HARIBABU MADDUKURI.. ✍🏼
వైట్ హౌస్..
రాత్రి ఏడుగంటల ప్రాంతం..
ఆరోజు మధ్యాహ్నమే ట్రంప్ కి అత్యంత సన్నిహితులైన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ దిగాడు. హంగేరి దేశం నుంచి విక్టర్, అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ కూడా వచ్చారు.
వాళ్ళ ఆగమనాన్ని ఆదరంగా చూసి “దయచేయండి” అన్నారు వైట్ హౌస్ పెద్దలు.. సరాసరి విడిదిచావిడికి తీసుకెళ్లి బూట్లు విప్పించి, కాళ్ళు కడిగించి, గళ్ళతువ్వాళ్ళతో తుడిపించారు.

సేదదీర్చుకోవడానికి చల్లటి వెనిజులా కొబ్బరిబొండాలు కొట్టించి, వాటిలో అదేదో ద్రావకాన్ని కలిపి చేతికి అందించారు.
భోజనాల బల్ల దగ్గరికి చేరి అవి పుచ్చుకునేలోపే వంటగదిలో కోడిపుంజుల తలలు తెగి, వేడివేడి బిర్యానీ సిద్ధమైపోయింది. ఆ ఘుమఘుమలకి, బోండాల మత్తుకి కిర్రెక్కిపోయారు అతిథులు..
అప్పుడే ట్రంప్ కూడా అతిథులు కూర్చున్న ఆ బల్ల దగ్గరికి చేరాడు.. ఎందుకో మనిషి ఉత్సాహంగా కాకుండా కొంచెం నీరసంగా కనిపిస్తున్నాడు..
ఎంతో వైభవంగా బతికిన తమ పెద్దన్న అలా నిస్తేజంగా ఉండటం చూసి అతిథిత్రయానికి జాలేసింది. కొంచెం కొంటెతనం, అణువంత అల్లరితనం కలగల్సిన నిలువెత్తు మనిషి అలా బెంగపెట్టుకుంటే వీళ్ళకి బాధేసింది.
“ఒహ్హోహ్హోహ్హో.. పెట్టి పుట్టాలండీ మా ట్రంప్ అన్నగారి ఆతిథ్యం అందుకోవడానికి.. ఏదేమైనా మనంమనం ఒక కుటమానంవాళ్ళం కాబట్టే ఈ మర్యాదమన్ననలు మనకే అర్థమవుతాయి. ఎక్కడో వేల మైళ్ళదూరంలో విసిరేసినట్టు ఉండే ఆసియావాళ్ళకేం తెలుస్తాయి..?” అర్జెంటీనా అధ్యక్షుడు మొదలెట్టాడు.
“బాగా చెప్పారు.. భారత్, చైనా, రష్యాల గురించే కదా..!” హంగేరి విక్టర్ అన్నాడు సాలోచనగా.
కుర్చీ దగ్గరికి లాక్కొని కూర్చున్న ట్రంప్ ఏం మాట్లాడలేదు..
“చైనా, రష్యాలంటే అనుకోవచ్చు.. కానీ ఇండియాకి ఏమైందని..? వాళ్లకి మన అన్నగారు ఏం తక్కువ చేశారండీ..? అడిగినవాళ్లకల్లా వీసాలిచ్చారు.. వచ్చినవాళ్లకల్లా ఉద్యోగాలిచ్చారు.. పెట్టుకున్నవాళ్ళకి కంపెనీలు, చేసుకున్న వాళ్ళకి వ్యాపారాలు.. ఏం లోటు చేశారసలు..?” బెంజమిన్ ఆవేశపడ్డాడు.
“ఇండియాకి ఇన్ని ఉపకారాలు చేస్తే.. ఇప్పుడు అన్నగారికి వ్యతిరేకంగా కూటమి కడతారా.. బాగోలేదు అన్నయ్యా.. ఇది పద్ధతిగాదు.. పెట్టిన చేతినే కరవడం తప్పు తప్పు.. ఇదేనా కృతజ్ఞత అంటే..??” నిష్టూరమాడాడు విక్టర్.
భారత్ పేరు వినగానే ట్రంప్ మొఖంలో మరింత నీరసం ఆవరించింది.. ఎట్టకేలకు నోరు విప్పాడు.
“అవును తమ్ముళ్ళుగారూ.. నిజానికి నాకు చాలా సిరాగ్గా ఉంది.. నేనుగానీ ఒకప్పటి మనిషినే అయ్యుంటే, ఆఘమేఘాల మీద ఎడాపెడా రెండుమూడు బాంబులు విసిరేసి, మా ప్రతిష్టను హెలికాప్టర్లో ఊరేగించేద్దును.. కానీ ఇప్పుడు నాకు ఏమాత్రం ఆసక్తి లేదు.. అమెరికాని గ్రేట్ చెయ్యడం మీదనే నా దృష్టంతా..” నిర్లిప్తంగా పలికాడు ట్రంప్..
అతిథులు ముగ్గురు సానుభూతిగా రెండుక్షణాలు మౌనం వ్యక్తం చేశారు..
“బోడి పన్నులు వేశారని మీకే ఎదురుతిరుగుతారా..? ఇక మీ పెద్దరికానికి ఏం మర్యాదిచ్చినట్టు..?? నాకు అర్ధంగాక అడుగుతాను.. రేపొద్దున్న మీకు నచ్చిన యే దేశం మీదనో తయారీనాణ్యత పరీక్షిద్దామని సరదాగా యే బాంబో వేస్తారు.. అంతమాత్రాన జట్లు కట్టేసి మీ మీద యుద్ధం ప్రకటించేస్తారా..?” అతిథుల్లో ఒకతను ఆవేశపడ్డాడు.
వెంటనే బెంజమిన్ అందుకున్నాడు.
“తప్పుతాదేటోయ్.. పదిదేశాలూ తిరిగి, ఆయా అధ్యక్షుల్ని బతిమాలో బెదిరించో ఆయుధాలకు సంబంధించి అరడజను బేరాలైనా కుదుర్చుకుని రావడం ముందునుంచీ మన పెద్దన్నగారి ఆనవాయితీ.. పాపం భారత్ ను కూడా అలాగే చేరదీసి, ఆయుధాలు అమ్మి, వాళ్ళని అభివృద్ధిలోకి తెద్దామనుకున్నారు. కానీ రోజులెప్పుడూ ఒకేలా ఉండిపోవు కదా.. పొట్టోణ్ణి పొడుగోడు కొడితే, పొడుగోణ్ణి పోచమ్మ కొట్టిందంటనే సామెత మొన్ననే టీవీలో ఒకాయన చెప్తుంటే విన్నాను..!!”
హోదాలో పెద్దవాడైన ట్రంప్ కి ఈ మాటలు రుచించలేదు..
“మనం అమ్మిన ఆయుధాలతో వాళ్ళూవాళ్ళూ కొట్టుకుంటుంటే, మనమే మధ్యలోకెళ్లి ఆపి తగువు తీర్చటం.. అదొక ముచ్చట.. ఎంత బాగుండేవండీ ఆరోజులు..?”
“మీరెన్ని చెప్పినా మంచికి రోజుల్లేవండీ. కృతజ్ఞతకి కాలమే కానరావట్లేదు..” అతిథులు ముగ్గురూ నిట్టూర్చి, చికెన్ జాయింట్ ముక్క కొరికే పనిలో పడ్డారు..
అసలు వీళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చారన్నట్టు ట్రంప్ ఇబ్బందిగా కదిలి.. “సరే ఇప్పుడు మా ఘనచరితల గురించి ఎందుకులేగానీ వచ్చిన విషయం తగలబెట్టండి నిరంజన్ గారూ…!!” అన్నాడు.
“అక్కడికే వస్తున్నాం అన్నగారు.. మీకు ఎదురు తిరిగినందుగ్గానూ.. నా మాట విని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించెయ్యండి ఓ పనైపోతుంది..” బెంజమిన్ ఆత్మీయంగా సలహా ఇచ్చాడు.
మిగతా ఇద్దరు ఆ నిర్ణయాన్ని బలపరిచారు.
“ఒద్దొద్దు.. మన మర్యాద, ఆత్మగౌరవం మనకి ముఖ్యంగానీ వాళ్ళని శత్రువులుగా చేసుకోవడం మన అభిమతం కాదు.. ” ట్రంప్ స్థిరంగా పలికాడు.
“అబ్బా.. ఈ అలవిగాని మంచితనమే ముంచేస్తోంది అన్నగారూ మిమ్మల్ని… అధ్యక్షుడన్నాకా కాసింత కర్కశత్వం అలవాటు చేసుకోవాలి మరి.. కావాలంటే ఆ కొరియా తమ్ముణ్ణి చూడండి ఓమాటు..” ముగ్గురూ ఆక్షేపించి ఉబ్బేశారు..
ట్రంప్ నవ్వి ఊరుకున్నాడు.
“మా మూడు దేశాలు కల్సి.. మా శాస్త్రజ్ఞులతో నెలల తరబడి చేయించిన సుదీర్ఘసర్వేలో భారత్, రష్యా, చైనాలు జత కట్టడానికి గల కారణాలేంటో విస్పష్టంగా తెలిసాయి.. ఆ నివేదికలు మీకు అందించడానికే ఇక్కడికొచ్చాం..” అని వినయంగా ఓ పేపర్లకట్ట ట్రంప్ చేతికి అందించాడు అర్జెంటీనా అధ్యక్షుడు.
ఆతృతగా కవరు చింపి పేపరు తెరిచి చూశాడు ట్రంప్..
చక్కగా డిజైన్ చెయ్యబడ్డ నల్లటి అక్షరాల్లో..
“ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్, రష్యా, సింగపూర్, చైనాలో మాత్రమే కనబడే ఈ గ్రహణ ప్రభావం కారణంగా ఆయా దేశాలు జతకట్టాయి…”
రెండుమూడు సార్లు తిరగేసి చూశాడు.. ఎంత చూసినా అదే ఉంది.. మళ్ళీ మళ్ళీ చదివి “అవునా.. ” అన్నట్టు నోరు తెరిచాడు ట్రంప్..
“వక్రించిన గ్రహాల కారణంగా జతకట్టిన ఆ పాపులకి బుద్ధి చెప్పడానికి మా దగ్గర సరైన మార్గం ఉంది. హింస జోలికి పోకుండానే వాళ్లకి సరైన బుద్ధి చెప్పి, ముగ్గుర్నీ మీ దారికి తెచ్చుకోవడం క్షణం పని అన్నగారు..” హంగేరి అధ్యక్షుడు ఊరించాడు..
“ఏమిటదీ..” రిపోర్టు పేపర్ మడిచి జేబులో పెట్టుకుంటూ కుతూహలం ప్రదర్శించాడు ట్రంప్..
“ఉన్నపళంగా మా దేశాల మీద తమరు యెంతో దయతో విధించిన సుంకాల్ని తక్షణం రద్దు చేసేస్తే.. వాళ్ళు ఏం కోల్పోయారో బుద్దొస్తుంది గాడిదలకి.. మందు పోసినవాడే సోడా కూడా పోస్తాడని తెలుసుకోకపోవడం విచారకరం..” వినయంగా పెన్ను, పేపరు ట్రంప్ చేతికందించాడు అర్జెంటీనా అధ్యక్షుడు..
ట్రంప్ చురచురా చూశాడు.. అనేక తర్జనభర్జనలు, మరో అరగంట తర్కించుకున్న తర్వాత ఇక సరేననక తప్పలేదు..
పనయ్యాకా, అతిథులు ముగ్గురు బయల్దేరబోతూ..
“మరి మాకింత గొప్ప ఉపకారం చేస్తున్న మీకోసం.. మీ మేలుకోరి.. ఇదిగోండి మీకోసం ఒకటి తెచ్చాను..” అంటూ బెంజమిన్ తన కోటు జేబులోంచి ఓ హెడ్ & షోల్డర్ షాంపూ ప్యాకెట్ తీసి ట్రంప్ చేతిలో పెట్టాడు.
“దేనికిది..??” ట్రంప్ విస్తుబోతూ అడిగాడు.
“గ్రహణానికి ముందు పట్టు స్నానం చేసి, గ్రహణం తర్వాత విడుపు స్నానం చెయ్యండి అన్నగారు.. గ్రహణ దోషం పట్టదు..”



