ఇప్పటివరకూ థర్మల్ పవర్, విండ్ పవర్, హైడ్రో పవర్, సోలార్ పవర్, బయో పవర్ వంటి సెక్టార్స్ పైనే ప్రధానంగా ఫోకస్ చేసిన భారత్.. ఇప్పుడు అణువిద్యుత్ పై మరింత ఫోకస్ పెంచుతోంది. దేశ భవిష్యత్ అంచనాలను దృష్టిలో ఉంచుకుని.. ఒక నిర్మాణాత్మకమైన రూపకల్పనకు వడివడిగా అడుగులేస్తోంది. అందుకోసం ఇప్పటికే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇంజనీర్స్ SMRగా పిల్చుకునే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ తయారీపై దృష్టి పెట్టారు.

ఒక వేళ ఈ అణురియాక్టర్స్ ఉపయోగించుకునే సాంకేతికత పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తేగనుక.. అతి తక్కువ థోరియం నిల్వలతో ఒక జిల్లా మొత్తానికి 14 ఏళ్ల పాటు కావల్సిన పవర్ సప్లై చేయొచ్చు. ఇలాంటి సాంకేతికవైపు భారత్ వేస్తున్న అడుగులు.. ఇప్పుడు మిగిలిన ప్రపంచం దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సంప్రదాయ ఇంధన రంగాలకు దీటుగా… థర్మల్ ప్లాంట్లకు భిన్నంగా డీకార్బనైజ్డ్ విద్యుతుత్పాదన వైపు పడుతున్న ఈ స్టెప్స్ ఓ న్యూ రెవల్యూషన్.
1945లోనే భారత్ లో టాటా గ్రూప్ సౌజన్యంతో ప్రముఖ అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా నేతృత్వంలో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది. దాంతో అణుశక్తిలో భారత్ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. అప్పటికే అణుశక్తితో ప్రయోగాలు చేస్తున్న ఇతర దేశాలు ముందువరుసలో ఉంటూనే, భారత్ కు మాత్రం ఆ సాంకేతికతను అందించేందుకు ఆసక్తి చూపలేదు. అదిగో అలాంటి సందర్భంలో జహంగీర్ బాబా చొరవతో 1954లో పుట్టుకొచ్చిందే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్.
అణుశక్తి సాంకేతికతనుపయోగించుకుని దేశ విద్యుత్ అవసరాల కోసం 50ల్లోనే మూడంచెల అణు విద్యుత్ కార్యక్రమానికి హోమీ జహంగీర్ బాబా రూపకల్పన చేశారు. అలా 60ల నాటికి పంజాబ్ దంగల్ లో మొదటి భార జల కర్మాగారం ఏర్పాటు, ఆ తర్వాత అదే దశాబ్దంలో అణు రియాక్టర్ల ఏర్పాటు, యురేనియం వెలికితీత, శుద్ధి, ఐసోటోపుల తయారీ వరకూ కూడా సాంకేతికంగా భారత్ ఓ విప్లవాన్నే సృష్టించింది.
ఆ తర్వాత యురేనియంతో విద్యుత్ తయారీ కోసం అమెరికా భారత్ కు సాయమందించింది. అలా ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ తో మహారాష్ట్రలోని తారాపూర్ కేంద్రంగా 1969లో అణువిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దశలో ఫాస్ట్ బ్రీడ్ రియాక్టర్స్, తమిళనాడులోని కల్పకం వద్ద ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ వంటివి ప్రారంభమయ్యాయి. అదిగో అదే సమయంలో భారత్ కు ఓవైపు చైనా, ఇంకోవైపు పక్కలో బల్లెమైన పాకిస్థాన్ తో యుద్ధాల నేపథ్యంలో భారత్ అణు పరీక్షలను నిర్వహించడంతో అమెరికా యురేనియం సరఫరాను నిలిపేసింది. అప్పటివరకూ అందించిన సాయాన్ని ఆపేసింది. కానీ, అదే సమయంలో కెనడా మళ్లీ భారత్ కు సాయం చేయడంతో పాటు.. అణు సాంకేతికత కోసం కూడా తోడ్పాటునందించింది.
భారత్ లో పెరుగుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా వాణిజ్యస్థాయిలో అణువిద్యుత్ ఉత్పత్తి చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలా 1987లో న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పలుచోట్ల అణువిద్యుత్ ప్లాంట్లను నిర్మించారు. దాంతో గత ఏడాది చివరినాటికి 2024 డిసెంబర్ వరకు భారత్ 8 వేల 189 మెగావాట్ల అణు విద్యుతుత్పత్తిని సాధించగల్గింది. 2050 నాటికి దేశంలో 25 శాతం అణువిద్యుత్తునే అందించేవిధంగా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే తాజాగా బార్క్ ఇంజనీర్స్ అతి తక్కువ థోరియం నిల్వలతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసే స్మాల్ మాడ్యూలర్ రియాక్టర్స్ ను తయారుచేస్తున్నారు.
2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ప్రకటించిన అణుశక్తి మిషన్ 2047 లక్ష్యంగా… 100 గిగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు బార్క్ ఇంజనీర్స్ తయారుచేస్తున్న ఐదు SMRలను 2033 నాటికి వినియోగయంలోకి తీసుకొచ్చేందుకు ఏకంగా బడ్డెట్ లో 20 వేల కోట్ల రూపాయలను కూడా కేటాయించింది భారత ప్రభుత్వం.
రాజస్థాన్ రావత్ భటలోని అణువిద్యుత్ ప్రాజెక్టును 2025, మార్చ్ 17వ తేదీన గ్రిడ్ కు అనుసంధానించడంతో.. భారత్ ఇప్పుడు మొత్తం 25 అణురియాక్టర్లను కల్గి ఉంది. వీటిల్లో మొత్తం 8 వేల పైచిలుకు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. వీటికి తోడు, మరో 13 వేల 600 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పాతకత కోసం యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతుండగా.. 2031-32 నాటికి 22 వేల 480 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఈ అణువిద్యుత్ రియాక్టర్ల వృద్ధి జరుగుతోంది.
ఒకవేళ బార్క్ ఇంజనీర్స్ ప్రయోగమేగనుక సక్సెస్ అయితే… అతితక్కువ థోరియంతో ఎక్కువ విద్యుత్తునందించగల్గితే… అణువిద్యుత్ రంగంలో భారత విప్లవాత్మక అడుగులు.. యావత్ ప్రపంచాన్నే నివ్వెరపర్చడం ఖాయం. అదే సమయంలో విద్యుత్ కొరత అనే మాటే రాకుండా కూడా ప్రతీ పల్లే వెలుగులీనవచ్చు.



