మే 2 ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే పుట్టినరోజైనందున.. ఆయన గురించి చాలా కథలే వచ్చుంటాయి. ఆయన తీసిన సినిమాలు, సినిమా దారిలో ఆయన ప్రయాణం, అందుకు కల్గిన స్ఫూర్తి, ఆయనకు ఆస్కార్ దక్కిన తీరు.. అలా రకరకాల స్టోరీస్ ఎవరికి తోచిన రీతిలో వారు… వాస్తవాలను మరింత ఆకట్టుకునేలా రాయడం సహజం. కానీ, ఓ దర్శకుడు తన X ఖాతాలో షేర్ చేసిన ఓ లేఖ మాత్రం వాటన్నింటినీ మించి చర్చనీయాంశమైంది. కహానీ, బద్లా, లస్ట్ స్టోరీస్, జాన్ కార్ బీట్స్ వంటి సినిమాలు తీసిన సుజోయ్ ఘోష్.. ఆ లెటర్ ను షేర్ చేస్తూ సత్యజిత్ రేతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకునే యత్నం చేశాడు. మరి ఇంతకీ సత్యజిత్ రే రాసిన ఆ లేఖలో ఏముంది..?

సత్యజిత్ రే వంటి ప్రముఖ దర్శకులతో ఏదో ఒక సందర్భంలో పనిచేయడాన్ని తమ జీవితానికి దక్కిన ఓ గొప్ప గుర్తింపుగా ఫీలవుతారు ఎవరైనా. అలాంటి కథే సుజోయోఘోష్ ది. అయితే, ఎవరైనా తమ సక్సెస్ స్టోరీస్ ను గొప్పగా చెప్పుకునేందుకు ఇష్టపడతారే తప్ప… ఫెయిల్యూర్స్ ను బయటపెట్టాలనుకోరు. కానీ, సుజోయ్ ఘోష్ కు సత్యజిత్ రే రాసిన లేఖ అప్పుడో చేదు అనుభవమే. కానీ, ఇన్నాళ్లకు అదే ఓ తీపి జ్ఞాపకమైంది. అందుకే సుజోయ్ ఘోష్ దాన్ని తన X ఖాతాలో పోస్ట్ చేశారు. అంతేనా, ఆ లేఖలో ఉన్న సారాంశాన్ని విడమర్చి చెప్పుకొచ్చారు.
చాలామందిలాగే రే పనితీరుకు ఫిదా అయిన సుజోయ్ ఘోష్ కూడా సత్యజిత్ రేకు ఓ ఏకలవ్య శిష్యుడు. ఎందుకంటే, రేతో కలిసి పనిచేయాలని సుజోయ్ కోరినా.. దాన్ని సత్యజిత్ రే చాలా సున్నితంగా నొచ్చుకోకుండా కన్వే చేస్తూ తిరస్కరించాడు.
1989లో తన పీజీ పూర్తి చేసిన తర్వాత విశ్వవిద్యాలయం నుంచి బయటకొచ్చిన సుజోయ్ ఘోష్ పై సినిమా ప్రభావం బాగా పడింది. పైగా సత్యజిత్ రే ఎఫెక్ట్ తో ఆయనా ఏకంగా సినిమా ఫీల్డ్ నే ఎంచుకోవాలని రంగంలోకి దిగాడు. అలా మాంచెస్టర్ లో తన విద్య పూర్తి కాగానే.. అక్కడి నుంచే సత్యజిత్ రేకు ఓ లేఖ రాశాడు. మీ దర్శకత్వం, సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నేను ఫలానాచోట ఉన్నతవిద్యను పూర్తి చేశాను. కానీ, సినిమాల్లో రాణించాలన్న ధ్యేయంతో ఆ రంగంలోకి అడుగిడుదామనుకుంటున్నాను. నాకు మీ దగ్గర ఏదో ఒక శాఖలో అవకాశం కల్పించాలని ఆ లేఖలో కోరాడు.
అప్పటికే భారతదేశ సినీ చరిత్రలో సత్యజిత్ రేది సమాంతర సినిమాలో ఓ స్వర్ణయుగం. అలాంటి దర్శకుడి నుంచి తిరిగి తనకు రిప్లై వస్తుందో, రాదో కూడా తెలవకున్నా ఓ అటెంప్టైతే చేద్దామని లేఖ రాశాడు సుజోయ్. కానీ సుజోయ్ ను ఆశ్చర్యపరుస్తూ సత్యజిత్ రే నుంచి రిప్లై లెటర్ వచ్చింది.
మరి ఆ లేఖలో సత్యజిత్ రే ఏం రిప్లై ఇచ్చారు..?
నేను ఇతర నిర్మాతల వద్ద డబ్బు తీసుకుని జీతంతో పని చేస్తున్నాను. అలాగే, నేను సొంతంగానే స్క్రీన్ ప్లేస్ రాసుకుంటాను. కాబట్టి, నేను మీకు సాయపడగల్గే స్థితిలో లేనందుకు చింతిస్తున్నానంటూ సత్యజిత్ రే సుజోయ్ కు చాలా మర్యాదగా, సున్నితంగా నో చెబుతూ రిప్లై ఇచ్చాడు.
అయితే, ఆ లేఖను సుజోయ్ నెగటివ్ గా భావించలేదు. సత్యజిత్ రే వంటి దిగ్దర్శకుడు అంత సున్నితంగా, మర్యాదగా తనబోటి అనామకుడికి తిరిగి సమాధానమిస్తూ లేఖ రాసిన తీరు సుజోయ్ కి సత్యజిత్ రేపై అప్పటివరకూ ఉన్న అభిమానాన్ని రెట్టింపు చేసింది. అలాగే, ఆ లేఖను తన వార్డ్ రోబ్ లోని ఫైల్ లో ప్రత్యేకంగా దాచుకుని ఇలాంటి సందర్భాల్లో ఓ జ్ఞాపకంగా ఉపయోగపడేలా చేసింది.
దాన్నో తిరస్కరణ లేఖగా కాకుండా సుజోయ్… ఓ గొప్ప, ప్రియమైన బహుమానంగా భావిస్తున్నాడు. ఎక్కడో మాంచెస్టర్ లో కూర్చుని జస్ట్ సత్యజిత్ రే సినిమాలకు ప్రభావమై ఓ అనామకుడిలా సినిమాలపై పిచ్చితో లేఖ రాస్తే.. సత్యజిత్ రే వంటి గొప్ప దర్శకుడు తిరిగి రిప్లై లెటర్ రాయడం సుజోయ్ ఘోష్ దృష్టిలో రేను ఓ హీరోను చేసింది.
సుజోయ్ ఘోష్ X ఖాతాలో పోస్టుకు స్పందనలు!
1977లో మద్రాస్ లో సెలవులో ఉన్న సమయంలో షత్రంజ్ కే ఖిలాడీ చూసిన తర్వాత.. కలకత్తాలో ఆ సినిమా ఎందుకు విడుదల కాలేకపోయిందని తన తల్లి సత్యజిత్ రేకు లేఖ రాస్తే.. దానికి కూడా రే రిప్లై ఇచ్చినట్టు కోల్ కత్తా నైట్ రైడర్స్ మాజీ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య స్పందించారు.
కొంచెం బిజీ ఉంటేనే… ఊపిరిసల్పనంత గజిబిజిగా షో ఆఫ్ చేసే లోకంలో… ముఖ్యమైనవాటికే సరైన రీతిలో స్పందించని సమాజంలో.. రే వంటివారూ ఉంటారనడానికి రేనే ఓ ఉదాహరణ అన్నట్టుగా ఓ వ్యాపారవేత్తైన సుమిత్ రమణి స్పందించారు.
మొత్తంగా సత్యజిత్ రే తిరస్కరణ లేఖ కూడా ఓ నిధిలాంటిదేనన్న కామెంట్స్ తో పాటు.. దాన్నో నోస్టాల్జియాగా పేర్కొంటూ సుజోయ్ పోస్టుపై నెటిజన్స్ భిన్నరకాలుగా ప్రతిస్పందించారు. .



