ఇరాన్లో మన మూసీ నది చూశాను !

వల్లీశ్వర్ గుండు… సీనియర్ జర్నలిస్ట్, రచయిత…✍🏻
మన భాగ్యనగరంలో లాగానే ఇరాన్ పురాతన నగరాల్లో ఒకటైన ఇస్ఫహానాలో మూసీనదిని చూశాను.
ఇరాన్ చక్రవర్తి షా తహంసా కాలంలో అల్లా వెర్ది ఖాన్ అనే జార్జియా రాజ కుటుంబానికి చెందిన సైనికాధికారి షా చక్రవర్తి సైన్యంతో జరిగిన యుద్ధంలో బందీగా దొరికిపోయాడు. కానీ చాలా కొద్ది కాలంలో అతను తన మేథస్సుతో చక్రవర్తి ప్రాపకం సంపాదించాడు. సఫావిద్ రాజ వంశ సలహాదారుగా ఎదిగాడు.
ఇరాన్లో ఒక ప్రధాన నగరమైన ఇస్ఫహానాలో అచ్చు మన ముచుకుందా (మూసీ) నదిలాగానే పైన ఎక్కడెక్కడో కురిసే నీటితో వర్షాకాలంలో వరదలతో ఊళ్లని ముంచెత్తుతూ, మిగతా సీజన్లలో నీరసంగా ప్రవహిస్తూన్న జయాందే నదిని ఎలా అదుపు చేసి, అభివృద్ధి చేసి సద్వినియోగం చేయాలా అని అల్లా వెర్ది ఖాన్ మన నాయకుల్లాగానే ఆలోచించాడు.

గత అర్థ శతాబ్దకాలంగా మన నాయకులు ప్రతిబడ్జెట్ లోనూ మూసీ ప్రక్షాళన, సుందరీకరణలకోసం కోట్లు కేటాయింపులు చేయటం ద్వారా దీర్ఘకాలిక ప్రణాలికలు రచిస్తూ రచిస్తూ రచిస్తూనే ఉన్నారు. కాని ఆ అల్లా వెర్ది ఖాన్ గారు అంత ‘దూరాలోచన’ గల నాయకుడు కాదు.
ఆయన వేసిన ప్రణాళికలను అనుసరించి, 17వ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా నగర పరిసరాల్లో జయాందే నదిమీద ఇంచుమించు ప్రతి కిలోమీటరు దూరానికి ఒక చెక్ డాం కట్టారు.. ప్రతి డాం మీదనుంచి రహదారి ఏర్పాటు చేశారు.. దాంతో ఏమైంది!
ఒక చెక్ డాం నిండిపోగానే నీరు క్రిందకి ప్రవహిస్తూ, క్రింది చెక్ డాం నిండేదాకా ఆగి, ఇంకా ఎక్కువ నీరు వస్తుంటే, ఆ చెక్ డాం మీదుగా ప్రవహించి తరువాత్ చెక్ డాం చేరుకోవటం … అక్కడా మళ్ళీ ఇలాగే …!
గత నెల మే 24 నాడు ఈ నగరంలో నది దిగువ నుంచి ఎగువకి ఏడెనిమిది చెక్ డాములు చూశాను. కొన్నింటిలో నీళ్ళు నిండుగా ఉన్నాయి. కొన్ని ఓ మోస్తరుగా ఉన్నాయి. చెక్ డాముల మీద కట్టిన రహదార్లలో కొన్నింటిని మాత్రమే నగరంలో అటూ కార్ల ట్రాఫిక్ తిరగటానికి వీలుగా వెడల్పాటి వంతెనల్లా చేశారు. మధ్య మధ్యలో కొన్నిటిని పాదచారులు విహరించేందుకు వీలుగా చేశారు.
అలాంటి ఒక ‘చెక్ డాం + రహదారిని ‘ పూర్తిగా పిల్లల వినోదం కోసం ఒక ఎమ్యూజిమెంట్ పార్కులా కేటాయించారు. అక్కడితో అవలేదు.
మొత్తం నది నగరంలోనుంచి ప్రవహించే ప్రాంతంలో నదికి ఇరువైపులా విశాలమైన విశ్రాంత చప్టాలు కట్టించారు.. పార్కు అభివృద్ధి చేశారు. నగరంలో పిల్లా పెద్దా అందరికీ వారాంతాల ఆటవిడుపుగా, పిల్లలకి ప్రతిరోజూ జల క్రీడాకేందంగా తీర్చి దిద్దారు.
ఇక్కడి ఫొటోల్లో చూడండి. ఇలా జయాందే నదిలా కళ కళలాడుతున్న స్థితిలో మన హైదరాబాదు మూసీ నదిని కూడా మన జీవితకాలంలో చూడగలమా అనిపిస్తోంది కదా!
మరి ఎవరు బాధ్యులు ?



