#SatyajitRay
…………………………………………………………..
Shanthi ishaan.. ✍🏼
ఆ సినిమా నిడివి 12 నిమిషాలు మాత్రమే. పాత్రధారులు ఇద్దరే ఇద్దరు చిన్నారులు. మాటల్లేవు; అక్కడక్కడ వినిపించే రకరకాల ధ్వనులే నేపథ్య సంగీతం. కానీ ఆ సినిమా మన మనసుల మీద చూపే ప్రభావం మాత్రం అపారం. అర్థం చేసుకోవాలే గానీ ఆ చిన్న సినిమాలో రకరకాల అంతరార్థాలు దాగుంటాయి. ఇంతకీ ఆ షార్ట్ ఫిలిం పేరేంటో గెస్ చేశారా? Two: A Film Fable. దాన్ని డైరెక్టర్ చేసింది మరెవరో కాదు తన సినిమాలతో కొన్ని తరాలకు స్ఫూర్తినిస్తూ వస్తున్న దార్శనిక దర్శకుడు సత్యజిత్ రే!

అప్పు ట్రైలజీ (పథేర్ పాంచాలి, అపరాజితో, అపుర్ సంసార్), చారులత, తీన్ కన్యా, షత్రంజ్ కే ఖిలాడి- ఇలా సత్యజిత్ రే తీసిన ప్రతీ సినిమా ఒక కళాఖండమే. ఆయన్ను ఆరాధించేవారు, అభిమానించేవారు వీటిలో కనీసం కొన్నింటినైనా ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. కానీ Two అనే షార్ట్ ఫిల్మ్ చూసినవాళ్ళు అరుదనే చెప్పాలి. ఎందుకంటే ఇది 1964లోనే తయారైనా పబ్లిక్ స్క్రీనింగ్ కి నోచుకుంది మాత్రం 2008 తర్వాతే.
ఒక అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ విజ్ఞప్తి మేరకు సత్య జిత్ రే ఈ షార్ట్ ఫిలిం తీశారు. బెంగాలీ సెట్టింగ్ లో ఒక ఇంగ్లీష్ సినిమా తీయమని వాళ్ళు అడిగారు. కానీ సత్యజిత్ రే మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో సైలెంట్ సినిమా తీయాలనుకున్నారు; అదే తీశారు. ఈ సినిమాకి ప్రత్యేకమైన కథ అంటూ ఏమీ ఉండదు. బాగా డబ్బున్న పిల్లాడికి, గుడిసెలో ఉండే పిల్లవాడికి కాసేపు జరిగిన ఘర్షణే దీని ఇతివృత్తం. మొదటి పిల్లాడి తల్లిదండ్రులు ఒక్కణ్ణే ఇంట్లో వదిలేసి ఎక్కడికో వెళ్తారు. వాడు రకరకాల బొమ్మలతో ఆడుకుంటూ ఇల్లంతా కలియ తిరుగుతుంటాడు. ఆ బొమ్మలు చేసే చప్పుళ్ళ మధ్య నుంచి ఉన్నట్టుండి ఫ్లూట్ సౌండ్ వినిపిస్తుంది. కిటికీ దగ్గరకొచ్చి చూస్తే ఎదురుగా ఉన్న గుడిసె ముందు మురిగ్గా ఉన్న పిల్లవాడొకడు చేతయ్యీ చేతకాకుండా వెదురు పిల్లనగ్రోవిని ఊదుతూ కనిపిస్తాడు. వాణ్ణి చూడగానే మనోడికి రోషం పొడుచుకొస్తుంది. తన దగ్గరున్న బొమ్మలు, గన్నులు చూపిస్తూ దర్పం ప్రదర్శిస్తాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారు, ఎందుకు గెలిచారు అన్నదే మిగతా స్టోరీ.
మామూలుగా చూస్తే ఇది పేద, ధనిక తారతమ్యాలపై తీసిన సినిమాలా అనిపిస్తుంది. అది నిజమే కూడా. డబ్బున్నవాడు బయటి వస్తువుల్లో సంతోషాన్ని వెతుక్కుంటే, పేదవాడు తనకున్న దాంట్లోనే ఆనందపడతాడని ఈ పిల్లల పాత్రల ద్వారా సత్యజిత్ రే చెప్పారనిపిస్తుంది. ఇంకాస్త తరచి చూస్తే మరో కోణం ఆవిష్కృతమవుతుంది. ఇద్దరు పిల్లల మధ్య పోట్లాట పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదానికి, పేద దేశాలకు మధ్య పోరులా కనిపిస్తుంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఈ షార్ట్ ఫిలింకి అప్పట్లో జరుగుతున్న వియెత్నాం యుద్ధమే స్ఫూర్తి. ఈ విషయాన్ని స్వయంగా సత్యజిత్ రే తన బయోగ్రఫీలో రాసుకున్నారు.
వియెత్నాంలో 1955లో మొదలైన యుద్ధం 20 ఏళ్ళ పాటు, అంటే 1975 వరకు సాగింది. ఎన్నో లక్షల మంది ప్రాణాలు బలిగొంది. ఎన్నో అడవుల్ని మింగేసింది. అమెరికా రక్త దాహానికి ఈ యుద్ధం ఇప్పటికీ, ఎప్పటికీ అతి పెద్ద ఉదాహరణ. అందుకే తన షార్ట్ ఫిలింకి సత్యజిత్ రే ఈ యుద్ధాన్నే backdropగా తీసుకుని ఉంటారు. థీమ్ కి తగ్గట్లే డబ్బున్న పిల్లవాడు డిస్నీ క్యాప్ పెట్టుకుని కూల్ డ్రింక్ తాగుతూ చాలా పొగరుగా కనిపిస్తాడు. వాడు పెట్టుకున్న వాచ్ మొదలుకొని ఇంట్లో ఉన్న వస్తువులు, వాడు ఆడుకునే బొమ్మలు- అన్నీ పెట్టుబడివాదానికి మచ్చు తునకల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇక గుడిసెలో పిల్లాడు మాత్రం పేద దేశాల్లాగా బక్కచిక్కిపోయి దీనంగా కనిపిస్తాడు. కానీ అమెరికన్ దురాక్రమణను తిప్పికొట్టిన వియెత్నాంలాగా చివరిదాకా పోరాట స్ఫూర్తి కనబరుస్తాడు.
డబ్బున్న కుర్రాడిగా రవి కిరణ్ కార్లా చాలా బాగా చేశాడు. పేద కుర్రాడిగా చేసిన అబ్బాయి చాలా సహజంగా అనిపిస్తాడు. కానీ ఆ అబ్బాయి పేరు ఎక్కడా దొరకలేదు. టైటిల్స్ లో “వీధి కుర్రాడు” అని మాత్రమే ఉండడం చూసి మనసు చివుక్కుమనిపించింది. “పథేర్ పాంచాలీ” సినిమాటోగ్రాఫర్ సుబ్రతా మిత్రాకి అసిస్టెంట్ గా పని చేసిన సౌమేందు రాయ్ ఈ షార్ట్ ఫిలింకి సినిమాటోగ్రఫీ అందించాడు. సంగీతంలోనూ మంచి ప్రవేశమున్న సత్యజిత్ రే దీనికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు.
1992లో ఆస్కార్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు సత్యజిత్ రే. ఆ సమయంలో ఆయన మంచంలో ఉన్నారు. ఆ తర్వాత అకాడెమీ ఫిలిం అర్కైవ్స్ వాళ్ళు రే సినిమాలను పదిలపరచడం మొదలుపెట్టారు. అలా 2016లో ఈ షార్ట్ ఫిలింని కూడా restore చేసి YouTubeలో upload చేశారు. పైన లింక్ ఉంది గమనించగలరు.
(మే 2 సత్యజిత్ రే జయంతి)



