ఏజెంట్ మోసానికి ఏడాదిగా పాక్ జైల్లో తల్లీకొడుకులు! ఎట్టకేలకు.. మాతృదేశానికి!!

తామోటి తలిస్తే… దైవమోటి తల్చిందన్నట్టు.. ఎలాంటి తప్పు చేయకుండానే పాకిస్థాన్ లో ఏడాది జైలు శిక్షననుభవించిన తల్లీకొడుకులు.. ఎట్టకేలకు బుధవారం రోజు మాతృదేశానికి చేరుకున్నారు. గత బుధవారమే పాకిస్థాన్ ఆర్మీ… ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కు అప్పగించిన ఆ తల్లీకొడుకుల సుఖాంత కథ.. కాస్త ఇంట్రెస్టింగ్!

వహీదా బేగం, ఆమె మైనర్ కొడుకు ఫైజ్ ఖాన్… అస్సాం నాగావ్ జిల్లాకు చెందినవారు. 2022లో వహీదాబేగం భర్త మరణంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఇక తన ఊళ్లో ఉండలేక… తన కుమారుణ్ని తీసుకుని ఏదైనా పని చూసుకునేందుకు కెనడాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది వహీదా బేగం. మనం నిత్యం ఎన్నో కథలు వింటున్నట్టే… ఓ మోసకారి ఏజెంట్ చేతుల్లో చిక్కింది ఆమె భవితవ్యం.

సదరు ఏజెంట్ కెనడా పంపించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుందని చెప్పడంతో… తన ఊళ్లోని ఇంటినీ అమ్మేసింది బేగం. ఆ వచ్చిన డబ్బును ఏజెంట్ చేతుల్లో పెట్టింది. అలా వారి ప్రయాణం మొదట దుబాయ్ వరకూ… అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకూ సాగింది. కానీ, ఆఫ్ఘనిస్తాన్ వెళ్లింతర్వాత ఏజెంట్… వహీదా బేగం ఇచ్చిన డబ్బు, ఆమె, ఆమె కొడుకు పాస్పోర్ట్ అన్నీ పట్టుకుని కనిపించకుండా అదృశ్యమైపోయాడు. ఏంచేయాలో పాలుపోని ఆందోళనకర స్థితి బేగంది. దేశం కాని దేశంలో ఒంటరైపోయి… మానవ అక్రమరవాణాలో ఇరుక్కుపోయారు ఆ తల్లీకొడుకులిద్దరూ.

ఎలాగైనా మళ్లీ తిరిగి తమ దేశానికి తాము వెళ్తేనే తాము సురక్షితంగా బతికి బట్టకట్టగలమన్న ఆలోచనతో… తల్లీకొడుకులు వహీదా, ఫైజ్ బార్డర్స్ దాటి పాకిస్థాన్ లోకి ప్రవేశించారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి చమన్ సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌లోకి వెళ్లుతుండగా పాకిస్థాన్ బార్డర్ సెక్యూరిటీ అధికారులు ఆ తల్లీకొడుకులను అరెస్టు చేశారు. విదేశీయుల అక్రమ చొరబాట్ల యాక్ట్ కింద అరెస్టైన వహీదా, ఫైజ్ ఇద్దరూ సరిగ్గా ఏడాది కాలంగా పాక్ జైలులో ఊచలు లెక్కబెట్టారు.

అయితే, పాక్ అధికారులు కూడా ఏ పాపం ఎరుగని ఆ కుటుంబానికి న్యాయం చేసే క్రమంలో ఓ పాక్ లాయర్ ను వారికి పరిచయం చేశారు. అలా పాకిస్థాన్ లాయర్ సాయంతో.. భారత్ లో ఉన్న వహీదా తల్లికి సమాచారమందింది. సదరు న్యాయవాది సహకారంతో కాన్సులేట్ సాయం కూడా అందింది. ఆ క్రమంలో న్యూఢిల్లీలోని పాక్ హై కమిషన్ తో పాటు… ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ ను కూడా వహీదా కుటుంబం సంప్రదించింది. దాంతో ఇస్లామాబాద్ లోని భారత్ హై కమిషన్ అధికారులు… పాకిస్థాన్ ఇంటర్నల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు. అయినా, పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియకు మాత్రం నెలల కాలం పట్టింది. దాంతో ఏడాది కాలం తల్లీ కొడుకులైన వహీదా, ఫైజ్ పాక్ జైల్లోనే గడపాల్సి వచ్చింది.

ఎట్టకేలకు వారికి బుధవారం రోజున విముక్తి లభించి.. వారిని పాక్ అధికారులు వాఘా సరిహద్దు వద్ద భారత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులకు అప్పగించారు. మళ్లీ తమ దేశానికి తాము వెళ్లగల్గుతామానన్న ఆందోళన, అనుమానాల్లో ఉన్న వహీదా, ఫైజ్ అలా మొత్తంగా అత్తారీ-వాఘా బార్డర్ దాటి మళ్లీ తమ మాతృదేశంలోకి అడుగుపెట్టారు.

వహీదా, ఫైజ్ ఖాన్ తల్లీకొడుకుల్లాగే… గతంలో అక్రమ చొరబాటు కేసుల్లో అరెస్టైన షబ్బీర్ అహ్మద్ కరాచీలోని మాలిర్ జైల్ నుంచి… అలాగే, సూరజ్ పాల్ లాహోర్ లోని కోట్ లఖ్ పత్ జైలు నుంచి విడుదలై… బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించబడటం కొసమెరుపు.

మొత్తంగా ఈ మధ్య జియో సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన ALELLI సినిమా తరహాలోనే.. వహీదా, ఫైజ్ స్టోరీ కొంత పోలి ఉండటం గమనార్హం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles