజరయ్యాడు. ప్రేక్షకుల స్పందనకు హెర్ష్ కన్నీళ్లు పెట్టుకున్నాడట. కానీ, వాళ్లు ఆ డాక్యుమెంటరీని సరిగ్గా అర్థం చేయలేకపోయారని.. దాన్ని ఆపడానికి తాను ప్రయత్నించానని ఆ తర్వాత హెర్ష్ చెప్పారు.

అసలు సీమోర్ హెర్ష్ అంటే మూడు ముక్కల్లో ఏం చెప్పొచ్చు..?

అధికారిక నివాసాలకు కంట్లో నలుసు
ఎడిటర్లకు తలబొప్పి కట్టించే జర్నలిస్ట్
సహచరులకు చికాకు
కానీ, జర్నలిజం చరిత్రలో మాత్రం ఓ చెరగని ముద్ర!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రభుత్వాలను ప్రశ్నించిన ఓ జర్నలిస్ట్.. చివరకు తనను తాను కూడా ప్రశ్నించుకోవడానికి సిద్ధంగా ఉండటమే సీమోర్ హెర్ష్ ప్రత్యేకత.

2025 డిసెంబర్ 5నే యూకే, ఐర్లాండ్లలో థియేటర్లలో కూడా ప్రదర్శించిన హెర్ష్ బయోపిక్ కవర్ అప్ డాక్యుమెంటరీ.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులో ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles