అవయవదానం… ఇప్పుడెంతవసరం..?

మూడేళ్ల క్రితం వరకూ కూడా గుజరాత్ కు చెందిన ప్రియదర్శినికి జీవితమంటే లెక్కలేనితనమన్నట్టుగా ఆడుతూపాడుతూ సాగిపోయేది. కావల్సినంత సంతృప్తి, ఆత్మవిశ్వాసంతో కనిపించేది. ఆమె చురుకైన సామాజిక జీవితం చూసినవాళ్లు ఔరా అనుకోవాల్సిందే. కానీ, ఇప్పుడు ప్రియదర్శినికి ఓ గదే ప్రపంచమైపోయింది. ఎప్పుడన్నా బయటకొస్తే ఆసుపత్రి సందర్శన మినహా.. గత పర్యటనల తాలూకు బతుకు కాదది. ఆమెకిప్పుడు కిడ్నీ అవసరం. కానీ, దాతలు దొరకడం లేదు.

ప్రతీసారీ ఆసుపత్రికెళ్లి డయాలసిస్ చేయించుకుని తిరిగి రావడం ఓ యుద్ధం లాంటిందంటిదని.. ఏ స్థితిలో తిరిగివస్తామో తెలియదంటోంది 30 ఏళ్ల ప్రియదర్శిని.

తరచూ వామ్టింగ్స్, అజీర్తి, బలహీనత వంటివాటితో ఆమె కిడ్నీ పని చేయకుండా పోయింది. ఆమె తల్లే ఆమెకు కిడ్నీ దానం ఇద్దామనుకుంది. తల్లి కిడ్నీ తీసుకోవడం బాధే అయినా.. తన బతుకు ఒకింత బాగుంటుందేమోనన్న ఆలోచన ఆమెలో ఒకింత మిణుకుమిణుకుమనే ఆశలు రేకెత్తించింది. కానీ, ఆమె తల్లి మూత్రపిండాలు బలహీనంగా ఉన్నాయని.. ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆమె కిడ్నీ ఇచ్చేందుకు అనుర్హురాలైంది.

ప్రియదర్శిని స్టోరీ ఇప్పుడు భారతదేశంలో అవయవదానం అవసరాన్ని చెబుతోంది. నిజంగా అవయవదాతలు ఎక్కువ సంఖ్యలో ఉండి ఉంటే.. అవయవదానంపై కనీస అవగాహన కల్గి ఉంటే బహుశా నా సోదరి జీవితం కాస్త మెరుగ్గా ఉండేదేమోనంటాడు పేరు చెప్పడానికి ఇష్టపడని ఆమె సోదరుడు.

భారత్ లో 2013లో యావరేజ్ గా అవసరం పడ్డ అవయవ మార్పిడి సంఖ్య 4 వేల 990గా ఉంటే… 2023 వరకు అది 18 వేల 378 మందికి అవసరంగా మారింది. అంటే ఐదేళ్లల్లో 268 శాతం పెరుగుదల. ఇది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్.. NOTTO లెక్క. అదే జాతీయ అవయవ మరియు కణజాల మార్పిడి సంస్థ.. 2025లో విడుదల చేసిన డాటా ప్రకారం.. గత ఏడు 2024లో 18 వేల 911 మందికి అవయవ మార్పిడి జరిగింది. అయితే, ఈ సంఖ్య అవయవదానం అంది మార్పిడి జరిగినవారి సంఖ్య మాత్రమే. కానీ, అవయవదానం అవసరం పడి అందనివారు ఇంకెందరో. ఆ లెక్క చూస్తే.. మిలియన్ జనాభాకు అంటే పదిలక్షలకు ఒకరి కంటే తక్కువ స్థాయిలో అవయవదానం చేస్తున్నవారి సంఖ్య కనిపిస్తోంది.

ముందుగా చెప్పుకున్న ప్రియదర్శని కథ.. ఒక వివిక్త విషాదంలా కనిపించినా… ఇది అవయవదానంలో భారత్ ఎదుర్కొంటున్న ఓ పెద్ద సంక్షోభం. కనీసంలో కనీసం ప్రస్తుతం 63 వేల మంది భారతీయులు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వేచిచూస్తుంటే.. 22 వేల మంది వరకూ కాలేయ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నవారూ ఉన్నారు. అయితే, గత దశాబ్దకాలంగా అవయవదానంపై అవగాహన పెరిగినా.. అది భారత జనాభా సంఖ్య.. అవయవమార్పిడి అవసరం పడుతున్న వారి సంఖ్యతో పోలిస్తే ఏమాత్రం సరిపోనిది. కుటుంబ సభ్యులు, బంధువులు తమ ప్రియమైనవారికి తమ ఆర్గాన్స్ ను అందించి సాయమందించేందుకు వస్తున్న కేసులూ నమోదవుతున్నప్పటికీ.. మరణించినవారి అవయవాలను అందించే పెద్ద మనసు మాత్రం ఇంకా భారత్ లో కనిపించడం లేదు.

ఎందుకు..?

సాంస్కృతిక అడ్డంకులు, మూఢాచారాలతో పాటు.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పెద్దగా ఫోకస్ చేయకపోవడం, అధికారిక సమస్యలు, కావల్సినంత అవగాహన లేకపోవడం వల్ల భారతదేశంలో అవసరానికి తగ్గ అవయవదానం కనిపించడంలేదు. వ్యవస్థాగత సంస్కరణలు, మరింత అవగాహన కల్పించకపోతే.. గుజరాత్ కు చెందిన ప్రియదర్శినిలాంటి వేలాది మంది మందులతో సరిపెట్టుకుంటూ, డయాలసిస్ వంటివి చేయించుకుంటూ, ఆసుపత్రుల వెంట తిరుక్కుంటూ నిరీక్షణలోనే జీవశ్ఛవాల్లా బతుకీడ్చాల్సిన పరిస్థితులు కళ్లకు కడుతూనే ఉంటాయి.

ఇప్పుడు అవయవదానంపై ప్రచారం పెరగాల్సిన అవసరముంది. ఏ గుట్కాలో, పాన్ పరాగో, కూల్ డ్రింక్స్ కో కమర్షియల్ యాడ్స్ చేసే సెలబ్రిటీస్… అవయవదానంపై ప్రచారం చేయాల్సిన అవసరముంది. రోల్ మాడల్స్ గా నిల్చేవారు ప్రచారం చేస్తే కొంతలో కొంత మార్పు రావచ్చంటున్నాడు… తన తండ్రి లివర్ ప్లాంటేషన్ కోసం బెంగళూర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే 45 ఏళ్ల సంతోష్ కుమార్ వర్మ.

అవయవదానంపై నెలకొన్న అపోహలు, తప్పుడు ప్రచారం!

ఏ ఒక్క వ్యక్తైనా తనకు మాలిన ధర్మం లేదనే అనుకుంటాడు. ఇదే ప్రాథమిక సూత్రం. కాబట్టి రిస్క్ తీసుకోవడానికి, ఒకే ఒక్క మూత్రపిండంతో జీవించడానికి సర్వసాధారణంగా ఇష్టపడరు. ప్రియదర్శిని తల్లి మూత్రపిండం ఇవ్వడానికి సిద్ధపడ్డా.. ఆమె అనర్హురాలవ్వడంతో ప్రియదర్శిని కుటుంబం మరింతమందిని రిక్వెస్ట్ చేసింది. కానీ, ఎవ్వరూ కిడ్నీ దానం చేయడానికి ముందుకు రాలేదు.

ప్రస్తుతం ప్రియదర్శిని గాంధీనగర్ లోని కేడీ ఆసుపత్రిలో వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటోంది. అక్కడ ఆమె తన కిడ్నీ మార్పిడి కోసం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. ఎన్నో ఆసుపత్రులను సందర్శించింది. ఆరా తీసింది. కానీ, తాను వెళ్లిన చోట తనకంటే ముందే చాంతాడంత జాబితాలు దర్శమిచ్చాయి. అప్పటికే మూడు, నాల్గేళ్ల నుంచి వెయిటింగ్ లిస్ట్ లు ఉన్న పేషంట్స్ కనిపిస్తున్నారు. దాంతో ప్రైవేట్ ఆసుపత్రులవైపు ఆమె చూపు పడింది. కిడ్నీ దాతను కనుగొనేందుకు తనకింకా ఎంత సమయం పడుతుందో.. సాధారణ జీవితం అసలు పొందగలనో, లేదో కూడా తనకు తెలియదంటూ ఆమె వెయింటింగ్ రూమ్స్ లో తన డయాగ్నసిస్ ఫైళ్లతో డయాలిసిస్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రతీ నెలా కేడీ హాస్పిటల్ ట్రాన్స్ ప్లాంటేషన్ కో ఆర్డినేటర్ గా ఉన్న నిఖిల్ వ్యాస్ కు ఫోన్ చేసి తనకు మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరికిందా అని అడుగుతూ ఉంటుంది ప్రియదర్శిని.

కేడీ ఆసుపత్రిలో ప్రతీ నెలా కార్నియా, మూత్రపిండాలు, కాలేయ మార్పిడితో సహా కనీసం ఏడెనిమిది మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతూ ఉంటాయి. అయితే మరణించాక సేకరించే దాతల సంఖ్య తక్కువగా ఉండటంతో.. కేవలం ఆరు నుంచి ఏడు వరకు బ్రెయిన్ డెడ్ దాతల అవయవాలు మాత్రమే ఆసుపత్రిలో అందుబాటులో ఉంటున్నాయి.

రోగులకు అవయవ మార్పిడి అవసరమైనప్పుడు క్షుణ్నంగా వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరముంటుంది. అవయవమార్పిడి అవసరమయ్యే రోగులకు బంధువులు లేకపోయినా, ఇవ్వడానికి ముందుకు రాకపోయినా, మ్యాచ్ కాకపోయినా.. మార్పిడి కోసం వెయిటింగ్ లిస్టులో ఉండాల్సిందే. ఈ జాబితాలను ఆసుపత్రిలోని ప్రత్యేక విభాగాలు, నేషనల్ రిజిస్ట్రీస్ నిర్వహిస్తుంటాయి.

చాలామంది యువత అవయవదానంపై అవగాహన కల్గి ఉండి ముందుకొస్తున్నప్పటికీ.. కుటుంబాలు వారి మరణం తర్వాత ఆ ప్రక్రియను ఉపసంహరించుకుంటున్నాయి. అందుకు సంప్రదాయాలు అడ్డురావడంతో పాటు.. గ్రహీతలెవ్వరో తెలియక.. తమవారి అవయవాలు దుర్వినియోగం కావచ్చునేమోనన్న సందేహాలు, ఆందోళనా చాలామందిలో కనిపిస్తున్నాయంటున్నారు చాలా మంది డాక్టర్స్.

అంతేకాదు, శరీరం పూర్తిగా లేకుండా దహనం చేసినా, ఖననం చేసినా ఆత్మకు శాంతి లభించదనే భయాలు కూడా.. చాలామంది కుటుంబీకుల్ని సదరు మరణించిన దాత అభిప్రాయాన్ని కూడా పక్కకు నెట్టేస్తున్నాయంటున్నారు వైద్యులు.

అవగాహనే ఆయుధం!

అవయవదానంపై నేడు భారతదేశమంతటా ఎన్జీవోలు, స్వచ్ఛంద సేవకులు, హెల్త్ కేర్ నిపుణులు ఇలా చాలామందే అపోహలను తొలగించే ప్రయత్నాలు మొదలెట్టారు. దీంతో చనిపోయే ప్రతీ పది మందిలో కనీసం ముగ్గురు నుంచి నల్గురివరకైనా ఇప్పుడు అవయవదానం అంగీకరించేలా ఒప్పించగల్గుతున్నారు. ఇటువంటి ప్రచారాలు కేవలం ఆసుపత్రులకే పరిమితం కాకుండా.. సమావేశాల్లోనూ, కాలేజ్ సెషన్స్ లోనూ, వివిధ ప్రజావేదికల్లోనూ భారీ ఎత్తున ప్రారంభించారు. శతాయు ఫౌండేషన్, మోహన్ ఫౌండేషన్ వంటి ఎన్జీవోలు ఇలాంటి విషయాలపై అవగాహన కోసం ర్యాలీలు, మారథాన్స్, నిధుల సేకరణ వంటివి చేస్తున్నాయి.

అవయవదానం అవసరం ఉన్నవారి దైన్యస్థితిని చూపిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, దృశ్యరూపంలో వారి కేస్ స్టడీస్ నూ ప్రదర్శిస్తూ మోహన్ ఫౌండేషన్ రోటరీ క్లబ్ తో కలిసి ఈ మధ్యే ఢిల్లీలోలో ఒక అవేర్నెస్ క్యాంప్ ను ఏర్పాటు చేసింది.

అవయవదానానికి ఎవరైనా ముందుకొచ్చినా వారు చనిపోయినతర్వాత వారి కుటుంబ సభ్యులు ససేమిరా అంటే ఏం చేసేది.. ? ఎవరిని సంప్రదించేంది..? ఇలాంటి సందేహాలతో ఆ క్యాంపులో స్పష్టమైన అవగాహన కల్పించే యత్నం చేశారు.

భారత్ వంటి దేశంలో అవయవదానం పెరగాలంటే.. విందు భోజనాల్లో మాట్లాడుకునే పిచ్చాపాటిలో ఈ అంశాలు కూడా సర్వసాధారణమైపోవాలంటోంది మోహన్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవీ కుమార్.

మోహన్ ఫౌండేషన్ అవయవమార్పిడిపై అవగాహన కల్పించడం, ముందుకొచ్చినవారికి మద్దతునివ్వడమేగాకుండా… ట్రాన్స్ ప్లాంట్ కో ఆర్డినేషన్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్, పోస్ట్ గ్యాడ్యుయేట్ డిప్లమా అన్ ట్రాన్స్ ప్లాంట్ కో ఆర్డినేషన్ అండ్ గ్రీఫ్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ వంటి అంశాలపై కోర్సులనూ నిర్వహిస్తోంది. సమగ్రమైన శిక్షణనూ అందిస్తోంది. 2025లో ఈ ఫౌండేషన్ ఏకంగా ఇప్పటివరకూ అత్యధికంగా ఏ సంస్థా చేయని రీతిలో 1128 మంది అవయవదాతలను నమోదు చేయగల్గింది.

అవయవదానమంటే మరణం తర్వాత జీవించడం!

ఫరీదాబాద్ లోని ఓ ఇంటి టెర్రస్ పై నుంచి పడిన రాకేష్ కుమార్ తల్లి.. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయింది. రెండేళ్ల క్రితం తన తల్లికి సంబంధించిన అవయవాలను దానం చేయడం తనకు గర్వంగా ఉందంటాడు. తన తల్లి చనిపోతూ కూడా ఇంకొకరిని కాపాడింది. ప్రాణం పోసింది.. అది చాలదూ అంటాడు రాకేష్ కుమార్.

నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ భారత్ లోని పౌరులెవ్వరైనా అవయవదానం చేయాలనుకుంటే ఒక ఆన్ లైన్ వ్యవస్థను కూడా రూపొందించింది. 2023లో 3 లక్షల 30 వేల మందికి పైగా పౌరులు తమ అవయవాలు దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇది చారిత్రాత్మకమైన రికార్డ్ అని కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా ఆగస్ట్ 2న భారత అవయవ దాన దినోత్సవంలో స్వయంగా వెల్లడించిన విషయం.

సుదీర్ఘ ప్రక్రియ!

అవయవదానంలో బతికున్నవారి నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు.. వారు కుటుంబ సభ్యులై ఉండాలన్న కఠినమైన నిబంధనలూ కొన్నిసార్లు ఇబ్బందిగా మారుతున్నాయి. మనేసర్ కు చెందిన 16 ఏళ్ల నవ్లీన్ కౌర్ కిడ్నీ వైఫల్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ను సంప్రదించారు. కానీ మానవ అవయవాల మార్పిడి చట్టం 1994 ప్రకారం ప్రత్యక్ష మార్పిడికి తల్లీ, తండ్రి, కొడుకు, కూమార్తె, సోదరుడు, సోదరి, జీవిత భాగస్వామి, తాతలు, మామాలు, మనవడు ఇలాంటివారు మాత్రమే దానం చేయొచ్చు. కానివారు అలాంటి అవయవదానం చేయాలంటే కచ్చితంగా ప్రత్యేక అనుమతులు, అందుకు అవసరమైన లీగల్ డాక్యుమెంటేషన్ ప్రక్రియ తప్పనిసరి. అలా నవ్లీన్ కౌర్ కు కిడ్నీ మార్పిడి కోసం.. దాత ఉన్నా కూడా 14 నెలల పోరాటం చేయాల్సి వచ్చింది ఆ కుటుంబం.

తండ్రి డానీ, జ్యోతిసింగ్ ఇద్దరిదీ రెండో పెళ్లి కావడం.. జ్యోతిసింగ్ నవ్లీన్ కౌర్ కు కిడ్నీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో.. ఓవైపు దాత వల్ల లభించిన ఆనందం పొందేంతలోనే.. ఆమె ఇవ్వడానికి వీల్లేదనే వైద్యుల వాదన డానీ కుటుంబానికి దిక్కుతోచకుండా చేసింది. జ్యోతిసింగ్ తన మొదటి భర్తతో వివాహమనంతరం విడాకుల్లేకుండానే… చాలాకాలం తర్వాత మళ్లీ డానీని పెళ్లి చేసుకుంది.

మొత్తంగా అవయవ మార్పిడి ప్రక్రియను పారదర్శకంగా ఉంచడానికే ఇలాంటి నిబంధనలు ఏర్పాటు చేసినట్టు వైద్యులు చెబుతున్నారు.

ఇక నవ్లీన్ కౌర్ విషయంలో తన పిన్నైన జ్యోతిసింగ్ తన కిడ్నీ ఇచ్చేందుకు తన మాజీ భర్త నుంచి విడాకులు తీసుకోవడంతో పాటు.. డానీతో పెళ్లైనట్టు అధికారిక ధృవీకరణ పత్రాన్నందించాకే.. చట్టపరంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది.

నేటి మెకానికల్ లైఫ్ లో అవయవాల మార్పిడి అవసరమవుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న రోజులువి. ఈ నేపథ్యంలో సామాజిక అవగాహన, వ్యక్తిత్వ వికాసం వంటివి మాత్రమే ఇలాంటి ప్రక్రియలు ఇంకా చురుకుగా సాగేందుకు అవకాశం కల్పిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles